• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్ర‌భుత్వ ఉద్యోగం ఇలా.. ప‌ట్టేద్దాం!

వ‌చ్చేస్తున్నాయ్ నోటిఫికేష‌న్లు మీరు సిద్ధ‌మేనా?
 

ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. తెలుగు రాష్ట్రాల్లో కొలువుల నియామకాలపై అధికారికంగా వచ్చిన వార్తలతో వీరిలో ఆశాజనకమైన ఉత్సాహ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి సానుకూల నేపథ్యంలో నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చినా విజయాన్ని సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను పకడ్బందీగా రచించుకోవాలి, అమలుచేయాలి. ఉద్యోగ సాధనకు చేయాల్సిన కృషి దీర్ఘకాలికమని గ్రహించాలి. అభ్యర్థుల ప్రిపరేషన్‌ ఫలవంతమయ్యేందుకు ఉపకరించే కొన్ని ముఖ్య విషయాలను పరిశీలిద్దాం!
 

‘తెలంగాణలో 50 వేల ఉద్యోగాలు’ ‘ఆంధ్రప్రదేశ్‌లో బ్యాక్‌ లాగ్‌ డీఎస్‌సీ, అనంతరం డీఎస్‌సీ, శాంతి భద్రతలకు సంబంధించి పోలీస్‌ ఉద్యోగాల నియామకం’
 

రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగార్థులు తమ లక్ష్యం సాధించేందుకు కింది విషయాలను గమనించి, అనుసరిస్తే ప్రయోజనకరం.
 

రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అధికారికంగా ఇలాంటి ప్రకటనలు చేయడంతో ఉద్యోగార్థులు సంబరపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రకటనలు గమనిస్తే విద్య, వైద్యం, శాంతిభద్రతలు, ఇంకా దిగువ స్థాయి పాలనకు సంబంధించిన కొలువులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల రెండు రాష్ట్రాల్లో అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్‌ని ఆశించవచ్చు. శాంతి భద్రతల నిర్వహణకు సంబంధించిన సబ్‌ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ మొదలైన ఉద్యోగాలకూ నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పరిపాలన ఉద్యోగాలయిన గ్రూప్‌-1లో దాదాపు 100- 300, గ్రూప్‌-2లో 1000-1500 ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌ విభాగాల్లో కూడా ఆయా శాఖల్లో వందల సంఖ్యలో ఉద్యోగాలు రావొచ్చు. పరిపాలన వికేంద్రీకరణ దశలో భాగంగా గ్రూప్‌-3 ఉద్యోగాలు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 
 

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సంబంధించినంతవరకు బ్యాక్‌ లాగ్‌ నోటిఫికేషను, వాటి పరీక్షలు దాదాపుగా పూర్తికావచ్చాయి. అందుకే ప్రభుత్వ సూచన మేరకు కొత్త నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వస్తాయని భావించవచ్చు. 
 

ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం- తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల అంచనా కింది విధంగా ఉంది.
 

పోలీసు శాఖ: 19,910
ఉపాధ్యాయులు: 16,000
వ్యవసాయం: 1740
పశు సంవర్థకం: 1500
బీసీ వెల్ఫేర్‌: 1027
మునిసిపల్‌: 1533
ఎస్‌సీ, ఎస్‌టీ: 350
ఇతర శాఖలు: 4,000
 

దీర్ఘకాలిక సన్నద్ధత 
ప్రిపరేషన్‌ను దీర్ఘకాలిక ప్రాతిపదికన కొనసాగించినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతారు. చాలామంది అభ్యర్థులు అప్పటికప్పుడు ఏదో ఒక కోచింగ్‌ సెంటర్‌ని ఆశ్రయించుకుని పరీక్షకు రెండు మూడు నెలల ముందు చదువుకోవచ్చులే అని భావిస్తారు. అలాగే చేస్తారు. గ్రూప్‌-1 పరీక్షకు కనీసం ఒక సంవత్సరం, గ్రూప్‌-2కి 9నెలలు, డీఎస్సీ, ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్‌ లాంటి పరీక్షలకు ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌ అవసరం. ఇతర పరీక్షలకు కూడా కనీసం ఆరు నెలల పాటు సమయాన్ని వెచ్చించినప్పుడే ఆశించిన లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంటుంది.
 

మార్గదర్శకత్వం
పోటీ పరీక్షల్లో అనుభవం ఉన్నవారి నుంచి సరైన మార్గదర్శకత్వం పొందితే శ్రమ తగ్గుతుంది, సమయం కలిసివస్తుంది. వ్యాపార ధోరణితో వ్యవహరించే కోచింగ్‌ సెంటర్ల కంటే గతంలో ఈ పరీక్షల్లో విజయం సాధించినవారు చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అవరోధాలు పరిష్కరించుకోవడంలో, తప్పులు తగ్గించుకోవడంలో నిర్మాణాత్మకంగా ముందుకెళ్లడానికి ఇటువంటి మార్గదర్శకత్వం ఉపకరిస్తుంది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ అభ్యర్థులు చేసుకుని కృషిని ప్రారంభించాలి.
 

ఒక కొలువుపైనే దృష్టి
రాబోయే రోజుల్లో ఒకటికంటే ఎక్కువ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ‘నాలుగు రాళ్ళు వేస్తే ఏదో ఒకటి తగులుతుందిలే’ అనే నమ్మకాన్ని పక్కనపెట్టి ఒక ఉద్యోగ నోటిఫికేషన్‌పైనే పూర్తి ఏకాగ్రత నిలపటం సమంజసం. ప్రస్తుత పోటీలో ఇది అత్యంత అవసరం కూడా. టెట్‌ అర్హత పొందిన వ్యక్తి డీఎస్‌సీ రాయవచ్చు. అదే సందర్భంలో ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్‌కి పోటీ పడవచ్చు. గ్రూప్‌-2, గ్రూప్‌-1  లాంటి పరీక్షలు కూడా రాయవచ్చు. ఇలా బహుళ అవకాశాలు ఉన్నాయి కదా అని అన్నిటినీ కలిపి ఎదుర్కొందాం అనేది హేతుబద్ధమైన ఆలోచన ఎంత మాత్రం సరికాదు. కచ్చితంగా ఏ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉందో ఖాళీలను బట్టీ, పోటీని బట్టీ సరైన అంచనా వేసుకుని దానిపైనే పూర్తి ఏకాగ్రత నిలపాలి. అదే సందర్భంలో పోటీకి కావలసిన సామర్థ్యాలున్నాయా లేదా అని పూర్తిగా విశ్లేషించుకోవడం చాలా అవసరం.
 

పోటీ తీరు
అకడమిక్‌ అధ్యయన పద్ధతులు వదలాలి. పోటీ పరీక్షల తాత్వికతని సరిగా అర్థం చేసుకోవాలి. అకడమిక్‌ పరీక్షల్లో దాదాపుగా పుస్తకాల్లో ఉన్న సమాచారంపై పట్టు ఉంటే మంచి మార్కులు ఎప్పుడూ వస్తాయి. దానికి కారణం- ఆ పుస్తకము ఆధారంగానే ప్రశ్నలు ఉంటాయి గనుక. అందువల్ల ఆ పరీక్షల్లో బట్టీ పట్టినవారికి కూడా మంచి మార్కులు వస్తాయి. అయితే పోటీ పరీక్షల్లో స్థూలంగా సిలబస్‌ వివరణ ఉంటుంది కానీ స్థిరంగా ఇవే పుస్తకాలు చదవాలంటూ ఉండదు. అందువల్ల ఎవరో సిఫార్సు చేశారని ఏదో ఒక పుస్తకాన్ని ఆధారం చేసుకుని పూర్తిగా దానితోనే మమేకమైతే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇచ్చిన సిలబస్‌లోని వివిధ అంశాలకు సంబంధించి భావనాత్మకమైన అధ్యయనంతో పాటు అవగాహన పెంచుకోవాలి. అప్పుడే పరీక్షల్లో ఏ విధమైన ప్రశ్నలు వచ్చినా గానీ సమాధానాలు కచ్చితంగా ఇవ్వగలుగుతారు. సిలబస్‌ అంశాల్లో భావనాత్మక వికాసం కలిగేందుకు పాఠశాల పుస్తకాలతోపాటు కొన్ని  అంశాల విషయంలో పీజీ స్థాయి పుస్తకాలూ చదవాల్సి ఉంటుంది.. చదివిన అంశాల అనువర్తనకు ప్రాధాన్యం ఇస్తూ అధ్యయనం చేయాలి.
 

ముందుగానే మెయిన్స్‌
కొన్ని ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లోనూ ప్రిలిమ్స్, మెయిన్స్‌  దశలు ఉంటున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్, గ్రూప్‌-2, పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్‌ ఉన్నాయి. తెలంగాణలో కూడా కొన్ని పరీక్షలు ఇదే పద్ధతిలో ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో అభ్యర్థులు ముందుగా మెయిన్‌ సిలబస్‌పై దృష్టి పెట్టి విస్తృతంగా ప్రిపేర్‌ అవ్వడం అనేది సరైన నిర్ణయం. ‘ప్రిలిమ్స్‌ పాస్‌ అయితే మెయిన్స్‌లో సిలబస్‌ని ఆ స్థాయిలో లోతుగా చదువుదాం’ అనే ధోరణి మంచిది కాదు. ముందస్తుగానే మెయిన్స్‌ ప్రిపేర్‌ అయితే ప్రిలిమ్స్‌ చాలా తేలిక అవుతుంది!
 

సబ్జెక్టుపై పట్టు
జూనియర్, డిగ్రీ, పాలిటెక్నికల్‌ లెక్చరర్లు, ఇంజినీరింగ్‌ ఉద్యోగాల్లో ప్రధానంగా వారి సబ్జెక్టే విజయానికి కారణం అవుతూ వస్తుంది. అందువల్ల ముందస్తుగా ఆ సబ్జెక్టుపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. తర్వాత జనరల్‌ స్టడీస్‌పై దృష్టి సారించాలి. జనరల్‌ స్టడీస్‌ అనేది అతిపెద్ద పరిధి కలిగిన విషయాల కలయిక. వాటిలో ఎంపిక చేసుకున్న కొన్ని అంశాలపై ముందస్తుగా దృష్టి పెట్టాలి. తద్వారా అభ్యర్థికి కచ్చితమైన స్కోరు లభిస్తుంది. అనంతరం మిగతా విషయాల మీద దృష్టి పెడితే సరిపోతుంది.
 

సొంత నోట్సు తయారీ
గ్రూప్‌-1, 2 లాంటి పరీక్షలకు సంబంధించి సొంత నోట్సు తయారీ చాలా ప్రధానమైన అంశం. వివిధ పుస్తకాల నుంచి సమాచారాన్ని ఒకే దగ్గరకి తెచ్చుకుని చదవటం వల్ల అభ్యర్థులకు ఈ పరీక్షల్లో బహుళ ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి నోటిఫికేషన్‌ రావడానికి ముందుగానే ఈ విధంగా సొంత నోట్సు తయారీకి సమయాన్ని వెచ్చించడం శ్రేయస్కరం. డీఎస్‌సీ లాంటి పరీక్షలో అయితే సిలబస్‌లో నిర్దేశించిన పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఆయా పుస్తకాలకే పరిమితమై చదవటం అధిక ప్రయోజనకరం. ఎంచుకున్న పరీక్షను బట్టి ఏ విధమైన ధోరణితో, పద్ధతితో ప్రిపేర్‌ అవ్వాలనేది ఉంటుంది. అందుకని సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
 

ప్రాధాన్య క్రమం
ప్రతి ఉద్యోగానికి సంబంధించిన పరీక్షల్లో కొన్ని పేపర్లు స్కోరింగ్‌గా ఉంటాయి. క్లిష్టతతో ఉంటాయి. అలాంటివాటిపై ముందు దృష్టి పెడితే సన్నద్ధత సులభమవుతుంది. ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్‌ పరీక్షలో జనరల్‌ ఇంగ్లిష్, అరిథ్‌మెటిక్, లాజికల్‌ రీజనింగ్‌ లాంటి విభాగాలు విజేతలు అయ్యేందుకు ప్రధాన అంశాలుగా ఉంటాయి. డీఎస్‌సీ లాంటి పరీక్షలో సైకాలజీ, మెథడాలజీ, ఫిలాసఫీ లాంటివి అభ్యర్థి అంతిమ ఫలితాన్ని నిర్దేశిస్తాయి. ఇలా ప్రతి పోటీ పరీక్షకు సంబంధించిన కోర్‌ టాపిక్స్‌ని గమనించుకుని వాటిపై   ముందుగా దృష్టిపెడితే అనంతరం సులభమయ్యే విధంగా ప్రయాణం ఉంటుంది. కాబట్టి అనుభవజ్ఞులను సంప్రదించి ముందస్తుగా ఏ విషయాలపై దృష్టి పెట్టాలో, ఆపై వేటిపై దృష్టి సారించాలో ప్రణాళిక వేసుకుంటే, అది అంతిమ విజయాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు.


 

Posted Date : 15-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌