• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పేరున్న సంస్థల్లో పీజీ కోసం!

ప్రవేశపరీక్ష.. జామ్‌ - 2021


ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో, ఐఐఎస్‌సీలో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ అడ్మిషన్‌ టెస్టు ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) ప్రకటన వెలువడింది. ఈ ఏడాది కొత్తగా ఎకనామిక్స్‌ సబ్జెక్టును చేర్చారు. పరీక్షలో ప్రతిభ చూపినవారు ఏడు సబ్జెక్టులకు చెందిన వివిధ స్పెషలైజేషన్లతో కోర్సులు ఎంచుకోవచ్చు. ఈ ఏడాది పరీక్షను ఐఐఎస్‌సీ బెంగళూరు నిర్వహిస్తోంది. ప్రకటన నేపథ్యంలో పూర్తి వివరాలు, సన్నద్ధత వ్యూహాలు తెలుసుకుందాం!

ఈ సంవత్సరం కొత్తగా ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ టెస్టు పేపర్‌ను జామ్‌లో చేర్చారు. దీంతో సబ్జెక్టుల సంఖ్య 7కు చేరింది. అవి బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమేటిక్స్, మ్యాథమేటికల్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్‌. అభ్యర్థులు ఒకటి లేదా గరిష్ఠంగా రెండు సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. సెషన్‌-1లో ఒకటి, సెషన్‌-2లో మరొక సబ్జెక్టులో పరీక్ష రాసుకోవచ్చు. సెషన్‌-1లో ఉదయం బయోటెక్నాలజీ, మ్యాథమేటికల్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. రెండో సెషన్‌లో మధ్యాహ్నం కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమేటిక్స్, ఎకనామిక్స్‌ సబ్జెక్టుల్లో పరీక్షలు ఉంటాయి. జామ్‌ స్కోరుతో ఎమ్మెస్సీ, జాయింట్‌ ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ-ఎంఎస్‌(రిసెర్చ్‌)/పీహెచ్‌డీ కోర్సుల్లో 20 ఐఐటీలతోపాటు, ఐఐఎస్‌సీ, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఎన్‌ఐటీలు, ఇతర సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది.

సంస్థలవారీ అర్హతల్లో స్వల్ప మార్పులుంటాయి. సాధారణంగా ఐఐటీల్లో ప్రవేశం కోరేవారు డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం సరిపోతుంది. అదే ఐఐఎస్‌సీ, బెంగళూరులో ప్రవేశాలకు 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతంగా నిర్ణయించారు. ఐఐటీలు, ఐఐఎస్‌సీలో కెమిస్ట్రీ కోర్సులకు డిగ్రీలో కెమిస్ట్రీతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ తప్పనిసరిగా చదివుండాలి. ఐఐటీ ఇండోర్, రూర్కీలకు మాత్రం డిగ్రీలో కెమిస్ట్రీ చదివితే సరిపోతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, జియాలజీ పీజీ కోర్సులకు డిగ్రీ స్థాయిలో ఆ సబ్జెక్టులు చదవడం తప్పనిసరి. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ ఐఐటీ- బాంబే, ఇండోర్‌ ఈ రెండు సంస్థలే అందిస్తున్నాయి. వీటికోసం గ్రాడ్యుయేట్లు ఎవరైనా పోటీ పడవచ్చు. ఈ విభాగంలో అందిస్తోన్న మాలిక్యులర్‌ మెడికల్‌ బయాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ కోర్సుల్లో చేరడానికి సంబంధిత సైన్స్, మ్యాథ్స్‌ కోర్సులు చదవడం తప్పనిసరి. కొత్తగా ప్రవేశపెట్టిన ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సును ఐఐటీ దిల్లీ, రూర్కీ అందిస్తున్నాయి. దిల్లీలో ఈ కోర్సులో చేరడానికి బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్‌ విద్యార్థులు పోటీ పడవచ్చు. రూర్కీలో అయితే డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. ప్రస్తుతం డిగ్రీ ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు జామ్‌ రాసుకోవచ్చు.

పరీక్ష ఇలా...
పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. వ్యవధి 3 గంటలు. ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఏ సబ్జెక్టు ప్రశ్నపత్రంలోనైనా మొత్తం ఆబ్జెక్టివ్‌ 60 ప్రశ్నలు ఉంటాయి. వీటికి వంద మార్కులు. మూడు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. అవి.. మల్టిపుల్‌ చాయిస్, మల్టిపుల్‌ సెలెక్ట్, న్యూమరికల్‌ సమాధాన ప్రశ్నలు. వీటిని 3 సెక్షన్లగా విభజించారు.
సెక్షన్‌ - ఎ: ఇందులో మొత్తం 30 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఒక మార్కు ప్రశ్నలు పది, రెండు మార్కుల ప్రశ్నలు ఇరవై వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 4 ఆప్షన్లు ఇస్తారు. వీటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పు సమాధానాలకు ఒక మార్కు ప్రశ్నకు 1/3, రెండు మార్కుల ప్రశ్నలకు 2/3 మార్కులు తగ్గిస్తారు. 
సెక్షన్‌ - బి: ఇందులో పది మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. నాలుగు ఆప్షన్లు ఇస్తారు. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలగా ఉండవచ్చు. సరైన ఆప్షన్‌/ ఆప్షన్లను గుర్తిస్తేనే పూర్తి మార్కులు వస్తాయి. పాక్షిక సమాధానానికి మార్కులు కేటాయించరు. రుణాత్మక మార్కులు లేవు.
సెక్షన్‌ - సి: ఇందులో 20 న్యూమరికల్‌ ఆన్సర్‌ ప్రశ్నలు వస్తాయి. వీటికి వాస్తవ సంఖ్య సమాధానంగా ఉంటుంది. ఈ ప్రశ్నలకు ఆప్షన్లు ఉండవు. ఒక మార్కు ప్రశ్నలు పది, రెండు మార్కుల ప్రశ్నలు పది వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు.

భిన్నంగా ప్రశ్నపత్రం
సంబంధిత సబ్జెక్టుపై పట్టుంటే జామ్‌లో విజయం సాధించవచ్చు. అయితే విశ్వవిద్యాలయాలు నిర్వహించే పీజీ ప్రవేశ పరీక్షలకు భిన్నంగా జామ్‌ ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రాథమికాంశాలకు ప్రాధాన్యమిస్తూనే విస్తృత అవగాహన పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు నేరుగా కాకుండా అన్ని కోణాల్లోనూ స్పృశించేలా ఉంటాయి. ఆయా సబ్జెక్టుల్లో అవగాహన, అనువర్తన, విశ్లేషణ, పరిజ్ఞానం పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి.ప్రాథమికాంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. ఇందుకోసం ముందుగా ఇంటర్‌ పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. అనంతరం డిగ్రీ పాఠ్యాంశాలు ఆపోశన పట్టాలి. సబ్జెక్టు/ పేపర్లవారీ సిలబస్‌ వివరాలను జామ్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆ ప్రాధాన్యం ప్రకారం పాఠ్యపుస్తకాల్లోని అంశాలు అధ్యయనం చేయాలి. సిలబస్‌లో ప్రస్తావించిన అంశాలు పాఠ్యపుస్తకంలో లేకపోతే రిఫరెన్స్‌ పుస్తకాలను ఆశ్రయించాలి.

ప్రామాణిక సన్నద్ధతలో పాతప్రశ్నత్రాలు దిక్సూచిలా ఉపయోగపడతాయి. ప్రశ్నల తీరు, ఆయా సబ్జెక్టుల్లో ఉన్న పాఠ్యాంశాలకు పరీక్షలో లభిస్తోన్న ప్రాధాన్యం తెలుసుకోవచ్చు. వీటిని బాగా పరిశీలించడం వల్ల వేటిని చదవాలి, ఎలా సన్నద్ధం కావాలో స్పష్టత వస్తుంది. పరీక్షపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. జామ్‌ వెబ్‌సైట్‌లో పాత ప్రశ్నపత్రాలు పొందుపరిచారు. పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. పరీక్షలకు కొద్ది రోజుల ముందు మాక్‌ టెస్టును జామ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. దాన్ని రాయడం వల్ల అసలు పరీక్ష ఎలా ఉండబోతుందో అంచనాకు రావచ్చు. సాధారణంగా 60 శాతం మార్కులు సాధించినవారు ఏదో ఒక ఐఐటీలో సీటు పొందడానికి అవకాశం ఉంది.

బయోటెక్నాలజీ
బయోటెక్నాలజీలో పరీక్ష రాసేవారు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులకు చెందిన ముఖ్యాంశాలను చదవాలి. బీఎస్సీ బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, బోటనీ, జువాలజీ పాఠ్యపుస్తకాల్లోని అంశాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా బయోకెమిస్ట్రీలో అమినో ఆసిడ్లు, ప్రొటీన్లు; కార్బొహైడ్రేట్‌ మెటబాలిజం, ఎంజైమ్‌లు, బయోకెమికల్‌ టెక్నిక్‌లు, సెల్‌ సిగ్నలింగ్‌ అంశాలపై శ్రద్ధ పెట్టాలి. జెనెటిక్స్, మాలిక్యులర్‌ బయాలజీ విభాగంలో డీఎన్‌ఎ ధర్మాలు, ఆర్‌డీఎన్‌ఎ టెక్నాలజీ, ట్రాన్‌స్క్రిప్షన్‌లపై దృష్టి సారించాలి.

కెమిస్ట్రీ
కెమిస్ట్రీ సబ్జెక్టులో పరీక్ష రాసే విద్యార్థులు ఫిజికల్, ఆర్గానిక్‌ విభాగాలపై అధిక దృష్టి సారించాలి. ఆర్గానిక్‌ విభాగంలో జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, రియాక్షన్‌ మెకానిజం, స్పెక్ట్రోస్కోపీ, స్టీరియో కెమిస్ట్రీ, నేమ్‌డ్‌ రియాక్షన్, రియేజెంట్స్‌ తదితర పాఠ్యాంశాలను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో క్వాంటమ్‌ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్‌ కైనటిక్స్, ఎల్రక్టో కెమిస్ట్రీ, సాలిడ్‌ స్టేట్‌ అంశాలను బాగా చదవాలి. ఇనార్గానిక్‌లో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, రసాయన బంధం అంశాలపై దృష్టి సారించాలి.

ఫిజిక్స్‌
ఫిజిక్స్‌ సబ్జెక్టులో పరీక్ష రాసేవారు ఫిజికల్‌ ఆప్టిక్స్, క్వాంటమ్‌ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, వేవ్స్‌ అండ్‌ ఆసిలేషన్స్, హీట్, ఆప్టిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, న్యూక్లియర్‌ ఫిజిక్స్, అటామిక్‌ ఫిజిక్స్, క్వాంటమ్‌ థియరీ, స్పెక్ట్రోస్కోపీ అంశాలను అధ్యయనం చేయాలి.

మ్యాథ్స్‌
మ్యాథ్స్‌ అభ్యర్థులు మ్యాట్రిక్స్, డెరివేటివ్స్, కాలిక్యులస్, వెక్టార్స్, ట్రిగనోమెట్రీ, కోఆర్డినేట్‌ జామెట్రీలపై దృష్టి సారించాలి.

ఎకనామిక్స్‌
ఎకనామిక్స్‌ పరీక్ష రాస్తున్నవారు మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ఇండియన్‌ ఎకానమీ, స్టాటిస్టిక్‌ ఎకానమీ, మ్యాథమెటికల్‌ ఎకానమీ అంశాలను అధ్యయనం చేయాలి.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అక్టోబరు 15 వరకు
పరీక్ష ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750 రెండు పేపర్లకు రూ.1050. మిగిలిన అభ్యర్థులు అందరికీ రూ.1500. రెండు పేపర్లకు రూ.2100
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 14
ప్రవేశపత్రాల డౌన్‌లోడ్‌: జనవరి 5 నుంచి  
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్‌.
ఫలితాల ప్రకటన: మార్చి 20
వెబ్‌సైట్‌: https://jam.iisc.ac.in/

రిఫరెన్స్‌ పుస్తకాలు
కెమిస్ట్రీ 
Organic Chemistry: Clayden, Carey Sundberg
Physical Chemistry: P.W.Atkins, K.L.Kapoor
Inorganic Chemistry: J.D. Lee, Shriver & Atkins

మ్యాథ్స్‌
Biochemistry: Voet & Voet, Albert Lehninger
Microbiology: Prescott
Cellbiology: Alberts, Lodish
Molecular Biology: Weaver
Immunology: Kuby
Genetics: Griffith, Suzuki
Animal Physiology: Nielsen
Plant Physiology: Teiz and Zeiger

బయాలజీ 
Algebra: Bhattacharya, Devid C Lay
Calculus: M.J.Strauss, H.Anton
Real Analysis: Shanti Narayan, Richard R Goldberg
Differential Equations: Sastri SS, Collins P.J.
Complex Numbers: Murry R Spiegel
Probability of Statistics: C.E. Weatherban, Das Gupta, Ray & Sharma

ఫిజిక్స్‌

Mechanics: D.S. Mathur, Daniel Waves and Optics : D.R. Brown, N K Bajaj
Electricity & Magnetism: D.C. Tayal, Edward M Purcell
Kinetic Theory & Thermodynamics: D John, Charles E Hecht
Modern Physics: D.C. Pandey, B.L. Theraja
Solid State Physics: S.P. Singh, D.K. Bhattacharya

 

Posted Date : 15-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌