• facebook
  • twitter
  • whatsapp
  • telegram

న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో 206 పోస్టులు

కేంద్ర అణుశక్తి సంస్థకు చెందిన న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) 206 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. వీటిలో 176 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ఖాళీలు ఉన్నాయి. వివిధ పోస్టులకు డిప్లొమా అర్హతతో పోటీ పడవచ్చు. మిగిలినవాటికి సైన్స్‌ డిగ్రీ, సాధారణ డిగ్రీలతో అవకాశం ఉంది. రాత పరీక్ష, స్కిల్‌టెస్టు, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
 

ప్రకటించిన పోస్టుల్లో స్టైపెండరీ ట్రెయినీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు 176 ఉన్నాయి. వీటిలో విభాగాలవారీ మెకానికల్‌ 65, ఎలక్ట్రికల్‌ 24, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 7, ఎలక్ట్రానిక్స్‌ 24, సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ బీఎస్సీ ఫిజిక్స్‌ 15, బీఎస్సీ కెమిస్ట్రీ 15 ఖాళీలు ఉన్నాయి. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ సిలో సేఫ్టీ సూపర్‌వైజర్‌ 4, సివిల్‌ 3 పోస్టులు ఉన్నాయి. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ బిలో సివిల్‌ 14, మెకానికల్‌ 3, ఎలక్ట్రికల్‌ 1, ఎలక్ట్రానిక్స్‌ 1 ఖాళీలు లభిస్తున్నాయి. ఇతర విభాగాల్లో గ్రేడ్‌-1 అసిస్టెంట్లు 10, స్టెనో 6, ఫైర్‌మెన్‌ 3, డ్రైవర్‌ కం పంప్‌ ఆపరేటర్‌ కం ఫైర్‌మెన్‌ 10, సబ్‌ ఆఫీస్‌ 1 పోస్టులు ఉన్నాయి.
 

విద్యార్హత: స్టైపెండరీ ట్రెయినీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధిత డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులుండాలి. సైన్స్‌ గ్రాడ్యుయేట్స్‌ పోస్టులకు బీఎస్సీ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీలో 60 శాతం మార్కులు తప్పనిసరి. ఫైర్‌ సేఫ్టీ పోస్టులకు ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా బీఎస్సీతోపాటు ఇండస్ట్రియల్‌ సేఫ్టీలో ఏడాది డిప్లొమా లేదా సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసుండాలి. అలాగే విద్యాభ్యాసం తర్వాత సంబంధిత విభాగంలో కనీసం నాలుగేళ్ల అనుభవం తప్పనిసరి. మిగిలిన పోస్టులకు సంబంధిత విభాగాల్లో డిగ్రీతోపాటు ఇతర నైపుణ్యాలు ఉండాలి. 
 

వయసు: స్టైపెండరీ ట్రెయినీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్, సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ బి పోస్టులకు 30 ఏళ్లలోపు, సి పోస్టులకు 35 ఏళ్లలోపు వయసు అవసరం. అసిస్టెంట్‌ విభాగానికి 28 ఏళ్లు, సబ్‌ ఆఫీస్‌ పోస్టుకి 40 ఏళ్లు, ఫైర్‌మెన్‌ 32 ఏళ్లు, డ్రైవర్‌ కం పంప్‌ ఆపరేటర్‌ కం ఫైర్‌మెన్‌ ఉద్యోగాలకు గరిష్ఠ వయసు 27 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
 

రాతపరీక్ష ఎలా ఉంటుంది?
సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 2 గంటల వ్యవధితో పరీక్ష ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం వంద ప్రశ్నలు. ఇందులో ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఒక్కో విభాగంలో 10 చొప్పున ప్రశ్నలు వస్తాయి. సంబంధిత డిప్లొమా నుంచి 70 ప్రశ్నలు ఉంటాయి. సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ ఫిజిక్స్, కెమిస్ట్రీ పోస్టులకు ఫిజిక్స్‌/కెమిస్ట్రీలో 70 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులు 40 శాతం, మిగిలినవారు 30 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్‌ ప్రకారం మొత్తం ఖాళీలకు అయిదు రెట్ల సంఖ్యలో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూ ఒక్కో దానికి 50 శాతం వెయిటేజీ ఉంటుంది. 
 

అసిస్టెంట్‌ పోస్టులకు గంట వ్యవధితో ప్రిలిమినరీ, రెండు గంటల వ్యవధితో అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో 50 ప్రశ్నలు ఉంటాయి. వీటికి ఒక గంట వ్యవధి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు చొప్పున 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. జనరల్‌ నాలెడ్జ్, కరంట్‌ అఫైర్స్‌ 25, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 15, ఇంగ్లిష్‌ 10 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అర్హులకు అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. వీటిలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25, రీజనింగ్‌ 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రతిప్రశ్నకూ 3 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ఇందులో అర్హులకు స్కిల్‌టెస్టు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు. మిగిలిన పోస్టులకు ముందుగా ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. అందులో ఎంపికైనవారికి స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకుంటారు.
 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: నవంబరు 24 సాయంత్రం 4:00 వరకు స్వీకరిస్తారు.
 

వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in
 

Posted Date : 04-11-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌