• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తొలిసారే.. జయభేరి!  

గేట్, ఈఎస్‌ఈల్లో ర్యాంకు సాధనకు మెలకువలు

ఆచరణయోగ్యమైన ప్రణాళికే గేట్‌/ ఈఎస్‌ఈ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి పెట్టడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇంజినీరింగ్‌ పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష ‘గేట్‌’. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించేది ‘ఈఎస్‌ఈ’. జాతీయస్థాయిలో క్లిష్టమైన పరీక్షలుగా పేరుపడ్డ  ఈ పరీక్షలను మొదటి ప్రయత్నంలోనే సాధించాలంటే ఎలా ప్రణాళిక వేసుకోవాలి? ఏ విధంగా సిద్ధం కావాలి?
 

ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో చాలామంది ఈ పరీక్షలను తమ తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు/ మార్కులతో సాధిస్తున్నారు. సాధ్యమే అని నిరూపిస్తున్నారు. కావలసిందల్లా... దృఢ సంకల్పం. దానికితోడు సన్నద్ధతా వ్యూహం, సమయపాలన, కార్యాచరణ ప్రణాళికలు. మంచి ర్యాంకు/ స్కోరు వస్తుందనే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం.  
 

పోటీపరీక్షలు మెరుగైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇతరులను ఎలిమినేషన్‌ చేసే ప్రక్రియలో సాగుతాయి. అందుకే పరీక్ష సిలబస్‌ను వీలైనన్నిసార్లు పరిశీలించుకోవాలి. అందులో వేటిలో బలంగా ఉన్నారో, ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో గ్రహించి, దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ ప్రణాళికను రూపొందించుకోవాలి. అభ్యర్థులు తమ సొంత ప్రణాళికను రూపొందించుకోవడం ఆచరణయోగ్యం. ఈ ప్రణాళికే అభ్యర్థులకు గేట్‌/ ఈఎస్‌ఈ పోటీపరీక్షల్లో మంచి ర్యాంకు/ మార్కులు సాధించి పెట్టడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. సన్నద్ధత మొదలుపెట్టిన నాటి నుంచి పరీక్ష సమయం వరకూ ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రేరణను కోల్పోకూడదు.
 

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ )
గేట్‌లో సబ్జెక్టు బేసిక్స్, ప్రాథమిక ఉపయోగాలపై ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. గ్రూప్‌-1లోని ఒక మార్కు ప్రశ్నలను త్వరగా చేయాలి. చాలావరకూ ఈ విభాగంలో థియరీకి సంబంధించిన మౌలికాంశాలపై ప్రశ్నలు వస్తాయి. 
‣ సృజనాత్మకంగా, పరిశోధనాత్మకంగా ఉన్న ప్రశ్నల కోసం మౌలికాంశాలు జాగ్రత్తగా చదవాలి. 
‣ యూపీఎస్‌సీ నిర్వహించే ఈఎస్‌ఈ, సివిల్‌ సర్వీసెస్, ఇస్రో ప్రశ్నలు గేట్‌లో అడుగుతుంటారు. వీటిని గేట్‌ సిలబస్‌కు అనుగుణంగా సాధన చేయాలి. 
‣ గేట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రాలు వివిధ సెట్లుగా రూపొందిస్తారు. కాబట్టి, అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం లభిస్తుంది. అభ్యర్థులు ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్నింటిలో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి.
వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష అయిన గేట్‌కు సాంప్రదాయిక కాల్‌క్యులేటర్‌ను అనుమతించరు. వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌తోనే సంఖ్యా సంబంధిత ప్రశ్నలను పరిష్కరించాలి.
న్యూమరికల్‌ ప్రశ్నలు: ఈ ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు తగిన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే సమాధానంలో పక్క యూనిట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దగ్గరి స్థాయిలో ఇవ్వవచ్చు. ఉదా: సరైన సమాధానం 30:93 అనుకుందాం. 30:92 నుంచి 30:94 మధ్యలో సమాధానం రాసినా స్వీకరించి మార్కులు ఇస్తారు. ఈ న్యూమరికల్‌ ప్రశ్నలకు ఆప్షన్లు ఉండవు. మౌస్, వర్చువల్‌ కీ ప్యాడ్‌ ఉపయోగించి సమాధానం రాయాలి.
 

పరీక్షలో మార్పులు
గేట్‌ 2021 సిలబస్‌లో గతంలో ఉన్న కొన్ని అంశాలను తొలగించి కొన్ని కొత్త అంశాలను చేర్చారు.
గేట్‌ 2021ను రెండు పేపర్లలో రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తప్పకుండా రెండు పేపర్లలో పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. తమ ఇష్టప్రకారం ఒకటి లేదా రెండు పేపర్లు ఎంచుకోవచ్చు. 
గేట్‌ 2021లో రెండు పేపర్లను కొత్తగా చేర్చి మొత్తం 27 పేపర్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. అదనంగా చేర్చిన రెండు పేపర్లు..1. ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ 2. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌.
కామర్స్, ఆర్ట్స్‌ విద్యార్థులు అంటే బీఎస్‌సీ/ బీఏ విద్యార్థులూ హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌లో గేట్‌ను రాసే అవకాశం కొత్తగా లభించింది.
గత ఏడాది ప్రశ్నపత్రాల్లో ఒకదాన్ని పరీక్షకు కేటాయించిన గడువును పాటిస్తూ సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి. ఇది అభ్యర్థులు తాము ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది.
 

సప్త సూత్రాలు
స్థాయికి తగిన సొంత ప్రణాళిక
చదివిన ప్రతి అంశం.. పునశ్చరణ
ప్రామాణిక  పాఠ్యపుస్తకాలు/ స్టడీ మెటీరియల్‌ 
నమూనా ప్రశ్నపత్రాల సాధన 
‣ ప్రాథమిక అంశాలు.. ఆపై కఠిన అంశాలు
‣ తరగని ధీమా, చెదరని ప్రేరణ 
చాప్టర్‌వారీ ఆన్‌లైన్‌ టెస్టుల అభ్యాసం 
 

ప్రాథమికాంశాలు
అభ్యర్థులు మంచి ప్రామాణిక పాఠ్యపుస్తకాలు లేదా స్టడీ మెటీరియల్‌ ఎంచుకోవడం ప్రధానం. ముందుగా ప్రాథమిక అంశాలను క్షుణ్ణంగా చదివి, సరైన అవగాహన వచ్చాక కఠిన అంశాలను చదవాలి. క్లిష్టతరమైన, సాధారణ, అతి సాధారణ అంశాలకు సమప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో ఎక్కువ వెయిటేజీ ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలి. ఈ పోటీపరీక్షలకు తొలిసారి సిద్ధమయ్యేవారు ప్రతి సబ్జెక్టు, ప్రతి చాప్టర్‌కు సంబంధించిన అంశాలను చిన్న చిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి. ప్రతి చాప్టర్‌ చదివిన తరువాత దానికి సంబంధించి విద్యాసంస్థలు అందించే ఆన్‌లైన్‌ టెస్టులను రాయాలి.
సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. అంటే ఎంత చదివారనే దానికంటే చదివినదానిలో ఎంత అర్థం చేసుకున్నారో, అర్థం చేసుకున్నదానిలో కావాల్సిన సమయం (పరీక్ష సమయం)లో ఎంత అమలు చేయగలుగుతున్నారనేది ప్రధానం. దాని కోసం మీరు ఏ పని చేస్తున్నా సబ్జెక్టు పునశ్చరణ చేస్తుండాలి. సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని, దానికి అనుగుణంగా చదవాలి. క్రమంగా గత గేట్, ఈఎస్‌ఈ, ఇస్రో, పీఎస్‌యూల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
 

పునశ్చరణ
ప్రిపరేషన్లో పునశ్చరణ చాలా కీలక విషయం. చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. ముందుగా తయారుచేసుకున్న చిన్న చిన్న పట్టికలు పునశ్చరణను త్వరితంగా పూర్తిచేస్తాయి. దీంతోపాటు ఆన్‌లైన్‌లో నిర్వహించే మాదిరి ప్రశ్నపత్రాలను (మాక్‌టెస్ట్‌) రాయాలి. నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేస్తే సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. చాప్టర్ల వారీ టెస్టులు, మాక్‌ టెస్టులు రాసేటపుడు, నమూనా ప్రశ్నపత్రాలు రాసేటపుడు తప్పుగా సమాధానం రాసిన ప్రతి ప్రశ్ననీ సవరించుకుని వాటిపై ప్రత్యేక శ్రద్ధతో సాధన చేయాలి. దీనివల్ల ఆ తప్పిదాలు అసలు పరీక్షలో పునరావృతం కాకుండా చూసుకోవచ్చు.
గేట్‌లో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం రుణాత్మక మార్కులుంటాయి. అంటే.. ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల ప్రశ్నలకు 2/3 చొప్పున రుణాత్మక మార్కులుంటాయి. న్యూమరికల్, బహుళ ఎంపిక ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు. 
ఈఎస్‌ఈలో కూడా ప్రతి తప్పు సమాధానానికి 1/3 (0.33) రుణాత్మక మార్కులుంటాయి. వీటి వల్ల నష్టపోకుండా జాగ్రత్తపడాలి.
 

సద్వినియోగం
పరీక్ష రాసేటపుడు ముందుగా సులభమైన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాయడానికి ఎక్కువ సమయం వృథా చేయకూడదు. సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు సమాధానం రాసేటపుడు ఎలిమినేషన్‌ పద్ధతిని ఉపయోగించాలి.
ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించామన్న దానికంటే ఎన్నింటికి సరైన సమాధానాలు రాశామన్నదే ముఖ్యం. పరీక్షలో ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయడం కష్టం. ఆ సమయంలో ఎన్ని, ఏ ప్రశ్నలు రాసే ఎక్కువ మార్కులు సాధించగలరో నిర్ణయించుకోవాలి. బహుళైచ్ఛిక ప్రశ్నల విషయంలో ఒక మౌలికాంశాన్ని, ఒక ఫార్ములాని విద్యార్థి ఎన్ని విధాలా తప్పు చేయవచ్చో ఎన్ని రకాల సమాధానాలు వస్తాయో ఊహించి, ప్రశ్నపత్ర రూపకర్తలు ఆప్షన్లు ఇస్తారు. అందుకని వచ్చిన సమాధానం  కనపడగానే వెంటనే గుర్తించకుండా ఒక క్షణం మిగతా వాటినీ పరిశీలించాకే గుర్తించాలి.
 

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ)
సిలబస్‌ పరిధి చాలా విస్తృతమే. అయినప్పటికీ ప్రశ్నలు మాత్రం మధ్యస్థం నుంచి కొంత కఠినంగా ఉంటాయి. గత సంవత్సరాల నుంచి ఆచరణాత్మక (ప్రాక్టికల్‌) ప్రశ్నలను చేర్చడం వల్ల ప్రశ్నపత్రం కఠినత్వం పెరిగింది. దీనికి పోటీ కూడా ఎక్కువే. ఈఎస్‌ఈ సన్నద్ధతలో సమయపాలన అత్యంత కీలకం. ప్రాథమికాంశాల సన్నద్ధత తర్వాత గత ఈఎస్‌ఈ, సివిల్‌ సర్వీసెస్, ఇతర స్టేట్‌ సర్వీసెస్, గేట్‌ల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
 

ప్రిలిమ్స్‌: 
ఈఎస్‌ఈ ప్రిలిమ్స్, గేట్‌ల  సిలబస్‌ ఒకేలా ఉంటుంది. సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేయాలి.               
అభ్యర్థులు టెక్నికల్‌ సబ్జెక్టులతోపాటు అదే సమయంలో జనరల్‌ స్టడీస్‌లోని 10 అంశాలపైనా తగిన శ్రద్ధ వహించాలి.               
ఈ పరీక్షకు కాల్‌క్యులేటర్‌ అనుమతి లేదు. కాబట్టి, దాని సాయం లేకుండానే సమస్యలను సాధించేలా సాధన చేయాలి.
 

మెయిన్స్‌:
దీనిలో ఇంజినీరింగ్‌ సిలబస్‌ను రెండు పేపర్లుగా విభజించారు. రెండూ అభ్యర్థి సంబంధిత కోర్‌ సబ్జెక్టులకు సంబంధించినవే. 
దీనిలో అభ్యర్థుల నుంచి బేసిక్స్‌తోపాటు అడ్వాన్స్‌డ్‌ విషయాలపైనా పూర్తిస్థాయి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. 
ఈఎస్‌ఈ (స్టేజ్‌-2) కన్వెన్షనల్‌లో చేతిరాత అత్యంత కీలకం. కాబట్టి, దీనిపైనా దృష్టిపెట్టాలి.                   
వీటిలోని ప్రశ్నల సమాధానాలు చాలా నిడివితో ఉంటాయి. సమయపాలనతో సమాధానాలు రాయాలి. 
సమాధానం రాయడానికి పరిమిత స్థలమే అందుబాటులో ఉంటుంది. దీనిలో సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలు ఎంచుకోవడం కూడా ముఖ్యమే. 
థియరీ ప్రశ్నలకు సమాధానాలు రాసేటపుడు నేరుగా బుల్లెట్‌ పాయింట్ల రూపంలో రాయడానికి ప్రయత్నించాలి.                    
న్యూమరికల్‌ ప్రశ్నలకు సమాధానాలు రాసేటపుడు స్టెప్స్‌తో, దశలవారీగా పూర్తిచేయాలి.
 

మౌఖిక పరీక్ష:
దీనిలో అభ్యర్థుల ఆలోచనా విధానం, శక్తిసామర్థ్యాలూ, నీతి నిజాయతీలను అంచనా వేస్తారు. 
సామాజిక, వర్తమాన విషయాలను అడిగే వీలుంది. 
ఉద్యోగం లేదా ఎంటెక్‌ చేస్తుంటే సంబంధిత ప్రశ్నలను అడగొచ్చు.

Posted Date : 05-11-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌