• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వెబ్‌ వేదికగా ప్రచార వ్యూహాలు

డిజిటల్‌ మార్కెటింగ్‌కు పెరుగుతున్న ఆదరణ  

ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే మార్కెట్‌లో అది దొరికే దుకాణానికి వెళ్లడం.. ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు మార్కెట్టే అరచేతిలోకి వచ్చేసింది. సంప్రదాయ విధానంలో ఒక వినియోగదారుడు మళ్లీ మళ్లీ అదే షాపునకు రావడం కనిపిస్తుంటుంది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌కి వచ్చేసరికి పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇక్కడ వినియోగదారులను ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. సోషల్‌ మీడియా, ఈమెయిల్, గూగుల్‌.. మొదలైనవి ఇందుకు వేదికలు. ఇదే డిజిటల్‌ మార్కెటింగ్‌! కెరియర్‌ పరంగానూ ఈ రంగం ఎన్నో అవకాశాలను అందిస్తోంది. రానున్న కాలంలో మంచి డిమాండ్‌ ఉన్న దీని విశేషాలు తెలుసుకుందామా!

సోషల్‌ మీడియా వెబ్‌సైట్లు చూస్తున్నపుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వస్తుంటాయి. ఉత్పత్తుల, వాటి ధరల వివరాలతో సహా వస్తుంటాయి. యూట్యూబ్‌ చూస్తున్నపుడూ మధ్యలో కొన్ని యాడ్‌లు వస్తుంటాయి. ఒక్కోసారి ఏదో వెబ్‌సైట్‌ చూస్తున్నపుడు కొన్ని వస్తువులకు సంబంధించి పాప్‌అప్‌లు చూస్తుంటాం. నచ్చితే వెంటనే కొనుగోలూ చేస్తుంటాం. డిజిటల్‌ మార్కెటింగ్‌కు ఉదాహరణలే ఇవి. కాస్త వివరంగా పరిశీలిస్తే..

కూర్చున్న చోటు నుంచే కావాల్సిన వస్తువులను తెప్పించుకునే వీలు ఇప్పుడు ఇంటర్నెట్‌ కల్పిస్తోంది. అలాగే ఎన్నో వేదికలూ అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు వినియోగదారుడు ఒకదానికే పరిమితమై ఉంటాడన్న నమ్మకం లేదు. దీంతో వారిని ఆకర్షించడానికి వారి దృష్టిపడే చోట మార్కెటింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువశాతం ప్రజలు సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారన్నది నిపుణుల మాట. దీంతో సంస్థలూ వాటి ఆధారంగా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంటర్నెట్‌ వంటి డిజిటల్‌ టెక్నాలజీలను ఉపయోగించి వస్తువుల, సేవలను మార్కెటింగ్‌ చేయడాన్నే డిజిటల్‌ మార్కెటింగ్‌గా చెబుతాం. సెర్చ్‌ ఇంజిన్లు, సోషల్‌ మీడియా, ఈమెయిల్‌ మార్కెటింగ్, వీడియో చానళ్లు, బ్లాగులు దీనికి ప్రధాన వేదికలు.

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ దీనికి ఆదరణ పెరుగుతోంది. ఎన్నో రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిన కొవిడ్‌ ఈ రంగంపై సానుకూల ప్రభావం చూపింది. దాదాపుగా ప్రతి సంస్థా తమ మార్కెటింగ్‌ కార్యకలాపాలకు ఆన్‌లైన్‌ బాట పట్టింది. దీంతో డిజిటల్‌ మార్కెటర్లకు ఆదరణ పెరిగింది. తాజాగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరల్‌ విడుదల చేసిన నివేదికలోనూ ఇదే విషయం రుజువైంది. 

‘ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్‌ రిపోర్ట్‌-2020’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం వచ్చే అయిదేళ్లలో ఆదరణ ఉండే పది రకాల ఉద్యోగాల్లో డిజిటల్‌ మార్కెటింగ్‌ సంబంధిత కొలువులు ఒకటి. 

ఏ సంస్థల్లో?

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)- బెంగళూరు, లఖ్‌నవూ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్, ముంబయి

క్రైస్ట్‌ యూనివర్సిటీ, బెంగళూరు

నర్సీ మాంఝీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్, ముంబయి

ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్, హైదరాబాద్‌

హరియాణ స్కూల్‌ ఆఫ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌

దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నెట్‌ మార్కెటింగ్‌ (డీఎస్‌ఐఎం)

పెరల్‌ అకాడమీ, దిల్లీ

జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, హైదరాబాద్‌

ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ మొదలైనవి.

కెరియర్‌ మార్గమిదీ!

ఈ కెరియర్‌ను ఎంచుకోవాలనుకునే విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌.. ఏ దశవారికైనా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా సర్టిఫికేషన్, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి.

డిగ్రీ స్థాయిలో బీఏ, బీబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు.

పీజీ స్థాయిలో ఎంబీఏ కోర్సు ఉంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు.

సర్టిఫికేషన్‌ స్థాయిలో సర్టిఫైడ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ మాస్టర్‌ కోర్స్, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ డిజిటల్‌ మార్కెటింగ్, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్‌ ట్రెయినింగ్, ఎస్‌ఈఓ (సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌), ఎస్‌ఈఎం (సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌), డిజిటల్‌ మైనింగ్, ఎస్‌ఎంఎం, ఈమెయిల్‌ మార్కెటింగ్‌ మొదలైన వాటిల్లో ఒక్కోదానితో ప్రత్యేకంగా సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. డిగ్రీ, పీజీ, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఎవరైనా ఎంచుకోవచ్చు. సంస్థ, ఎంచుకున్న కోర్సుబట్టి కాలవ్యవధి ఉంటుంది. సాధారణంగా మూడు నెలల నుంచి ఏడాది వ్యవధి వరకూ ఉంటాయి. 

డిప్లొమా స్థాయిలో డిప్లొమా ఇన్‌ డిజిటల్‌ మార్కెటింగ్, ప్రొఫెషనల్‌ డిప్లొమా ఇన్‌ డిజిటల్‌ మార్కెటింగ్, ప్రొఫెషనల్‌ డిప్లొమా ఇన్‌ ఎస్‌ఈఎం, ప్రొఫెషనల్‌ మొదలైన కోర్సులున్నాయి. కొన్ని ఏ డిగ్రీ వారికైనా అందుబాటులో ఉండగా, కొన్ని కోర్సులను ప్రొఫెషనల్స్‌ను ఉద్దేశించి రూపొందించారు.  సంస్థ, ఎంచుకున్న కోర్సుబట్టి కాలవ్యవధి ఉంటుంది. సాధారణంగా మూడు నెలల నుంచి ఏడాది వ్యవధి వరకూ ఉంటాయి.

సంస్థను బట్టి ప్రవేశప్రక్రియలో మార్పులున్నాయి. డిగ్రీ కోర్సులకు ఎక్కువగా మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తున్నారు. ప్రముఖ సంస్థలు మాత్రం ప్రవేశపరీక్ష నిర్వహించి ప్రవేశాలను కల్పిస్తున్నాయి. పీజీ కోర్సులకు ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి.

ఆన్‌లైన్‌ స్పెషలైజేషన్లు

ఈ కామర్స్‌ మార్కెటింగ్‌: ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెటింగ్, స్ట్రాటజీ, అనాలిసిస్‌ అంశాల గురించి తెలుసుకుంటారు.

కంటెంట్‌ మార్కెటింగ్‌: సోషల్‌ మీడియా, బ్లాగులకు సంబంధించి పోస్టులు, వీడియోలు, పీపీసీ అడ్వర్టైజ్‌మెంట్లు మొదలైనవి ప్లాన్‌ చేసుకునే అంశాలపై దృష్టిసారిస్తారు.

ఎస్‌ఈఓ: సంస్థలకు కస్టమర్‌ ట్రాఫిక్‌ వచ్చేలా చేయడం, సెర్చ్‌ ఇంజిన్స్‌లో తమ సంస్థకు ప్రాధాన్యం అందేలా చేయడం వంటి అంశాల గురించి తెలుసుకుంటారు.

ఇంకా.. మొబైల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఆన్‌లైన్‌ రెప్యుటేషన్‌ మేనేజ్‌మెంట్‌ అంశాల్లోనూ ఆన్‌లైన్‌ కోర్సులున్నాయి. కోర్స్‌ ఎరా, గ్రేట్‌ లర్నింగ్‌ అకాడమీ, సింప్లీ లర్న్, యుడెమి, అప్‌గ్రాడ్, ఎడ్యుకార్ట్‌ మొదలైనవి అందిస్తున్నవాటిలో ప్రముఖమైనవి.

కోర్సుతోపాటు ఏదైనా మంచి సంస్థలో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయగలిగితే మంచి కెరియర్‌ అవకాశాలను అందుకునే వీలుంది.

ఉద్యోగావకాశాలెలా?

4జీ ఇంటర్నెట్‌ అనువైన ధరల్లో అందుబాటులో ఉండటం, అత్యుత్తమ సేవలతో స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి రావడం, ఆన్‌లైన్‌ సేవలకు ఆదరణ పెరగడం దేశంలో ఈకామర్స్‌ రంగం అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. దీంతో ప్రతి రంగం ఆన్‌లైన్‌ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. దీంతో ఎన్నో కెరియర్‌ అవకాశాలూ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో డిజిటల్‌ మార్కెటింగ్‌ ఒకటి. దేశంలో 2026 నాటికి ఈ రంగం 200 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని నిపుణుల అంచనా. వీడియోలకు ప్రాధాన్యం పెరుగుతుండటం, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పెరుగుదల వంటివీ వీరికి అవకాశాలను పెంచుతున్నాయి.

కోర్సులు చేసినవారిని ఎస్‌ఈఓ మేనేజర్‌/ ప్రొఫెషనల్, ప్రాజెక్ట్‌ మేనేజర్, డిజిటల్‌ బిజినెస్‌ మార్కెటర్, కంటెంట్‌ మార్కెటర్‌/ మేనేజర్, సోషల్‌ మీడియా మేనేజర్, ఇన్‌బౌండ్‌ మార్కెటింగ్‌ మేనేజర్, ఆటోమేషన్‌ ఎక్స్‌పర్ట్, మొబైల్‌ మార్కెటింగ్‌ ఎక్స్‌పర్ట్, డిజిటల్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజిస్ట్, డిజిటల్‌ మార్కెటింగ్‌ కన్సల్టెంట్, సోషల్‌ మీడియా మేనేజర్, డేటా అనలిటిక్స్‌ ప్రొఫెషనల్, కస్టమర్‌కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ మొదలైన హోదాలకు తీసుకుంటారు. 

రిటైల్, టూరిజం, బ్యాంకింగ్, హాస్పిటాలిటీ, ఐటీ, మీడియా, పీఆర్, అడ్వర్టైజింగ్, కన్సల్టెన్సీలు, మార్కెట్‌ రిసెర్చ్‌ సంస్థలు, డిజిటల్‌ మార్కెట్, డేటా అనలిటిక్స్‌ ఏజెన్సీలు, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ ఏజెన్సీలు మొదలైనవి వీరిని ఎక్కువగా ఎంచుకుంటున్నవాటిలో ఉన్నాయి. గూగుల్, ఫేస్‌బుక్, ఐప్రాస్పెక్ట్‌ ఇండియా, ఐస్టార్ట్, రిజల్‌క్స్, సోషల్‌ పంగా, యాడ్‌గ్లోబల్‌ 360, బీసీ వెబ్‌వైజ్‌ వీరిని ఎంచుకుంటున్న ప్రముఖ సంస్థలు.

ఎంపికైన సంస్థ, హోదానుబట్టి జీతభత్యాల్లో మార్పులుంటాయి. ప్రారంభ వేతనం సాధారణంగా ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకూ ఉంటుంది. నైపుణ్యాలు, అనుభవంతో మంచి జీతాన్ని అందుకునే వీలుంది.
 

Posted Date : 23-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌