• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మారుతోంది నియామకాల తీరు!

అభ్యర్థులకు కొత్త టెస్టుల సవాళ్లు
రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌; ఇంటర్వూలో భాగంగా టెక్నికల్, హెచ్‌ఆర్‌ రౌండ్లు.. ఉద్యోగ ప్రక్రియలో కనిపించే దశలు. ఒక్కోదశలో అభ్యర్థిలోని వివిధ కోణాలను పరీక్షించడానికి ఉద్దేశించినవే. ఇదంతా కొవిడ్‌-19కు ముందు పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొవిడ్‌ కారణంగా పరిశ్రమల్లో కార్యకలాపాలు చాలావరకూ మందగించాయి. వాటిలో ఇప్పుడిపుడే కదలికలు కనిపిస్తున్నాయి. సంస్థలూ నియామకాలవైపు మొగ్గు చూపుతున్నాయి. కానీ  హుషారైన, చురుకైన అభ్యర్థులను ఎంచుకోవటానికి నియామక ప్రక్రియలో మార్పులను ప్రవేశపెడుతున్నాయి. పాతపద్ధతికే పరిమితమైతే అవకాశాలు చేజారొచ్చు. కొత్త మార్పులవైపూ ఓ కన్నేయాల్సిన సమయమిది! 
 

నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలు అభ్యర్థులకు రకరకాల పరీక్షలు నిర్వహిస్తాయి. వీటిలో కొన్ని..వేలాది దరఖాస్తుల్లో తగినవారిని వడపోత చేయడం కోసం నిర్వహిస్తారు. కానీ.. చాలావరకూ అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యం, సబ్జెక్టు పరిజ్ఞానం, సంస్థలో పనిచేయగల, తోటివారితో పాటు కలిసి పనిచేయగల వివిధ నైపుణ్యాలను పరీక్షించడం వీటి ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు పరిస్థితి కొవిడ్‌ ముందు, ఆ తరువాతలా తయారైంది. 
 

కొవిడ్‌ ముందు వరకూ దాదాపుగా సంస్థలన్నీ రాతపరీక్ష, బృందచర్చ, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేసేవి. అన్ని సంస్థలూ వీటన్నింటినీ నిర్వహించకపోయినా దాదాపుగా వీటి ఆధారంగానే ఎంపిక ఉండేది. కొవిడ్‌ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. పరిశ్రమల కార్యకలాపాలన్నీ కుంటుపడ్డాయి. దీంతో చాలామంది ఉద్యోగాలనూ కోల్పోయారు. ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా మార్పు మొదలవుతోంది. అంతకుముందు నియామక ప్రక్రియ నేరుగా జరిగేది. వీటన్నింటినీ ఎదుర్కోవడానికి అభ్యర్థులు సంస్థకు వెళ్లడం తప్పనిసరిగా ఉండేది. కొన్ని సంస్థలు ప్రారంభ దశలను ఆన్‌లైన్‌లో నిర్వహించినా తుది దశకైనా సంస్థకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొవిడ్‌ కారణంగా భౌతిక దూరం తప్పనిసరి అయింది. ఫేస్‌ టూ ఫేస్‌ ఇంటర్వ్యూలు, సంస్థలకు వెళ్లి పనిచేయడం లాంటి వాటికి అవకాశం లేకుండా పోయింది. దీంతో సంస్థలన్నీ ఆన్‌లైన్‌ ఎంపికలవైపు చూస్తున్నాయి.

చాలాకాలం పాటు నియామకాలు లేకపోవడం, ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోవడంతో కొలువుల కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరిగింది. గత పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం ఒక్క ఉద్యోగానికి వేలల్లో పోటీపడే స్థితి ఇప్పుడు కనిపిస్తోంది. వీటన్నింటినీ పరిశీలించి అభ్యర్థులను ఎంచుకునే సమయం సంస్థలకు ఉండటం లేదు. స్క్రీనింగ్‌లో భాగంగా అప్లికేషన్‌ ట్రాకింగ్, కీవర్డ్‌ స్కానింగ్‌ వంటి వాటి సాయం తీసుకుంటున్నారు. 
 

అయినా తగిన నైపుణ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఆన్‌లైన్‌లో కొంత కష్టమే. దీంతో కొత్త అంశాలూ, ధోరణులకు నియామక ప్రక్రియలో చోటిస్తున్నారు. ఉద్యోగార్థులు వాటిపై అవగాహన తెచ్చుకుని, ముందునుంచీ వాటికి సన్నద్ధమై ఉండటం మంచిదనేది నిపుణుల సూచన.
 

పర్సనాలిటీ టెస్ట్‌
సంస్థలో పనిచేయడానికి దానికి సంబంధించిన పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. నలుగురితో కలిసి పనిచేయడం, ముందు ఉండి నడిపించడం, ఒత్తిడిలో సమర్థంగా పనిచేయడం వంటి సామాజిక నైపుణ్యాలూ కావాలి. వాటిని ఇందులో భాగంగా పరీక్షిస్తారు. మొత్తంగా అభ్యర్థి సంబంధిత ఉద్యోగానికి ఎంతవరకూ సరిపోతాడో చూడటం దీని ఉద్దేశం. సంస్థలు  దీనిని సైకోమెట్రిక్‌ టెస్ట్‌గా అభివర్ణిస్తున్నాయి. అభ్యర్థి తాను సహజంగా ఎలా ఉంటాడో దీని ద్వారా చూపగలిగితే చాలు. వీటిలో తప్పు, ఒప్పు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. బలాలు, బలహీనతలు మాత్రమే ఉంటాయి. వీటిని పరీక్షించుకోవడానికీ ఆన్‌లైన్‌లో ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పరీక్షించుకుని, సూచనలను పాటిస్తే విజయం సాధించడం సులువే.

 

ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌
చాలా ప్రభుత్వ, ప్రైవేటు పరీక్షల్లో ఈ విభాగం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి, చాలామందికి సుపరిచితమైన అంశమే. తార్కిక (లాజికల్‌), క్రిటికల్‌ థింకింగ్‌ అంశాలను దీనిలో భాగంగా పరీక్షిస్తారు. ప్రాబ్లమ్‌ సాల్వింగ్, వెర్బల్, న్యూమరికల్, లాజికల్‌ రీజనింగ్‌ అంశాలు వాటిని ఎంత సమయంలోగా, ఎంత కచ్చితత్వంతో చేయగలుగుతున్నారో దీనిలో పరిశీలిస్తారు. విద్యార్థి విశ్లేషణ సామర్థ్యాన్ని దీనిలో పరిశీలిస్తారు. కాబట్టి, దీనిపై మరింత దృష్టిపెట్టడం తప్పనిసరి. వీటిని సాధన చేయాలనుకునేవారికి ఎన్నో ఆన్‌లైన్‌ వేదికలు అందుబాటులో ఉన్నాయి.

 

వర్క్‌ శాంపిల్స్‌
వర్చువల్‌ హైరింగ్‌లో ఈ విధానానికి ప్రాముఖ్యం పెరిగింది. దీనిలో అభ్యర్థికి పనికి సంబంధించి ఒక టాస్క్‌ ఇచ్చి పూర్తిచేయమంటారు. ఒక రకంగా సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పరీక్షించినట్లే. ఉదాహరణకు- అకౌంటింగ్‌కు సంబంధించినవారైతే సంబంధిత సమస్యను ఇచ్చి పరిష్కరించమని అడుగుతారు. డిజైనింగ్‌ వారిని వారికి కావాల్సిన అంశాలను ఇచ్చి డిజైన్‌ చేయమని అడుగుతారు. మార్కెటింగ్‌ వారికి వారికి సంబంధించినవీ.. ఇలా! అయితే నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది.

 

సంస్థ సంగతేంటి?
సాధారణంగా ఇంటర్వ్యూ అన్నాక అభ్యర్థి సంస్థపై ఎంతవరకూ అవగాహనతో ఉన్నాడో తెలుసుకోవడం మామూలే. అంటే.. ఇంటర్వ్యూకు ముందు సంస్థకు సంబంధించిన వివరాలను ఎంతవరకూ సేకరించుకున్నాడో పరిశీలించడమన్నమాట. అయితే వీటిని నేరుగా అడగరు. ఇక్కడా అంతే.. సంస్థ ప్రొడక్ట్స్, ఇటీవలి సమస్యలు.. ఇలా వాటితో సంబంధమున్న వాటిని అడుగుతారు. కాబట్టి.. ఇంటర్వ్యూకు వెళ్లే సంస్థతోపాటు పరిశ్రమకు సంబంధించిన తాజా అంశాల గురించీ తెలుసుకుంటూ ఉండటం ఉత్తమం.

 

హ్యాకథాన్‌
టెక్నికల్, ఐటీ విభాగాలవారికి పరిచయమున్న పేరిది. ఎన్నో దిగ్గజ సంస్థలు- టీసీఎస్, ఐబీఎం వంటివి వీటిని నిర్వహిస్తుంటాయి. తమ కోడింగ్‌ నైపుణ్యాలను పరీక్షించుకోవాలనుకునేవారు దీనికి హాజరవుతుంటారు. అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షించడానికే కాకుండా తక్కువ సమయంలో మంచి ఫలితాన్ని చూపించాల్సి ఉంటుంది. వీటిని అందరికీ నిర్వహించరు. టెక్నాలజీ సంబంధిత సంస్థలు మాత్రమే వీటిని నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఏదైనా సమస్యను ఇచ్చి దానికి పరిష్కారాన్ని సూచించమంటారు. వెబ్‌సైట్, వెబ్‌ ఆప్, ఆండ్రాయిడ్‌/ ఐఓఎస్‌.. ఇలా వేటినైనా రూపొందించొచ్చు. వాటిల్లో ఉత్తమ పరిష్కారాన్ని ఎంపిక చేస్తారు. దీన్ని నిర్ణీత సమయంలోగా చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉండి, వివిధ సంస్థలు నిర్వహించే వాటిలో నేరుగా పాల్గొనడం ద్వారా కూడా వివిధ సంస్థల దృష్టిని ఆకర్షించొచ్చు.

 

కేస్‌ స్టడీ
మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఇది సుపరిచితమైన పేరు. మిగతావారికే కొంత పరిచయం అవసరం. పని ప్రదేశం అన్నాక పని విషయంగానైనా, తోటివారితోనైనా ఏదో ఒక సమస్య ఎదురవుతుండటం సహజమే. చాలావాటిని పరిష్కరించడానికి విశ్లేషణాత్మక నైపుణ్యాలు అవసరమవుతుంటాయి. పనికి సంబంధించిన అవగాహనతోపాటు పని ప్రదేశంలో అవసరమైన నైపుణ్యాలనూ సంస్థలు అభ్యర్థుల నుంచి ఆశిస్తాయి. అవి అభ్యర్థుల్లో ఎంతమేరకూ ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ కేస్‌ స్టడీలు సాయపడతాయి. దీనిలో సమస్యను పరిష్కరించడంలో భాగంగా అభ్యర్థి గుర్తించిన కీ పాయింట్లు, తన విశ్లేషణ, చేసిన సూచనల ఆధారంగా అభ్యర్థిని అంచనా వేస్తారు. ఎంత సృజనాత్మకంగా సూచనలు చేశారో పరిశీలిస్తారు. ఒక రకంగా అభ్యర్థిలో నిర్ణయం పట్ల ఉన్న అవగాహన, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను తెలుసుకోవడానికీ ఈ విధానం తోడ్పడుతుంది.

 

లిఖితపూర్వకంగా..
‘మీ గురించి చెప్పండి’.. ఇంటర్వ్యూ ప్రక్రియపై అవగాహన ఉన్నవారెవరికైనా పరిచయమున్న ప్రశ్నే ఇది. దాదాపుగా ప్రతి సంస్థా అడిగే ప్రశ్న ఇది. అభ్యర్థికి తనపై తనకు ఎంతవరకూ అవగాహన ఉందో, తనని తాను ఎంతవరకూ మార్కెట్‌ చేసుకోగలుగుతాడో పరిశీలించడమే దీని ఉద్దేశం. నిజానికి రెజ్యూమె, కవర్‌ లెటర్‌ వంటి వాటిల్లో చేసేదీ అభ్యర్థి తన గురించి తాను తెలియజేయడమే. ఇప్పుడు సంస్థలు ప్రత్యేకంగా ఒక దశగా నిర్వహిస్తున్నాయి. అభ్యర్థి లిఖితŸపూర్వకంగా రాయాల్సి ఉంటుంది. అయితే తాను తనంతట రాసే విధంగా ఉండటంలేదు. సంస్థలే కొన్ని ప్రశ్నలు అడుగుతాయి. ఉదాహరణకు- మీ బలాలేంటి? అది మీకే ఎలా ప్రత్యేకం? ఇలా అడగొచ్చు. రెజ్యూమె, కవర్‌ లెటర్‌ లాంటివాటిల్లో కేవలం జాబితాగా రాసి వదిలేస్తాం. కానీ ఇక్కడ వాటిని నిరూపించేలా ఉదాహరణలనూ జోడించాల్సి ఉంటుంది. కాబట్టి, ముందస్తుగానే వీటిని సిద్ధం చేసుకుని ఉండటం మంచిది. అలాగే.. మీ బలహీనతలూ మీకు సానుకూలంగా ఉపయోగపడేలా ఉండేలా చూసుకోవాలి. అలాగే విజయాలు వంటి వాటి విషయంలో తాజా వాటికి చోటివ్వాలి. మిగతా పరీక్షల్లోలా వీటిని వదిలేసే అవకాశముండదు. అలాగని ఏదో ఒకటి రాస్తే సరీ అన్న వైఖరీ ఇక్కడ పనికి రాదు.

 

Posted Date : 06-10-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌