• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నెట్టింట్లో పక్కాగా!

పోటీ పరీక్షార్థులకు పనికొచ్చే ప్రామాణిక ఆన్‌లైన్‌ వనరులు 

కొవిడ్‌ కారణంగా పోటీపరీక్షల ఆఫ్‌లైన్‌ శిక్షణ తరగతులు జరగటం లేదు. అవసరమైన విస్తృత సమాచారాన్ని పొందేందుకు అభ్యర్థులు గ్రంథాలయాలపై ఆధారపడటం తగ్గింది. గూగుల్‌లో అన్వేషించటం పెరిగింది. చౌకైన బ్యాండ్‌ విడ్త్, స్పీడ్‌ నెట్‌వర్క్స్‌ అందుబాటులోకి రావడంతో ఉద్యోగార్థులు ఆన్‌లైన్‌ వనరులపై దృష్టి పెడుతున్నారు. వెబ్‌సైట్లూ, ఆప్‌లను వినియోగించుకుంటున్నారు. పోటీపరీక్షల్లో విశ్వసనీయమైన, అధికారిక సమాచారం పొందుపరిస్తేనే ఎక్కువ మార్కులు వస్తాయి. అలాంటి ప్రామాణిక ఆన్‌లైన్‌ వనరులు ఏమేం లభ్యమవుతున్నాయో తెలుసుకుందాం!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేరువ అయ్యే క్రమంలో తమ శాఖాపరమైన వివిధ రకాల సమాచారాలను వెబ్‌ సైట్ల ద్వారా, యాప్‌ల ద్వారా ప్రజలకు అందిస్తున్నాయి. వివిధ నియామక సంస్థలు కూడా ప్రభుత్వ సమాచారంపై అభ్యర్థుల స్థాయిని అంచనా వేసేందుకు ఈ తరహా పరిజ్ఞానంపైనే ప్రశ్నలు అడుగుతున్నాయి. ఆ రకంగా కాబోయే ఉద్యోగుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాయి.

వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించే ప్రభుత్వ వెబ్‌సైట్లు:

పాఠశాల స్థాయి
పోటీ పరీక్షల్లో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు పాఠశాల స్థాయి పుస్తకాల నుంచి ప్రశ్నలు అడగటం ఆనవాయితీ. యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్స్‌ పరీక్షలో కూడా గుర్తించదగిన స్థాయిలో పాఠశాల స్థాయి సమాచారంపై ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో జనరల్‌ సైన్స్, సాంఘిక శాస్త్రంలోని అంశాలు ప్రశ్నల రూపంలో అభ్యర్థులకు ఎదురవుతున్నాయి. అనువర్తన కోణంలో అడిగే ప్రశ్నలు ఈ పుస్తకాల్లో కనిపిస్తున్నాయి. అందుకే ఎందరో సివిల్స్, ఇతర సర్వీసుల విజేతలు తాము ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను బాగా చదివామని తరచూ చెబుతారు.
వెబ్‌సైట్‌: https://ncert.nic.in/

ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల్లో కూడా ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. అందువల్ల ఈ పోటీ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థులు జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వ్యవస్థ, భౌగోళికాంశాలు, చరిత్ర, రాజనీతి శాస్త్రం, ఎథిక్స్, శాస్త్ర సాంకేతికత మొదలైన విభాగాల కోసం ఈ వెబ్‌సైట్‌లపై ఆధారపడవచ్చు. తెలుగు భాషలో కూడా ఈ పుస్తకాలు వెబ్‌సైట్లలో లభిస్తాయి.
వెబ్‌సైట్‌: https://scert.telangana.gov.in/ , https://scert.ap.gov.in/

సబ్జెక్టు పుస్తకాలు
పోటీ పరీక్షల్లో డిగ్రీ స్థాయి ప్రిపరేషన్‌ కొన్ని సబ్జెక్టుల్లో అవసరమవుతుంది. ఉదాహరణకు హిస్టరీ, పాలిటీ లాంటి సబ్జెక్టులను పేర్కొనవచ్చు.ఈ స్థాయి సన్నద్ధతకు ఈ-బుక్స్‌ని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అందిస్తోంది. డిగ్రీ స్థాయిలో సోషియాలజీ, చరిత్ర, రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పరిపాలన, ఆర్థిక వ్యవస్థ మొదలైన సబ్జెక్టుల పూర్తి సమాచారం ఉంది. ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా లభిస్తున్న పుస్తకాలన్నీ అందుబాటులో ఉంచిన వెబ్‌సైట్‌: http://egyankosh.ac.in
అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వెబ్‌ సైటును సందర్శిస్తే డిగ్రీ స్థాయి పాఠ్యాంశాలకు వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలు చాలా సులభంగా అర్థం చేసుకునేందుకు ఉపకరిస్తాయి. వెబ్‌సైట్‌: https://braou.ac.in

మౌలిక రంగాలు 
వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం, ఇంధన వనరులు, ఈ-గవర్నెన్స్‌ల సమాచారాలను వికాస్‌ పీడియా ద్వారా భారత ప్రభుత్వం అందిస్తోంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వారు అందిస్తున్న ఈ వెబ్‌సైట్లో కీలకమైన ఆరు మౌలిక రంగాలకు సంబంధించిన తాజా సమాచారం లభిస్తుంది.
వెబ్‌సైట్‌: https://vikaspedia.in

విదేశీ వ్యవహారాలు
భారతదేశానికి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ వైఖరి, అభిప్రాయాలు, భారత ప్రధాని ఇతర దేశాలతో ఏర్పరుచుకున్న సంబంధాలు మొదలైన విషయాల గురించి వ్యాసరచన, ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు పోటీ పరీక్షల్లో  తప్పనిసరిగా వస్తాయి. అటువంటి సమాచారానికి విశ్వసనీయత ఉన్నప్పుడే అభ్యర్థులకు ప్రయోజనకరం. అలాంటి ప్రామాణిక సమాచారం కోసం ఆధారపడదగిన ప్రభుత్వ
వెబ్‌సైట్‌: https://mea.gov.in
కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్, పర్యావరణ శాఖ, ఇతర శాఖల విధానాలు, నివేదికలు మొదలైనవి కూడా సంబంధిత వెబ్‌సైట్లో లభ్యమవుతున్నాయి.వాటినీ అధ్యయనం చేస్తే పోటీ పరీక్షల్లో మంచి మార్కులకు అవకాశం ఉంటుంది.

వర్తమాన అంశాలు
జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలను చాలా వెబ్‌సైట్లు అందిస్తున్నాయి. వీటిని అనుసరించటం ద్వారా పోటీ పరీక్షలకు కావలసిన సమాచారాన్ని పొందవచ్చు.
వెబ్‌సైట్‌: https://www.pib.gov.in/indexd.aspx , http://www.ptinews.com/ , http://newsonair.com/

లోతైన విశ్లేషణ
వివిధ పరిపాలన అంశాలకు సంబంధించి ఒకటి లేదా రెండు అంశాలను తీసుకుని లోతైన విశ్లేషణతో పాటు ప్రముఖుల అభిప్రాయాలు కూడా పొందుపరిచే ‘యోజన’, ‘కురుక్షేత్ర’ మొదలైన మ్యాగజీన్ల ఈ-కాపీలను పొందేందుకు వెబ్‌సైట్‌: http://www.yojana.gov.in/ బాగా ఉపయోగపడుతుంది.
ఇటీవలే మినిస్ట్రీ ఆఫ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ వారు తాజాగా దేశంలో జరుగుతున్న వివిధ వర్తమానాంశాలు అందించేందుకు కొత్త పక్షపత్రిక ‘న్యూ ఇండియా సమాచార్‌’ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పక్ష పత్రిక ఆబ్జెక్టివ్‌ తరహా ప్రిపరేషన్‌కు కూడా బాగా ఉపయోగం. ఇంగ్లిష్‌ భాషతో పాటు 12 భాషల్లో లభ్యమవుతుంది. అందులో తెలుగు కూడా ఒకటి. దీని కోసం http://davp.nic.in/nis వెబ్‌సైట్‌ ఉపయోగపడుతుంది. యోజన, కురుక్షేత్ర, న్యూ ఇండియాసమాచార్‌ పత్రికలను మొబైల్లో కూడా డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకునే అవకాశం ఉంది.
రాష్ట్ర స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మ్యాగజీన్లు ఉన్నాయి. తెలంగాణ మ్యాగజీన్‌ అయితే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
వెబ్‌సైట్‌: http://magazine.Telangana.gov.in
తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రభుత్వ సమాచారం కోసం ‘తెలంగాణ’ అనే మాసపత్రిక ఉంది.
వెబ్‌సైట్‌: http://ipr.tg.nic.in/telanganapatrika

ఆర్థిక అంశాలు
పోటీ పరీక్షల్లో వివిధ రకాలైన ఆర్థిక అంశాలపై ప్రశ్నలు అడుగుతుంటారు. వర్తమాన అంశాలతో కూడిన లోతైన విశ్లేషణకు తప్పనిసరిగా కొన్ని వెబ్‌సైట్లను అనుసరించాల్సివుంటుంది. కేంద్ర రాష్ట్ర బడ్జెట్‌లు, ఎకనామిక్‌ సర్వేలు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విధానాలు, ఉత్తర్వులు మొదలైనవి అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారానే అభ్యర్థులు పరీక్షకు తగ్గట్టుగా తయారవగలరు.
భారతదేశ బడ్జెట్, ఆర్థిక సర్వేల కోసం: https://www.indiabudget.gov.in/
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్, ఆర్థిక సర్వేల కోసం: https://apfinance.gov.in
తెలంగాణ బడ్జెట్, ఆర్థిక సర్వేల కోసం: https://finance.telangana.gov.in
ఆర్థిక వ్యూహాలు, విధానాల కోసం: https://niti.gov.in , https://fincomindia.nic.in
ఆర్థిక విషయాలపై విమర్శనాత్మక నివేదికల కోసం: https://cag.gov.in

పార్లమెంట్‌ సమాచారం
పోటీ పరీక్షలన్నింటిలోనూ రాజ్యాంగం, దానికి సంబంధించిన అనువర్తన అంశాలపై ప్రశ్నలు తప్పనిసరి. అందులోనూ పార్లమెంటరీ ప్రక్రియలు, పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులు, సంబంధిత స్థితిగతులు సరికొత్త చేర్పులతో ఈ వెబ్‌సైట్లో లభిస్తాయి.
వెబ్‌సైట్‌: https://prsindia.org

వినియోగం జాగ్రత్త సుమా!
1. ప్రభుత్వ వెబ్‌సైట్‌లను పోలిన వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. సరైన ప్రభుత్వ సైట్లను గుర్తించి, వాటినే అనుసరించాలి.
2. కొన్ని కోచింగ్‌ సెంటర్లు ప్రభుత్వ వెబ్‌సైట్‌ల టాగ్‌లలో పెట్టుకుని గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ద్వారా అభ్యర్థులను ఆకర్షించి అసలైన వెబ్‌సైట్ల నుంచి తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇది గమనించాలి.
3. కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో డేటాను ఎప్పటికప్పుడు మార్చరు. అందుకే అప్‌ డేట్‌ అయిందా లేదా అన్నది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ సమాచారాన్ని అనుసరించాలి.
4. కొన్ని గణాంకాల విషయంలో వెబ్‌సైట్ల మధ్య తేడాలు ఉంటున్నాయి. అందుకని అభ్యర్థులు ఆ విషయంలో మెరుగైన సమాచారాన్ని తెలిపే ప్రభుత్వ వెబ్‌సైట్‌నే అనుసరించటం మేలు.
5. కొన్ని సైట్లలో పరీక్షకు అవసరం లేని డేటా కూడా ఉంది. పరీక్ష సిలబస్‌కు సరిపోయినంతవరకే తయారవ్వాలి. అప్పుడే  సమయం సద్వినియోగం అవటమే కాక శ్రమ కూడా తగ్గుతుంది.
6. ఇంగ్లిషులో ఉన్న అనేక వెబ్‌ సైట్లను గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌ ద్వారా తర్జుమా చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే సరైన భావనల్ని అభ్యర్థులు అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది.
7. ప్రామాణిక వెబ్‌సైట్లను వినియోగించుకునే క్రమంలో ఇతర ఆకర్షణలకు గురిచేసే ఇతర సైట్ల లింకులకు వెళ్తే సమయం వృథా అవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

- కొడాలి భవానీ శంకర్‌

Posted Date : 25-08-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌