• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐసర్‌లో చేరదాం రండి!

బీఎస్ఎమ్మెస్, బీఎస్ ప్రవేశాలకు ప్రకటన విడుదల 

‣ అర్హత: 10+2/ తత్సమాన ఉత్తీర్ణత

పరిశోధనలకు దేశంలోనే పేరొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(ఐఐఎస్ఈఆర్)లో చేరాలనుకునే వారికి శుభవార్త. శాస్త్రవేత్త కావాలనుకునే మీ కలలను సాకారం చేసుకునేందుకు ఐసర్ అవకాశం కల్పిస్తోంది. సైన్స్లో ఐదేళ్ల బీఎస్ఎమ్మెస్(డ్యుయల్ డిగ్రీ), నాలుగేళ్ల ఇంజినీరింగ్ సైన్స్ అండ్ ఎకనామిక్ సైన్సెస్(బీఎస్) డిగ్రీలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.

భారత మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఐసర్‌లో నిత్యం సైన్స్కు సంబంధించిన పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. దేశంలోని ఏడు చోట్ల ఈ క్యాంపస్లు ఉన్నాయి. బెరహంపూర్ (ఒడిశా), భోపాల్ (మధ్యప్రదేశ్), కోల్కతా (పశ్చిమబెంగ), మొహాలీ (పంజాబ్), పుణె (మహారాష్ట్ర), తిరువనంతపురం (కేరళ), తిరుపతి (ఆంధ్రప్రదేశ్)లో ఇవి కొలువుదీరాయి. అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలు సంస్థల ప్రత్యేకత. 

అర్హతలు

కోర్సుల్లో చేరడానికి 2020/2021లో 10+2/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) ఫెలోషిప్ పొందిన వారు కూడా అర్హులే. జేఈఈ అడ్వాన్స్కామన్ ర్యాంకింగ్స్లో పది వేల కంటే తక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డు(ఎస్సీబీ) మార్గంలో 10+2 లో సైన్స్ విభాగంలో సంబంధిత బోర్డు నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించినవారు అర్హులు. 

ఎంపిక విధానం

ఈ విద్యాసంస్థల్లో 50 శాతం సీట్లను కేవీపీవై, జేఈఈ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో మిగిలిన సీట్లతోపాటు మరో 50 శాతం సీట్లను ఎస్సీబీ విధానంలో అర్హత పొందిన విద్యార్థులకు ఐసర్ప్రత్యేక ఆప్టిట్యూడ్ టెస్ట్లో ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు. దీనికి ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల పాఠ్యాంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. 

పరీక్ష ఇలా..

ఆప్టిట్యూట్ టెస్ట్ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. దీన్ని సెప్టెంబర్ 17న నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి ప్రశ్నలడుగుతారు. ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో ప్రశ్నలన్నీ విద్యార్థుల విశ్లేషణ, తార్కిక సామర్థ్యాలను పరీక్షించేలా ఉంటాయి. ఐఐటీ-జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్ స్థాయిలో వస్తాయి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు

దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో 17 కేంద్రాల్లో నిర్వహిస్తారు. వాటిలో అనంతపురం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్ ఉన్నాయి. 

దరఖాస్తు విధానం

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.1000, ఇతరులు రూ.2000 చెల్లించాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 31, 2021.

వెబ్‌సైట్‌: http://www.iiseradmission.in/

నెస్ట్‌తో...

నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌)లో మెరిసినవారు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైసర్‌), భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు చదువుకోవచ్చు. కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.5000 చొప్పున అయిదేళ్లపాటు ఉపకార వేతనాలు చెల్లిస్తారు.  

నైసర్‌లో 200, సీఈబీఎస్‌లో 57 సీట్లు ఉన్నాయి. బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కోర్సులు అందిస్తున్నారు. ఈ సంస్థల్లో చేరినవారికి అయిదేళ్లపాటు ప్రతి నెలా రూ.5000 స్టైపెండ్‌ అందుతుంది. వేసవిలో ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున కాంటింజెన్సీ ఇస్తారు. అన్ని సెమిస్టర్లలోనూ మేటి ప్రతిభ చూపిన విద్యార్థులకు భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ట్రెయినింగ్‌ స్కూల్‌లో పరీక్ష రాయకుండానే ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అనుమతిస్తారు. ఇలా ఎంపికైనవారు శిక్షణ అనంతరం బార్క్‌లో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. 

ప్రశ్నపత్రం ఇలా...

రాత పరీక్షను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు. 4 సెక్షన్లలో ప్రశ్నలు వస్తాయి. (గతంలో 5 సెక్షన్లలో వీటిని అడిగేవారు. అందులో 30 మార్కులతో జనరల్‌ సెక్షన్‌ ఉండేది. ప్రస్తుతం దాన్ని తొలగించారు) అభ్యర్థికి ఆయా సబ్జెక్టుల్లో ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యాన్ని తెలుసుకునేలా ప్రశ్నలు రూపొందిస్తారు. అన్ని సెక్షన్లలోనూ కనీస మార్కులు పొందడం తప్పనిసరి. సెక్షన్‌ 1 నుంచి 4 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి. వీటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు. ఈ నాలుగింటిలో ఎక్కువ మార్కులు సాధించిన మూడు సెక్షన్ల స్కోర్‌ కలిపి మెరిట్‌ లిస్ట్‌ తయారుచేస్తారు. దీని ప్రకారం మొత్తం 150 మార్కుల్లో అభ్యర్థులు సాధించిన స్కోర్‌ పర్సంటైల్‌ విధానంలో లెక్కిస్తారు. జనరల్‌ అభ్యర్థులు 95, ఓబీసీలు 90, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 75 పర్సంటైల్‌ సాధించడం తప్పనిసరి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను కోర్సుల్లోకి తీసుకుంటారు. 

సన్నద్ధత ఇలా 

1.  ఐసర్, నెస్ట్‌ పరీక్షల్లో సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల్లోని బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్‌ అంశాల నుంచే ప్రశ్నలొస్తాయి. సబ్జెక్టులవారీ సిలబస్‌ వివరాలు ఆయా వెబ్‌సైట్లలో పొందుపరిచారు. అందులో పేర్కొన్న చాప్టర్లు, అంశాలు బాగా చదువుకుంటే పూర్తి మార్కులు పొందవచ్చు.

2.  ముందుగా ఇంటర్మీడియట్‌ బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌ పుస్తకాలు క్షుణ్నంగా చదవాలి. ప్రాథమికాంశాలూ, భావనలపై పట్టు సాధించాలి. ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. 

3.  పాత ప్రశ్నపత్రాలను అద్యయనం చేయాలి. నెస్ట్‌ వెబ్‌సైట్‌లో 2007 నుంచి 2020 వరకు నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు, సమాధానాలు అందుబాటులో ఉంచారు. ప్రతి సబ్జెక్టులోనూ ఏయే చాప్టర్ల నుంచి ఎలాంటి ప్రశ్నలు, ఎన్నేసి చొప్పున వస్తున్నాయో గమనించి, అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కావాలి.

4.  ఎంసెట్, ఐఐటీ-జేఈఈ, నీట్‌ పాత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లు సాధన చేయడం ఉపయోగకరం. 

5.  నెస్ట్‌ పరీక్షకు రెండు వారాల ముందు మాక్‌ టెస్టు నెస్ట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. దాన్ని సాధన చేయడం ప్రయోజనకరం. 
 

Posted Date : 04-07-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌