• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మార్పులెన్ని వచ్చినా మెరవొచ్చు!

సురక్షిత కెరియర్‌కు సూత్రాలు


కాలం వేగంగా మారిపోతోంది. నిన్న కొత్తగా అనిపించినవి రేపటికి పాతవవుతున్నాయి. అంతకుమించి మెరుగైనవి వెంటనే మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి. మరి ఉద్యోగాలు? అవీ మారిపోతున్నాయి. ఇప్పుడున్న ఉద్యోగాలు ఏడాది లేదా అయిదేళ్ల తరువాత ఇప్పటిలా ఉండకపోవచ్చు. పదేళ్లకు అసలే కనుమరుగై పోవచ్చు. మార్పుతో సంబంధం లేకుండా సరైన అభ్యర్థిగా ఉండాలంటే? లోపాలు లేని సురక్షితమైన (ఫూల్‌ ఫ్రూఫ్‌) కెరియర్‌ కోసం దానికి తగ్గట్టుగా మీ ఆలోచనల్లోనూ మార్పుండాలి. అదెలా?!

ఒకప్పుడు ఏదైనా సమాచారం అచ్చు రూపంలో కావాలంటే టైప్‌ రైటర్‌ను ఉపయోగించేవారు. ఇప్పుడు కంప్యూటర్‌ సాయం తీసుకుంటున్నారు. టైప్‌ రైటర్‌ విషయంలో ఉన్న పరిమితులను కంప్యూటర్‌ అధిగమించింది. కెమెరా, రేడియో, అలారం, వాచ్‌ విడివిడిగా ఉండేవన్నీ ఇప్పుడు మొబైల్‌లోనే అందుబాటులో ఉంటున్నాయి. మొదటి ఉదాహరణలో సంపూర్ణ మార్పు కనిపిస్తుంది. రెండో దానిలో.. మొబైల్‌లో అన్నీ అందుబాటులో ఉన్నా.. పిక్సెల్స్‌ కారణంగా కెమెరాలను, అలంకరణ/ అనుకూలత దృష్ట్యా వాచ్‌లు, వాహనాల్లో రేడియోలను ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఆయా వస్తువుల రూపాల్లో మార్పు వచ్చింది.

ఈ ఉదాహరణలను గమనిస్తే.. భవిష్యత్తు ఎలా మారుతుందో చెప్పడం కొంచెం కష్టం. ఒక్కోసారి కొద్దిగా మార్పు చెందితే, ఇంకోసారి పాతవి ఆనవాళ్లు లేకుండానే మాయమైపోవచ్చు. ఇది వస్తువులకే కాదు, ఉద్యోగాలకూ వర్తిస్తుంది. జాబ్‌ డిస్క్రిప్షన్‌లో మార్పు రావచ్చు లేదా అసలు ఆ ఉద్యోగమే లేకుండానూ పోవచ్చు. నిజానికి కళాశాలలో నేర్చుకునే నైపుణ్యాలు ప్రతి అయిదేళ్లకు సగం మేర విలువ తగ్గిపోతాయనేది నిపుణుల భావన. ఒక వ్యక్తి జీవితంలో కెరియర్‌ వ్యవధి 40 ఏళ్లు అనుకుంటే.. మిగతా సమయాన్ని కొనసాగించడం కష్టమే కదా! కాబట్టి, సమయానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందకపోతే కెరియర్‌ రేసులో వెనకబడిపోవాల్సి వస్తుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడాలన్నా, కెరియర్‌ అర్ధాంతరంగా ముగియకూడదన్నా కొన్ని వ్యూహాలను పాటించాల్సిందే!

మార్పులకు తగ్గట్టు
కెరియర్‌లో ఎప్పుడైనా మార్పు సాధ్యమే అనేది స్పష్టం చేసుకోవాలి. ఏటా వచ్చే మార్పులను గమనించుకుంటూ అనుగుణంగా సిద్ధమవ్వాలి. ఉద్యోగులైతే వివిధ విభాగాల్లో పనిచేయాలి. అవసరమైతే మార్చమని పై అధికారులను అడగొచ్చు. డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు, కొత్త టెక్నాలజీల గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. విద్యార్థులైతే పరిశ్రమ గురించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి. అవసరమైన ప్రోగ్రామ్‌లకు చదువుతోపాటు ప్రాముఖ్యమివ్వాలి. పరిశ్రమ ఏదైనప్పటికీ సంబంధిత సాంకేతిక అంశాలకూ ప్రాముఖ్యమివ్వాలి. వివిధ ఇంటర్న్‌షిప్‌లు చేయడానికి ప్రయత్నించాలి.

ఒకదానిపైనే గురి?
ఒక పరిశ్రమకే, ఒక రకమైన ఉద్యోగ బాధ్యతపైనే దృష్టిపెట్టొద్దు. పరిస్థితులను బట్టి ఏ పరిశ్రమలోనైనా ఏ ఉద్యోగాన్నైనా  చేయగలిగేలా తయారవ్వాలి. ఎందుకంటే అన్నిసార్లూ అందరికీ స్పష్టమైన కెరియర్‌ మార్గాన్ని చూపే సంస్థల్లో చేరడం సాధ్యం కాకపోవచ్చు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ విషయంలోనూ ఇది పెద్ద సమస్యకాదు. కానీ, అభివృద్ధి తక్కువగా ఉన్న లేదా క్షీణ దశలో ఉన్న రంగాలైతే ఎంత కష్టపడి పనిచేసేవారైనా కష్టాలు తప్పవు. తీరా అలాంటి పరిస్థితి ఎదురయ్యాక వేరే మార్గాన్ని వెతుక్కోవడం కంటే ముందునుంచే దేనికైనా సిద్ధమనే ధోరణిని అలవరచుకోవాలి. విభిన్న అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

ఎల్లలు లేని ఆలోచన
పరిశ్రమ గురించి తెలుసుకోవాలి! ఈ మాట వినగానే దేశంలోని ప్రముఖ సంస్థలు, వాటి కొత్త ఉత్పత్తులు, సంస్కరణలు.. వగైరా విషయాలకే పరిమితమవుతుంటాం. ఎక్కడో జరిగిన యుద్ధం, ఒక దేశ మార్కెట్‌ ప్రపంచాన్ని కుదిపేయడం చూస్తుంటాం. కాబట్టి, స్థానికతకు మాత్రమే ప్రాముఖ్యమివ్వకూడదు. ప్రపంచవ్యాప్తంగా సంబంధిత రంగంలో వస్తున్న మార్పులపైనా దృష్టిపెట్టాలి. నూతన వైఖరులు, సాంకేతికతలకు సానుకూలంగా స్పందించగలగాలి. ప్రాంతాన్నిబట్టి సంస్కృతులు మారుతుంటాయి. వాటి గురించీ అవగాహన ఉండాలి. దాన్నిబట్టి ఆలోచించగలగాలి, ప్రవర్తించగలగాలి.

సాంకేతిక సామర్థ్యం
చాలామందిలో టెక్నాలజీ అనగానే ‘మాకు సంబంధం లేదు, అది సాఫ్ట్‌వేర్‌ వాళ్లకే పరిమిత’మనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఇది సరైన ఆలోచన కాదు. కెరియర్‌ నిమిత్తం కొన్ని అవసరమైన, ప్రాథమిక నైపుణ్యాలనైనా అందిపుచ్చుకుని ఉండటం అవసరం. ఉద్యోగానికీ, రంగానికీ సంబంధించినవే అవ్వాలనేం లేదు. ఏదైనా ప్రాజెక్టును సొంతంగా వివరించాలన్నా టెక్నాలజీ సాయం తప్పనిసరి. దీనికోసం ఇతరులపై ఆధారపడితే అన్నివిధాలా అనుకున్నవిధంగా రాకపోవచ్చు. కాబట్టి, ఎక్సెల్, వర్డ్, కొన్ని టూల్స్‌ లాంటి ప్రాథమికమైనవి నేర్చుకుని ఉండాలి.

హార్డ్, సాఫ్ట్‌ స్కిల్స్‌
పరిశ్రమ ఏదైనా మార్కెటింగ్, ఫైనాన్స్, సేల్స్‌ లాంటి అంశాలు తప్పక ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రాథమిక అవగాహన అవసరం. డిజిటల్‌ మార్కెటింగ్, డేటా అనాలిసిస్, సేల్స్, ఫైనాన్స్‌ మొదలైన అంశాలపై కనీసావగాహనను పెంచుకోవాలి. ఈ అంశాలను అధ్యయనం చేస్తుండాలి. ఉద్యోగ స్థాయి/ పరిశ్రమతో సంబంధం లేకుండా అవసరమయ్యేవి సాఫ్ట్‌స్కిల్స్‌. రానున్న ఆటోమేషన్‌ యుగంలో రోబోలకు గట్టి పోటీ ఇవ్వడానికి వ్యక్తులకు అవసరమయ్యే నైపుణ్యాలూ ఇవే. భావప్రకటన, బృందంతో పనిచేయడం, సమస్యా పరిష్కారం, పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం, నేర్చుకోవాలనే తపన మొదలైన లక్షణాలు/ నైపుణ్యాలను అలవరచుకోవాలి.

గెలుపు చిట్టా
చాలా ఇళ్లల్లో ఖర్చులకు సంబంధించి పద్దులు రాస్తుంటారు. సంస్థలూ తమ లావాదేవీలన్నింటినీ ఒక చోట నిర్వహిస్తుంటాయి. ఇక్కడ అభ్యర్థీ అదే బాటలో పయనించాలి. కాకపోతే తను రాయాల్సింది తను సాధించిన విజయాలు, ఆలోచనల గురించి. ఒక చిన్న గుర్తింపు, ఆలోచన, చేసిన ప్రాజెక్ట్, సాధించిన మార్కులు, తీసుకున్న శిక్షణ, వాలంటీరుగా చేసిన పని.. ఇలా తనకు తృప్తినిచ్చే దేన్నైనా దీనిలో చేర్చుకోవచ్చు. వీటిని ఎప్పటికీ కొనసాగిస్తూ ఉండాలి. ఇవి రెజ్యూమె తయారీ, ఇంటర్వ్యూ సమయల్లోనే కాదు, ఆఫీసులో పదోన్నతులు, అప్రైజల్స్‌ సమయంలోనూ ఉపయోగపడతాయి. ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంచడంలోనూ సాయపడతాయి.

నెట్‌వర్క్‌ ఉందా?
‘మీకేం తెలుసు అన్నదానికంటే ఎవరు తెలుసు అన్నదే ముఖ్యం’. పాత మాటే! కానీ ఇప్పటికీ దీనికి ప్రాముఖ్యం ఉంది. నెట్‌వర్క్‌ ద్వారానే మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ. విద్యార్థులు/ ఉద్యోగులు తోటివారితోనే స్నేహం చేయాలి, సంబంధాలు నెరపాలి అన్న ఆలోచనను పక్కన పెట్టేయాలి. ఇతర వయసుల వారు, సంస్థలతోనూ స్నేహం చేయాలి. ఇవి అవకాశాలకే కాదు.. భిన్న నైపుణ్యాలను అందుకోవడానికీ, వ్యూహాలను తెలుసుకోవడానికీ పనికొస్తాయి. వివిధ బృందాలు, ఫోరమ్‌లు, ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ల్లో చేరడం ద్వారా దీన్ని సాధించొచ్చు. వాటిలో చురుకుగా పాల్గొనడమూ ప్రధానమే!

Posted Date : 07-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌