• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆత్మస్థైర్యమే రక్ష!

మీపై మీరు నమ్మకం పెంచుకునే మార్గాలు 

 

 

ఆత్మవిశ్వాసం ఉంటే.. ఏ క్లిష్టమైన పనినైనా సమర్థంగా నిర్వహించవచ్చు. కానీ కొనసాగుతున్న కొవిడ్‌ పరిణామాలు ప్రణాళికలను తలకిందులు చేస్తున్నాయి. భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. ధైర్యం సన్నగిల్లి చాలా మందిలో ధీమా దెబ్బ తింటోంది. ఈ పరిస్థితుల్లో  ఏయే మెలకువలు పాటించాలి?

 

పరీక్షలకు సిద్ధమవుతోంది రమ్య. ప్రస్తుత పరిస్థితుల కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. సరిగ్గా ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియని పరీక్షల కోసం ఎలా ప్రిపేర్‌ కావాలో తెలియక తికమకపడుతోంది. రోజుల తరబడి చదివినా పరీక్షల నాటికి అన్నీ గుర్తుంటాయో లేదోననే బెంగపెట్టుకుంటుంది. 

 

రాహుల్‌.. ప్రముఖ సంస్థలో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంది. దాంతో ఉదయం నుంచే కంగారుగా అటూఇటూ తిరుగుతున్నాడు. ‘ఈ ఇంటర్వ్యూలో సెలెక్టు అవుతానో లేదో? ఫ్రెండ్స్‌ అందరూ ఇప్పటికే మంచి ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. ఈ ఉద్యోగమూ రాకపోతే నా పరిస్థితి ఏంటి?...’ అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. రోజులు గడిచేకొద్దీ తన శక్తి సామర్థ్యాల మీద అతడికి నమ్మకం తగ్గిపోతోంది. 

 

ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నాడు అభిజిత్‌. ముఖ్యమైన విషయం మీద ప్రజంటేషన్‌ ఇవ్వాల్సి ఉంది. 

 

అది బాస్‌కు నచ్చుతుందో లేదోనని సందేహిస్తున్నాడు. తనిచ్చే ప్రజంటేషన్‌ అధికారుల అంచనాలకు దీటుగా లేకపోతే తన పరిస్థితి ఏమవుతుందోనని కంగారుపడుతున్నాడు. 

 

విద్యార్థిని రమ్య, ఉద్యోగార్థి రాహుల్, ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న అభిజిత్‌... వీరి నేపథ్యాలూ, కర్తవ్యాలూ వేరైనా వీరంతా ఒకే సమస్యతో బాధపడుతున్నారు. అదేమిటంటే... ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం. పరిస్థితులను భూతద్దంలో ఊహించుకుంటూ తమ మీద తాము నమ్మకాన్ని కోల్పోతున్నారు. దూసుకువెళ్లాల్సినవారు ఆత్మరక్షణలో పడిపోయి, వెనకబడుతున్నారు. ఈ పరిస్థితుల్లోంచి బయటపడి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలంటే ఎలాంటి మార్గాలను అనుసరించాలో తెలుసుకుందాం.

 

ఇంటర్వ్యూలో మెరవాలంటే... 

సబ్జెక్టుపరమైన పరిజ్ఞానం మీకు ఎలాగూ ఉంటుంది. దాంతోపాటుగా ఇంటర్వ్యూకు హాజరయ్యే సంస్థకు సంబంధించిన ప్రాథమిక వివరాలనూ తెలుసుకోవాలి. అలాగే  ఇంటర్వ్యూల్లో శరీర భాషకూ ఎంతో ప్రాధాన్యముంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భుజాలు వంచకుండా నిటారుగా నిలబడాలి. ఎదుటివ్యక్తి ప్రశ్నలు వేస్తుంటే.. కిందకు లేదా చుట్టుపక్కల చూస్తూ మాట్లాడకూడదు. ఎదుటివారి కళ్లలోకి సూటిగా చూస్తూ సమాధానాలు చెప్పాలి. 

మీరు నడిచే విధానం, సమాధానం చెబుతున్న తీరును అద్దంలో చూస్తూ సాధన చేయొచ్చు. ఇలా చేయడం వల్ల పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. దీంతో మీ మీద మీకు నమ్మకమూ పెరుగుతుంది. 

ప్రశ్నకు సమాధానం తెలియకపోతే.. తోచిందేదో చెప్పెయ్యకూడదు. తెలియదని నిజాయతీగా చెప్పాలి. 

ముఖ్యంగా ఇంటర్వ్యూకు వెళ్లడానికి ముందు సాధన చేయడం వల్ల చాలా ఉపయోగముంటుంది. 

వీలైనంత వరకు ఇంటర్వ్యూ బాగా చేయాలనే విషయం గురించి మాత్రమే ఆలోచించాలి. ఇందులో ఎంపిక కాకపోతే తర్వాత ఏంచేయాలనే ఆలోచనను మనసులోకి రానీయకూడదు. ప్రతికూల ఆలోచనలు రాగానే మీ మీద మీకు నమ్మకం సన్నగిల్లుతుంది. దాంతో మీకు తెలిసిన విషయాలనే అడిగినా సరిగ్గా సమాధానం చెప్పలేకపోవచ్చు. 

అందుకే మీ దృష్టి ఎప్పుడూ ప్రయత్నం మీదే ఉండాలిగానీ ఫలితం మీద ఉండకూడదు. ఫలితం గురించి ఆలోచిస్తే ఒత్తిడికి గురై ఇంటర్వ్యూలో విఫలమయ్యే అవకాశాలే ఎక్కువ. 

 

విద్యార్థులైతే...

గతంలో మాదిరిగా విద్యార్థులు కాలేజీకి వెళ్లి రావడం, నలుగురు స్నేహితులతో కలిసి మాట్లాడటం లాంటివేమీ ఇప్పుడు ఉండటం లేదు. వీరు ఆన్‌లైన్‌ క్లాసులతో ఇంటికే పరిమితం అవుతున్నారు. దాంతో ఆందోళన, దిగులు, ఆత్మవిశ్వాసం కోల్పోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలంటే-  

రోజూ నిర్దిష్టంగా కొన్ని గంటలపాటు చదవాలి. తర్వాత తగినంత విశ్రాంతీ తీసుకోవాలి. రోజంతా చదవుతూ ఉంటే పుస్తకాలు చేతిలోనే ఉన్నా రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి చదివినంత సేపూ ఏకాగ్రతతో చదివితే ఇలాంటి ఇబ్బంది ఉండదు. 

వెనకబడివున్న సబ్జెక్టు మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాలి. ఇప్పుడు ఎలాగూ సమయం ఉంది కాబట్టి ఆ సబ్జెక్టులోని ముఖ్యమైన అంశాలను చదివి చూడకుండా రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా రాయడం వల్ల ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నారో అర్థమవుతుంది. వాటిని మళ్లీ చదువుకునే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థులకు తమ మీద తమకు నమ్మకమూ పెరుగుతుంది. 

ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంట్లో ఉండాల్సి రావడాన్ని శిక్షలా భావించకూడదు. కొత్త విషయాలను నేర్చుకోవడానికీ, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికీ దొరికిన మంచి అవకాశంగా భావించాలి. 

ఖాళీ సమయంలో స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతూ కొంత ఊరట పొందొచ్చు. సబ్జెక్టుపరంగా ఏమైనా సందేహాలున్నా అడిగి తెలుసుకోవచ్చు. 

ఇంతవరకు కాలేజీకి వెళ్లిరావడంతో బిజీగా గడిపారు కాబట్టి ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి. శారీరంకంగా తగిన విశ్రాంతి తీసుకుంటే మానసిక సాంత్వనా పొందుతారు. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో చదువు మీద దృష్టిని కేంద్రీకరించగలుగుతారు.  

అరుదుగా దొరికిన ఈ సమయంలో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ బలాలు, బలహీనతల గురించి ఒక అవగాహనకు రావాలి. బలహీనతలను అధిగమిస్తే మీ మీద మీకు నమ్మకమూ పెరుగుతుంది. 

 

ఉద్యోగులైతే... 

పై అధికారుల ముందు ఏదైనా ప్రత్యేకాంశం గురించి  మాట్లాడాలన్నా.. ప్రజంటేషన్‌ ఇవ్వాలన్నా కొంతమంది ఉద్యోగులు తడబడుతుంటారు. ఎక్కువగా ఒత్తిడికీ గురవుతుంటారు. అలాకాకుండా విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించాలి. ఎంత సీరియస్‌ అంశమైనా దాన్ని ఆసక్తికరంగా మార్చడానికి ప్రయత్నించాలి.   

అదేవిధంగా చెప్పాలనుకుంటున్న అంశాన్ని సీరియస్‌గా.. గబగబా చెప్పుకుంటూ వెళ్లిపోకూడదు. కాస్త కంగారుగా ఉన్నా అది ముఖంలో కనిపించకుండా జాగ్రత్తపడాలి. చిరునవ్వుతో, నిదానంగా విషయాన్ని వివరించాలి.  

ప్రజంటేషన్‌కు సాధన ఎంతో ముఖ్యం. అద్దం ముందు నిలబడి సాధన చేయొచ్చు. లేదా స్నేహితులు లేదా కుటుంబసభ్యుల సమక్షంలో ప్రజంటేషన్‌ ఇవ్వొచ్చు. ఇలా చేయడం వల్ల సమయానికి తడబడకుండా, ఒత్తిడికి గురికాకుండా ఉండగలుగుతారు.   

మీ స్నేహితులెవరైనా ఇంతకుముందు ప్రజంటేషన్స్‌ ఇచ్చి ఉంటే వారి సలహాలు, సూచనలను పాటించవచ్చు. వారి అనుభవాలు మీకు విలువైన పాఠాలుగానూ ఉపయోగపడతాయి.

విషయానికి మీ వ్యక్తిగత అనుభవాలనూ జోడించి ఉదాహరణలుగా చెబితే ఎదుటివారు కాస్త ఆసక్తిగా వినే అవకాశముంటుంది. 

చెప్పే అంశంలో మీకు సంపూర్ణ పరిజ్ఞానం లేకపోవచ్చు. కానీ ఆ అంశం మీద మీరు మంచి కసరత్తు చేశారనే విషయం చూసేవాళ్లకు అర్థంకావాలి. దాంతో అధికారులకు మీ మీద సదభిప్రాయం ఏర్పడుతుంది. మీ మీద మీకు నమ్మకమూ పెరుగుతుంది. 

Posted Date : 15-06-2021 .