• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కొలువా? గెలుపా? కోడింగ్‌ పోటీ ఉందిగా!

అంతర్జాతీయ స్థాయిలో గూగుల్‌ కాంపిటిషన్స్‌

అంతర్జాతీయంగా ఎన్నో భాషలు. దేశం, ప్రాంతం బట్టి వీటిల్లో మార్పులున్నాయి. కానీ అంతర్జాతీయంగా ఉపయోగించే ఒక భాష ఉంది. అదే కోడింగ్‌. పరిస్థితులతో సంబంధం లేకుండా దీని అవసరం, ఉపయోగం పెరుగుతోంది. దీనిలో కెరియర్‌ మలచుకోవాలనుకునేవారికీ, తమ ప్రావీణ్యాన్ని పరిశీలించుకోవాలనుకునేవారికీ  కోడింగ్‌ కాంపిటిషన్లు సరైన వేదికలు. వాటిల్లో గూగుల్‌ కోడింగ్‌ కాంపిటిషన్లు ప్రముఖమైనవి. 2021కిగానూ ఈ పోటీల వివరాలను గూగుల్‌ ఇప్పటికే ప్రకటించేసింది. ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించదగ్గ అవకాశమిది.

రంగం ఏదైనా ప్రతిభ చూపినవారికే అవకాశాలు దక్కుతాయి. కోడింగ్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ.. మిగతావాటి విషయంలో చాలావరకూ ఒక్కరే కూర్చుని చదవడమో, సాధన చేయడమో చేస్తే సరిపోతుంది. కోడింగ్‌ విషయంలో మాత్రం నిరూపించుకోవడం ద్వారా అవకాశాలు దక్కించుకోవచ్చు. ఇందుకు సమస్యలను గుర్తించడం, వాటికి పరిష్కారాలను కనిపెట్టడం చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని కోడింగ్‌ కాంపిటిషన్లు కలిగిస్తాయి. పోటీల్లో అభ్యర్థి సామర్థ్యం, సృజనాత్మకత, కచ్చితత్వం పరిశీలించి, విజేతలను నిర్ణయిస్తారు. ఇవి మంచి ఉద్యోగావకాశాలను చేజిక్కించుకునే అవకాశంతోపాటు తమ స్థాయిని అంచనా వేసుకోవడానికీ తోడ్పడుతాయి. ఇలా పోటీలను నిర్వహించే వాటిలో ‘గూగుల్‌’ ప్రముఖమైనది. ఈ సంస్థ అంతర్జాతీయంగా ‘కోడింగ్‌  కాంపిటిషన్స్‌’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మూడు పోటీలు- కిక్‌ స్టార్ట్, కోడ్‌ జామ్, హాష్‌ కోడ్‌ వేర్వేరుగా నిర్వహిస్తారు. ఈ పోటీలను ఏటా ఒక్కసారే నిర్వహిస్తారు. మూడింటికీ ప్రత్యేకమైన గుర్తింపు, నియమ నిబంధనలు, నమోదు ప్రక్రియలు ఉన్నాయి. ఇందుకుగానూ https://codingcompetitions.withgoogle.com/ పేరిట ప్రత్యేకంగా వెబ్‌సైట్‌నూ అందుబాటులోకి తెచ్చింది.

హాష్‌ కోడ్‌

రియల్‌ ఇంజినీరింగ్‌ చాలెంజ్‌గా పిలుస్తారు. ఇదో బృందంతో పాల్గొనే ప్రోగ్రామింగ్‌ కాంపిటిషన్‌. బృందంలో ఇద్దరి నుంచి నలుగురు వరకూ సభ్యులు ఉండొచ్చు. వయసు కనీసం 18 ఏళ్లు ఉండటం తప్పనిసరి. ఇతర పోటీదారులతో బృందాన్ని ఏర్పరచుకునే అవకాశముంటుంది. ఈసారి దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. పోటీలో రెండు రౌండ్లుంటాయి. 1. క్వాలిఫికేషన్‌ రౌండ్‌ 2. ఫైనల్‌ రౌండ్‌. 

క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ఇచ్చిన సమస్యకు నచ్చిన ప్రోగ్రామ్‌ లాంగ్వేజ్, టూల్స్‌ ఉపయోగించి పరిష్కారాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇందుకు నాలుగు గంటల సమయం ఉంటుంది. దీనిలో మెరుగైన ప్రతిభ చూపిన టాప్‌ టీమ్‌లను వర్చువల్‌ వరల్డ్‌ ఫైనల్స్‌కు ఎంపిక చేస్తారు.

పోటీల దృష్ట్యానే కాకుండా సాధన నిమిత్తం గూగుల్‌ ఎంతో మెటీరియల్‌ను అందుబాటులో ఉంచింది. ప్రతి పోటీకి సంబంధించీ ప్రిపరేషన్‌ సెషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పోటీలకు సిద్ధమవడానికే కాకుండా మంచి కోడర్‌గా నైపుణ్యాలను పెంచుకోవడానికీ తోడ్పడతాయి. 

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: ఫిబ్రవరి 22, 2021

ఆన్‌లైన్‌ క్వాలిఫికేషన్‌ తేదీ: మార్చి 2, 2021 

వరల్డ్‌ ఫైనల్స్‌: ఏప్రిల్‌ 24, 2021 

దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది.

ఫైనల్‌లో రౌండ్‌లో ముందుగా నిలిచిన మొదటి మూడు బృందాలకు నగదు బహుమతులు వరుసగా 4,000, 2,000, 1,000 యూఎస్‌ డాలర్ల చొప్పున ఇస్తారు. పాల్గొన్నవారిలో కనీసం ఒక పాయింటు సాధించినవారికి ధ్రువపత్రాలు, ఫైనల్‌కు చేరినవారికి బహుమతులూ ఉంటాయి. 

కిక్‌ స్టార్ట్‌

అంతర్జాతీయ స్థాయి పోటీ. గూగుల్‌లో కెరియర్‌ నిర్మించుకోవాలనుకునేవారు ప్రయత్నించవచ్చు. టెక్నికల్‌ కెరియర్‌కు అవసరమైన కోడింగ్‌ నైపుణ్యాలను పరీక్షించుకోవాలన్నా, ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవాలనుకున్నా దీన్ని ప్రయత్నించవచ్చు. కాంపిటిషన్‌లో మంచి ప్రతిభ కనబరిచినవారికి గూగుల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తుంది. ఆన్‌లైన్‌లో సాగుతుంది. ఇది ఏడాది పొడవునా నిర్ణీత కాలవ్యవధుల్లో అందుబాటులో ఉంటుంది. మూడు గంటలపాటు సాగుతుంది. ప్రీ క్వాలిఫికేషన్‌ పరీక్షలంటూ ఏమీ ఉండవు. పోటీలో భాగంగా గూగుల్‌ ఇంజినీర్లు డిజైన్‌ చేసిన అల్గారిథమిక్, మేథమేటికల్‌ ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొంటారు. పోటీలో ఉత్తమ ప్రదర్శన చేసినవారిని గూగుల్‌ ఇంటర్వ్యూ నిమిత్తం ఆహ్వానిస్తుంది.

మొత్తం 8 (ఎ-హెచ్‌) రౌండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకదానితో ఇంకోదానికి సంబంధం లేదు. ఒకసారి నమోదు చేసుకున్నాక అందుబాటులో ఉన్న రౌండ్లలో దేన్నైనా, ఎన్నింటినైనా ప్రయత్నించే వీలుంది. పాల్గొనేవారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. ఒకసారి నమోదు చేసుకుంటే చాలు. గూగుల్‌ అకౌంట్‌ లాగిన్‌తో భవిష్యత్‌ పోటీల్లోనూ పాల్గొనే వీలుంటుంది. రౌండ్‌ పూర్తిచేసుకున్నాక ర్యాంకింగ్‌తోపాటు అనాలిసిస్‌నీ అందిస్తారు.

కనీసం 16 సంవత్సరాల వయసు ఉండాలి. రౌండ్‌-ఎ మార్చి 21న ప్రారంభమవుతుంది.

రౌండ్‌లో భాగంగా కనీసం ఒక సబ్‌మిషన్‌ చేసినవారికి సర్టిఫికెట్‌ను అందజేస్తారు. ఒకటికి మించి రౌండ్లను ప్రయత్నించిన ప్రతిసారీ సర్టిఫికెట్, ర్యాంక్‌ అప్‌డేట్‌ అవుతుంది.

కోడ్‌ జామ్‌

అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలంపాటు సాగే కాంపిటిషన్‌. పోటీలో భాగంగా చాలెంజింగ్, అల్గారిథమిక్‌ పజిల్స్‌ను ఎదుర్కొంటారు. మొత్తం అయిదు రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్‌ ప్రత్యేకం. ప్రతిదానిలో కొత్త చాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌: ఇది 27 గంటలపాటు సాగుతుంది. కనీస క్వాలిఫయింగ్‌ పాయింట్లను వీలైనంత తక్కువ సమయంలో సాధించాల్సి ఉంటుంది. అలా అర్హత సాధించినవారిని రౌండ్‌-1కు పంపుతారు. మొత్తంగా 1500 మంది ఇక్కడి నుంచి రౌండ్‌-1కు ఎంపికవుతారు.

రౌండ్లు- 1, 2, 3: ప్రతి రౌండ్‌లోనూ మళ్లీ సబ్‌ రౌండ్లు ఉంటాయి. కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. రౌండ్‌ పెరిగేకొద్దీ అభ్యర్థుల వడపోత ఉంటుంది. వీటన్నింటినీ విజయవంతంగా పూర్తిచేసినవారిలో మొదటి 25 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. మొదటి నాలుగు రౌండ్లూ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పాల్గొనే వీలుంది. ప్రతి రౌండూ దేనికదే ప్రత్యేకం. 

ఫైనల్‌: తుది రౌండ్‌కు 25 మందిని ఎంపిక చేస్తారు. గత ఏడాది వరకూ ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక ప్రదేశంలో కోడ్‌ జామ్‌ ఫైనల్‌ను నిర్వహించేవారు. ఈసారి దీనినీ వర్చువల్‌ విధానంలోనే నిర్వహించనున్నారు.16 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవారెవరైనా పాల్గొనవచ్చు. ఫైనల్‌ రౌండ్‌కు 18 అంతకన్నా వయసు ఉన్నవారినే అనుమతిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఫిబ్రవరి 16, 2021 నుంచి ప్రారంభమవుతుంది. 

దరఖాస్తు చివరితేదీ: మార్చి 28, 2021 

క్వాలిఫికేషన్‌ రౌండ్‌: మార్చి 26 నుంచి మార్చి 28 వరకు (27 గం.)

క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో కనీసం ఒక సబ్‌మిషన్‌ చేసినా సర్టిఫికెట్‌ను అందజేస్తారు. మొదటి 1000 ర్యాంకులు సాధించినవారికి టీషర్ట్‌లు అందజేస్తారు. ఫైనల్‌కు చేరిన 25 మందికీ నగదు బహుమతులుంటాయి. మొదటి మూడు స్థానాలు సాధించినవారికి వరుసగా 15,000, 2,000, 1,000 డాలర్లూ, 4- 25 స్థానాల వారికి 100 డాలర్లు అందజేస్తారు. 

Posted Date : 03-02-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌