• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐటీ స్కిల్స్‌లో ఉచిత శిక్షణ

నిరుద్యోగులకు ‘నిర్మాణ్’ చేయూత

సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగం సాధించుకోవాలనే కల చాలామందికి ఉంటుంది. కానీ ఎలా సంపాదించుకోవాలి? ఎలాంటి స్కిల్స్ పెంపొందించుకోవాలి? ఎవరు నేర్పిస్తారు? అనే సందేహాలు వెంటాడుతుంటాయి. వీటికి సమాధానం ‘నిర్మాణ్’ ఇస్తుంది. ఇదో లాభాపేక్షలేని సంస్థ. బిట్స్ పిలానీ విద్యార్థులు స్థాపించారు. 
పొందిన డిగ్రీ లేదా సర్టిఫికెట్ కంటే అభ్యర్థిలో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయా లేదా అనే ప్రస్తుతం సంస్థలు పరిశీలిస్తున్నాయి. కనీస అర్హతగా డిగ్రీ ఉన్నప్పటికీ చాలామందిలో తగిన నైపుణ్యాలు ఉండటం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. సరైన శిక్షణ కేంద్రాలు లేకపోవడం, ఉన్నా శిక్షణ తీసుకోడానికి అవసరమైన ఆర్థికస్థోమత లేకపోవడం వంటి ఎన్నో ఇబ్బందులను అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. ఇంజినీరింగ్ పట్టాలతో ఆఫీసుల చుట్టూ తిరిగినా స్కిల్స్ లేకపోవడంతో ఎలాంటి ఫలితం ఉండటం లేదు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి ‘నిర్మాణ్’ సాయపడుతుంది. 
అందరూ ఉన్నత చదువుల్లో అధిక మార్కులు సాధించడంపైనే దృష్టి పెడుతుంటారు. అది అవసరమే అయినప్పటికీ ఉద్యోగాలకు తగిన నైపుణ్యాలను పెంపొందించుకోడానికి కృషి చేయాలి. డిగ్రీ పూర్తయిన తర్వాత మొదలు పెట్టాలని భావిస్తే పోటీలో వెనుకబడిపోతారు. ఇలాంటి వారికీ ‘నిర్మాణ్’ చేయూతను అందిస్తోంది. 

ఏమిటీ నిర్మాణ్ ?

బిట్స్ పిలానీకి చెందిన విద్యార్థులు 2005లో ‘నిర్మాణ్’ అనే ఎన్జీఓ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశాలు పిల్లలకు విద్య, యువతకు నైపుణ్యాల శిక్షణ, ఉద్యోగాల కల్పన, సామాజిక బాధ్యత. గత 15 ఏళ్లలో సంస్థలోని 220 మందికిపైగా శాశ్వత సభ్యులు, 750 మందికి పైగా వాలంటీర్ల సహకారంతో పది లక్షల మందికి రకరకాలుగా సాయం అందించారు. 35కు పైగా కార్పొరేట్, ప్రభుత్వ, దాతృత్వ సంస్థల భాగస్వామ్యంతో దేశంలోని 8 రాష్ట్రాల్లో విభిన్న సామాజిక నేపథ్యాలు ఉన్న పిల్లలు, మహిళలు, యువత, రైతులకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలు చేపట్టారు. 

ఎలాంటి వారికి శిక్షణ ఇస్తారు?

బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఈ, బీసీఏ, ఎంసీఏ పట్టాలు ఉన్నవారికి ప్రధానంగా ఉచిత శిక్షణ కార్యక్రమాలు మైక్రోసాఫ్ట్-నిర్మాణ్ ఫ్యూచర్ రెడీ యూత్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇతర డిగ్రీలు, డిప్లొమా అభ్యర్థులకూ శిక్షణ ఉంటుంది. కానీ కంప్యూటర్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. ప్రస్తుతం 2017, 18, 19, 20 సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేసి 27 సంవత్సరాల వయసు లోపు నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

నేర్పించే కోర్సులు

HTML, CSS, BOOTSTRAP, PHP, Angular JS, Javascript, Asp .Net, CSharp, J Query, My SQL, Communication, English, Interview Skills

అడ్మిషన్ విధానం

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి అవసరాన్ని అనుసరించి రోజుకి కనీసం మూడు గంటలపాటు మూడు నెలల శిక్షణ ఉంటుంది. నిపుణులైన అధ్యాపకులు కోర్సులు బోధిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్ తోపాటు ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగం సాధించుకోవడంలో సాయపడతారు. బ్యాచ్‌లు ఎప్పూడూ నడుస్తూ ఉంటాయి. ఆసక్తి కలిగినవారు నిర్వాహకులను సంప్రదించవచ్చు.

వెబ్‌సైట్; http://shorturl.at/uwP45
 

Posted Date : 16-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌