• facebook
  • twitter
  • whatsapp
  • telegram

శోధిస్తారు.. సాధిస్తారు!

 భూగర్భశాస్త్రంలో భలే కెరియర్‌ 
 విభిన్న రకాల కోర్సులు

బంగారం ఎక్కడ దొరుకుతుంది? విలువైన నిక్షేపాల కోసం ఏ ప్రాంతంలో అన్వేషించవచ్చు? సముద్రంలో చేపలవేట ఎక్కడ బాగుంటుంది?  భూకంపాలను ముందుగానే పసిగట్టడం ఎలా? డైనోసార్లు ఎందుకు అంతరించిపోయాయి?... ఇలా ఎన్నో ప్రశ్నలకు భూగర్భశాస్త్రం సవివరంగా సమాధానాలు అందించగలదు. నింగీ, నీరూ, నేలల గురించి లోతుగా తెలుసుకోవాలనుకునేవారికి సరైన మార్గం చూపగలదు. అన్వేషణపై ఆసక్తి, శోధించాలనే తపన ఉన్నవారు భూగర్భశాస్తాన్న్రి అస్త్రంగా ఉపయోగించుకోవచ్చు. జియాలజిస్టులుగా సుస్థిర కెరియర్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ శాఖలు, అనుబంధ విభాగాలు, ప్రైవేటు సంస్థలు... అన్ని చోట్లా వీరికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. విదేశాల్లో రాణించడానికీ అవకాశాలు ఉన్నాయి!

భూగర్భశాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు యూజీ డిగ్రీ నుంచి దీన్ని ఒక సబ్జెక్టుగా చదువుకోవచ్చు. ఇంటర్‌ సైన్సు విద్యార్థులు జియాలజీ కోర్సుల్లో చేరవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. కొన్ని కేంద్రీయ విద్యా సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ జియాలజీ కోర్సును అయిదేళ్ల వ్యవధితో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారికోసం అందిస్తున్నాయి. డిగ్రీ అనంతరం విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో చేరవచ్చు. పీజీలో కోరుకున్న స్పెషలైజేషన్‌ తీసుకోవచ్చు. జియాలజీతోపాటు అప్లైడ్‌ జియాలజీ, హైడ్రో జియాలజీ, మెరైన్‌ జియాలజీ...ఇలా నచ్చిన కోర్సులో చేరవచ్చు. ఎంటెక్‌లోనూ అప్లైడ్‌ జియాలజీ, మెరైన్‌ జియాలజీ కోర్సులను కొన్ని ఐఐటీలతోపాటు చాలా సంస్థలు అందిస్తున్నాయి. పీజీ తర్వాత పీహెచ్‌డీ చేస్తే ఈ విభాగంలో మరింతగా రాణించవచ్చు.

ఈ కోర్సుల్లో చేరినవారు పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి, వాటిలో రకాలు, ఖనిజ లవణాలు అంటే ఏమిటి, వాటిని గ్రహించే విధానం, భూమి లోపలి పొరలు, సముద్ర గర్భంలోని విశేషాలు.. మొదలైనవి తెలుసుకుంటారు. క్షేత్ర పర్యటనలు, సేకరించిన నమూనాను ప్రయోగశాలలో పరిశీలించడం, భూమిలోపల ఫలకాల పరిస్థితి, భూకంపాలకు కారణం, వాటిని ముందుగా గుర్తించే విధానం, విపత్తుల సమయంలో చురుగ్గా వ్యవహరించడం...ఇవన్నీ సిలబస్‌లో భాగమే. పై తరగతులకు వెళ్లేకొద్దీ ఎంచుకున్న అంశాలపై లోతైన అధ్యయనం ఉంటుంది. నేల, నీరు, నింగిల గురించి తెలుసుకుని వాటిద్వారా ప్రయోజనం పొందడం, వాటిని పరిరక్షించే చర్యలు జియాలజిస్టుల కర్తవ్యం.


 

ఏ హోదాలు?
చదువుకున్న కోర్సు (స్పెషలైజేషన్‌), చేరిన కంపెనీ, చేస్తోన్న ఉద్యోగం ఆధారంగా హోదాలు కేటాయిస్తారు.
 మెరైన్‌ జియాలజిస్టులు: సముద్ర వాతావరణాన్ని అధ్యయనం చేస్తారు. రిమోట్‌ సెన్సర్ల ద్వారా అందులోని పురాతన శిలాజాలు, మొక్కలను అన్వేషిస్తారు. వాటి ప్రభావం సముద్రం, పర్యావరణంపై ఏ విధంగా ఉంటుందో అంచనా వేస్తారు. 
 పెట్రోలజిస్టులు: చమురు, గ్యాస్‌ నిక్షేపాలు ఇంకా ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి పరిశోధన చేస్తారు. ఈ పరిశోధనలు సముద్రం లోపల, బయట నుంచి కొనసాగుతాయి. నిక్షేపాలు ఎక్కడైనా గుర్తిస్తే తవ్వకాలు మొదలుపెట్టడానికి ముందే భూ భౌతిక సర్వే చేస్తారు. భూకంపాలకు అవకాశం ఉందా అనేదీ పరిశీలిస్తారు. 
 మినరాలజిస్టులు: రాళ్లలోని ఖనిజాలపై పరిశోధిస్తారు. సముద్రగర్భ విశేషాలు తెలుసుకుంటారు. 
 జియోహైడ్రాలజిస్టులు: నీటి వనరుల కోసం అన్వేషిస్తారు. లభ్యం కావడానికి అవకాశం ఉన్న చోట్ల ప్రయోగాలు నిర్వహిస్తారు. అలాగే ఆ జలం కాలుష్య కారకాలపై అంచనా వేస్తారు. 
 పాలియాంటాలజిస్టులు: శిలాజాల గురించి తెలుసుకుంటారు. చనిపోయిన జీవులు, మొక్కలపై అధ్యయనం చేస్తారు. వాటి వయసును నిర్ధారిస్తారు. అవి ఎలా ఆవిర్భవించాయి, ఆ సమయంలో భూమండలం ఎలా ఉండేది, వాటి అంతానికి కారణం .. మొదలైనవి అంచనా వేస్తారు. 
 సిస్మాలజిస్టులు: భూకంపానికి కారణమైన భూమిలోపల ఉన్న ఫలకాలపై అధ్యయనం చేస్తారు. వాటి కదలికలను పసిగడతారు. ప్రమాదాన్ని గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తారు. భూకంప శాస్త్రవేత్తలగా సేవలు అందించేది వీరే..
 సర్వేయర్లు: భూమి, సముద్రం... వీటి సమాచారం సేకరించి వివరాలు భద్రపరుస్తారు. గత డేటాను వర్తమాన సమాచారంతో పోలుస్తారు. డేటాలో మార్పులపై అధ్యయనం చేస్తారు.

విధులు ఇలా...
జియాలజిస్టులు క్షేత్రంలో సేకరించిన నమూనాలను ప్రయోగశాలలో పరీక్షిస్తారు. వృత్తిలో భాగంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అభ్యర్థి ఎంచుకున్న విభాగం, చేరిన సంస్థను అనుసరించి పని ఆధారపడి ఉంటుంది. చమురు కంపెనీల్లో ముఖ్యంగా నూనెలు అన్వేషించిన చోట సముద్రం మధ్యలో పనిచేయాల్సి వస్తుంది. ఆటుపోట్లకు సిద్ధంగా ఉండాలి. ప్రకృతి విపత్తుల నుంచి రక్షణలోనూ వీరి సేవలు కీలకం. విధుల్లో భాగంగా పర్వతాల అంచులకు, సముద్ర గర్భంలోకీ వెళ్లాల్సి రావచ్చు. క్షేత్రంతో అనుసంధానమైన విభాగం కాబట్టి ఫీల్డ్‌ వర్క్‌కి సిద్ధంగా ఉండాలి.

ప్రముఖ విద్యాసంస్థలు
 దిల్లీ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, మద్రాస్‌ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పంజాబ్‌ యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ వర్సిటీ. 
 ఐఐటీల్లో: ఐఐటీ బాంబే, ఐఐటీ ధన్‌బాద్‌ (ఐఎస్‌ఎం), ఐఐటీ రూర్కీలు ఎమ్మెస్సీ అప్లైడ్‌ జియాలజీ కోర్సు అందిస్తున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ భువనేశ్వర్‌లో ఎమ్మెస్సీ జియాలజీ  కోర్సు ఉంది. వీటిలో ప్రవేశం జాయింట్‌ అడ్మిషన్‌ టెస్టు ఫర్‌ ఎమ్మెస్సీ (జామ్‌)తో లభిస్తోంది. నేషనల్‌ జియో ఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ..మొదలైనవి పరిశోధనాత్మక కోర్సులు అందిస్తున్నాయి. 
 హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అయిదేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ అప్లయిడ్‌ జియాలజీ అందిస్తోంది. ఇంటర్‌ సైన్స్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 తెలుగు రాష్ట్రాల్లో: ఆంధ్రా, ఉస్మానియా, శ్రీవెంకటేశ్వర, ఆచార్య నాగార్జున, కాకతీయ వర్సిటీలు జియాలజీ పీజీ కోర్సులు అందిస్తున్నాయి.

ఉద్యోగాలెన్నో...
ప్రభుత్వ, ప్రైవేటు, పరిశోధన, బోధన రంగాల్లో వివిధ ఉద్యోగాలు జియాలజీ చదివినవారికోసం అందుబాటులో ఉన్నాయి.


యూపీఎస్సీ: ఏటా కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ సర్వీస్‌ ద్వారా ఎంపికైనవారు జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్‌ వాటర్‌ రిసోర్సెస్‌... తదితర సంస్థల్లో గ్రూప్‌- ఎ ఆఫీసర్‌ హోదాతో సేవలు అందించవచ్చు. జియాలజీ లేదా అనుబంధ విభాగాల్లో పీజీ పూర్తిచేసుకున్నవారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


పీఎస్‌యూల్లో: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ), నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ), నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ), మినరల్స్‌ అండ్‌ మెటల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (ఎంఎంటీసీ), నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ), స్టేట్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంసీ), నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ), నేషనల్‌ అల్యూమినియం కంపెనీ (నాల్కో), హిందూస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ (హెచ్‌జడ్‌ఎల్‌), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), థెరీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీహెచ్‌డీసీ), మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అథారిటీ.. మొదలైన వాటిలో దాదాపు ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎక్కువ సంస్థలు గేట్‌ స్కోర్‌తో అవకాశం కల్పిస్తున్నాయి. కొన్నిసార్లు ప్రత్యేక ప్రకటన విడుదల చేసి పోస్టులు భర్తీ చేస్తాయి. ఎమ్మెస్సీ జియాలజీ లేదా ఎంటెక్‌ జియాలజీ కోర్సులు చదివినవారు ఈ పోస్టులకు అర్హులు. ఇవన్నీ మహారత్న, నవరత్న, మినీరత్న సంస్థలు. వీటిలో అవకాశం వచ్చినవారికి రూ.6 నుంచి రూ.12 లక్షలు, ఆ పైన వార్షిక వేతనం లభిస్తుంది.


ప్రత్యేక సంస్థల్లో: డైరెక్టరేట్‌ ఆఫ్‌ జియాలజీ అండ్‌ మైనింగ్‌ (డీజీఎం), ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ (ఐబీఎం), డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో), ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో), నేషనల్‌ జియో ఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)- హైదరాబాద్, వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ,  భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌), నేషనల్‌ అంటార్కిటికా రిసెర్చ్‌ సెంటర్‌- గోవా, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్సీ)-హైదరాబాద్, స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఏసీ)- అహ్మదాబాద్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (ఐఐఆర్‌ఎస్‌)- దెహ్రాదూన్, అటామిక్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా.. మొదలైన ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో మేటి కొలువులు జియాలజీ చదివిన వారికి లభిస్తున్నాయి. యూపీఎస్సీ లేదా ఆయా సంస్థలు విడుదల చేసిన ప్రకటనల ద్వారా వీటిలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు.డిఫెన్స్, పారామిలటరీల్లోనూ జియాలజిస్టులు సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనూ గనుల శాఖ, భూగర్భ జలాల విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.


ప్రైవేటు సంస్థల్లో: బ్రోకెన్‌ హిల్, రియో టినాట్, డిబీర్స్, కెయిర్న్, రిలయన్స్‌ ఎనర్జీ, షెల్, ఎస్సార్‌ ఆయిల్‌.. తదితర ప్రైవేటు సంస్థల్లోనూ జియాలజిస్టుల నియామకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నాయి. పెట్రోలియం పరిశ్రమలో ఎక్కువ అవకాశాలుంటాయి. భారత్‌లో గనుల సంస్థల్లో పెద్దఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు తాజా గ్రాడ్యుయేట్లకు ఎంతో మేలు చేస్తున్నాయి. మినరల్, హైడ్రోలాజికల్, రిమోట్‌ సెన్సింగ్, జీఐఎస్, జీపీఎస్‌... మొదలైన విభాగాల్లో కన్సల్టెన్సీ సేవలకు అవకాశం ఉంది. ఇందుకోసం పని అనుభవం, నైపుణ్యాలు తప్పనిసరి.


విదేశాల్లో: అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాల్లోనే కాకుండా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో జియాలజిస్టుల సేవలు కీలకమయ్యాయి. ఇండోనేసియా, మలేసియా, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, వియత్నాం, థాయ్‌లాండ్, అప్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌...మొదలైన దేశాల్లో రహదారులు, విమానాశ్రయాలు, డ్యామ్‌లు, పైపులైన్లు నిర్మాణానికి జియాలజిస్టుల అవసరం ఉంది. మధ్యప్రాచ్యంలో చమురు అన్వేషణ జియాలజిస్టులకు వరంగా మారింది.

కావాల్సిన నైపుణ్యాలు
 అన్వేషణపై ఆసక్తి
 పరిశోధనపై మక్కువ
 పరిశీలన దృక్పథం
 శాస్త్రీయంగా ఆలోచించడం
 ఏ వాతావరణంలోనైనా ఇమడగలగడం
 కొత్త విషయాలు తెలుసుకునే తపన
 ప్రయాణాలకు సంసిద్ధత

Posted Date : 31-08-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌