• facebook
  • twitter
  • whatsapp
  • telegram

exams: ఈ రెండు నెలలూ పరీక్షలే పరీక్షలు!

విద్యార్థులు, ఉద్యోగార్థులు బిజీ బిజీ

దాదాపు రెండేళ్ల నుంచి విద్యావ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. విద్యాసంవత్సరం అంటే ఎప్పటి నుంచి ఎప్పుడో చెప్పలేని పరిస్థితి తలెత్తింది. ఇక విద్యార్థుల సామర్థ్యానికి ప్రామాణికంగా భావించే పరీక్షలకే కరోనా పరీక్ష పెడుతోంది. రెండో వేవ్ వల్ల దేశంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతేడాది పరీక్షల సమయంలోనే కరోనా దేశంలో అలజడి సృష్టించింది. ఫలితంగా కొన్ని పరీక్షల రద్దు కావడంతోపాటు మరికొన్ని వాయిదా పడ్డాయి. ఈ ఏడాది కూడా పరిస్థితి మరింత దుర్భరంగా మారడంతో అటు పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ వరకు పరీక్షలు రద్దయ్యాయి. వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో చేరడానికి రాసే ప్రవేశ పరీక్షలు వరుసగా వాయిదా పడుతూ వచ్చాయి. మరోవైపు కొవిడ్తో ఉద్యోగాల ఎంపిక నిర్వహణలోనూ తీవ్రజాప్యం జరిగింది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ చేపట్టాల్సిన ఉద్యోగ భర్తీ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. పరిస్థితి కాస్త కుదుడపడ్డాక నిర్వహిస్తామని ఆయా నిర్వహణ సంస్థలు ప్రకటించాయి. 

వాస్తవానికి చాలా రాష్ట్రాలు పాఠశాల స్థాయి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. జాతీయ స్థాయిలో నిర్వహించే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు కూడా తప్పని పరిస్థితుల్లో రద్దు చేయాల్సి వచ్చింది. అయితే రద్దు చేసిన వాటి ఫలితాల ప్రక్రియ సాగుతోంది. ఈక్రమంలోనే వాయిదా పడిన వివిధ ఉద్యోగ, ప్రవేశపరీక్షల నిర్వహణకు ఆయా సంస్థలు కొత్త తేదీలను ప్రకటించాయి. మరో రెండు నెలలు దేశంలో పరీక్షల మేళా జరగనుంది. 

ప్రవేశ పరీక్షలు ఇలా..

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్(ఐఎన్ఐ సెట్)-2021 పరీక్షను జులై 22న జరపనున్నట్లు ఎయిమ్స్ తెలిపింది. షెడ్యూలు ప్రకారం ఈ పరీక్ష మే 8న జరగాల్సి ఉండగా.. దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా ఎయిమ్స్ జూన్ 16కు వాయిదా వేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. సుప్రీం ఆదేశాల మేరకు పరీక్షను జులై 22న నిర్వహించనున్నట్లు ఎయిమ్స్ ప్రకటించింది.

జేఈఈ(మెయిన్)-2021 ఏప్రిల్, మే సెషన్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్రం కొత్త తేదీలను ప్రకటించింది. జులై 20 నుంచి 27 వరకు మూడో విడత పరీక్ష, ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నాలుగో విడత పరీక్ష జరగనుంది. 

మను(మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ)లో ప్రవేశాలకు జులై 29 నుంచి 31 వరకు పరీక్ష జరగనుంది. 

ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 11-14 తేదీల్లో పీజీఈసెట్ జరగనుంది. 

తెలంగాణలో ఎంసెట్ కు సంబంధించి ఇంజినీరింగ్ పరీక్షను ఆగస్టు 4,5,6 తేదీల్లో, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష ఆగస్టు 9, 10 తేదీల్లో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 

ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్ ఆగస్టు 19 నుంచి 25 వరకు కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 

ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్, 23న లాసెట్, 24, 25 తేదీల్లో ఎడ్ సెట్ నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ ఆగస్టు 23న జరగనుంది. 

దేశంలోని వైద్య, దంత కళాశాలల్లో ఎండీ, ఎమ్మెస్ ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-పీజీ-2021 పరీక్ష సెప్టెంబర్ 11న జరగనుంది. 

నీట్(యూజీ)-2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించనున్నారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా జరుపుతారు. 

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ సెప్టెంబర్ 17, 18న విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. 

సెప్టెంబర్19న ఈసెట్(అనంతపురం జేఎన్టీయూ), సెప్టెంబర్21న ఎడ్సెట్(విశాఖ ఏయూ) పరీక్షలు జరగనున్నాయి. 

తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్22న లాసెట్, సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు పీజీఈ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఉద్యోగ పరీక్షలు

దేశంలోని అత్యున్నత ఉద్యోగాల ఎంపిక చేపట్టే యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రిలిమ్స్ తేదీని ప్రకటించింది. జులై 18(ఆదివారం)న ఈఎస్ఈ ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. 

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ ఆగస్టు 8న నిర్వహిస్తారు. 

జులై 17, 18న కంబైన్డ్ జియో-సైటిస్ట్(మెయిన్స్) పరీక్ష జరగనుంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్(సీజీడబ్ల్యూబీ)లో వివిధ పోస్టుల కోసం యూపీఎస్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఇప్పటికే ప్రిలిమ్స్ ముగియగా.. మెయిన్స్ జరగనుంది. 

Posted Date : 17-07-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌