• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Unemployment: ఉపాధి లేక యువత బేజారు

కొలువుల భర్తీలో యూపీ సర్కారు అలసత్వం
‘చదువుకున్న మహిళ- బంగారు భవితకు ప్రతీక’... ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ గతంలో చేసిన ప్రకటన ఇది. మరోవైపు శిఖా పాల్‌ అనే విద్యావంతురాలు తనకు రావాల్సిన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వంద అడుగుల ఎత్తయిన నీళ్ల ట్యాంకు మీద 120 రోజులకు పైగా బైఠాయించారు. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో నెగ్గినా శిఖకు నియామక ఉత్తర్వులు రాలేదు. ఆమె మిత్రులు నిరసన ప్రదర్శన నిర్వహించి నైతికంగా మద్దతు ఇచ్చారు. అన్నపానాలు, ఇతర సామగ్రి అందిస్తూ అండగా నిలిచారు. ఎర్రని ఎండలో, కుండపోత వర్షాల్లో నీళ్ల ట్యాంకు మీదే గడిపిన శిఖ శీతాకాల చలినీ లెక్కచేయకుండా అక్కడే కూర్చున్నారు. ఈశాన్య భారతంలో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ పదహారేళ్ల పాటు నిరవధిక నిరశన వ్రతం పూనిన ఇరోమ్‌ షర్మిల తరవాత ప్రభుత్వ వైఖరిపై సుదీర్ఘకాలం ఉద్యమించిన మహిళ శిఖా పాల్‌ మాత్రమే. 
అరకొర వేతనాలూ అందని వైనం
లక్షన్నరమంది మహిళలతోసహా మొత్తం 4.5 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని యూపీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. మరోవైపు, వేల సంఖ్యలో ఉపాధ్యాయులు నెలకు ఏడు వేల రూపాయల గౌరవ వేతనంపై పనిచేస్తున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. గత ప్రభుత్వం నియమించిన వ్యాయామ విద్యాబోధకులు, ఉర్దూ టీచర్లు సైతం పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రాథమిక శిక్షణ ధ్రువపత్రం(బీటీసీ) సాధించిన అభ్యర్థుల్లో చాలామందికి నియామక ఉత్తర్వులు రాలేదు. పిల్లలను పాఠశాలల్లో చేర్చేలా కుటుంబాలకు నచ్చజెప్పడానికి నియమించిన వారికి గౌరవ వేతన చెల్లింపులూ సక్రమంగా జరగడం లేదు. డిగ్రీ కళాశాలల అధ్యాపకులు పీజీ విద్యార్థికి చెల్లించే ఉపకార వేతనంకన్నా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. ఇంకోవైపు  గణనీయమైన సంఖ్యలోని ఫార్మసిస్టులు పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తుంటే, నెలకు రెండున్నర వేల రూపాయల గౌరవ వేతనంపై పనిచేస్తున్న గ్రామ సెక్యూరిటీ గార్డులు తమ జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. బహిరంగ మల విసర్జనను నివారించడానికి మరుగుదొడ్లు కట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆచరించేలా ప్రజలను ఒప్పించడానికి నియమించిన స్వచ్ఛతాగ్రాహులకు ఇవ్వాల్సిన అరకొర ప్రోత్సాహకాలనూ ఇవ్వడం లేదు. ఒక మరుగుదొడ్డిని కట్టించేట్లు ప్రోత్సహిస్తే రూ.150 చెల్లిస్తామని, గ్రామాన్ని పూర్తిగా బహిరంగ మలవిసర్జన రహితంగా మారిస్తే పది వేల రూపాయల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన మాట నీటిమూట అయింది. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలను చేపట్టినప్పటి నుంచి దేశీయంగా ప్రభుత్వ ఉద్యోగాలను ఖాళీగా అట్టిపెట్టడం ఎక్కువైంది. ఉన్న ఉద్యోగులను వదిలించుకోవడం, ఒప్పంద ఉద్యోగులను నియమించుకోవడం, పొరుగు సేవల సంస్థలతో పనులు జరిపించుకోవడం వంటి పద్ధతులను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. దీంతో మన దేశంలోని యువ జనాభాకు భవిష్యత్తుపై నైరాశ్యం కమ్ముకొంటోంది. చదువుకున్న మహిళలకు ఉద్యోగాలు రావడం లేదు. మరి విద్యాస్థాయులు పెరగడం వల్ల ప్రయోజనమేమిటనే ప్రశ్న ముల్లులా పొడుస్తోంది.
ప్రజలకు ఒనగూడిందేమిటి?
ఉపాధి హక్కు ప్రాథమిక హక్కు కాకపోయినా, జీవించే హక్కు మాత్రం కచ్చితంగా ప్రాథమిక హక్కే. ఆదాయం లేకుంటే హుందాగా జీవించడం సాధ్యపడదు. సంఘటిత, అసంఘటిత రంగాలు రెండింటిలో నిరుద్యోగం జడలు విప్పి నర్తిస్తోంది. ఉపాధి పొందడాన్ని ప్రాథమిక హక్కుగా ప్రకటించి పటిష్ఠంగా అమలుపరిస్తే తప్ప పరిస్థితి మారదు. భారత్‌లో సంపన్నులు మరింత సంపన్నులవుతుంటే, సగం జనాభా పూట గడవని దుస్థితిలోకి జారిపోవడం ప్రగతికి చిహ్నం కాజాలదు.  విద్య, వైద్యాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ప్రజలందరికీ మౌలిక సేవలు అందాలి. ఒకవైపు విద్యావంతుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు మన విద్యా, వైద్య సంస్థల్లో ఖాళీలు పెరుగుతున్నాయి. తగు విద్యార్హతలు ఉన్నవారితో వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వాలు మొరాయిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలలు రోగులతో కిటకిటలాడుతుండగా, వారికి చికిత్స చేయడానికి చాలినంతమంది వైద్య సిబ్బంది లేనే లేరు. ప్రభుత్వాలు ఉద్యోగాలను భర్తీ చేయకుండా అంతా ప్రైవేటు రంగానికి అప్పజెప్పడం వల్ల ప్రజలకు ఒరిగిందేమిటి? ఈ పంథాలో భారతదేశం అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎప్పటికి మారేను?

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

Posted Date : 26-01-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌