• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎడ్‌టెక్‌లో ఎన్నో ర‌కాల కొలువులు

నాన్-టెక్నిక‌ల్ అభ్య‌ర్థుల‌కూ అవ‌కాశాలు

సాంకేతిక నైపుణ్యాలను అభ్యసించి, మెరుగుపరుచుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. మరోపక్క నియామక సంస్థలు సాంకేతికేతర విద్యార్థులకూ అవకాశాలు కల్పిస్తున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఇంటర్న్‌షిప్‌లకు అత్యధిక ఆదరణ పెరిగింది! ఉపాధి అవకాశాలను అందించే విషయంలో ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ (ఎడ్‌-టెక్‌) పరిశ్రమ ముందంజలో ఉంది!   

సాంకేతిక నైపుణ్యాల అభ్యాసం

కొవిడ్‌ కారణంగా నెలకొన్న పరిస్థితుల వల్ల శిక్షణకు ఆన్‌లైనే ఆధారమైంది. గత ఏడాది సాంకేతిక నైపుణ్యాల శిక్షణ కోసం 65 శాతం మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. 35 శాతం మంది మాత్రమే సాంకేతికేతర శిక్షణ కోసం నమోదు చేసుకున్నారు. 28 శాతం మంది పైతాన్, 295 శాతం మంది వెబ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల్లో చేరారు. వీటితోపాటుగా ఆటోకాడ్, మెషిన్‌ లర్నింగ్‌లో 16 శాతం చొప్పున, ఎథికల్‌ హ్యాకింగ్‌లో 15 శాతం నమోదయ్యారు. ఆన్‌లైన్‌ సాంకేతిక నైపుణ్యాల కోర్సుల్లో 2016 నుంచి పైతాన్‌ ఆధిక్యం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగనుందని అంచనా.

సాంకేతికేతర సిబ్బందికి ప్రాధాన్యం

అన్ని ఇంటర్న్‌షిప్‌లలో 81 శాతం సాంకేతికేతర సిబ్బంది నియామకాలవే ఉన్నాయి. 19 శాతం ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు మాత్రమే సాంకేతిక హోదాలకు సంబంధించినవి. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ప్రొఫైల్‌లో 29 శాతం, కంటెంట్‌ రైటింగ్‌లో 22 శాతం, గ్రాఫిక్‌ డిజైనింగ్‌లో 18 శాతం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌లో 16 శాతం, డిజిటల్‌ మార్కెటింగ్‌లో 14 శాతం ఇంటర్న్‌షిప్‌లు భర్తీ అయ్యాయి.  ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌లో 64 శాతం, హైరింగ్‌ ప్లేస్‌మెంట్‌ సొల్యూషన్, కెరియర్‌ గైడెన్స్‌లో 19 శాతం, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌/క్రియేటర్స్‌కు సంబంధించి నియామక సంస్థలు 18 శాతం ఇంటర్న్‌షిప్‌లను కోరాయి. ప్రధానంగా ఎడ్‌-టెక్‌ పరిశ్రమ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందింది. ఇది అపారమైన కెరియర్‌ అవకాశాలను భారతీయ విద్యార్థులకు కల్పిస్తూ ముందుకు సాగుతోంది.   

తక్కువ అవకాశాలెందుకు?

మెకానికల్, సివిల్, ఇతర ఇంజినీరింగ్‌ విభాగాలు, ఆర్కిటెక్చర్, మాన్యుఫ్యాక్చరింగ్‌/ ప్రొడక్షన్, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్, ప్రభుత్వ ఇంటర్న్‌షిప్‌లకు సంబంధించిన సాంకేతిక విధులను ఇంటి నుంచి చేయటం (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) సాధ్యం కాదు. కొవిడ్‌ కారణంగా నెలకొన్న పరిస్థితుల వల్ల సాంకేతికపరమైన ఇన్‌-ఆఫీస్‌ ఇంటర్న్‌షిప్‌లను చాలా సంస్థలు తాత్కాలికంగా నిలిపేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాకపోకలు లేకుండా చూడటం, సామాజిక దూరం పాటించడం ముఖ్యం కాబట్టి ఈ ఇంటర్న్‌షిప్‌లను తాత్కాలికంగా నిలిపేయాల్సి వచ్చింది.  

అధికసంఖ్యలో సంస్థలు ఇంటి నుంచి పనిచేసే విధానానికే మొగ్గు చూపాయి. దీనివల్ల ఇంట్లో సురక్షితంగా, క్షేమంగా ఉంటూనే నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. 2020-21లో భర్తీచేసిన మొత్తం ఇంటర్న్‌షిప్‌లలో 64 శాతం ఇంటి నుంచి చేసినవే ఉన్నాయి. 

‘కొవిడ్‌-19 వల్ల పని ప్రదేశాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. డిజైన్, మేనేజ్‌మెంట్, సేల్స్, మార్కెటింగ్, కంటెంట్‌ రైటింగ్‌... విభాగాల్లో సంస్థలు ఆన్‌లైన్‌ వేదికగా అవకాశాలు కల్పించాయి. ఇదే సమయాన్ని విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వినియోగించారు. పరిస్థితులు మెరుగైన తర్వాత ఇన్‌-ఆఫీస్‌ ఇంటర్న్‌షిప్‌లకు అవకాశాలు పెరుగుతాయి. ఆఫీసులు తిరిగి ప్రారంభమైన తర్వాత సాంకేతిక నైపుణ్యం సాధించిన విద్యార్థులు అవకాశాలను పొందగలుగుతారు’ అంటున్నారు ఇంటర్న్‌శాల వ్యవస్థాపకులు, సీఈఓ సర్వేష్‌ అగ్రవాల్‌. 
 

Posted Date : 05-05-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌