• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సాధించాల‌నే త‌ప‌న‌తోనే స‌గం విజ‌యం
 

* నిర్దిష్ట ల‌క్ష్యం, స‌మ‌యం, ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు

 
ఈనాడు, హైదరాబాద్‌: కొత్త ఏడాది ఎన్నో కొంగొత్త ఆశలను, అవకాశాలను మోసుకొస్తుంది. నిరాశ, నిస్పృహలు వీడి వాటిని అందుకోవడంలో ముందుడగు వేయడమే మన ముందున్న కర్తవ్యం. అందుకు పక్కా ప్రణాళిక, తగిన కృషి అవసరం. చాలామంది లక్ష్యం పెట్టుకుంటారు. సాధనకు సరైన పరిశ్రమ ఉండదు. మరికొందరు నిర్ధిష్టమైన లక్ష్యం లేక...గాలిలో దీపం పెట్టి అదృష్టాన్ని నమ్ముకుంటారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుకు లోనై చివరికి విపరీత నిర్ణయాలవైపు అడుగులు వేస్తుంటారు. అయితే విజయం ఎవరి సొత్తు కాదని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్న మాట. సరైన ప్రణాళిక, పరిశ్రమతో ముందుకు సాగితే విజయం తనంతట తానే మన తలుపుతడుతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా సాధించాలనే ప్రగాఢమైన కోరిక సగం విజయాన్ని అందిస్తుందని అంటున్నారు. నిర్ధిష్టమైన లక్ష్యంతో...సమయంతో...పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అదే విజయానికి దగ్గర దారి అని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఆంగ్లభాషా బోధకులు డాక్టర్‌ శ్రీనాథచారి తెలిపారు. కొత్త ఏడాదిలో అనుకున్న లక్ష్యాన్ని తాకాలంటే... ఎలాంటి సూత్రాలు అవసరమో వివరిస్తున్నారు. అవి ఏమిటో చూద్దాం..
* మార్పు అనేది మన నుంచే ప్రారంభం కావాలి. కెరీర్‌ లేదా ఇంకేదైనా విషయంలో విజయం సాధించాలంటే దానికి బలమైన కోరిక ఉండాలి. శాస్త్రీయ దృక్పథంతో లక్ష్యాన్ని విశ్లేషించాలి. లక్ష్యం సాధించడానికి ఒక నిర్ధిమైన సమయం పెట్టుకోవాలి. ఆంగ్లభాషపై పట్టుసాధించాలంటే స్పీకింగ్‌ కోర్సు పుస్తకం కొంటే సరిపోదు. అప్పుడు దానికి యజమాని మాత్రమే అవ్వగలం. నిరంతర సాధనమే భాషపై పట్టుసాధించాలా చేస్తుందని గుర్తించుకోవాలి.
* కలలు అందరూ కంటారు. ఏ కల నిన్ను నిద్రకు దూరం చేస్తుందో.. అదే నిన్ను విజయ తీరాలకు చేర్చుతుందని అని అబ్దుల్‌కలాం అంటారు. లక్ష్యం అంత బలమైనదిగా ఉండాలనేది అందులో అర్థం. అప్పుడే విజయంవైపు అడుగులు పడతాయి.
* లక్ష్యం స్పష్టంగా లేనప్పుడు ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిస్పృహలు కమ్మేస్తాయి. అందుకే లక్ష్యం వాస్తవానికి దగ్గరగా ఉండాలి. కొందరు భావనను గోల్‌గా భావిస్తుంటారు. భావన వేరు...గోల్‌ వేరు అని తెలుసుకోవాలి.
* మన దృష్టిలో లేనిది క్రమంగా కనుమరుగు అవుతుంది. అందుకే కొత్త ఏడాదిలో స్పష్టంగా సాధించాల్సిన లక్ష్యాలను ఒకచోట రాసి పెట్టుకోవాలి. అవి తరచూ మన కంటపడుతూ ఉండాలి. అప్పుడు అవి మన అచేత మెదుడులోకి వెళ్లి నీవు లక్ష్యంవైపు వెళ్లేలా చేస్తాయి. ఇక నీ విజయం ఆపడం ఎవరి తరం కాదని గ్రహించాలి.
* విజయంలో నేడు కమ్యూనికేషన్‌ స్కిల్స్, భాషా నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్రపోషిస్తున్నాయి. ఇందులో పండితులు అవ్వాల్సిన అవసరం లేదు. కనీసం ప్రాథమిక అవగాహన తప్పకుండా ఉండాలి. లేకపోతే ఇప్పటి నుంచే వాటిపై పట్టు సాధించాలి. 
* ముఖ్యంగా గతాన్ని అవలోకనం చేసుకొని భవిష్యత్తు దర్శనం చేసుకుంటూ వర్తమానం ఆస్వాదిస్తూ ముందుకు సాగితే విజయం మీదేనని గుర్తించాలి. గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే వర్తమానం, భవిష్యత్తు రెండూ అంధకారమే. కొత్త ఏడాదిలో కొత్త ఆశలు, ఆశయాలతో ముందుకు సాగితే విజయం మీదే..!!


- డా.శ్రీనాథచారి 
 

Posted Date : 01-01-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌