• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఎస్‌బీలో చేరాలంటే?

ప్రపంచ మేటి బిజినెస్ స్కూళ్లలో హైద‌రాబాద్ ఒక‌టి

ప్రపంచంలో మేటి బిజినెస్‌ స్కూళ్లలో ఒకటిగా హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ఖ్యాతి గడించింది. వివిధ సంస్థల ర్యాంకుల్లో ఏటా చోటు దక్కించుకుంటోంది. ఇక్కడ అందిస్తోన్న పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ విశ్వవ్యాప్త గుర్తింపు పొందింది. మన దేశంలో ప్రథమశ్రేణి మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థ ఇదే. ప్లేస్‌మెంట్లలోనూ ఐఎస్‌బీ టాప్‌ రేటులో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సంస్థ అందించే కోర్సులు, ప్రవేశ వివరాలు చూద్దాం...

చేర్చుకుంటున్న విద్యార్థుల సంఖ్య పరంగా చూసుకుంటే ఇక్కడి పీజీపీ కోర్సు ప్రపంచంలో టాప్‌-10లో ఒకటి. ఈ కోర్సులో చేరుతోన్నవారిలో మహిళలు 34 శాతం మంది ఉండడం విశేషం. ఇంత పెద్ద సంఖ్యలో మనదేశంలో మరే సంస్థా వీరికి అవకాశం కల్పించడం లేదు. ఐఎస్‌బీకి హైదరాబాద్‌తోపాటు మొహాలీలోనూ క్యాంపస్‌ ఉంది. ఇక్కడి కోర్సులకు ఏఏజీఎస్‌బీ, ఈక్యూయూఐఎస్‌ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద సంస్థలకు మాత్రమే ఈ తరహా గుర్తింపు ఉంది. పీజీపీ కోర్సులో రెండు విడతల్లో ప్రవేశాలు ఉంటాయి. ఒక్కో దఫా 50 శాతం సీట్లు కేటాయిస్తారు. 

వ్యవధి ఏడాది

పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు వ్యవధి 12 నెలలు. దీన్ని హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. ఇందులో చేరడానికి కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. రెండు క్యాంపస్‌ల్లోనూ కలిపి సుమారు 900 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. జీమ్యాట్‌/ జీఆర్‌ఈ స్కోరు ప్రామాణికం. జీమ్యాట్‌ అయితే 600, జీఆర్‌ఈ అయితే 311కు పైగా స్కోరు ఉంటే సీటు ఆశించవచ్చు. ఈ కోర్సులో చేరినవారు అన్నీ కలుపుకుని (ట్యూషన్, పుస్తకాలు, వసతి, భోజనం) సుమారు రూ.38 లక్షలకు పైగా చెల్లించాలి. మెరిట్‌ విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడినవారికి స్కాలర్‌షిప్‌ అందుతుంది. మిగిలినవారికి రుణ సౌకర్యం కల్పిస్తారు. 

ఈ సంస్థ ఏడాది నుంచి 18 నెలల వ్యవధితో 4 పీజీలు, 15 నెలల వ్యవధితో 8 అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు, 2 డాక్టొరల్‌ కోర్సులు అందిస్తోంది. రెండు రోజుల నుంచి రెండు వారాల్లో ముగిసే 27 ఓపెన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లూ ఉన్నాయి. వర్కింగ్‌ ప్రొఫెషన్లు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, కుటుంబ వ్యాపారం నిర్వహిస్తోన్నవారి కోసం ఐఎస్‌బీ ప్రత్యేకంగా కోర్సులు నడుపుతోంది. బిజినెస్‌ ఎనలిటిక్స్, హెల్త్‌కేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫ్యాక్చరింగ్‌ అండ్‌ ఆపరేషన్స్, పబ్లిక్‌ పాలసీ విభాగాల్లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌ల కోసం ఆన్‌లైన్‌ ఓపెన్‌ ప్రోగ్రాంలు అందిస్తున్నారు. డాక్టొరల్‌ చదువులపై ఆసక్తి ఉన్నవారు ఫెలో ప్రోగ్రాం, ఎగ్జిక్యూటివ్‌ ఫెలో ప్రోగ్రాంల్లో చేరవచ్చు. 

ఎంపిక విధానం 

అకడమిక్‌ సామర్థ్యం పరిశీలిస్తారు. అంటే డిగ్రీలో; పీజీ, సర్టిఫికెట్‌ కోర్సుల్లో (చదివినట్లయితే) ప్రతిభను గమనిస్తారు. జీమ్యాట్‌ / జీఆర్‌ఈ స్కోర్‌ చూస్తారు. పనిలో ప్రదర్శించిన ప్రతిభ, సామర్థ్యాలకు కొన్ని క్రెడిట్స్‌ ఉంటాయి. కెరియర్‌లో చూపిన ప్రగతి, నాయకత్వ లక్షణాలకు కొన్ని పాయింట్లు కేటాయిస్తారు. ఆల్‌రౌండ్‌ నైపుణ్యాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీ, సామాజిక సేవ, ప్రత్యేకతలు, వైవిధ్యం, పని అనుభవం... వీటన్నింటికీ కొన్ని క్రెడిట్లు ఇస్తారు. 

రెండేళ్ల కంటే తక్కువ పని అనుభవం ఉన్నవారికోసం అర్లీ ఎంట్రీ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. ఈ విధానంలో సీటు పొందినవారు రెండేళ్ల అనుభవం అనంతరం కోర్సులో చేరే అవకాశం లభిస్తుంది. అలాగే ఆఖరు సంవత్సరం డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం యంగ్‌ లీడర్‌షిప్‌  ప్రోగ్రాం నడుపుతున్నారు. వీరు జీఆర్‌ఈ/జీమ్యాట్‌ స్కోరుతో ఐఎస్‌బీలో ముందస్తు ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానంలో ఎంపికైనవారు కోర్సు పూర్తయిన తర్వాత సంస్థలో చేరడానికి అవకాశం కల్పిస్తారు.

వచ్చే విద్యా సంవత్సరంలో పీజీపీ కోర్సులో చేరడానికి రౌండ్‌-2 ప్రవేశాలకు గడువు ఉంది. అర్హతలు, ఆసక్తి ఉన్నవారు జనవరి 10లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హత:

2021 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఆశించేవారు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. జీమ్యాట్‌/ జీఆర్‌ఈ స్కోరు తప్పనిసరి. మార్చి 31, 2021 నాటికి కనీసం రెండేళ్ల పూర్తికాల పని అనుభవం అవసరం. డిగ్రీని ఆంగ్ల మాధ్యమంలో చదవనివారైతే టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌/ పీటీఈ స్కోర్‌ ఉండాలి. 

వెబ్‌సైట్‌: https://www.isb.edu/en.html
 

Posted Date : 23-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌