• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బెల్‌లో ఉద్యోగాలు

ఇంజినీర్, ఆఫీసర్‌ పోస్టులకు ప్రకటన
 

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) 56 ఇంజినీర్, ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. వీటిలో కొత్వారాలో 33, చెన్నై కేంద్రంలో 23 ఖాళీలున్నాయి. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు, మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదివినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు ఏడాది నుంచి గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు విధుల్లో కొనసాగే అవకాశం ఉంది. 
 

జూనియర్‌ ఇంజినీర్‌గా ఎంపికైనవారు ఏడాది పాటు విధుల్లో కొనసాగుతారు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థి సమర్థత ప్రాతిపదికన మరికొన్నాళ్లు సేవలు పొడిగిస్తారు. వీరు గరిష్ఠంగా మూడేళ్లు పాటు కొనసాగుతారు. వీరికి మొదటి ఏడాది రూ.25 వేలు, రెండో సంవత్సరం రూ.28 వేలు, మూడో ఏట రూ.31 వేలు చెల్లిస్తారు. ప్రాజెక్టు ఇంజినీర్‌గా ఎంపికైనవారు రెండేళ్ల ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వర్తించాలి. అవసరాలు, సమర్థత ప్రాతిపదికన ఈ వ్యవధిని మరో రెండేళ్లు పొడిగిస్తారు. వీరికి తొలి సంవత్సరం రూ.35 వేలు, రెండో ఏడాది రూ.40 వేలు, మూడో సంవత్సరం రూ.45 వేలు, చివరిదైన నాలుగో ఏట రూ.50 వేలు ప్రతి నెలా చెల్లిస్తారు.
 

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఉంటుంది. 10 మార్కులు అనుభవానికి, 15 ఇంటర్వ్యూకు కేటాయించారు. కనీస అనుభవం ఉన్నవారికి 2.5 మార్కులు ఇస్తారు. ప్రతి ఆరు నెలల అదనపు అనుభవానికీ 1.25 మార్కులు చొప్పున కలుస్తాయి. ఇలా గరిష్ఠంగా 10 మార్కులు వేస్తారు. అకడమిక్‌ బోధన, పరిశోధన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోరు. అప్రెంటిస్‌గా పని చేసినవారు అర్హులే. వచ్చిన దరఖాస్తులకు సంబంధిత వివరాల ప్రకారం మార్కులు వేసి, మెరిట్‌ ప్రకారం ఒక్కో పోస్టుకీ అయిదు మందిని చొప్పున ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైనవారి వివరాలు బెల్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అభ్యర్థులకు ఈ-మెయిల్‌ ద్వారా వర్తమానం అందిస్తారు. వీరికి నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిని ప్రత్యక్షంగా కాకుండా ఆన్‌లైన్‌లో వీడియో రూపంలో నిర్వహిస్తారు. 
 

దరఖాస్తు ఫీజు: ప్రాజెక్టు ఇంజినీర్‌ / ఆఫీసర్‌ పోస్టులకు రూ. 500. ట్రెయినీ ఇంజినీర్‌ / ఆఫీసర్లకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. 
 

దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. దరఖాస్తుతోపాటు సంబంధిత పత్రాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 
 

బెల్‌ చెన్నైలో 23 ఖాళీలు ఉన్నాయి. వీటినీ ఒప్పంద ప్రాతిపదికనే భర్తీ చేస్తున్నారు వీటిలో ట్రెయినీ ఇంజినీర్‌ 11 (ఎలక్ట్రానిక్స్‌ 9, మెకానికల్‌ 2), ట్రెయినీ ఆఫీసర్‌ 2, ప్రాజెక్టు ఇంజినీర్‌ 9(ఎలక్ట్రానిక్స్‌ 4, మెకానికల్‌ 3, కంప్యూటర్‌ సైన్స్‌ 1, సివిల్‌ 1) ప్రాజెక్టు ఆఫీసర్‌ 1 ఖాళీలు ఉన్నాయి. వయసు, అర్హతలు, అనుభవం, వేతనం, ఎంపిక విధానం అన్నీ బెల్‌ కొత్వారా మాదిరిగానే ఉంటాయి. 
 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 30. 
 

వెబ్‌సైట్‌: http://www.belnindia.in/en.html

బెల్‌ కొత్వారా (ఉత్తరాఖండ్‌) లో...
పోస్టు: ట్రెయినీ ఇంజినీర్‌
మొత్తం ఖాళీలు: 33. 
విభాగాలవారీ: ఎల్రక్టానిక్స్‌ 10, మెకానికల్‌ 5, కంప్యూటర్‌ సైన్స్‌ 2, సివిల్‌ 1, ఎలక్ట్రికల్‌ 1. అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత 
వయసు: సెప్టెంబరు 1, 2020 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. 
ఏడాది పని అనుభవం తప్పనిసరి. కొన్ని పోస్టులకు ఆరు నెలలు సరిపోతుంది.  
 

పోస్టు: ప్రొజెక్ట్‌ ఇంజినీర్‌
విభాగాలవారీ ఖాళీలు: ఎల్రక్టానిక్స్‌ 6, కంప్యూటర్‌ సైన్స్‌ 6 
అర్హత: సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.
వయసు: సెప్టెంబరు 1, 2020 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. 
రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి.  
ట్రెయినీ ఆఫీసర్‌ ఫైనాన్స్‌: 2, ప్రాజెక్టు ఆఫీసర్‌ హెచ్‌ఆర్‌ 1 ఖాళీలు ఉన్నాయి. 
అర్హత: ఫైనాన్స్‌ పోస్టులకు ఎంబీఏ ఫైనాన్స్‌.హెచ్‌ఆర్‌ పోస్టులకు ఎంబీఏ (హెచ్‌ఆర్‌) లేదా ఎంహెచ్‌ఆర్‌ఎం లేదా ఎంఎస్‌డబ్ల్యు (హెచ్‌ఆర్‌) వీటిలో ట్రెయినీ ఆఫీసర్‌కు ఏడాది, ప్రాజెక్టు ఆఫీసర్‌కు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. 
అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబరు 21. 
 

Posted Date : 14-10-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌