• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సైన్స్‌లో మెరికలకు చేయూత

‣ ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం కేవీపీవై ఫెలోషిప్పులు  

బేసిక్‌ సైన్సెస్‌పై పట్టు, పరిశోధనల్లో ఆసక్తి ఉన్న యువ కిశోరాలను ప్రోత్సహించడానికి జాతీయ పురస్కారాలు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐఐఎస్సీ ఈ పురస్కారాలకు అర్హులను ఎంపిక చేస్తుంది. ఇందుకోసం ఏటా పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు కిశోర్‌ వైజ్ఞానిక ప్రోత్సాహన్‌ యోజన (కేవీపీవై)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి డిగ్రీలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు ప్రతినెలా రూ.5000 చెల్లిస్తారు. పీజీలో రూ.7000 చొప్పున అందిస్తారు. 

జాతీయ స్థాయిలో జరిగే ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రతిభ చూపినవారిని ఈ ఫెలోషిప్పులకు ఎంపిక చేస్తారు. ఈ ఏడాదికి ఇంటర్వ్యూ రద్దు చేశారు. (గత ఏడాది వరకు పరీక్షతోపాటు ఇంటర్వ్యూ తప్పనిసరి. ఆప్టిట్యూడ్‌ పరీక్షలో పొందిన మార్కుల్లో 75 శాతం + ఇంటర్వ్యూ మార్కుల్లో 25 శాతం కలిపి మెరిట్‌ లిస్ట్‌ తయారు చేసేవారు) అభ్యర్థి ప్రస్తుత విద్యార్హతను బట్టి పరీక్ష నిర్వహిస్తారు.  

సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలను ప్రోత్సహించడానికీ, సైన్స్‌ విభాగాల్లో విద్యార్థులు రాణించేలా.. సైన్స్‌ను కెరియర్‌గా మలచుకునేలా చేసే లక్ష్యంతో  భారత ప్రభుత్వానికి చెందిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ (డీఎస్టీ) 1999లో కేవీపీవైను ప్రారంభించింది. సైన్స్‌ సబ్జెక్టుల్లో ఆసక్తి, ప్రావీణ్యం ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం దీని లక్ష్యం. బీఎస్సీ ప్రథమ సంవత్సరంలో ఉంటుండగానే మొదలయ్యే ఈ ఫెలోషిప్పు పీజీ పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. అలాగే ఎంపికైనవారికి దేశంలోని ప్రముఖ సైన్స్‌ పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థల్లో సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్, బెంగళూరు వీటిని పర్యవేక్షిస్తోంది.

ఆన్‌లైన్‌ పరీక్షలో...
ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రత్యేకమైన సిలబస్‌ అంటూ నిర్దేశించలేదు. విద్యార్థికి సైన్స్‌ సబ్జెక్టుల్లో ఉన్న అవగాహన, అర్థం చేసుకునే తీరు, విశ్లేషణను పరిశీలిస్తారు. అయితే ప్రశ్నలు సాధారణంగా వాళ్లు రాసే స్ట్రీమ్‌ బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ / ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రథమ సంవత్సరంలోని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచే ఉంటాయి. 

ఎస్‌ఏ స్ట్రీమ్‌ ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో రెండు భాగాలు. పార్ట్‌ ఎలో 60 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటాయి. పార్ట్‌ బిలో 20 ప్రశ్నలకు 40 మార్కులు. ఎస్‌బీ, ఎస్‌ఎక్స్‌ స్ట్రీమ్‌ల్లోనూ రెండు భాగాలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రానికి 160 మార్కులు కేటాయించారు. మొదటి భాగంలో 80 ప్రశ్నలకు 80 మార్కులు. రెండో భాగంలో 40 ప్రశ్నలకు 80 మార్కులు. అన్ని స్ట్రీమ్‌ల పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులున్నాయి. పార్ట్‌ ఎలో ప్రశ్నలకు తప్పు సమాధానం గుర్తిస్తే పావు మార్కు, అదే పార్ట్‌ బిలో అయితే అర మార్కు చొప్పున తగ్గిస్తారు. 

2009 నుంచి ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు, జవాబులు కేవీపీవై వెబ్‌సైట్‌లో ఉన్నాయి. వీటిద్వారా ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టును కేవీపీవై వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. దాన్ని అభ్యాసం చేసి ఆన్‌లైన్‌ పరీక్షపై అవగాహన పెంచుకోవచ్చు. పరీక్షలో సాధించిన మెరిట్‌ ప్రకారం అర్హులకు స్కాలర్‌షిప్పులు అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం కొన్ని స్కాలర్‌షిప్పులు కేటాయించారు.

కేవీపీవై-2019 ఫెలోషిప్పులకు జనరల్‌ కేటగిరీలో ఎస్‌ఏలో 53, ఎస్‌ఎక్స్‌లో 55, ఎస్‌బీలో 50 శాతం మార్కులు సాధించినవారు ఎంపికయ్యారు.(పరీక్ష, ఇంటర్వ్యూ కలిపి వందకు కుదించడం ద్వారా పొందిన మార్కులు).

వీటిలో చేరితేనే...
బీఎస్సీ/ బీఎస్‌/బీస్టాట్‌/ బీమ్యాథ్స్‌/ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ ఎంఎస్‌ - ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, సెల్‌ బయాలజీ, ఎకోలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, బోటనీ, జువాలజీ, ఫిజియోలజీ, బయోటెక్నాలజీ, న్యూరో సైన్సెస్, బయో ఇన్ఫర్మాటిక్స్, మెరైన్‌ బయాలజీ, జియాలజీ, హ్యూమన్‌ బయాలజీ, జెనెటిక్స్, బయో మెడికల్‌ సైన్సెస్, అప్లయిడ్‌ ఫిజిక్స్, మెటీరియల్‌ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, జియో ఫిజిక్స్‌ వీటిలో ఏదైనా సబ్జెక్టులో చేరితేనే స్కాలర్‌షిప్పు అందుతుంది. 

కేవీపీవైలో స్ట్రీమ్‌లు...
ఎస్‌ఏ: ప్రస్తుత విద్యా సంవత్సరం (2020-21)లో సైన్స్‌ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు ఈ విభాగంలోకి వస్తారు. పదో తరగతిలో మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 75 శాతం మార్కులు సాధించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 65 శాతం మార్కులు ఉండాలి. వీరు కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం) మార్కులతో ఇంటర్‌ పూర్తి చేయాలి. దీంతోపాటు 2022-23 విద్యా సంవత్సరంలో బేసిక్‌ సైన్సెస్‌ (బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బీమ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌) కోర్సుల్లో చేరితేనే ఈ స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది. వీళ్లు సీనియర్‌ ఇంటర్‌లో ఉన్న సమయాన్ని ఇంటెరిమ్‌ పీరియడ్‌గా పరిగణిస్తారు. ఈ వ్యవధిలో ప్రాంతీయ, జాతీయ స్థాయి సైన్స్‌ క్యాంపులకు ఆహ్వానిస్తారు. ఇందుకయ్యే ప్రయాణ ఖర్చులు భరిస్తారు. వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. 

ఎస్‌ఎక్స్‌: ఈ విద్యా సంవత్సరంలో అంటే 2020-21లో సైన్స్‌ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్న వాళ్లు ఎస్‌ఎక్స్‌ స్ట్రీమ్‌ కిందికి వస్తారు. వీరంతా పదో తరగతిలో మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 75 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 65 శాతం) మార్కులు పొందినవారై ఉండాలి. అలాగే సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 50 శాతం) మార్కులతో ఇంటర్‌ పూర్తిచేయాలి. దీంతోపాటు 2021-22 విద్యా సంవత్సరంలో బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బీమ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్‌ కోర్సుల్లో చేరితేనే స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది. 

ఎస్‌బీ: ఈ విద్యా సంవత్సరంలో అంటే 2020-21లో ప్రథమ సంవత్సరం బీఎస్సీ/బీఎస్‌/బీస్టాట్‌/బీమ్యాథ్స్‌/ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ఎంఎస్‌ కోర్సులు చదువుతున్న వాళ్లు ఎస్‌బీ స్ట్రీమ్‌ కిందికి వస్తారు. వీళ్లు సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం) మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్‌ తర్వాత అకడమిక్‌ గ్యాప్‌ ఉండరాదు. అలాగే వీరు డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తేనే స్కాలర్‌షిప్‌కి ఎంపికవుతారు. 

ప్రోత్సాహకాలు...
బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బీమ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ ఎంఎస్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ప్రతి నెల రూ.5000 చొప్పున చెల్లిస్తారు. ఏటా రూ.20,000 కాంటింజెన్సీ గ్రాంట్‌ అందుతుంది. ఎమ్మెస్సీ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీజీ చివరి రెండేళ్లు ప్రతినెల రూ.7000 అందుతాయి. కాంటింజెన్సీ ఏడాదికి రూ.28,000 ఉంటుంది. వీటికి ఎంపికైనవారు జాతీయ ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయం, ప్రయోగ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. 

ఏటా మెరుగైన అకడమిక్‌ ప్రతిభ చూపితేనే ఫెలోషిప్‌ తర్వాత విద్యా సంవత్సరంలో కొనసాగుతుంది. లేదంటే ఆ విద్యా సంవత్సరానికి వర్తించదు. అంటే ప్రతి విద్యా సంవత్సరంలోనూ సైన్స్‌ సబ్జెక్టుల్లో తొలి ప్రయత్నంలోనే కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం) సాధించాలి. దీంతోపాటు సమ్మర్‌ క్యాంప్, సమ్మర్‌ ప్రాజెక్టుల్లో సంతృప్తికరమైన పనితీరు కనబరచడం తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఇతర ప్రోత్సాహకాలు పొందినవారు కేవీపీవైకు అనర్హులు. 

సమ్మర్‌ ప్రోగ్రాం
సైన్స్‌లో పరిశోధనాసక్తి మరింత పెంపొందించే లక్ష్యంతో సమ్మర్‌ ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు. వేసవి సెలవుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారం లేదా రెండు వారాల వరకు ఈ ప్రోగ్రాంలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా సైన్స్‌ సంబంధించిన వివిధ అంశాల్లో నిపుణులు ఉపన్యాసాలిస్తారు. శాస్త్రవేత్తలతోనూ మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. సైన్స్‌ అంశాలను ప్రయోగాత్మకంగా చూపిస్తారు. సైన్స్‌లో పరిశోధనలు కొనసాగిస్తున్న విద్యార్థులతోనూ భేటీ కావొచ్చు. ఏ అంశంపైనైనా ప్రత్యేక ఆసక్తి ఉంటే అందులో ఇప్పటికే పరిశోధన కొనసాగిస్తున్న నిపుణులతో సందేహాలు నివృత్తి చేసుకోవడమే కాకుండా ప్రయోగాలు కూడా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. అలాగే ఆ అంశానికి సంబంధించిన కెరియర్‌ అవకాశాలనూ తెలుసుకోవచ్చు. సాధారణంగా ఈ సమ్మర్‌ క్యాంప్‌లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన పరిశోధనా సంస్థలు, సైన్స్‌ విద్యాలయాల్లో ఉంటాయి. నివాస ప్రాంతానికి దగ్గరలో ఉన్న పరిశోధనా సంస్థలు, ప్రయోగశాలలకూ తీసుకెళ్తారు. కేవీపీవైకు ఎంపికైన ప్రతి విద్యార్థికీ గుర్తింపు కార్డు మంజూరు చేస్తారు. దీనిద్వారా జాతీయ ప్రయోగ శాలలు/యూనివర్సిటీల్లో లైబ్రరీ, ల్యాబొరేటరీ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు: అక్టోబరు 5
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.625. మిగిలిన అందరికీ రూ.1250.
పరీక్ష తేది: జనవరి 31, 2021
ప్రవేశపత్రాలు: జనవరి రెండోవారం నుంచి కేవీపీవై వెబ్‌లో అందుబాటులో ఉంటాయి. 
పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.
వెబ్‌సైట్‌: http://kvpy.iisc.ernet.in/main/index.htm

Posted Date : 14-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌