• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రఖ్యాత సంస్థల్లో.. ప్రామాణిక బోధనలో..

ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

సమాజ సంక్షేమానికి ఏది కనిపెట్టాలన్నా.. శాస్త్రవేత్తలు కావాల్సిందే. కరోనా కష్టకాలంలో వారి విలువ అందరికీ పూర్తిగా తెలిసివచ్చింది. శాస్త్రవేత్త అంటే కేవలం ఉద్యోగం, హోదా మాత్రమే కాదు. ఒక గౌరవం. వాళ్లు లేకపోతే మానవ మనుగడే లేదంటే అతిశయోక్తి కాదు. వైద్య‌, సాంకేతిక‌, ఆర్థిక‌, విద్య వంటి అనేక‌ రంగాల్లో వారి నిరంత‌ర కృషి సమాజానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తోంది. రోజురోజుకు అనంత విశ్వంలో చోటుచేసుకునే అనేక కొత్త విష‌యాలు వారు కనిపెడుతున్నవే. విపత్తులను తప్పించుకోవడం వారి శ్రమ వల్లే సాధ్యమవుతోంది. 

ఇంతటి ఉన్నత స్థానాన్ని అందుకోవాలంటే ఏం చేయాలి? అత్యున్నత ప్రమాణాలతో బోధించే ప్రఖ్యాత సంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ చేయాలి. అందుకు వీలు కల్పిస్తోంది నెస్ట్ - 2021 (నేషనల్ ఎంట్రన్స్ స్ర్కీనింగ్ టెస్ట్). ఈ ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధిస్తే ‌నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (నైస‌ర్‌‌) - భువ‌నేశ్వ‌ర్‌, యూనివ‌ర్సిటీ ఆఫ్ ముంబైలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ విభాగానికి చెందిన సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ చేసేందుకు అవ‌కాశం దక్కుతుంది. ఈ సంస్థల్లో సుదీర్ఘ అనుభవం క‌లిగిన‌ అధ్యాప‌కులు ఉన్నారు. విదేశీ శాస్త్ర‌వేత్త‌లు బోధిస్తారు. అధునాత‌న ప్ర‌యోగ‌శాల‌లు ఉన్నాయి.  2021-26 విద్యాసంవ‌త్సరంలో బ‌యాల‌జీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ స‌బ్జెక్టుల్లో పీజీ కోర్సు ప్ర‌వేశాల‌కు సంయుక్తంగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేశాయి. పరిశోధన రంగంలో రాణించాలని, సైంటిస్ట్ కావాల‌నుకునే అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. తమ కలలను సాకారం చేసుకోవచ్చు. 

కనీస అర్హ‌తలు

ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన క‌ళాశాల‌ల నుంచి 2019, 2020 సంవ‌త్స‌రాల్లో సైన్స్ విభాగాల్లో క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణులై ఉండాలి. 2021లో ఇంటర్‌ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధిస్తే చాలు. జ‌న‌ర‌ల్‌, ఓబీసీ విద్యార్థులు ఆగ‌స్టు 01, 2001 త‌ర్వాత జ‌న్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు వ‌య‌సులో అయిదేళ్ల స‌డ‌లింపు ఉంటుంది. 

ద‌రఖాస్తు ఎలా?

అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ ఫిబ్ర‌వ‌రి 24, 2021న ప్రారంభ‌మై ఏప్రిల్ 30, 2021న ముగుస్తుంది. ద‌ర‌ఖాస్తు రుసుంగా జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్య‌ర్థులు రూ.1200, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీలు రూ.600 చెల్లించాలి. నెస్ట్ దేశ వ్యాప్తంగా జూన్ 14, 2021న జరుగుతుంది. మొద‌టి సెష‌న్ ఉద‌యం 9 నుంచి 12.30 గంట‌ల వ‌ర‌కు, రెండో సెష‌న్ మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఉంటాయి. మెరిట్ జాబితాను నైస‌ర్, సీఈబీఎస్ వేర్వేరుగా రూపొందించి జూన్ 30, 2021న వెబ్‌సైట్‌లో పొందుప‌రుస్తాయి.  
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: గుంటూరు, క‌ర్నూలు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌.

ఎంపిక విధానం

నైస‌ర్‌లో 200, సీఈబీఎస్‌లో 57 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకోవాలంటే త‌ప్ప‌నిస‌రిగా నెస్ట్‌- 2021 రాయాల్సి ఉంటుంది.  ఇది ఆన్‌లైన్ ప‌రీక్ష‌. ఆబ్జెక్టివ్ విధానంలో రెండు సెష‌న్ల‌లో నిర్వహిస్తారు. బ‌యాల‌జీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల నుంచి ప్ర‌శ్న‌లుంటాయి. ఒక్కో సెక్ష‌న్‌లో 50 మార్కులుంటాయి. అభ్య‌ర్థికి ఆయా స‌బ్జెక్టుల్లో ఉన్న ప‌రిజ్ఞానం, విశ్లేష‌ణ సామ‌ర్థాన్ని ప‌రీక్షిస్తారు. అన్ని సెక్ష‌న్లలో త‌ప్పుగా గుర్తించిన స‌మాధానాల‌కు రుణాత్మ‌క మార్కులు ఉంటాయి. కొన్ని ప్ర‌శ్న‌లకు ఇచ్చిన ఆప్ష‌న్ల‌లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండవచ్చు. అన్ని సరైన సమాధానాలను గుర్తిస్తేనే మార్కు పొందుతారు. అభ్య‌ర్థులు నాలుగు సెక్ష‌న్ల‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎక్కువ మార్కులు వ‌చ్చిన మూడు సెక్ష‌న్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని రెండు ఇన్‌స్టిట్యూట్లు మెరిట్ లిస్ట్‌ను విడివిడిగా త‌యారు చేస్తాయి. మొత్తం 150 మార్కుల్లో అభ్య‌ర్థులు సాధించిన స్కోర్‌ను ప‌ర్సంటైల్ విధానంలో లెక్కిస్తారు. రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారం సీట్ల కేటాయింపు ఉంటుంది.

స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు

ఈ సంస్థ‌ల్లో ప్ర‌వేశం ల‌భించిన వారికి ఇన్‌స్పైర్‌స్కాల‌ర్‌షిప్‌తో అయిదేళ్లపాటు ఏడాదికి రూ.60,000 ‌చొప్పున ఉప‌కార వేత‌నం అందుతుంది. అలాగే వేస‌వి ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 వేలు అదనంగా ఇస్తారు. అన్ని సెమిస్ట‌ర్ల‌లోనూ మంచి ప్ర‌తిభ ప్ర‌ద‌ర్శించిన విద్యార్థుల‌కు బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్ (బార్క్‌) ట్రైనింగ్ స్కూల్లో ప‌రీక్ష లేకుండా ఇంట‌ర్వ్యూ ద్వారా ప్ర‌వేశం క‌ల్పిస్తారు.

స‌న్న‌ద్ధమ‌వ్వండిలా..!

సీబీఎస్ఈ 11, 12 త‌ర‌గ‌తుల్లోని బ‌య‌లాజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్ పుస్త‌కాల‌ను క్షుణ్ణంగా చ‌ద‌వాలి. ప్రాథ‌మికాంశాలు, భావ‌న‌ల‌పై ప‌ట్టు సాధించాలి. ముఖ్యాంశాల‌ను నోట్సుగా రాసుకోవాలి. బ‌యాల‌జీ విద్యార్థులు మ్యాథ్స్ ను, మ్యాథ్స్ విద్యార్థులు బ‌యాల‌జీని మిన‌హాయించుకోవ‌చ్చు. నెస్ట్ అధికార వెబ్‌సైట్‌లో ఉన్న పాత ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను అధ్య‌యనం చేయాలి. ప్ర‌తి స‌బ్జెక్టులో ఏయే చాప్ట‌ర్ల నుంచి ఎలాంటి ప్ర‌శ్న‌లు, ఎన్నేసి చొప్పున వ‌స్తున్నాయో గ‌మ‌నించి, అందుకు త‌గిన విధంగా సిద్ధ‌మ‌వ్వాలి. ఎంసెట్‌, జేఈఈ మెయిన్స్‌, నీట్ పాత ప్ర‌శ్న‌ప‌త్రాలు, న‌మూనా పేప‌ర్లు సాధ‌న చేయాలి. అభ్య‌ర్థులు బట్టి ధోర‌ణిలో చదవకుండా స‌బ్జెక్టును అవ‌గాహ‌న చేసుకుని అధ్య‌యనం చేస్తూ, విభిన్న అంశాల‌ను అన్వ‌యించగ‌లిగితే మంచి స్కోర్ చేయ‌వ‌చ్చు. 

గ‌త ప్ర‌శ్న‌ప‌త్రాల ఆధారంగా సంబంధిత స‌బ్జెక్టులో ఎక్కువ దృష్టిసారించాల్సిన అంశాలు...

బ‌యాల‌జీ
జ‌న‌ర‌ల్ బ‌యాల‌జీ, సెల్ బ‌యాల‌జీ, జెనెటిక్స్‌, ఎకాల‌జీ అండ్ ఇవ‌ల్యూష‌న్‌, బ‌యోటెక్నాల‌జీ, యానిమ‌ల్ ఫిజియాల‌జీ, ప్లాంట్ ఫిజియాల‌జీ, డీఎన్ఏ ధ‌ర్మాలు, ఆర్‌డీఎన్ఏ టెక్నాల‌జీ, ట్రాన్స్‌లేష‌న్‌, ట్రాన్‌స్క్రిప్ష‌న్ మొద‌లైన‌వి.

కెమిస్ట్రీ
ఆర్గానిక్ కెమిస్ట్రీలో జ‌న‌ర‌ల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, రియాక్ష‌న్ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీ, నేమ్‌డ్ రియాక్ష‌న్స్‌, ఏరోమ్యాటిసిటీ, కార్బోహైడ్రేట్స్‌, అమైనోయాసిడ్స్‌, పాలిమ‌ర్స్‌, ఫిజిక‌ల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్, సొల్యూష‌న్స్‌, సాలిడ్ స్టేట్‌, ఎల‌క్ట్రో కెమిస్ట్రీ, కెమిక‌ల్ కైన‌టిక్స్‌, థ‌ర్మోడైన‌మిక్స్ సంబంధిత అంశాలు. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సంశ్లిష్ట స‌మ్మేళ‌నాలు, ఎస్‌, పి, డి, ఎఫ్ ‌బ్లాక్ మూల‌కాలు, మెట‌ల‌ర్జీ మొద‌లైన‌వి.

ఫిజిక్స్‌
జ‌న‌ర‌ల్ ఫిజిక్స్‌, ఆప్టిక్స్‌, మోడ‌ర‌న్ ఫిజిక్స్, ఎల‌క్ట్రిసిటీ, మాగ్న‌టిజ‌మ్, మెకానిక్స్‌.

మ్యాథ‌‌మేటిక్స్
కాల‌క్యుల‌స్‌, త్రికోణ‌మితి, కోర్డానేట్ జామెట్రీ, ఆల్జీబ్రా, వెక్ట‌ర్స్‌.‌

వెబ్‌సైట్ : www.nestexam.in

Posted Date : 13-02-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌