• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డెంటల్‌ సైన్స్‌లో మేటి సంస్థలివీ 

దేశంలో అందుబాటులో ఉన్న సుమారు 27 వేల బీడీఎస్‌ సీట్లు

పంటికి సంబంధించిన ఏదో ఒక సమస్యతో దాదాపు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా దంత వైద్యులను సంప్రదిస్తారు. ఎంబీబీఎస్‌ తర్వాత ప్రాధాన్యం ఉన్న కోర్సుగా బీడీఎస్‌ గుర్తింపు పొందింది. దీన్ని చదవడానికి బైపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకోవాలి. నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్టు (నీట్‌) ర్యాంకుతో బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ (బీడీఎస్‌) కోర్సులో చేరే అవకాశం లభిస్తుంది. దీని వ్యవధి అయిదేళ్లు. ఇందులో ఏడాది ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. బీడీఎస్‌ పూర్తిచేసుకున్నవారు ఆసక్తి ఉంటే మాస్టర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ (ఎండీఎస్‌)లో చేరవచ్చు. ఇందులో చాలా స్పెషలైజేషన్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో నచ్చిన విభాగాన్ని ఎంచుకోవచ్చు. పీజీ కోర్సు వ్యవధి మూడేళ్లు. డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) ఆధ్వర్యంలో బీడీఎస్, ఎండీఎస్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు. దేశంలో 300కు పైగా సంస్థల్లో సుమారు 27 వేల బీడీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ప్రకటించిన డెంటల్‌ సైన్సెస్‌ ర్యాంకుల్లో మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ బీడీఎస్, ఎండీఎస్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బోధన, అభ్యసన వనరులు; పరిశోధనలు, వృత్తిగత నైపుణ్యాలు; గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకున్నవారు, విద్యార్థుల వైవిధ్యం, వారు చూపిన ప్రతిభ, ఉన్నత చదువుల అవకాశం పొందినవారు, సంబంధిత విద్యా సంస్థపై వివిధ వర్గాల నిపుణుల దృక్పథం..తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు.  

విద్యార్థులు ఎంచుకోవడానికి ఎన్నో కోర్సులుంటాయి. డిగ్రీలు ఏవైనప్పటికీ మేటి సంస్థల్లో వాటిని పూర్తిచేసుకున్నవారికి ప్రత్యేకమైన విలువ ఉంటుంది. వివిధ సంస్థలకు ర్యాంకులు ప్రకటించడం ద్వారా విద్యార్థులకు విలువైన సమాచారం చేరువ కావడంతోపాటు, విద్యాసంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి అవకాశం ఉంటుంది. నియామక సంస్థలకు సైతం ఈ జాబితాతో మేలు జరుగుతుంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని కేంద్ర మానవ వనరులశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) 2016 నుంచి వివిధ కోర్సుల వారీ ర్యాంకులు కేటాయిస్తూ వస్తోంది. 2020 నుంచీ డెంటల్‌ సైన్సెస్‌కు ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఈ విభాగంలో 2021కి గానూ మేటి సంస్థల జాబితాను  ప్రకటించారు. ఆ వివరాలు మీకోసం...

టాప్‌ టెన్‌ సంస్థలు

1. మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్, ఉడుపి

2. డాక్టర్‌ డీవై పాటిల్‌ విద్యాపీఠ్, పుణే

3. సవితా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ టెక్నికల్‌ సైన్సెస్, చెన్నై

4. మౌలానా ఆజాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్, న్యూదిల్లీ

5. కింగ్‌జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ, లఖ్‌నవూ

6. ఏబీ శెట్టి మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్, మంగుళూరు

7. మణిపాల్‌ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్, మంగుళూరు

8. శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, చెన్నై

9. ఎస్‌డీఎం కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ అండ్‌ హాస్పిటల్, ధార్వాడ్‌

10. ఎస్‌ఆర్‌ఎం డెంటల్‌ కాలేజ్, చెన్నై

తెలుగు రాష్ట్రాల నుంచి రెండు సంస్థలు ర్యాంకుల్లో చోటు దక్కించుకున్నాయి. విష్ణు డెంటల్‌ కాలేజ్, పశ్చిమగోదావరి జిల్లా 23వ స్థానంలో నిలిచింది. ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్, సికింద్రాబాద్‌ 30వ స్థానం పొందింది. దేశవ్యాప్తంగా మొత్తం 40 సంస్థలకే డెంటల్‌ విభాగంలో ర్యాంకులు ప్రకటించారు.
 

Posted Date : 28-10-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌