• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పరీక్షా పత్రాలు... ప్రశ్నల రూపాలు 

యుద్ధం గెలవాలంటే- ‘ప్రత్యర్థి ఎటువంటి ఆయుధాల్ని ఉపయోగిస్తున్నాడు, వాటి ప్రభావం ఎంత? ఎదుర్కొనే ప్రత్యామ్నాయాలు ఏమిటి ?’ అని ఆలోచించాలి. లోతుగా అధ్యయనం చేయాలి. ఇదే విధంగా ఉద్యోగార్థులు కూడా పోటీ పరీక్షల్లో వచ్చే ప్రశ్నల స్వభావం, కఠినత్వం, వెయిటేజిలను అర్థం చేసుకోవటం తప్పనిసరి. అప్పుడే గెలుపు బాటలో అడుగులు పడతాయి! 

అభ్యర్థులు తాము రాయదల్చుకున్న పోటీ పరీక్షలకు సంబంధించిన గత పరీక్షా పత్రాలను తగిన సమయం వెచ్చించి, గమనించాలి. ఒకవేళ అవి తక్కువ సంఖ్యలో ఉంటే? అసలు లభ్యం కాకపోతే?.. ఇలాంటి పరిస్థితుల్లో  అనుభవజ్ఞులు రూపొందించిన నమూనా ప్రశ్నలపై, ప్రశ్నపత్రాలపై ఆధారపడవచ్చు.

ప్రిపరేషన్‌లో భాగంగా పరీక్షా పత్రాల ముందస్తు అధ్యయనం వల్ల అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వాటిని పరిశీలిస్తే...

1.  వివిధ అంశాల వెయిటేజి: నిర్దేశించిన సిలబస్‌లోని ఏ అంశాలపై ఎగ్జామినర్‌ ప్రధానంగా దృష్టి పెట్టి ప్రశ్నలు తయారు చేస్తున్నాడు అనే అవగాహన పెరుగుతుంది. ఆ విషయంపై ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం కలుగుతుంది. ఎగ్జామినర్‌ దృష్టిలో ముఖ్యం కాదనుకున్న విభాగాలపై తక్కువ సమయం దృష్టి పెట్టే అవకాశం ఏర్పడుతుంది.

2.  ప్రశ్నల కఠినత్వం: ప్రశ్నపత్రాల అధ్యయనం వల్ల ప్రశ్నలు ఏ స్థాయి కఠినత్వంతో వస్తున్నాయో అభ్యర్థులు అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా ప్రశ్నల తయారీలో సులభం, మధ్యమ స్థాయి, కఠినత్వం అనే మూడు ప్రమాణాలను పాటిస్తారు. అకడమిక్‌ పరీక్షల్లో అయితే స్థిరమైన వెయిటేజిని పాటిస్తారు. పోటీ పరీక్షల్లో అలా స్థిరమైన వెయిటేజి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కువ సందర్భాల్లో దీన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. అందువల్ల ప్రశ్నపత్రాలను అధ్యయనం చేసినప్పుడు ఆయా పేపర్లలో, ఆయా చాప్టర్లలో పరీక్ష తీరుతెన్నులను బట్టీ, ఉద్యోగ స్థాయిని బట్టీ ప్రశ్నలు ఎలా వస్తున్నాయో అవగాహన ఏర్పడుతుంది. తద్వారా సన్నద్ధత తీరుతెన్నుల్ని మెరుగుపరచుకోవచ్చు.

3.  థియరీ.. అన్వయాల అంచనా: అకడమిక్‌ పరీక్షల్లో అయినా, పోటీ పరీక్షల్లో అయినా సాధారణంగా సైద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ అనువర్తన అంశాలపైనా ప్రశ్నలు అడుగుతారు. అకడమిక్‌ పరీక్షల్లో ఈ విషయంలో స్థిరమైన నిష్పత్తిని పాటిస్తారు గానీ పోటీ పరీక్షల్లో అటువంటి గ్యారంటీ లేదు. డీఎస్సీలో కూడా మెథడాలజీ, సైకాలజీ విభాగాల్లో అనువర్తన ప్రశ్నలకు అధిక ప్రాధాన్యం ఉంటుందనేది తెలిసిన విషయమే. అదే విధంగా పోటీ పరీక్షల్లో ప్రధానంగా జనరల్‌ సైన్స్, శాస్త్ర సాంకేతిక, ఆర్థిక, రాజ్యాంగ విభాగాల్లో అనువర్తన ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. భౌగోళిక శాస్త్రం, విపత్తు నిర్వహణ మొదలైనవాటిలోనూ అనువర్తనం అధికమే. అందువల్ల ప్రశ్నపత్రాలు అధ్యయనం చేసినప్పుడు అభ్యర్థులకు ఇటువంటి అవగాహన విస్తృతŸంగా ఏర్పడుతుంది. తద్వారా ఆయా విభాగాల్లో ఆయా కోణాల్లో చదివే నైపుణ్యం సంక్రమిస్తుంది.

4.  కీలక పదాలపై పట్టు: ఎగ్జామినర్‌ అభ్యర్థుల్లోని జ్ఞాన, అవగాహన స్థాయులను అర్థం చేసుకునేందుకు ప్రశ్నల్లో వివిధ ‘కీ’లక పదాలను జోడిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కీ పదాల ఉపయోగం డిస్క్రిప్టివ్‌ పరీక్షల్లో చాలా ఎక్కువ. గ్రూప్‌-1 యూపీఎస్సీ ప్రధాన పరీక్షలు (మెయిన్స్‌), కొన్ని పోటీ పరీక్షల్లో అడిగే వివరణాత్మక ప్రశ్నలకు సరైన సమాధానం రాయాలంటే కీ పదాల్ని గుర్తించాలి. వాటికి అనుగుణంగా సమాధానాలు రాసినప్పుడే మంచి మార్కులు వస్తాయి. కీ పదాల వెయిటేజి, ఏ పేపర్‌లో, ఏ చాప్టర్‌ లో ఎటువంటి కీ పదాలు వాడుతున్నారో అవగాహన పెరగాలంటే తప్పనిసరిగా పాత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి.

5.  వివిధ ప్రశ్నల రూపాలు: ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో బహుళైచ్ఛిక, ఖాళీలను పూరించే, జతపరిచే, అసర్షన్‌- రీజనింగ్‌ మొదలైన రూపాల్లో ప్రశ్నలను అడుగుతుంటారు. ఇలాంటి విభిన్న ప్రశ్నల రూపాలు ఒక పరీక్షలో ఎన్ని వస్తున్నాయి అనేది అంచనా వేసుకోవాలి. తద్వారా అందుకు అనుగుణంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మెరుగుపరుచుకునే అవకాశం పుష్కలం. ఉద్యోగ స్థాయి పెరుగుతున్నకొద్దీ సంబంధిత పోటీ పరీక్షలో అసర్షన్‌- రీజనింగ్‌ ప్రశ్నల వాటా పెరుగుతూ ఉంటుంది. భాషా సంబంధిత పరీక్షల్లో సాధారణ పరీక్షలతో పోల్చినప్పుడు కాంప్రహెన్షన్, ప్రెసీ మొదలైన విభిన్న రకాలైన ప్రశ్నలు వస్తాయి. ఇటువంటి నేపథ్యంలో భాషా పేపర్‌లపై ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అనేది ముందస్తుగా అర్థం చేసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.

6.  సాధనకు కిటుకులు: ప్రశ్నల రూపాలు అర్థమైనపుడు వాటిని సాధించేందుకు ఏ కిటుకులు పాటించాలో అభ్యర్థుల్లో ఆలోచన మొదలవుతుంది. ఫలితంగా ఆయా ఆ మెలకువలను ముఖ్యంగా ఆబ్జెక్టివ్‌ పరీక్షలో అనుసరించి ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ముఖ్యంగా నిర్దిష్ట సమయంలోపు అన్ని ప్రశ్నలూ సాధించేందుకు కావలసిన అవగాహన ప్రశ్నపత్రాల అధ్యయనం ద్వారా ఏర్పడుతుంది. 

7.  పుస్తకాల ఎంపిక సులభం: పరీక్షలో అడిగే ప్రశ్నల వెయిటేజిపై, ప్రశ్నల రూపాలపై అవగాహన ఏర్పడినపుడు ఆయా ప్రశ్నలకు ఎదుర్కొనేందుకు ఏ స్థాయిలో రచించిన పుస్తకాలు ఉపయోగపడతాయో అభ్యర్థులకు స్పష్టత ఏర్పడుతుంది. ఈ అవగాహనతో పుస్తకాలను ఎంపిక చేసుకోవడం సులువు అవుతుంది.

సోషల్‌ మీడియాలో ప్రశ్నల హోరు

డిజిటల్‌ మీడియా బలపడిన తర్వాత పరిపక్వత లేని వ్యక్తులు కూడా విస్తృతంగా నమూనా ప్రశ్నలు తయారుచేసి పోటీ పరీక్ష అభ్యర్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా అత్యంత కఠినమైన ప్రశ్నలు, పేలవమైన ప్రశ్నలు ఇచ్చి అభ్యర్థుల్ని గందరగోళపరుస్తున్నారు. అందువల్ల యూట్యూబ్, టెలిగ్రామ్, వాట్సాప్‌.. ఇతరత్రా సోషల్‌ మీడియాలో లభించే ప్రశ్నలపై జాగ్రత్తగా కన్నేసి వాటిని యోగ్యతను అంచనా వేసుకున్నాక మాత్రమే వినియోగించుకుంటే మంచిది. లేకుంటే పరీక్షకు అవసరమైన రీతిలో తయారు అవ్వకపోయే ప్రమాదం చాలా ఎక్కువ!   

అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల ప్రకటన 

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివిధ శాఖలకు చెందిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 155 రెగ్యులర్‌ పోస్టులతోపాటు 35 బ్యాక్‌లాగ్‌ పోస్టులు కూడా ఉన్నాయి. ఎల్‌సీఈ, ఎల్‌ఎంఈ, సివిల్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్ల్లొమా,   గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారికి అవకాశాలున్నాయి. నోటిఫికేషన్‌లో రోస్టర్లు, జోన్ల వారీగా విభజించి ఉద్యోగాల సంఖ్యను ఇచ్చారు. అందువల్ల అభ్యర్థులు విద్యార్హతలు, జోన్లు, రోస్టర్లు పరిశీలిస్తే ఏ పోస్టులకు పోటీ పడాలో స్పష్టత వస్తుంది.

ఉమ్మడిగా జనరల్‌ స్టడీస్‌ 

మిగతా సాంకేతిక ఉద్యోగ పోటీ పరీక్షల మాదిరిగానే ఈ పరీక్షలో కూడా జనరల్‌ స్టడీస్‌ ఉమ్మడిగా ఉంది. పోస్టును బట్టి జనరల్‌ స్టడీస్‌తో పాటు వృత్తి సంబంధిత పరిజ్ఞానంపై అదనంగా ప్రశ్నపత్రాలు ఉన్నాయి. ఆ వివరణ ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌ విభాగంలో కనిపిస్తుంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ, గ్రూప్‌- 2 పేపర్‌ 1, ఇతర పోటీ పరీక్షల జనరల్‌ స్టడీస్‌లో ఉన్న సిలబస్‌నే నిర్దేశించారు. అందువల్ల జనరల్‌ స్టడీస్‌ కోసం ఉపయోగపడే పాఠశాల, తెలుగు అకాడమీ, ఇతర విశ్వవిద్యాలయాల పుస్తకాలను వినియోగించుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో పోటీ కఠినత్వం ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సిద్ధపడితే అనుకూల ప్రయోజనాలు సాధించవచ్చు.
 

Posted Date : 11-10-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌