• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మాక్‌ టెస్టులతో మేలు ఎంత?

అభ్యర్థులను విజేతలుగా నిలపడానికి ఎక్కువగా తోడ్పడేవి నమూనా పరీక్షలే! నాటక ప్రదర్శనకు రిహార్సల్స్‌ ఎంత ముఖ్యమో.. పోటీ పరీక్షల్లో నెగ్గటానికి మాక్‌ టెస్టులూ అంతే అవసరం!  

డిగ్రీ చదివిన ప్రదీప్‌ పోటీ పరీక్షలు రాస్తూనే ఉన్నా.. నెగ్గలేకపోతున్నాడు.  ఒకరోజు తన స్నేహితుడు రవిని కలిసి బాధను పంచుకున్నాడు. ఇప్పటివరకు ఎన్ని నమూనా పరీక్షలు రాశావని రవి ప్రదీప్‌ను అడిగాడు. ఒక్కటీ రాయలేదన్న సమాధానంతో ఆశ్చర్యపోయాడు. తను పోటీ పరీక్షలకు సన్నద్ధమైనపుడు రాసిన మాక్‌ టెస్టులు తన విజయానికెంతో తోడ్పడ్డాయని చెప్పాడు.  నమూనా పరీక్షల ద్వారా అభ్యర్థులు తమ శక్తి సామర్థ్యాలను విశ్లేషించుకుని ఒక అంచనాకు రావచ్చు. చేసిన తప్పులు పరీక్షలో దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

విశ్లేషించుకునే అవకాశం 

పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులందరూ సాధన చేస్తారు. కానీ అది ఎంత సమర్థంగా ఉందో, దాంట్లో ఇంకా ఎలాంటి మార్పులూ, చేర్పులు చేసుకోవాలనే విషయాలు తెలియవు. నమూనా పరీక్షలు రాయడం వల్ల  ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని వాటి సాధన మొదలుపెట్టొచ్చు. అంటే ఈ పరీక్ష ద్వారా ప్రతిభను స్వయంగా విశ్లేషించుకుని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. 

అవగాహన పెరుగుతుంది

పోటీ పరీక్షలకు హాజరయ్యేముందు ఎన్నో సందేహాలు వేధిస్తుంటాయి. ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది, పరీక్షను పూర్తి చేయడానికి సమయం సరిపోతుందా.. లాంటి సందేహాలెన్నో వస్తుంటాయి. వీటన్నింటికీ సమాధానాలు మాక్‌ టెస్టులు రాయటం ద్వారా గ్రహించవచ్చు.  

వివిధ వ్యూహాలు

ఒక్కో మాక్‌ టెస్టులో ఒక్కో వ్యూహాన్ని అనుసరించవచ్చు. ఏ వ్యూహాన్ని అనుసరించడం వల్ల సమయం వృథా కాకుండా ఉంటుందో, ప్రశ్నలన్నింటికీ సమాధానాలు  రాయగలుగుతున్నారో తెలుసుకోవచ్చు. ఇలా వివిధ రకాలుగా ప్రయోగాలు చేసే అవకాశం దొరుకుతుంది. చివరగా మెరుగైన వ్యూహాన్ని ఎంచుకుని పరీక్షలో అనుసరించవచ్చు. 

సమయపాలన 

సాధారణంగా పోటీపరీక్షల్లో ఒక సెక్షన్‌ను పూర్తిచేయడానికి ఎక్కువ సమయం, మరో సెక్షన్‌కు తక్కువ సమయం తీసుకోవచ్చు. ఈ పరీక్ష రాయడం వల్ల ఒక్కో సెక్షన్‌కు సరిగ్గా ఎంత సమయం కేటాయించాలనే విషయంలో ఒక అవగాహనకు రావచ్చు. దీని ప్రకారం సమయాన్ని విభజించుకోవచ్చు. అలాగే కొంచెం సమయం మిగిలేలానూ ప్రణాళిక వేసుకుంటే ఆ సమయంలో కాస్త క్లిష్టంగా ఉన్న ప్రశ్నలకు జవాబులు రాయొచ్చు.

బలాలు, బలహీనతలు

రెండు, మూడు మాక్‌ టెస్టులు రాసిన తర్వాత ఏ సెక్షన్‌ పూర్తిచేయడం క్లిష్టంగా ఉందో, ఏది సులువుగా ఉందో అనే విషయంలో స్పష్టత వచ్చేస్తుంది. ఏయే అంశాల మీద మరింత పట్టు సాధించాలో తెలుస్తుంది. ఆయా అంశాలను శ్రద్ధగా సాధన చేస్తే పరీక్షలో విజయం సాధించగలుగుతారు. 

పురోగతి అంచనా 

తరచూ మాక్‌ టెస్టులు రాయడం వల్ల అభ్యర్థులు సన్నద్ధతలో తమ ప్రగతిÄని అంచనా వేసుకోవచ్చు. కొంతకాలం తర్వాత ఎలాంటి మెరుగుదల కనిపించిందో కూడా తెలుసుకోవచ్చు. చేస్తున్న తప్పులను గుర్తించి, అవి పదేపదే దొర్లకుండానూ జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒక ప్రణాళిక ప్రకారం సాధన చేసి పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. 

ఒత్తిడి మాయం

కొంతమంది పరీక్ష ముందు చాలా ఒత్తిడికి గురవుతుంటారు. మరికొందరు అప్పటివరకు చక్కగా చదివిన అంశాలను కూడా మర్చిపోతుంటారు. ఇలాంటి ఇబ్బందుల బారిన పడకుండా నమూనా పరీక్షలు కాపాడతాయి. వీటిని రాయడం వల్ల పరీక్షలు రాయడం అలవాటై ఒత్తిడీ మాయమవుతుంది. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదే నమ్మకంతో అసలైన పరీక్షనూ రాస్తే విజయం సొంతం అవుతుంది.  
 

Posted Date : 21-10-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌