• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంట‌ర్, డిగ్రీతో స‌ర్కారీ కొలువులు

‣  నేష‌న‌ల్ వాట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీలో ఖాళీలు

‣  ప్ర‌క‌ట‌న విడుదల చేసిన సంస్థ‌

సర్కారీ కొలువుల కోసం ప్రయత్నించేవారికి నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆహ్వానం పలుకుతోంది. సంస్థ తాజాగా వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టును బట్టి పన్నెండో తరగతి, డిగ్రీ చదివినవారు అర్హులు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌డబ్ల్యూడీఏ స్వయం ప్రతిపత్తి సంస్థ. ఇది జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తాజాగా జూనియర్‌ ఇంజినీర్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 62.

ఖాళీలు - అర్హతలు

జూనియర్‌ ఇంజినీర్‌: 16 ఖాళీలు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.

హిందీ ట్రాన్స్‌లేటర్‌: 1

గుర్తింపు పొందిన సంస్థ నుంచి హిందీలో మాస్టర్స్‌ పూర్తిచేసుండాలి. అలాగే ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చదివుండాలి. హిందీ మాధ్యమంలో చదివినవారైనా అర్హులే. వీటితోపాటు హిందీ నుంచి ఇంగ్లిష్‌/ ఇంగ్లిష్‌ నుంచి హిందీ ట్రాన్స్‌లేషన్‌ డిప్లొమా లేదా సర్టిఫికేషన్‌ కోర్సు చేసుండాలి. కేంద్ర, రాష్ట్ర లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో అనువాదం చేసిన అనుభవం ఉండాలి.

జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌: 5 ఖాళీలు

గుర్తింపు పొందిన సంస్థ నుంచి కామర్స్‌ డిగ్రీతోపాటు ప్రభుత్వ సంస్థల్లో క్యాష్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగంలో మూడేళ్ల అనుభవముండాలి. సీఏ/ఐసీడబ్ల్యూఏఐ/ కంపెనీ సెక్రటరీ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.

అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌: 12 ఖాళీలు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్, ఎంఎస్‌ వర్డ్, ఎంఎస్‌ ఆఫీస్, ఎంఎస్‌ ఎక్స్‌ఎల్, ఎంఎస్‌ పవర్‌పాయింట్, ఇంటర్నెట్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

స్టెనోగ్రాఫర్‌ (గ్రేడ్‌-2): 5 ఖాళీలు

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు అర్హులు. కంప్యూటర్, షార్ట్‌హ్యాండ్‌ తెలిసుండాలి. నిమిషానికి 80 పదాలు టైప్‌ చేయగలగాలి. 

లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 23 ఖాళీలు

గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌ పూర్తిచేసుండాలి. నిమిషానికి ఇంగ్లిష్‌ 35 పదాలు లేదా హిందీ 30 పదాలు టైప్‌ చేయగల సామర్థ్యముండాలి. కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్, ఎంఎస్‌ వర్డ్, ఎంఎస్‌ ఆఫీస్, ఎంఎస్‌ ఎక్స్‌ఎల్, ఎంఎస్‌ పవర్‌పాయింట్, ఇంటర్నెట్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

వ‌యో పరిమితి: జూనియర్‌ ఇంజినీర్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, స్టెనోగ్రాఫర్, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌లకు 18 నుంచి 27 ఏళ్లు. హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌లకు 21-30 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీలకు అయిదేళ్లు, ఓబీసీవారికి మూడేళ్లు, వికలాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు వ‌యో పరిమితిలో సడలింపు ఉంది.

జీతభత్యాలు: జూనియర్‌ ఇంజినీర్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్, హిందీ ట్రాన్స్‌లేటర్‌లకు లెవల్‌-6 స్థాయి మూలవేతనం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకూ చెల్లిస్తారు. జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్‌లక లెవల్‌-4 స్థాయి మూలవేతనం రూ.25,500 నుంచి రూ.81,100 వరకూ ఉంటుంది. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌లకు లెవల్‌ 2 స్థాయి మూలవేతనం రూ.19,900 నుంచి రూ.63,200 వరకూ ఉంటుంది.

ఎంపిక: జూనియర్‌ ఇంజినీర్, హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ హోదాలకు ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు.స్టెనోగ్రాఫర్, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌లకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షతోపాటు స్కిల్‌ టెస్ట్‌ (షార్ట్‌హ్యాండ్‌/ టైపింగ్‌)నూ నిర్వహిస్తారు. 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీవారికి రూ.840, ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలు, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరీల వారికి రూ.500. ఈమెయిల్‌ ఆధారంగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేసుకునే వీలుంది. వాటన్నింటికీ విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ ఎంపికైనవారిని రాతపరీక్షకు ఈమెయిల్‌ ద్వారా ఆహ్వానిస్తారు. 

ద‌ర‌ఖాస్తుల‌కు తుది గ‌డువు: జూన్‌ 25, 2021


పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nwda.gov.in

Posted Date : 18-05-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌