• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నిరాశ వదులు.. కార్యాచరణకు కదులు!

నిశి అమావాస్య గడిచాక నిండు వెన్నెల పున్నమి వస్తుంది. చిమ్మచీకటి రాత్రి తరువాత వెలుగురేకల సూర్యోదయమౌతుంది. నైరాశ్యం వీడితే కోటి ఉషస్సుల అవకాశాలు కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి! ప్రతి సంక్షోభాన్నీ సదవకాశంగా మలచుకోవాలంటారు. ఇప్పుటి ఈ కొవిడ్‌ సంక్షోభ సమయాన్ని పోటీ పరీక్షార్థులు తమ దీర్ఘకాల స్వప్నాన్ని నిజం చేసుకునేందుకు వినియోగించుకోవాలి. అలా చేస్తే నేటి నిరాశను జయించి రేపటి విజేతగా నిలవొచ్చు!


ఇప్పుడేం చేయాలి?
‣ తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు ఇక నోటిఫికేషన్లు వస్తాయని విశ్వసించి వెంటనే సీరియస్‌ సన్నద్ధతను ప్రారంభించాలి.
‣ ఏ పరీక్షకైనా గత ప్రశ్నపత్రాలే విజయ సూచికలు. సేకరించగలిగినన్ని పాత ప్రశ్నపత్రాలు సేకరించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
‣ ప్రతి పరీక్షకూ సిలబస్సే దిక్సూచి. నియామక సంస్థ వెబ్‌సైట్‌ నుంచి సిలబస్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రతి సబ్జెక్టునూ అందులోని ప్రతి చాప్టర్‌నూ అవగాహన చేసుకోవాలి.
‣ సిలబస్‌పై అవగాహన ఏర్పడ్డాక దానిని గత ప్రశ్నపత్రాలతో అనుసంధానం చేసుకుంటూ సన్నద్ధత వ్యూహం రూపొందించుకోవాలి.
‣ ఇప్పుడిక కాలవ్యవధి నిర్దేశించుకుని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. నోటిఫికేషన్‌ వచ్చే నాటికే ఒక స్థాయి సన్నద్ధత పూర్తి చేసెయ్యాలి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగార్థులు నిరాశతో కూడిన నిస్తేజంలో ఉన్నారు. 2020 సంవత్సర ఆగమనం తరువాత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూపులు ఫలిస్తాయనుకున్నా మార్చి నెలాఖరు నుంచే లాక్‌డౌన్, కొవిడ్‌-19 వ్యాప్తితో ప్రభుత్వాలు అతలాకుతలమవుతున్నాయి. ఇక ఉద్యోగార్థులు ఎక్కడికక్కడ తమ ప్రిపరేషన్‌ ప్రాంతాలు వదిలి గూటికి చేరే పక్షుల్లా సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. అక్కడే కాస్తో కూస్తో సన్నద్ధతలో ఉన్నారు. కానీ చాలావరకు మునుపటి జిజ్ఞాస లేదు. తపనా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం అసలు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయా అన్న సందేహమే. ఆశిస్తున్న ఉద్యోగ ప్రకటనలు వెలుగు చూస్తాయా? ఇతర అవకాశాలన్నింటినీ వదులుకుని కూర్చుని తమ కలల ఉద్యోగాలను ఎప్పటికైనా కైవసం చేసుకోగలమా? ఉద్యోగార్థులను వేధిస్తున్న సందేహాలు, సమాధానం లేని శేష ప్రశ్నలు!

నిరాశ వదిలి.. వాస్తవ విశ్లేషణ
నైరాశ్యం ఏర్పడినప్పుడు అందుకు కారణాలను విశ్లేషించుకోవడం విద్యావంతులూ, విజ్ఞులూ చేసే మంచి పని. ఈ విపత్కర పరిస్థితులు ఎప్పటికి తొలగిపోతాయో తెలియదు. సంక్షోభం సమసిపోయాక ప్రభుత్వాలు బలహీనపడి ఆర్థిక పరిస్థితి నుంచి కోలుకుని అసలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయో లేదో? ఈ రెండు కారణాలను కాస్త లోతుగా విశ్లేషించుకుంటే.. వాస్తవాలను బేరీజు వేసుకుంటే మనోధైర్యం ఏర్పడుతుంది. అనుసరించాల్సిన కార్యాచరణ మనోఫలకంపై రూపు దిద్దుకుంటుంది.
 

మొదటిది: కొవిడ్‌-19 సృష్టించిన విలయం నుంచి మనం బయటపడతామా? నిజానికి ఇది ఒక్క ఉద్యోగార్థుల సమస్య మాత్రమే కాదు. ప్రపంచం అంతా ఈ సంక్షోభం గురించి ఆందోళన చెందుతోంది. ఎంతటి వైరస్‌ కూడా ఎల్లకాలం ప్రభావం చూపదు.  కొవిడ్‌-19 వైరస్‌ నిరోధక వ్యాక్సిన్లు వివిధ ప్రయోగ దశల్లో ఆశాజనకంగా ఉన్నాయి. నెలల వ్యవధిలోనే వరుసగా కొవిడ్‌-19 వ్యాకిన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వాలు, పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు రేయింబవళ్లూ కృషి చేస్తున్నారు. నిర్ధారితంగా చెప్పలేం కానీ వ్యాధి నిరోధక ఔషధం రావడం మాత్రం తథ్యం. ఈ సంక్షోభం నుంచి బయట పడటమూ తథ్యమే.
 

రెండోది: ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వాలు దీని నుంచి తేరుకుని ఉద్యోగ భర్తీని చేపడతాయా అనేది మరో సందేహం. దీనికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తాయన్నది అందరిలో మెదులుతున్న మరో ప్రశ్న. ఉద్యోగ ఖాళీల భర్తీ అనేది ప్రభుత్వాల అవసరంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలకు అవసరం రానంతవరకూ ఏదోవిధంగా కాలయాపన చేస్తాయే తప్ప అవసరం ఏర్పడినపుడు అనివార్యంగా నియామకాలు చేపడతాయి. ఈ కోణం నుంచి చూసినపుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు మూడు శాఖల్లో ఖాళీల భర్తీ అవసరం ఉందని స్పష్టమవుతోంది.

నిరీక్షణ పరీక్షలకు మోక్షం
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నుంచి నోటిఫికేషన్లు వచ్చి రెండేళ్ల నుంచి పరీక్షలు పెండింగ్‌లో ఉన్న ఎన్‌టీపీసీ (నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ) రాతపరీక్షలకు డిసెంబరు 15 నుంచి షెడ్యూల్స్‌ ఇస్తున్నట్లు బోర్డు ఇప్పటికే ప్రకటించింది. గత రెండేళ్ల నుంచి సుదీర్ఘ ప్రిపరేషన్‌ సాగిస్తున్న తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది ఉద్యోగార్థులకు ఇది శుభవార్తే. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంతవరకూ పెండింగ్‌లో ఉన్న పోటీపరీక్షలను ఇకపై వెనువెంటనే నిర్వహించే అవకాశముంది. సాఫ్ట్‌ సెలక్షన్‌ (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలూ ఈ కోవకు చెందినవే.
 

వైద్య ఆరోగ్య శాఖ: కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా తొలిసారిగా ప్రభుత్వాలకు ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు భారీగా పెంచాల్సిన అవసరం తెలిసొచ్చింది. విపత్తు తొలిదశలో ప్రభుత్వ ఆసుపత్రులపై తీవ్రమైన ఒత్తిడి పడింది. ప్రైవేటు రంగంలోకి కార్పొరేట్‌ ఆసుపత్రులు వెలవెలపోగా ప్రభుత్వ ఆసుపత్రులకు డిమాండు పెరిగింది. ప్రభుత్వాలు వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు పెంచడానికి ఇప్పుడు నిర్ణయించాయి. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, పాలనా సిబ్బంది నియామకాలు అనివార్యం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ దిశగా ఆమోదాలు తెలుపుతున్నాయి. రాబోయే నెలల్లో వైద్యం, ఆరోగ్య రంగాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశముంది.
 

పోలీసు శాఖ: కరోనా విపత్తు సందర్భంగా వైద్యశాఖ తరువాత ఎక్కువగా సేవలు అందించిన శాఖ ఇది. వైరస్‌ వ్యాప్తి తొలిదశలో పాజిటివ్‌ కేసుల ట్రేసింగ్, కంటెయిన్‌మెంట్‌కు పోలీసు వారి సేవలు ఉపయోగపడ్డాయి. పోలీసు సిబ్బంది లాక్‌డౌన్‌ సమయంలో రెండు, మూడు నెలలు రాత్రింబవళ్లు వారాంతపు సెలవులు కూడా తీసుకోకుండా పనిచేశారు. ఈ శాఖలో సిబ్బంది కొరత కొవిడ్‌ ముందు నుంచీ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కానిస్టేబుల్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్లకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడే విపత్తు రీత్యా సిబ్బంది అవసరం పెరిగినందున ఖాళీలు భారీగా పెరిగే అవకాశముంది.
 

విద్యాశాఖ: పరిస్థితులు సద్దుమణిగాక విద్యారంగం పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలయ్యాక ఉపాధ్యాయుల నియామకాలు ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉంది. వాస్తవానికి మార్చి నాటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఖాళీలు గుర్తించి నియామకాలకు సిద్ధమయ్యాయి. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల టీఆర్‌టీ నోటిఫికేషన్లు వెలువడలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 2018 టీఆర్‌టీ నియామకాలు పూర్తికాకపోవడంతో కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తూ కొత్త టీఆర్‌టీ నోటిఫికేషన్‌ను విడుదల చేయలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దీనిపై ఆదేశాలు ఇవ్వడంతో సెప్టెంబరు చివరి వారంలో టీఆర్‌టీ నియామకాలు చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే కొత్త టీఆర్‌టీని ఉద్యోగార్థులు ఆశించినప్పుడు అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా వివిధ యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలల్లో ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది.
 

Posted Date : 28-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌