• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విద్యార్థినులకు సంతూర్‌ సాయం

ప్రతిభకు పేదరికమే పెద్ద సమస్య. అందులోనూ ఆడపిల్లలైతే చదువులు అర్ధాంతరంగా ఆపేయాల్సిందే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక శక్తి సరిపోక ఉన్నతవిద్యలో చేరలేకపోతున్నారు. ఇలాంటి వారిని ఆర్థికంగా   ఆదుకొని, చదువులో రాణించేలా చూడడానికి విప్రో సంస్థ ‘సంతూర్‌ ఉపకారవేతనా’లను అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌ ప్రకటన వెలువడింది. ఇంటర్‌ పూర్తిచేసిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. 


 

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. సమాన అవకాశాలు ఉన్నప్పటికీ బాల్యంలోనే కొంతమంది బాలికలు చదువులకు దూరం అవుతున్నారు. అందుకు ప్రధానమైన కారణం ఆర్థిక పరిస్థితి. దాన్ని అధిగమించి, వారికి ఆసరా కల్పించేందుకు సంతూర్‌ స్కాలర్‌షిప్పులు అందిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం ఉన్న బాలికలను చదువులో ప్రోత్సహించడానికి విప్రో కన్సూమర్‌ కేర్, విప్రో కేర్స్‌ కలిసి వీటిని అందిస్తున్నాయి. ఇవి 2016-2017 విద్యా సంవత్సరం నుంచి మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి ఏడాదికి 900 మందికి ఈ ప్రోత్సాహకాలు అందుతున్నాయి. గత నాలుగేళ్లలో 3600 మంది విద్యార్థినులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఈ తోడ్పాటుతో ఉన్నత విద్యలో రాణిస్తున్నారు. 
 

హ్యుమానిటీస్, లిబరల్‌ ఆర్ట్స్, సైన్స్‌ కోర్సుల్లో చేరినవారికి, వెనుకబడిన జిల్లాలకు చెందినవారికి ఎంపికలో కొంత ప్రాధాన్యం ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారు.
 

అర్హతలు: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదివుండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పేద బాలికలే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. 2019-20 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసినవారై ఉండాలి. 2020-21లో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి. కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు.
 

స్కాలర్‌షిప్‌: ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా రూ.రెండువేల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తారు. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంటర్‌ తర్వాత ఉండే వివిధ యూజీ కోర్సులు చదవడానికి ఈ స్కాలర్‌షిప్పు ఉపయోగపడుతుంది. 
 

దరఖాస్తు: దరఖాస్తు ఫారాన్ని సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింటవుట్‌ తీసుకోవాలి. అందులో పూర్తి వివరాలను నింపి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
 

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: అక్టోబరు 31

చిరునామా: విప్రో కేర్స్‌- సంతూర్‌ స్కాలర్‌షిప్, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్‌ రోడ్డు, బెంగళూరు - 560035, కర్ణాటక.

వెబ్‌సైట్‌: http://www.santoorscholarships.com/

 

Posted Date : 06-10-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌