• facebook
  • twitter
  • whatsapp
  • telegram

న‌యా ఉద్యోగాల‌కు నవీన నైపుణ్యాలు!

ఇంజినీరింగ్ చేస్తూ అభివృద్ధి చేసుకోవాల్సిన స్కిల్స్‌

నూతన తరహా కొలువులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో బ్యాంకింగ్, ఆర్థిక, బీమా, ఐటీ ఆధారిత సేవలు, ఇంటర్నెట్‌-వ్యాపార రంగాల్లో ఉద్యోగ నియామకాల విషయంలో భారీ మార్పులు జరిగి ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయని జాతీయస్థాయి అధ్యయన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్‌ చదువుతున్నవారు కళాశాల దశలోనే నవతరం ఉద్యోగాలకు అవసరమైన మెలకువలు నేర్చుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కొత్త నైపుణ్యాలు ఉద్యోగార్థులకు అభిలషణీయం మాత్రమే కాదు, అత్యవసరం కూడా!  
 

గత ఐదు- పది సంవత్సరాల కాలంలో ఉద్యోగ విపణిలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. అభ్యర్థుల నైపుణ్యాలకూ, పరిశ్రమల అవసరాలకూ మధ్య అంతరం పెరిగింది. ఊహించని వేగంతో సాంకేతికలో వస్తున్న విప్లవాత్మక ప్రగతి, పరిశ్రమలు ఈ కొత్త టెక్నాలజీల అమలుకు విస్తృతంగా మొగ్గు చూపడం లాంటివి ఉద్యోగార్థుల నైపుణ్యాల అంచనాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఉన్న సాంప్రదాయిక ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. ఇంతకుముందు వినని కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు ‘వె ల్డర్‌’ ఉద్యోగం ఈరోజు దాదాపు కనుమరుగయింది. డేటా అనలిటిక్స్, రొబొటిక్స్‌ లాంటి కొత్త టెక్నాలజీలు ఇటువంటి సంప్రదాయ ఉద్యోగాలకు తెర దించాయి. అలాగే టెలిఫోన్‌ ఆపరేటర్‌ విధులను రోబోలు నిర్వహిస్తున్నాయి. 
 

ఇంజినీర్లు ఇంతవరకు సమాజానికీ, ఆర్థిక వ్యవస్థకూ వెన్నెముక అయిన పరిశ్రమలూ, భారీ ప్రాజెక్టులూ నిర్మించి నిర్వహించేవారు. ఇప్పుడు ఇంజినీరింగ్‌.. వ్యక్తిగత అభిరుచులను దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీలను తీసుకురాగలగాలి. ఉదాహరణకు మనిషి కొలతలకు అతికినట్టుగా బట్టలు కుట్టి అప్పటికప్పుడు సిద్ధం చేసే టెక్నాలజీ కలిగిన కుట్టు మిషన్లు రాబోతున్నాయి. ఒక జీన్స్‌ ప్యాంట్‌ కొనుక్కుని దాని కొలతలు మనకు సరిపోక, దర్జీ దగ్గరికి తీసుకువెళ్ళి తిరిగి కుట్టించుకోనక్కర్లేదు. ఇలా అవసరమైనమేరకు బట్ట ముక్క వినియోగం, తక్కువ సమయం, తక్కువ ఖర్చు, శరీర సౌష్ఠవానికి సరిపోయేలా కుట్టించుకునే వెసులుబాటు కొత్త టెక్నాలజీ అందించే లాభాలుగా ఉంటాయి. వ్యక్తి ఆలోచనలకూ, వ్యక్తిగత అభిరుచులకూ అనుగుణంగా వ్యాపారసంస్థలు తమ దిశను మలచుకుంటే అందుకు అవసరమైన టెక్నాలజీల రూపకల్పన, నిర్వహణ సామర్థ్యం ఉన్న ఇంజినీర్లు కావాలి. పర్సనలైజేషన్‌/ పర్సనలైజ్‌డ్‌ ఇంజినీరింగ్‌ అని దీన్ని వ్యవహరిస్తారు. ఈ మార్పుల వల్ల వివిధ రంగాల్లో గణనీయ సంఖ్యలో సాంప్రదాయిక ఉద్యోగాలు పోయి వాటి స్థానంలో అంతకు ఎక్కువ సంఖ్యలో కొత్త తరహా ఉద్యోగాలు వస్తున్నాయి. వీటికి అవసరమైన మెలకువలను ఇంజినీరింగ్‌ విద్యార్థులు బీటెక్‌ చేస్తున్న కాలంలోనే అభివృద్ధి చేసుకోవాలి.
 

నైపుణ్యాల నివేదిక ఏం చెబుతోంది? 
టాగ్‌డ్‌ అనే మానవ వనరుల సేవల సంస్థ, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆన్‌లైన్‌లో ప్రతిభా పరీక్షలు నిర్వహించే వీబాక్స్‌ సంస్థలు సంయుక్తంగా ఏటా ప్రచురించే ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌- 2020 వెలువడింది. పరిశ్రమల నిపుణుల అభిప్రాయాలు, విద్య-శిక్షణ సంస్థల బోధనా పద్ధతులు, నైపుణ్యాల శిక్షణ పద్ధతులను క్రోడీకరించిన నివేదిక ఇది. ఉద్యోగాలకు కావలసిన కొత్త మెలకువలపై సిఫారసులు, సాంకేతిక విద్యార్థుల ఉద్యోగ సంసిద్ధతపై వివరాలు దీనిలో ఉన్నాయి. 
ఎంబీఏ అభ్యర్థుల ఉద్యోగ సంసిద్ధత అధికంగా ఉంది. అంటే వీరి పాఠ్యాంశాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వున్నాయి. 
ఇంజినీరింగ్‌ అభ్యర్థుల మెలకువల్లో 2019 సంవత్సరం కంటే ఈ ఏడాది 9% తరుగుదల ఉంది. పరిశ్రమల అవసరాలకూ, పాఠ్యాంశాల్లో మెలకువల శిక్షణకూ అంతరం పెరిగింది
బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగం, బీమా రంగం, ఐటీ ఆధారిత సేవల రంగం, ఇంటర్నెట్‌-వ్యాపార రంగాల్లో ఉద్యోగ నియామకాల విషయంలో గత ఐదేళ్లలో పెను మార్పులు జరిగాయి. ఈ రంగాల్లో  ఉద్యోగ అవకాశాలూ భారీగా పెరిగాయి. 
భారతదేశ  పారిశ్రామిక విప్లవం 4.0 అవసరాలకు తగ్గట్టుగా అభ్యర్థులు నైపుణ్యాలను నేర్చుకోవాలి. 
కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, కొన్ని కాలం చెల్లిన నైపుణ్యలను వదులుకోవడం చాలా అవసరం. ఈ ప్రక్రియనే ‘లర్న్‌- అన్‌ లర్న్‌- రీ లర్న్‌’ అంటారు. 
బీటెక్‌ ముగించి కళాశాల బయటకు అడుగుపెట్టేవారిలో ఉద్యోగ సంసిద్ధత కేవలం 15% ఉంది.
నౌకరి.కామ్‌ వంటి జాబ్‌ పోర్టల్స్, లింక్‌డ్‌ఇన్‌ వంటి సామాజిక మాధ్యమాలు, ఉద్యోగుల రెఫరల్‌ మార్గాల ద్వారా అత్యధికంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.
 

కీలక నైపుణ్యాలు
 

క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడం (Complex problem solving ability)
జటిల సమస్యలకు సులభమైన రీతిలో సమాధానాలు సాధించడం ఒక నేర్పు. ఒక సమస్యకు ఒకే సమాధానం ఉండదు. చాలా రీతుల్లో ఆ సమస్యకు సమాధానం రాబట్టవచ్చు. అన్ని సమాధానాలలోకీ  తక్కువ సమయం తీసుకునే, తక్కువ ఖర్చుతో కూడుకున్న, సరళమైన, నాణ్యమైన పరిష్కారం గుర్తించడం ఒక కళ. ప్రతి పరిశ్రమలోనూ ఇంచుమించు ప్రతి స్థాయిలోనూ కంప్యూటరీకరణ జరుగుతోంది. అంటే బ్రాంచితో నిమిత్తం లేకుండా ప్రతి ఇంజినీర్‌కూ ప్రోగ్రామింగ్‌ తెలిసుండాలి. ఉదాహరణకు ఒకప్పుడు మహిళలకు చీరకు సరిపోయే రంగు రవికె దొరకడం కష్టంగా ఉండేది. ఎన్నో దుకాణాలు తిరిగి శ్రమపడవలసి వచ్చేది. కంప్యూటర్‌లో వివిధ రంగుల మిశ్రమం అనుకరించే సౌలభ్యం ఈ సమస్యకు వరంగా లభించిందని చెప్పవచ్చు. ఈ కిటుకును జౌళి పరిశ్రమలో అమలుపరిచి, బట్టలకు రంగులు అద్దే ప్రక్రియను ముందుకు జరిపి చీరతో పాటు రవికెనూ నేయడం ద్వారా ఇది సాధ్యమయింది. సమస్యను సమగ్రంగా అర్థం చేసుకుని, చిన్న చిన్న సమస్యలుగా విభజించి, వాటి సమాధానాల సమాహారంగా అసలు సమస్యను సాధించడం ప్రతిభతో కూడుకున్న నైపుణ్యం. ఇది ఇంజినీరింగ్‌కి మూలస్తంభం. ఈ నైపుణ్యంలో లోటుపాట్లను గుర్తించడం, భద్రతకు గల అవకాశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి పరీక్షించడం, కష్ట నష్టాల అవకాశాన్ని గుర్తించడం, సామర్థ్యాన్ని పెంచడం అంతర్భాగాలు.
 

సృజనాత్మకత (Creativity)
ఇంజినీర్లు రూపకర్తలేకానీ సృష్టికర్తలు కారు కదా, వీరికి వైజ్ఞానికుల స్థాయిలో సృజనాత్మకత అవసరం ఉండదనుకోవడం పొరపాటు. వైౖజ్ఞానికుల ప్రతిపాదనలకు భౌతిక రూపం ఇవ్వాలంటే  వనరుల అవసరాలు, తక్కువ ధర, అధిక ఉత్పత్తి, భౌగోళిక పరిస్థితులు, సమాజంలోని సంస్కృతి, మతపరమైన అంశాలు, ప్రభుత్వాల ఆంక్షలు, ప్రజా ప్రయోజనం, వాతావరణ కాలుష్యం, ప్రకృతి సమతౌల్యం వంటివెన్నో పరిగణించాలి. పరస్పర విరుద్ధ లక్ష్యాలు కలిగిన ఈ అంశాలను యాజమాన్యం, ప్రభుత్వం, ప్రజల ఆమోదం ఉండేలా సాధించాలంటే ఇంజినీర్లకు సృజనాత్మకత చాలా అవసరం. ఇంజినీర్‌ కెరియర్‌కు ఇదే పెట్టుబడి. సృజనాత్మక ఇంజినీర్లు సమస్యలకు సరైన సమాధానాలు కనుక్కునేవారుగానే కాకుండా ఇతరులకు స్ఫూర్తిదాయకులుగానూ ఉంటారు. ధవళేశ్వరం వంతెన రూపకర్త సర్‌ ఆర్థర్‌ కాటన్, కన్నంబాడి రిజర్వాయర్‌ రూపకర్త సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఈసీఐఎల్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ ఏఎస్‌ రావు వంటివారు ఈ కోవలోకి వస్తారు. 
 

విమర్శనాత్మక ఆలోచనా దృక్పథం (Critical thinking)
సమస్య సందర్భాన్ని విశ్లేషించి సమయోచితమైన నిర్ణయం కోసం ఆలోచించగలిగే సామర్థ్యం ఇది. వ్యక్తిగత అభిప్రాయాలకూ, ఇతర ప్రలోభాలకూ లోనుకాకుండా తటస్థ నిర్ణయం తీసుకోవటాన్ని అలవరచుకోవాలి. సమస్యకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించడం, దాన్ని అన్ని కోణాలనుంచి పరిశీలించి, విశ్లేషించి, పరిష్కారంపై విరుద్ధ ప్రభావం చూపే అంశాలను గుర్తించడం, సంబంధిత వ్యక్తుల అభిప్రాయాలను సేకరించడం- వారి స్పందన,  వివిధ ప్రత్యామ్నాయ సమాధానాలు ఈ మెలకువలో అంతర్భాగం. ఇవి నిరంతర అభ్యాసంతో వస్తాయి.
 

ముందుచూపుతో సమస్యలకు పరిష్కారం (Foreseeing problems and sovling)
ప్రతి కొత్త టెక్నాలజీ ఒక సమస్యకు సమాధానం ఇస్తుంది. అదే సమాధానం బహుశా మరో ఎదురు చూడని, కొత్త సమస్యకు తెర తీస్తుంది. ఉదాహరణకు మనకు అవసరమైనవారు అన్నివేళలా మనకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కనుక్కున్న మొబైల్‌ ఫోన్‌ మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మనిషిని మనిషి నుంచి వేరు చేస్తున్నదనే అపప్రథను మోస్తూ కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. మొబైల్‌ కనుక్కున్నప్పుడు ఈ సమస్యను ఎవరూ ఊహించలేదు. ఈరోజు ఈ జటిల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలంటే మేధకూ, సృజనాత్మకతకూ పని పెట్టాలి. ప్రత్యామ్నాయ మార్గంలో సమాధానాలు ఆలోచించాలి. అలాగే కారులో సీటు బెల్టు డ్రైవర్ల నిర్లక్ష్యానికీ, అధిక వేగంతో ప్రమాదం కొనితెచ్చుకునేవారు బలి కాకుండా ప్రాణాలు నిలబెట్టడానికీ  చేసిన ఇంజినీరింగ్‌ సృష్టి. కొత్త టెక్నాలజీలు అందించే లాభాలతోపాటు అవి తెచ్చిపెట్టే ప్రమాదాలను ముందుగానే ఊహించగలగడం ఒక దార్శనిక కళ. ఇది నిత్యం అభ్యాసం చేస్తే కానీ రాని నైపుణ్యం.
 

ఇవే కాదు-  రేపటి ఇంజినీర్లు అలవర్చుకోవాల్సినవాటిలో కింది నైపుణ్యాలూ ముఖ్యమే.. 
దైనందిన లావాదేవీలకు అవసరమైన ఒత్తిడి నిర్వహణ సామర్థ్యం (Stress management)
సమయ నిర్వహణ (Time management)
బృందంతో కలిసి పనిచెయ్యగలగడం (Team work)
‣ భావ ప్రకటనా పాటవం (Communication skills)
నమూనాల నిర్మాణ మెలకువలు (Model development)

Posted Date : 14-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌