• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆధునిక అవసరాలకు..

కెమికల్‌ ఇంజినీరింగ్‌ 
 


ఇంజినీరింగ్‌ కోర్సుల్లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ సమకాలీన పురోగతీ, విశిష్టతా ఉన్న బ్రాంచి. దీన్ని డిగ్రీ, పీజీ స్థాయిలో చదివినవారికి ఉపాధి అవకాశాలూ మెరుగ్గా ఉంటాయి. బీటెక్‌/బీఈ కౌన్సెలింగ్‌ తరుణంలో విద్యార్థులు మిగతా బ్రాంచిల్లాగే దీని ప్రాధాన్యమూ తెలుసుకుంటే కెరియర్‌కు సంబంధించి సరైన నిర్ణయం తీసుకునే వీలుంటుంది. 

ముడి పదార్థాల నుంచి ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో నాణ్యతగా తయారు చేయడానికి కెమికల్‌ ఇంజినీర్లు కృషి చేస్తారు. పర్యావరణ అనుకూల మార్గాలను రూపొందిస్తారు. కెమికల్‌ ఇంజినీరింగ్‌ రంగం మెడిసిన్, ఎలక్ట్రానిక్‌ మెటీరియల్స్, పునరుత్పాదక ఇంధనాలు, ఇండస్ట్రియల్‌ బయోటెక్నాలజీ, సైబర్‌ ఎనేబుల్డ్‌ కంప్యుటేషనల్‌ సిస్టమ్స్, నానోటెక్నాలజీ ఫర్‌ ఎనర్జీ కన్వర్షన్, మైక్రో ఎలక్ట్రానిక్స్, బయో కెటలిస్ట్స్, టైలర్డ్‌ మాలిక్యులర్‌ ప్రొడక్ట్స్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ బ్రాంచి పాఠ్యాంశాలు సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేకమైన ఆలోచన ప్రక్రియను ప్రేరేపించడానికి రూపొందించివుంటాయి. ఇది వివిధ ఇంజినీరింగ్, సైన్స్‌ విభాగాలతో సంబంధం ఉన్న బ్రాంచి. మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, బయోప్రోసెస్‌ అండ్‌ బయో టెక్నాలజీ, పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఎనర్జీ టెక్నాలజీ, పెట్రోలియం అండ్‌ పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్, ఫుడ్‌ టెక్నాలజీ - ప్రాసెస్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ మొదలైనవి వాటిలో కొన్ని.

కెమికల్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ, ప్రైవేటు, ఆర్‌ అండ్‌ డి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయి. పెట్రోలియం, పెట్రోకెమికల్, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, ఎరువులు, ఉక్కు, పాలిమర్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్, పల్ప్‌ అండ్‌ పేపర్, రసాయనాలు, డిజైన్‌- నిర్మాణం, ఔషధ, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ ఆరోగ్యం లాంటి విభాగాలు వీరికి ఉపాధినిస్తాయి. డిజైన్‌ ఇంజినీర్లు, ప్రాసెస్‌ ఇంజినీర్లు, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు, ప్రొడక్షన్‌ ఇంజినీర్లు, మెయింటెనెన్స్‌ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్లు, సేఫ్టీ ఇంజినీర్లు, కన్సల్టెన్సీ సిబ్బంది, ఆడిటింగ్‌ ఇంజినీర్లు, ఆర్‌ అండ్‌ డి శాస్త్రవేత్తలు, సైంటిఫిక్‌ ఆఫీసర్ల వంటి హోదాల్లో విధులు నిర్వహించవచ్చు. 

ఉన్నత విద్య
అన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో ఎం.టెక్‌ ప్రోగ్రాం లభిస్తుంది. విదేశాల్లో అనేక కౌంటీలలో కెమికల్‌ ఇంజినీరింగ్, అలైడ్‌ డిసిప్లిన్స్‌లో ఎం.ఎస్‌. ప్రోగ్రాంలు ఉన్నాయి. ప్రముఖ కళాశాలల్లో ఈ బ్రాంచిలో ప్రత్యేక పరిశోధనా కేంద్రాలతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు, ప్రయోగశాల సౌకర్యాలతో బీటెక్, ఎంటెక్‌ చదువుకోవచ్చు. కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్యాంపస్‌ నియామకాల ద్వారా వివిధ కోర్‌ కంపెనీలలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. 

ఉపాధి ఎక్కడెక్కడ?

ప్రభుత్వ రంగంలో: కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్, డిఫెన్స్‌ రిసెర్చ్‌ ల్యాబ్స్, అటామిక్‌ ఎనర్జీ, ఐఓసీ‡ఎల్, ఓఎన్‌జీసీ, బీసీసీఎల్, ఎన్‌టీపీసీ, హిందూస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్, ఇంకా..  ఇండియన్‌ ఆర్మీ, నేవీ, వైమానిక దళం, రైల్వే, జాతీయ బ్యాంకులు.

ప్రైవేటు రంగంలో: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్,  రిలయన్స్‌ పెట్రోలియం లిమిటెడ్, గోదావరి ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్, కోరమాండల్‌ ఎరువులు, ఎల్‌ అండ్‌ టీ, హిందుస్తాన్‌ లివర్‌ లిమిటెడ్, అనేక పాలిమర్, ప్లాస్టిక్, స్టీల్, పేపర్, ఔషధ తయారీ సంస్థలు.

ప్రాంతీయ కంపెనీలు: డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్, వసంత కెమికల్స్‌ లిమిటెడ్, విర్చో లాబొరేటరీస్‌ లిమిటెడ్, ఎవరెస్ట్‌ ఆర్గానిక్స్‌ లిమిటెడ్, గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్, హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్, ఎంఎస్‌ఎన్‌ ఫార్మా లిమిటెడ్, వింధ్య ఫార్మా లిమిటెడ్, జెన్‌ కెమికల్‌ కన్సల్టెంట్స్‌ లిమిటెడ్, ఇతర ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలు. 
 

Posted Date : 22-10-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌