• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మార్చి 24 నుంచి ఇంటర్‌ పరీక్షలు

* 2020-21 విద్యా క్యాలెండర్‌ను ఖరారు చేసిన బోర్డు
* దసరాకు 3.. సంక్రాంతికి 2 రోజుల సెలవులు
* మొత్తంగా తగ్గిన పనిదినాలు: 40


ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌బోర్డు ఈ విద్యా సంవత్సరం(2020-21) క్యాలెండర్‌ను ఖరారు చేసింది. వార్షిక పరీక్షలు 2021 మార్చి 24నుంచి ప్రారంభం అవుతాయని తెలిపింది. సాధారణంగా ఇంటర్‌ పరీక్షలు మార్చి మొదటి వారంలో మొదలవుతాయి. 2019-20లో మార్చి 4 నుంచి ప్రారంభమయ్యాయి. ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభం బాగా ఆలస్యమైనందున చివరి పరీక్షలు కూడా ఆలస్యంగా జరుగుతాయా? గతంలో మాదిరిగానే మార్చిలో ఉంటాయా? అనే సందిగ్ధత నెలకొంది. అయితే గత ఏడాదితో పోలిస్తే చివరి పరీక్షలు 20 రోజులు ఆలస్యంగా మొదలుకానున్నాయి.
సెప్టెంబ‌రు 1 నుంచి రెండో ఏడాది విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి విద్యా సంవత్సరం మొదలైనట్లుగా పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 16 చివరి పనిదినంగా పేర్కొన్నారు. అంటే మొత్తం 228 రోజులు. అందులో ఆదివారాలు, ఇతర సెలవులు 46 మినహాయిస్తే 182 రోజులు పనిదినాలుగా ఉంటాయి. దసరాకు ఈసారి ఆదివారంతో కలిపి మూడు రోజులు, సంక్రాంతికి రెండు రోజులు సెలవులిచ్చారు. సాధారణంగా జూన్‌ 1 నుంచి విద్యా సంవత్సరం మొదలవుతుంది. ఈసారి మూడు నెలలు ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో సెలవులు కుదించినా దాదాపు 40 రోజుల పనిదినాలు తగ్గాయి. విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టేందుకు ఇంతకంటే మార్గం కూడా లేదని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆగ‌స్టు 31వ తేదీ సంతకంతో విద్యా క్యాలెండర్‌ను ఇంటర్‌బోర్డు సెప్టెంబ‌రు 10న‌ కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపింది.
ప్రిన్సిపాళ్లకు, యాజమాన్యాలకు సూచనలు.. హెచ్చరికలు
‘‘ప్రభుత్వం ప్రకటించిన మేరకు సెలవులను తప్పనిసరిగా పాటించాలి. ప్రవేశాలను ఇంటర్‌బోర్డు కాలపట్టిక ప్రకారమే చేపట్టాలి. ప్రవేశాల కోసం పీఆర్‌ఓలను నియమించుకోవడం, ఇతరత్రా ప్రచారం చేసే మార్కెటింగ్‌ వ్యూహాలను అమలు చేయరాదు. హోర్డింగ్, కరపత్రాలు, గోడలపై రాతలతో ప్రచారం చేయరాదు. జవాబుపత్రాల మూల్యాంకనానికి అర్హులైన అధ్యాపకులను పంపించకుంటే ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ హెచ్చరించారు.
వార్షిక విద్యా క్యాలెండర్‌ ఇదీ...
మొత్తం పని దినాలు: 182
విద్యా సంవత్సరం ప్రారంభం: సెప్టెంబరు 1
దసరా సెలవులు: అక్టోబరు 23, 24, 25
సంక్రాంతి సెలవులు: 2021 జనవరి 13, 14
ప్రీ ఫైనల్‌ పరీక్షలు: 2021 ఫిబ్రవరి 22-27
ప్రయోగ పరీక్షలు: 2021 మార్చి 1-20
చివరి పరీక్షలు: 2021 మార్చి 24- ఏప్రిల్‌ 12
చివరి పని దినం: 2021 ఏప్రిల్‌ 16
వేసవి సెలవులు: 2021 ఏప్రిల్‌ 17- మే 31
సప్లిమెంటరీ పరీక్షలు: 2021 మే చివరి వారం
2021-22 విద్యా సంవత్సరం మొదలు: 2021 జూన్‌ 1

Posted Date : 11-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌