• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జూనియర్‌ ఇంజినీర్‌ కొలువుకు సిద్ధమేనా?

ఎస్‌ఎస్‌సి జేఈ - 2020 ప్రకటన 
 

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ వారు జూనియర్‌ ఇంజినీర్స్‌ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.  దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ సంస్థల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో  నియమితులవుతారు. ఈ ప్రకటన ముఖ్యాంశాలూ, సన్నద్ధత విధానం తెలుసుకుందాం!
 

తాజా నోటిఫికేషన్‌ ద్వారా నియమితులైనవారికి జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టు విభాగంలో సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 స్కేలులో దాదాపుగా మొదట రూ.50 వేల నుంచి రూ.55 వేల జీతం లభిస్తుంది. 
 

జూనియర్‌ ఇంజినీర్‌గా నియమితులైనవారికి కేంద్ర జలసంఘం, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్, కేంద్ర జల, విద్యుత్‌ రిసెర్చ్‌ స్టేషన్, మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీస్, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్, ఫారాఖా బ్యారేజ్‌ ప్రాజెక్టు, నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ తదితర సంస్థల్లో తమకు సంబంధించిన విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది.

ఉదా: ఒక ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌కు సంబంధించిన జూనియర్‌ ఇంజినీర్‌ తన ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోనే సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగంలో నియమితుడవుతాడు. తమకు సంబంధించిన విభాగంలో పనిచేయడమనేది ప్రతి ఉద్యోగికీ¨ సులభమైన విషయంగా పరిగణించవచ్చు.


దరఖాస్తు: ఆన్‌లైన్‌లో http://ssc.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చేతిరాత ద్వారా పోస్టులో పంపినవాటిని స్వీకరించరు.

అర్హతలు: డిప్లొమా (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌), తత్సమాన డిగ్రీ చదివినవారు అర్హులు. పోస్టులకు అనుగుణంగా 18-32 సంవత్సరాల వయసు ఉండాలి. వివిధ కేటగిరీలవారికి వయఃపరిమితుల్లో సడలింపులు ఉన్నాయి. భారతీయులై ఉండాలి. కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు ఉన్నాయి.

దరఖాస్తు గడువు: 30.10.2020 
 

ఆన్‌లైన్‌ పరీక్ష (పేపర్‌-1): మార్చి 20, 2021- మార్చి 25, 2021

ఆఫ్‌లైన్‌ పరీక్ష (పేపర్‌-2): తేదీని తరువాత ప్రకటిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం
 

పేపర్ ‌- 1
ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. అందులో బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 రుణాత్మక మార్కులుంటాయి. దీనిలో సాధించిన మార్కులు తుది ఫలితాల్లోనూ ఉపయోగపడతాయి. పేపర్‌-1ను మూడు భాగాలుగా విభజించారు. మొత్తం 200 ప్రశ్నలకుగానూ 200 మార్కులుంటాయి. సమయం మాత్రం 120 నిమిషాలే. అందుకని పరీక్షను రాసేటపుడు సమయపాలనను పాటించడం తప్పనిసరి. ప్రణాళికబద్ధంగా కాన్సెప్టులవారీగా సరైన సాధన చేయాల్సి ఉంటుంది.
ప్రశ్నలు సులభంగా డిప్లొమా స్థాయిలో ఉంటాయి. థియరీ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. అన్ని సబ్జెక్టులకీ తగినంత సమయం కేటాయించాలి. కాబట్టి, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయడంతోపాటు ఎంత త్వరగా వాటిని గుర్తించారన్నదీ ముఖ్యమే. సమాధానాలు త్వరగా రాయాలంటే అభ్యర్థులకు విస్తృత సాధన అవసరమవుతుంది.  పరీక్ష సమయంలో అభ్యర్థులు సూటిగా సమాధానం రాయగలిగినవాటిని మొదట  ఎంచుకుని తక్కువ సమయంలో వాటిని పూర్తిచేయాలి. మిగిలిన సమయాన్ని ఎక్కువ సమయం పట్టే సంఖ్యాపరమైన, సూత్రాధారిత ప్రశ్నలకు కేటాయించవచ్చు.
1. జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: దీనిలో ముఖ్యంగా వెర్బల్, నాన్‌వెర్బల్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ముఖ్యంగా ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డెసిషన్‌ మేకింగ్, అరిథ్‌మెటిక్‌ రీజనింగ్, క్లాసిఫికేషన్, నంబర్‌ సిరీస్, అనాలజీ అంశాలపై ప్రశ్నలుంటాయి. డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదివినవారికి ఈ అంశాలు వారు చదివిన పాఠ్యాంశాల్లో లేనప్పటికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి సరైన పద్ధతిలో సాధన చేయాలి.
2. జనరల్‌ అవేర్‌నెస్‌: పరిసరాల్లో జరిగే సాధారణ విషయాల అవగాహన, సమాజాలపై అది చూపే ప్రభావాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. వీటిపై డిప్లొమా, ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు అవగాహన తక్కువ ఉన్నప్పటికీ వార్తాపత్రికలు, ముఖ్యమైన వార్తాంశాలు, ప్రామాణిక పాఠ్యపుస్తకాలు అధ్యయనం చేస్తే పరీక్షలో ప్రశ్నల సాధన సులభమవుతుంది.
3. జనరల్‌ ఇంజినీరింగ్‌: సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ప్రశ్నలడుగుతారు. అంటే సివిల్‌ విద్యార్థులు సివిల్‌ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లోనూ ఆయా విభాగాల ప్రశ్నలు వస్తాయి.
4. సివిల్‌ ఇంజినీరింగ్‌: పూర్వ ప్రశ్నపత్రాల ద్వారా సరైన అవగాహన పొంది, ఆపై సన్నద్ధతను మొదలుపెట్టడం మంచిది. పూర్వ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే బిల్డింగ్‌ మెటీరియల్స్, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్, సర్వేయింగ్, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌ సబ్జెక్టుల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడం గమనించవచ్చు. కాబట్టి, ఇలాంటి ముఖ్యమైన సబ్జెక్టులను ముందుగా అభ్యసించడం, మాదిరి ప్రశ్నలను సాధన చేయడం కీలకం.
5. మెకానికల్‌ ఇంజినీరింగ్‌: గత ప్రశ్నపత్రాలు గమనిస్తే ఫ్లూయిడ్‌ మెకానిక్స్, హైడ్రాలిక్‌ మెషిన్స్, థర్మల్‌ ఇంజినీరింగ్, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ల నుంచి ప్రశ్నలు వచ్చాయి.
6. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: ఎలక్ట్రికల్‌ మెషిన్స్, మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.

 

పేపర్‌ - 2
పేపర్‌-1లో మెరుగైన మార్కులను సాధించినవారిని పేపర్‌-2కు అనుమతిస్తారు. గత ప్రశ్నపత్రాల ప్రకారం.. దీనిలో మొత్తం ఆరు ప్రశ్నలు అడిగారు. ప్రతి ప్రశ్నలకు 60 మార్కులు.ప్రతి ప్రశ్ననీ 3-4 ఉప ప్రశ్నలుగా విభజించారు. మొత్తం ఆరు ప్రశ్నల్లో అయిదింటికి సమాధానం రాయాల్సి ఉంటుంది. సివిల్‌ ఇంజినీరింగ్‌ వారికి బిల్డింగ్‌ మెటీరియల్స్, సర్వేయింగ్, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్, స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్స్, స్ట్రక్చరల్‌ అనాలిసిస్‌ సబ్జెక్టులకు ప్రాధాన్యమిచ్చారు. మెకానికల్‌ వారికి.. ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెషిన్స్, థర్మల్‌ ఇంజినీరింగ్, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్, ఐసీ ఇంజిన్స్, హీట్‌ ట్రాన్స్‌ఫర్‌ సబ్జెక్టులు ముఖ్యం. ఎలక్ట్రికల్‌ వారికి ఎలక్ట్రికల్‌ మెషిన్స్, మెజర్‌మెంట్స్‌ అండ్‌ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, పవర్‌ సిస్టమ్‌ ప్రధానమైనవి.


 

సన్నద్ధత విధానం
ప్రశ్నపత్రాలు డిప్లొమా సిలబస్‌ స్థాయిలోనే ఉంటాయి. కానీ డిప్లొమాతోపాటు డిగ్రీ విద్యార్థులూ ఈ పరీక్షకు పోటీ పడతారు. కాబట్టి డిప్లొమా విద్యార్థులు సాధన విషయంలో కొంత శ్రమపడాల్సి ఉంటుంది.
‣ సిలబస్, పరీక్ష స్థాయిని అర్థం చేసుకున్నాకే సన్నద్ధత మొదలుపెట్టడం మంచిది.
పేపర్‌-1 పరీక్షకు దాదాపుగా 5 నెలల సమయం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తగిన సన్నద్ధత ప్రణాళికను రూపొందించుకోవాలి.
ఇప్పటినుంచీ రోజుకు కనీసం 5 నుంచి 6 గంటలు సాధనకు కేటాయించాలి.
‣ గత ప్రశ్నపత్రాలు, సిలబస్‌ను గమనించుకుంటూ సాధన చేయాలి.
సన్నద్ధత క్రమంలో ప్రతి చాప్టర్, సబ్జెక్టుకు సంబంధించి ముఖ్యాంశాలను చిన్న పట్టికల రూపంలో సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి.
పునశ్చరణ కీలకం. దానికి సన్నద్ధతలో ప్రాధాన్యమివ్వాలి.
మాదిరి పరీక్షలకు ప్రాధాన్యమివ్వాలి.
ప్రస్తుత విపత్కర సమయంలో పరీక్షల సన్నద్ధతతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యానికీ ప్రాధాన్యమివ్వాలి.
 

Posted Date : 08-10-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌