• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తాత్కాలికమేనని తక్కువగా చూడొద్దు! 

ఏడాదిగా ఒప్పంద ఉద్యోగాలకు గిరాకీ

ప్రతి ఉద్యోగార్థి ఆశయం ఏమై ఉంటుంది? మంచి సంస్థలో దీర్ఘకాలం కొనసాగే ఉద్యోగంలో చేరాలని! కానీ రానున్న కాలంలో చాలా మందికి ఇది కలగానే మిగిలే అవకాశముందని చెబుతున్నాయి అధ్యయన నివేదికలు. చాలావరకూ సంస్థలు కాంట్రాక్ట్‌/ ఒప్పందం మీద ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో తీసుకునే అవకాశముందనేది వీటి సారాంశం. మరి ఇప్పుడు ఉద్యోగార్థుల ముందున్న మార్గమేంటి?

నిజానికి ఒప్పంద ఉద్యోగాలు కొత్తవేమీ కావు. దాదాపుగా ప్రతి రంగంలోనూ వీటి ఉనికి ఉంది. కాకపోతే పర్మనెంట్‌/ శాశ్వత ఉద్యోగాలతో పోలిస్తే వీటి సంఖ్య చాలా తక్కువ. గత ఏడాది కాలంగా వీటికి గిరాకీ ఏర్పడింది. కొవిడ్‌ పరిణామాల తరువాత అంతర్జాతీయంగా ఎన్నో రంగాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో ఉద్యోగాలు ఉనికే లేకుండా పోయాయి. ఎంతోమంది ఉపాధిని కోల్పోయారు. కొన్ని సంస్థలు శాశ్వత ఉద్యోగులను తొలగించి, వారిలో కొంతమందికి కాంట్రాక్చువల్‌ పద్ధతిలో తిరిగి అవకాశం కల్పించాయి.

ఒక ప్రముఖ సంస్థ నివేదిక ప్రకారం.. గత ఏడాది జనవరి నుంచి జులై లోపే కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్లో 119 శాతం పెరుగుదల ఉంది. ఇప్పటికీ క్రమంగా పెరుగుతోందిట. ఏటా ఎంతోమంది గ్రాడ్యుయేట్లు జాబ్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంటారు. ఈ సంవత్సరం వీరికి గత ఏడాది గ్రాడ్యుయేట్లతోపాటు నిరుద్యోగులూ తోడయ్యారు. దీంతో పోటీ మరింత ఎక్కువైంది. కాబట్టి, మంచి ఉద్యోగం.. కొన్నేళ్లపాటు సాగేదాని కోసం వేచి చూస్తామంటే కుదరని స్థితి. ముందున్న ప్రత్యామ్నాయ మార్గం కాంట్రాక్చువల్‌ ఉద్యోగాలే. వీటిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు.. సరిగా తీర్చిదిద్దుకోవాలే గానీ ఇవీ భవిష్యత్‌ను మలచుకునే వారధులవుతాయంటున్నారు నిపుణులు.

ఏమిటివి? 

రెగ్యులర్‌ ఉద్యోగాల్లాగే ఇవీ కంపెనీల్లో విధులు నిర్వహించే పనులే. కాకపోతే నిర్ణీత పనిగంటల్లో, నిర్ణీత మొత్తానికి పనిచేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఉద్యోగుల పని కాలవ్యవధి 3 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. సంస్థ, ఎంపికైన హోదాను బట్టి  మార్పులుంటాయి. వీటిలోనూ పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్‌ ఉద్యోగాలుంటాయి. పనితీరు బాగుంటే సంస్థలే శాశ్వత ఉద్యోగావకాశాన్ని కల్పిస్తాయి. పనివిధానం నచ్చకపోతే మధ్యలోనే బయటకు వచ్చేయాల్సివుంటుంది.ప్రతి రంగంలోనూ టెక్నాలజీ ప్రమేయం పెరుగుతోందన్నది తెలిసిన విషయమే. ఇవి అవకాశాలను తెచ్చిపెడుతుండటంతోపాటు ఎన్నో సవాళ్లనూ ముందుంచుతున్నాయి. ఐటీ రంగంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. ఈ సమయంలో ఉద్యోగులకు ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. తమ ఉద్యోగులకు వాటిని నేర్పించడం ఖర్చుతో కూడుకున్న పని అవుతుండటంతో సంస్థలూ వీటికి ప్రాధాన్యమిస్తున్నాయి. ఇక మిగతా రంగాల విషయంలో.. కొన్ని పనులు/ కొన్ని విభాగాల అవసరం ఏడాది పొడవునా ఉండాలనేం లేదు. ఇలాంటప్పుడు ఈ అవసరాలకు పూర్తిస్థాయి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటే డబ్బు, మానవ వనరుల వృథానే. కాంట్రాక్చువల్‌ ఉద్యోగులు ఈ విషయంలో వారికి సాయపడతారు.

ఎవరు? ఎలా?

వీటిని ప్రత్యేకంగా ఫలానావారే ఎంచుకోవాలన్న నిబంధనేమీ లేదు. చదువుతూ నైపుణ్యం సంపాదించుకోవాలనుకునేవారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు, ఉద్యోగాన్ని కోల్పోయినవారు ఎవరైనా వీటిని ఎంచుకోవచ్చు. అవసరమైతే ఎప్పుడైనా మానేసే వీలు ఉండటం వీటి ప్రత్యేకత. కాబట్టి, అవసరమైనవారు ఎంచుకోవచ్చు.

ఉద్యోగం తాత్కాలికమైనదైనా, శాశ్వతమైనదైనా రెజ్యూమెను తయారు చేసుకోవడం మొదటి ప్రక్రియ. దానిలో తాత్కాలిక ఉద్యోగాలకీ ఆసక్తి ఉన్నట్లుగా దానిలో పొందుపరచాల్సి ఉంటుంది. ఉద్యోగాధారిత సైట్లలో ఆపై నమోదు చేసుకోవాలి. లేదా లింక్‌డిన్‌ వంటి వాటిలో నేరుగానూ ప్రయత్నించవచ్చు. నచ్చిన స్పెషలైజేషన్, రంగంతోపాటు ఆశిస్తున్న జీతభత్యాల వివరాలనూ పొందుపరచుకోవాలి. అయితే ఉద్యోగాన్ని అందుకునేముందే.. సంస్థ ఆశిస్తున్న అంశాలు, కాలవ్యవధి, పనిగంటలు మొదలైన అంశాలనూ చూసుకోవడం తప్పనిసరి.

శాశ్వతమవ్వాలంటే?

ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థ ఏదైనా.. ఉద్యోగులను తీసుకోవాలంటే మొదటగా తాత్కాలిక ఉద్యోగులవైపే చూస్తాయి. వారికే ఇప్పటికే సంస్థ సంస్కృతి, పని విధానంపై అవగాహన ఉండటం, కొత్తగా శిక్షణనిచ్చే అవసరం ఉండకపోవడం వంటివెన్నో ఇక్కడ అనుకూలాంశాలు. కాకపోతే.. అభ్యర్థి ప్రతిభా ప్రదర్శనకి ఇక్కడ ప్రాధాన్యముంటుందని గమనించాలి. వీటితోపాటు..

సమయపాలనను పాటించాలి. నాణ్యమైన పనితీరు కనబర్చాలి. 

ఉద్యోగులతో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి. 

సంస్థపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. 

చేరిన సంస్థ శాశ్వత ఉద్యోగాలను కల్పించే వీలుందేమో, అందుకు కావాల్సిన అర్హతల గురించీ తెలుసుకోవాలి. 

తాత్కాలికమని తక్కువ అంచనా వేయొద్దు. పనిపట్ల నిబద్ధత, ఉత్సాహంతో ఉండాలి. 

మెరుగైన నెట్‌వర్క్‌ను ఏర్పరచుకోవాలి. మంచి కమ్యూనికేషన్‌ను కొనసాగించగలగాలి.      

చెప్పిన పనికే పరిమితం కాకుండా అదనంగా సేవలను అందించగలగాలి.  

ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండగలగాలి. 

ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలపై దృష్టిపెడుతుండాలి.

ఏ ప్రయోజనాలు?

రెజ్యూమెకు అదనపు విలువ: చదువు పూర్తయ్యాక కానీ, ఉద్యోగం కోల్పోయాక కానీ వచ్చే విరామం ఎప్పుడూ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంటర్వ్యూ సమయంలోనూ దీనిపై ప్రత్యేక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరైన సమాధానం లేకపోతే ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి, ఇది ఉద్యోగ అనుభవాన్ని ఇవ్వడంతోపాటు రెజ్యూమెకు అదనపు విలువనూ జోడిస్తుంది.- వివిధ వ్యక్తులతో పనిచేసే వీలు: కాంట్రాక్ట్‌ విధానంలో వివిధ సంస్థలు, టెక్నాలజీలు, వ్యక్తులతో పనిచేసే వీలు కలుగుతుంది. దీంతో వివిధ సంస్కృతులు, సవాళ్లు ఎదురవుతాయి. పని విధానంలో కొత్త ఉత్సాహాన్ని తెస్తాయి.

ప్రాధాన్యం: కొవిడ్‌ పరిస్థితినే తీసుకోండి. ఆర్థికవ్యవస్థ భారీగానే దెబ్బతింది. సంస్థలూ తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. చాలావరకూ సంస్థలు ఇంకా కొత్త ఉద్యోగులను ఎంచుకోవడానికి సందేహిస్తూనే ఉన్నాయి. దీంతో వారు ఎంచుకుంటున్న మార్గం తాత్కాలిక ఉద్యోగులను ఎంచుకోవడమే. కాబట్టి, పరిస్థితి ఎలా ఉన్నా.. వీరికి మాత్రం ప్రాధాన్యం తప్పక ఉంటుంది. పైగా శిక్షణ, అందుకు అయ్యే ఖర్చు, సమయ వృథా ఉండదు. అయితే తగిన నైపుణ్యాలు ఉండటం మాత్రం తప్పనిసరి.

నెట్‌వర్క్‌: వివిధ సంస్థలకు పనిచేసేటపుడు వివిధ వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. సత్సంబంధాలను కొనసాగించగలిగితే మంచి నెట్‌వర్క్‌ ఏర్పడుతుంది. వృత్తిగత భవిష్యత్తుకు వీరి సాయం తోడ్పడుతుంది.

వేతనాలు: సంస్థలు కాంట్రాక్ట్‌ విధానంలో ఎంచుకుంటున్నాయంటే.. వారిలోని నైపుణ్యాలే కారణం. కాబట్టి, పరిశ్రమలో వచ్చే మార్పులకు అనుగుణంగా అదనపు నైపుణ్యాలను జోడించుకుంటూ వెళితే సంస్థలూ మంచి మొత్తంలో చెల్లించడానికి ముందుకొస్తాయి.

అనుకూలమైన పని  వేళలు: తాజాగా సంస్థలన్నీ తమ ఉద్యోగులందరికీ ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్నే కల్పిస్తున్నాయి. కాబట్టి, సంస్థకే వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉండదు. నిర్దిష్ట పని వేళలను ఎంచుకునే వీలుంటుంది.

కొత్త ప్రయత్నాలు: కొత్తగా కెరియర్‌ను ప్రయత్నించాలనుకునేవారికి ఇదో మంచి మార్గం. పరిశ్రమ పనితీరు, మీ వ్యక్తితత్వానికి సరిపోతుందో లేదో అంచనా వేసుకునే వీలు కలుగుతుంది.

శాశ్వత ఉద్యోగ అవకాశం: పనితీరు నచ్చితే అవసరమైనపుడు సంస్థ మొదటి ప్రాధాన్యం తాత్కాలిక ఉద్యోగులకే కల్పిస్తుంది. ఇంటర్వ్యూ చేసీ, శిక్షణ అందించీ కొత్తవారిని తీసుకోవడం కంటే ఇదివరకే పని తెలిసినవారిని తీసుకోవడం ఎక్కువ లాభం కదా!

Posted Date : 09-02-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌