• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అప్పు ఇవ్వాలా వద్దా?

‣ రుణ మంజూరులో కీలకం క్రెడిట్‌ అనలిస్టులు


రుణం కావాల్సి వస్తుంది. మన నుంచి కొన్ని వివరాలను తీసుకుని, భవిష్యత్‌లో ఆ అప్పు తిరిగి చెల్లించగలుగుతామో లేదో తేల్చుకుంటారు. క్రెడిట్‌ కార్డువిషయంలోనూ అంతే. ఒక్కోసారి బ్యాంకుల నుంచే రుణానికి అర్హులమంటూ పిలుపు వస్తుంటుంది. ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తూ, తీసుకున్న అప్పును సమయానికి, నిర్ణీత వ్యవధిలోగా చెల్లించేయగలుగుతారని నిర్ధారించుకుంటారు. సంస్థల విషయంలోనూ ఇదే తీరు సాగుతుంటుంది. వీటిని నిర్ధారించే నిపుణులే క్రెడిట్‌ అనలిస్టులు. ఈ కెరియర్‌కు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది!

క్రెడిట్‌ అనలిస్టులు కస్టమర్ల, సంస్థల ఆర్థిక సంబంధిత సమాచారాన్ని విశ్లేషించడం ప్రధానంగా చేస్తుంటారు. దాని ఆధారంగా రుణం ఇవ్వొచ్చో లేదో, రిస్క్‌ మోతాదు లాంటివి అంచనా వేస్తారు. వీరినే రిస్క్‌ అనలిస్టులుగానూ వ్యవహరిస్తారు. ఎన్నో బాధ్యతలతోపాటు రిస్క్‌ మోతాదు ఎక్కువ ఉన్న కెరియర్‌ ఇది. క్రెడిట్, లోనుకు సంబంధించిన దరఖాస్తు వచ్చినపుడు క్రెడిట్‌ అనలిస్ట్‌ తెర వెనక నుంచి పని చేస్తారు. అభ్యర్థి ఆర్థిక సమాచారాన్నంతా విశ్లేషించి, రిస్క్‌ ఎంతమేరకూ ఉందో అంచనా వేస్తారు. దరఖాస్తు అంచనా వేయడం దగ్గర్నుంచి తుది నిర్ణయం వరకూ వీరిపైనే ఆధారపడి ఉంటుంది. దరఖాస్తు కారణం, చెల్లించగల సామర్యం, గత ఆర్థిక చరిత్ర, అర్హత మొదలైనవన్నీ ఇందులో భాగంగా చూస్తారు. ఇందుకు వీరికి కొన్ని కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లూ అవసరమవుతాయి. అభ్యర్థి క్రెడిట్, రోజువారీ లావాదేవీల వివరాలన్నీ ఈ ప్రోగ్రామ్‌ల్లో ఎప్పటికప్పుడు పొందుపరచి ఉంటాయి. ఆర్థికరంగంలో వీరిది ప్రధాన పాత్ర. వీరి ఆమోదం లేనిదే బ్యాంకులు, ఇన్సూరెన్స్, సంబంధిత సంస్థలు నగదును మంజూరు చేయవు.

వీరిలోనూ బిజినెస్‌ క్రెడిట్‌ అనలిస్ట్, కన్స్యూమర్‌ క్రెడిట్‌ అనలిస్ట్, కమర్షియల్‌ క్రెడిట్‌ అనలిస్ట్, రిస్క్‌ అనలిస్ట్‌ అనే తేడాలుంటాయి. హోదాను బట్టి విధుల్లో కొద్దిపాటి తేడాలుంటాయి. బిజినెస్‌ క్రెడిట్‌ అనలిస్టులు సంస్థలు, వాటికి సంబంధించిన లోన్ల విషయంలో పనిచేస్తే, కన్స్యూమర్‌ క్రెడిట్‌ అనలిస్టులు వ్యక్తిగత లోన్లపై పనిచేస్తారు. కమర్షియల్‌ క్రెడిట్‌ అనలిస్టులు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంబంధ సంస్థలతో పనిచేస్తారు. వీరు అప్పులను ఎంతవరకూ చెల్లించగలుగుతారో చూస్తే, క్రెడిట్‌ అనలిస్టులు అసలు అప్పును పొందడానికి అర్హులో కాదో నిర్ణయిస్తారు. పేరు ఏదైనా ఎక్కువ సంస్థల్లో ఈ విధులన్నీ ఒకరే నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఉద్యోగావకాశాలు? 
వీరికి వివిధ రంగాల్లో అవకాశాలుంటాయి. ప్రారంభంలో జూనియర్‌ అనలిస్ట్‌గా చేరొచ్చు. అనుభవం ఆధారంగా సీనియర్‌ అనలిస్ట్, ఫైనాన్షియల్‌ మేనేజర్‌ ఆపై హోదాలకు చేరుకునే వీలుంది.
ఎక్కువగా బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్, ఈక్విటీ సంస్థలకూ వీరి అవసరం ఎక్కువగానే ఉంది. ఇవే కాకుండా కార్పొరేట్‌ ఆఫీసులు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థ‌లు, ప్రభుత్వ రుణ విభాగాలు, క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు, ఈక్విటీ సంస్థ‌ల్లోనూ వీరికి అవకాశాలుంటాయి.
ఎంపికైన సంస్థ, రంగం, అది ఉన్న ప్రాంతం, అనుభవం, హోదాలను బట్టి వేతనాల్లో మార్పులుంటాయి. ప్రారంభవేతనం ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి మొదలవుతుంది. అనుభవాన్ని బట్టి వేతనాల్లో భారీ మార్పులు ఉంటాయి. ఏడాదికి రూ. 5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ అందుకోవచ్చు.

విధులేంటి?
‣ అప్పులు ఇచ్చేటపుడు రిస్క్‌ అవకాశాలను అంచనా వేస్తారు. 
‣ ఆస్తుల, అప్పుల వివరాలను అంచనా వేసి, అభ్యర్థి ఆస్తులను విలువ కడతారు. అవసరమైతే ఆన్‌లైన్‌ విశ్లేషణకూ ప్రాధాన్యమిస్తారు. 
‣ మేనేజ్‌మెంట్, ఆర్థిక, అభివృద్ధిపరంగా సంస్థ‌ల ఆర్థిక సురక్షితతను అంచనా వేస్తారు. 
‣ అభ్యర్థి దరఖాస్తును విశ్లేషించి, పూర్తి నివేదికను సంస్థ‌కు‌ అందజేస్తారు. 
‣ రుణాలను మంజూరు చేస్తారు. సంబంధిత ధ్రువపత్రాలను సేకరిస్తారు. 
‣ దరఖాస్తు ప్రక్రియలో కస్టమర్లకు సాయపడతారు.

కావాల్సిన నైపుణ్యాలు
‣ ఆంగ్లభాషా పరిజ్ఞానం తప్పనిసరి.
‣ కమ్యూనికేషన్, అనలిటికల్, ఆర్గనైజేషనల్‌ నైపుణ్యాలుండాలి.
‣ ప్రాథమిక సాఫ్ట్‌వేర్‌ అంశాలు- ఎంఎస్‌ ఎక్సెల్, పవర్‌ పాయింట్, న్యూమరికల్‌ డేటాకు సంబంధించిన ఇతర సాఫ్ట్‌వేర్‌ అంశాలపై అవగాహన ఉండాలి.
‣ బాధ్యతలను నిర్భయంగా నెరవేర్చగల   స్థైర్యం ఉండాలి. ఒకటికి మించి బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలి.
‣ వివిధ సంబంధిత అంశాలపై అవగాహన ఉండాలి.
‣ మ్యాథమేటికల్, ఇంటర్‌ పర్సనల్‌ నైపుణ్యాలుండాలి.
‣ త్వరితగతిన మాటలద్వారాగానీ, పేపర్‌పై గానీ నిర్ణయాలు తీసుకోగలగాలి. సమస్యలకు వేగంగా, సరైన పరిష్కారాలను చూపగలిగేలా ఉండాలి.
‣ ఒకే సమయంలో వివిధ ప్రాజెక్టులపై పని చేయాల్సి వస్తుంది. కాబట్టి మల్టీ టాస్కింగ్‌ నైపుణ్యాలు తప్పనిసరి.

మార్గాలివీ!
క్రెడిట్‌ అనలిస్ట్‌ కెరియర్‌లోకి చేరడానికి నేరుగా ఏ కోర్సులూ అందుబాటులో లేవు. చాలావరకూ ఫైనాన్స్, అకౌంటింగ్‌ల్లో డిగ్రీ, పీజీ విద్యార్హత ఉన్నవారికి సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రేషియో అనాలిసిస్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కాల్‌క్యులస్, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ అనాలిసిస్, రిస్క్‌ అసెస్‌మెంట్‌ల్లో డిగ్రీలు ఉన్నవారూ ఈ కెరియర్‌ను అందుకోవచ్చు. వీటిల్లో రిస్క్‌ అసెస్‌మెంట్‌ను కోర్సులో భాగంగా చదువుతారు.
చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ (సీఎఫ్‌ఏ), కెరియర్‌ అసిస్టెన్స్‌ సర్వీసెస్‌ (సీఏఎస్‌), సర్టిఫికెట్‌ ఇన్‌ కార్పొరేట్‌ క్రెడిట్‌ అనాలిసిస్‌ (సీసీఏ), క్రెడిట్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, సర్టిఫికెట్‌ ఇన్‌ కమర్షియల్‌ క్రెడిట్‌ (సీఐసీసీ), క్రెడిట్‌ స్కిల్స్‌ ఫర్‌ బ్యాంకర్స్‌ సర్టిఫికెట్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కొన్ని వారాల నుంచి నెలల వ్యవధి వరకూ ఉంటాయి. సంస్థ, ఎంచుకున్న కోర్సును బట్టి వ్యవధుల్లో తేడాలుంటాయి. 
ఇంకా..
‣ డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్‌ ఇన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనాలిసిస్‌ చదివి, పీజీ స్థాయిలో ఎంబీఏ చేయడం ద్వారా అవొచ్చు.
‣ డిగ్రీ స్థాయిలో బీకాం చదివి, పీజీ స్థాయిలో ఎంకాం/ చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ (సీఎఫ్‌ఏ)/ ఎంబీఏ ఫైనాన్స్‌ చేయొచ్చు.
‣ డిగ్రీ స్థాయిలో బీఎస్‌సీ (మేథ్స్‌)/ బ్యాచిలర్‌ ఆఫ్‌ స్టాట్స్‌/ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ చదివి, పీజీ స్థాయిలో ఎంబీఏ (ఫైనాన్స్‌)/ సర్టిఫైడ్‌ క్రెడిట్‌ రిసెర్చ్‌ అనలిస్ట్‌ (సీసీఆర్‌ఏ) చేయడం ద్వారా అవొచ్చు.
‣ డిగ్రీ తరువాత ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ చదివినవారూ అవొచ్చు.

సర్టిఫికేషన్‌ కోర్సులకు.. 
‣ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ మేనేజ్‌మెంట్, పుణె
‣ కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ బ్యాంకింగ్, పుణె
‣ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ (ఎన్‌ఐఎస్‌ఎం), ముంబయి
‣ బీఎస్‌సీ ఇన్‌స్టిట్యూట్‌ లిమిటెడ్, ముంబయి, అహ్మదాబాద్, కోల్‌కతా
‣ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (ఏఐడబ్ల్యూఎంఐ), ముంబయి
‣ మూడీస్‌ అనలిటిక్స్‌ (హైదరాబాద్‌తో సహా ప్రముఖ నగరాలన్నింటిలోనూ సంస్థ బ్రాంచీలు ఉన్నాయి)
‣ క్రిసిల్, ముంబయి
‣ ఫ్లిప్, కర్ణాటక మొదలైనవి.
ఆన్‌లైన్‌లో యుడెమి, ఐమార్టికస్, ఎడ్‌ఎక్స్‌ మొదలైనవాటిల్లోనూ అందుబాటులో ఉన్నాయి.

Posted Date : 10-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌