• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IDBI: గ్రాడ్యుయేట్ల‌కు ఐడీబీఐ ఆహ్వానం!

920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ప్ర‌క‌ట‌న‌

మూడేళ్ల ఒప్పంద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ

సమాజంలో బ్యాంకు ఉద్యోగులకు మంచి గుర్తింపు ఉంది. ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. పని దినాలు, పని గంటల్లో అనుకూలమైన సౌలభ్యం ఉంటుంది. విధుల్లో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ అందే ప్రయోజనాల ముందు అదంత కష్టంగా అనిపించదు. దీంతో చాలా మంది గ్రాడ్యుయేట్లు బ్యాంకు కొలువులకు గురి పెడుతున్నారు. దేశంలోని జాతీయ స్థాయి బ్యాంకుల నుంచి, గ్రామీణ స్థాయి బ్యాంకుల వరకు ఏటా వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడుతున్నాయి. తాజాగా ఇండస్ట్రియల్ డెవ‌ల‌ప్‌మెంట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఏ).. 920 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను ఐడీబీఐ మూడేళ్ల‌ఒప్పంద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తోంది. అనంత‌రం ఉద్యోగుల ప‌నితీరు ఆధారంగా బ్యాంకు అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించే అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల ప‌రీక్ష‌లో అర్హ‌త సాధిస్తే అసిస్టెంట్ మేనేజర్‌గా శాశ్వ‌త ఉద్యోగాన్ని పొందవచ్చు. 

అర్హత ఏమిటి?

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 55శాతం మార్కులతో డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులు సాధిస్తే చాలు. వయసు జులై 1, 2021 నాటికి 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల గరిష్ఠ వయసు పరిమితి, ఇతర బీసీ (నాన్ క్రిమీ లేయర్)లకు గరిష్ఠంగా 3 ఏళ్ల మినహాయింపు ఉంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ఠంగా పదేళ్ల వయో పరిమితి మినహాయింపు ల‌భిస్తుంది. 

ఎంపిక ఎలా చేస్తారు?

ద‌ర‌ఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్య‌ర్థుల‌కు ఆన్‌లైన్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. అందులో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారికి ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌, వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్‌, వైద్య ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించిన వారిని షార్ట్ లిస్ట్ చేసి తుది ఎంపిక‌లు చేప‌డ‌తారు. 

జీతభత్యాలు ఎలా?

మొదటి ఏడాది (నెలకు) రూ.29000, రెండో ఏడాది రూ.31000, మూడో ఏడాది రూ.34000 చెల్లిస్తారు. ఇత‌ర అల‌వెన్సులు ఉండవు. 

ద‌ర‌ఖాస్తు విధానం?

అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ప‌రీక్ష రుసుము ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇత‌రులు రూ.1000 చెల్లించాలి. ద‌ర‌ఖాస్తుల‌కు ఆగ‌స్టు 18 తుది గ‌డువు. 

ప‌రీక్ష‌లో ఏముంటుంది?

ఆన్‌లైన్ ప‌రీక్ష‌ను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మూడు విభాగాలంటాయి. ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. టెస్ట్‌ ఆఫ్ రీజనింగ్ (50 ప్రశ్నలు, 50 మార్కులు), టెస్ట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇంగ్లిష్‌లాంగ్వేజ్‌ (50 ప్రశ్నలు, 50 మార్కులు), టెస్ట్‌ ఆఫ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌(50 ప్రశ్నలు, 50 మార్కులు). పరీక్షా సమయం గంట‌న్న‌ర‌ ఉంటుంది. ఇందులో రుణాత్మ‌క మార్కులుంటాయి.  త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం. 

తెలంగాణ‌: హైద‌రాబాద్, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.

స‌న్న‌ద్ధ‌త ప్ర‌ణాళిక‌

ఇప్ప‌టికే బ్యాంకు ఉద్యోగాల‌కు సన్న‌ద్ధం అవుతున్నవారు ఈ ప‌రీక్ష‌ను అల‌వోక‌గా ఎదుర్కోవ‌చ్చు. ఎందుకంటే వాళ్లు ఎస్‌బీఐ, ఐబీపీఎస్ త‌దిత‌ర నోటిఫికేష‌న్లకు సంబంధించి ప్రిప‌రేష‌న్ పూర్తి చేశారు. ఐడీబీఐ ప‌రీక్ష‌కు దాదాపు నెల రోజుల స‌మ‌యం ఉంది. ఇప్ప‌టికే స‌న్న‌ద్ధం అవుతున్న వారు ఈ స‌మ‌యంలో మ‌రింత ప‌క‌డ్బందీగా సాధ‌న చేయాలి. ఇత‌ర ప‌రీక్ష‌లతో పోలిస్తే ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ ప‌రీక్ష‌లో 150 ప్ర‌శ్న‌ల‌ను 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ న‌మూనా టెస్టులు రాస్తే త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ స‌మాధానాలు గుర్తించ‌వ‌చ్చు. ఇక కొత్తగా ప్రిప‌రేష‌న్ మొద‌లు పెడుతున్న వారు కూడా రీజ‌నింగ్‌, ఇంగ్లిష్‌, ఆప్టిట్యూడ్ విభాగాల‌పై క‌స‌ర‌త్తు చేయ‌డానికి నెల రోజుల స‌మ‌యం స‌రిపోతుంది. అయితే ఆల‌స్యం చేయ‌కుండా వీలైనంత త్వ‌రగా ప్ర‌ణాళిక ర‌చించుకోవాలి. అందుకు అనుగుణంగా స‌న్న‌ద్ధ‌త ప్రారంభిస్తే ప‌రీక్షలో వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించ‌వ‌చ్చు. 


సిల‌బ‌స్‌

రీజనింగ్: ఇందులో అభ్యర్థుల తార్కిక ఆలోచనా విధానాన్ని పరిశీలిస్తారు. సంఖ్యలు, డిజైన్ల మధ్య సంబంధాలను ఎలా అర్థం చేసుకుంటున్నారో చూస్తారు. కోడింగ్, డీ-కోడింగ్, అనాలజీ, సిరీస్, డైరెక్షన్స్, సీటింగ్ అరెంజ్ మెంట్స్, రక్తసంబంధాలు, ర్యాంకింగ్, పజిల్స్, ఆల్ఫాబెట్ టెస్ట్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. వీలైనంత సాధన చేస్తే ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవ‌చ్చు. మిర్రర్ ఇమేజెస్, బొమ్మలతో కూడిన ప్రశ్నలు వ‌స్తాయి.

ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఈ విభాగంలో అభ్యర్థికి సాధారణ ఆంగ్లభాషపై ఉన్న  పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు.  రీడింగ్ కాంప్ర‌హెన్ష‌న్‌, క్లోజ్ టెస్ట్‌, సెంటెన్స్ అరేంజ్‌మెంట్స్, సెంటెన్స్ క‌రెక్ష‌న్స్‌, జంబుల్డ్ సెంటెన్స్ అంశాల‌నుంచి ప్రశ్నలుంటాయి. గ్రామ‌ర్ రూల్స్‌, ఒకాబులరీ, యాంటనిమ్స్, సిన‌నిమ్స్‌పై దృష్టి పెట్టాలి. గ్రామ‌ర్‌పై పట్టు సాధిస్తే ప‌రీక్ష‌లో వచ్చే ప్రశ్నలకు సుల‌భంగా స‌మాధానాల‌ను గుర్తించవచ్చు. 

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థి తార్కిక, విశ్లేషనాత్మక, పరిమాణాత్మక నైపుణ్యాలకు ఇది ప‌రీక్ష‌. సమస్యలను పరిష్కరించడంలో సామర్థ్యం, అంకెలు, సంఖ్యలపై పట్టు, గణిత నైపుణ్యాలను పరిశీలిస్తారు. ప్రతిరోజూ సాధన చేస్తేనే ఇందులో సఫలమవుతారు. ఈ విభాగంలో సమాధానాలను గుర్తించడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మిగతా వాటిని త్వరగా పూర్తి చేసి దీనికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.  గణితంలో కీలక భావనలైన కూడికలు, తీసివేతలు, భాగహారాల వంటి వాటిపై పట్టు సాధించాలి. నిష్పత్తులు, శాతాలు, వర్గమూలాలు, ఘనమూలాలు, లాభ-నష్టాలు, కాలం-పని, కాలం-దూరం మొదలైన అంశాలను ప్రాథమిక స్థాయి నుంచి ప్రాక్టీస్ చేయాలి. 

ప‌రీక్ష తేదీ: సెప్టెంబ‌ర్ 5, 2021

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

Posted Date : 06-08-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌