• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పాఠాలు వింటూ... ప‌రిశోధ‌న‌లు చేస్తూ...

విజ‌య‌న‌గరం జిల్లా యువ‌కుడికి అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు

పీజీ విద్యార్థి ఎలా ఉంటాడు? క్లాసురూంలో పాఠాలు వింటాడు. ప్రాజెక్ట్‌ వర్క్‌లో తలమునకలవుతాడు. విజయనగరం జిల్లా గరివిడి కుర్రాడు ఆలమూరు కృష్ణచైతన్య అంతకు మించి! పాఠాలు వింటూనే పరిశోధన చేస్తున్నాడు. పుస్తకాలు చదువుతూనే అంతర్జాతీయ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నాడు. అంతర్జాతీయ పురస్కారాలూ అందుకున్నాడు.

వృథా నీటిని సద్వినియోగం చేసుకొని సాగు చేసేలా వేస్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌, తక్కువ విస్తీర్ణం గల భూముల్లో వర్టికల్‌ ఫార్మింగ్‌ పద్ధతిలో కూరగాయల సాగు తదితర అనేక ఆధునిక వ్యవసాయ పరిశోధనలు చేశాడు కృష్ణచైతన్య. ఈ విధానాలను గోవా, దిల్లీ, నోయిడా, బెంగళూరులలో నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌లలో ప్రదర్శించాడు. యువ శాస్త్రవేత్త, యువ పరిశోధకుడు, ఉత్తమ వ్యవసాయ విద్యార్థిగా అవార్డులు, పురస్కారాలు అందుకున్నాడు.

పుస్తకాలతో కుస్తీ పడుతూ, సరదాల్ని ఇష్టపడే పీజీ విద్యార్థికి ఇవన్నీ ఎలా సాధ్యం? అంటే వ్యవసాయంపై మక్కువ, అత్యాధునిక సేద్య పద్ధతుల్ని దేశీయ రైతులకు అందించాలనే ఏకైక తపనే అంటాడు కృష్ణచైతన్య. ఆధునిక సేద్య పద్ధతుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు తను. డిగ్రీకి రాగానే ప్రముఖ మాస పత్రికల్లో వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. తల్లిదండ్రుల కోరికపై మెడిసిన్‌ ఎంచుకోవాలనుకున్నా సీటు రాకపోవడంతో మహారాష్ట్రలోని మహాత్మా పూలే కృషి విద్యాపీఠ్‌లో వ్యవసాయ డిగ్రీలో చేరాడు. అప్పుడే అగ్రిమీట్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌, ఈ-న్యూస్‌, అగ్రికల్చర్‌ ఎన్విరాన్‌మెంట్‌, ఈ-న్యూస్‌ లెటర్‌, అగ్రి ఫుడ్‌, ఇండియన్‌ ఫార్మర్‌లాంటి జాతీయ, అంతర్జాతీయ పత్రికలకు వ్యాసాలు రాశాడు. ఈ రంగంలో ప్రముఖంగా భావించే ‘యాక్టా సైంటిఫిక్‌ జనరల్స్‌ రివ్యూవ్‌ బోర్డు’ సభ్యునిగా అర్హత సాధించాడు. ప్రస్తుతం పంజాబ్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జెనెటిక్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌లో ఎంఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌. స్వామినాథన్‌ స్ఫూర్తితో, విదేశాల్లో అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని మన రైతులకు చేరువ చేసి సేద్యాన్ని లాభసాటి వనరుగా మార్చాలన్న లక్ష్యంతో పరిశోధనలు చేస్తున్నాడు. వీటి ద్వారా గ్రహించిన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక విధానాలను ఇప్పటి వరకు 20కి పైగా జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో పంచుకున్నాడు.

అంతర్జాలం సాయంతో..

కొవిడ్‌-19 సమయంలో ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందరికీ చేరువ చేయాలన్న లక్ష్యంతో ‘ప్లాంట్‌ జినోమియా’ పేరిట అంతర్జాతీయ వేదికకు రూపకల్పన చేశాడు. దీని ద్వారా ఆధునిక, వ్యవసాయ పరిశోధనలపై దేశ, విదేశాల నిపుణులతో అంతర్జాలంలో సదస్సులు నిర్వహిస్తూ సమాలోచనలు చేస్తున్నాడు. తొలిసారిగా నవంబరులో నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌కి కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి కేవీ పీటర్‌ ముఖ్య అతిథి అయ్యారు. అమెరికా, జర్మనీ, కెనడా, శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, నైజీరియా, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బంగ్లాదేశ్‌, చైనా, ఈజిప్టు దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆచార్యులు, పరిశోధకులు, నిపుణులతో పాటు 4,335 మంది వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు. మొక్కలకు వచ్చే వ్యాధులు, తట్టుకునే శక్తి పెంచడం, నివారణ మార్గాలు, కొత్త వంగడాల ఆవిష్కరణ తదితర అంశాలపై డిసెంబరు 20న నిర్వహించిన వెబినార్‌లో దేశ విదేశాలకు చెందిన 5,800 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

- దాసరి రమణ, గరివిడి
 

Posted Date : 01-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌