• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐటీ అభ్య‌ర్థుల‌కు ఆగ‌ని ఆఫ‌ర్లు

వేతనాలపై కొవిడ్‌ ప్రభావం తక్కువే

హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో అధిక నియామకాలు

స్కైకీ మార్కెట్‌ నెట్‌వర్క్‌ నివేదిక

ముంబయి: దేశంలో అన్ని రంగాల ఉద్యోగాలపై కరోనా వైరస్‌ ప్రభావం పడినప్పటికీ.. ఐటీ రంగంలో ఉద్యోగాలకు గిరాకీ తగ్గలేదని ఒక నివేదిక పేర్కొంది. బెంగళూరు, పుణె వంటి నగరాల్లో గరిష్ఠ స్థాయిలో ఉద్యోగాలు, వేతన ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు జాబ్‌ ప్లాట్‌ఫామ్‌ స్కైకీ మార్కెట్‌ నెట్‌వర్క్‌ నివేదిక పేర్కొంది. నవంబరులో ప్రాజెక్ట్‌ మేనేజర్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, సాఫ్ట్‌వేర్‌ టెస్టర్, కన్సల్టెంట్, డిజిటల్‌ మార్కెటింగ్‌ లీడ్‌ వంటి ఉద్యోగాలకు గిరాకీ కనిపించిందని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో వ్యాపారాలు డిజిటల్‌ బాట పట్టడంతో టెక్నాలజీ వినియోగం అధికమై ఐటీ రంగంలో ఉద్యోగాలకు గిరాకీ పెరిగిందని స్కైకీ మార్కెట్‌ నెట్‌వర్క్‌ సహవ్యవస్థాపకుడు కరుణ్‌జీత్‌ కుమార్‌ ధిర్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంపై కరోనా ప్రభావం తక్కువగా ఉందని, కంపెనీలు డిజిటల్‌కు మారడంలో ఈ రంగం కీలకపాత్ర పోషించిందని అన్నారు. స్కైకీ ప్లాట్‌ఫామ్‌పై నవంబరులో నమోదైన ఉద్యోగాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. నివేదికలోని

మరిన్ని అంశాలు ఇలా. 

బెంగళూరులో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఉద్యోగాలకు అధిక గిరాకీ కనిపించింది. తర్వాతి స్థానాల్లో దిల్లీ- ఎన్‌సీఆర్, పుణెలు నిలిచాయి.

ఐటీ రంగంలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌లకు గిరాకీ 55 శాతంగా ఉంది. నిర్మాణం (6 శాతం), నియామకాలు (5 శాతం), బ్యాంకింగ్‌ (3 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇక బెంగళూరులో డెవలపర్ల (35 శాతం)కు గిరాకీ ఉంది. ఇందులో 65 శాతం ఐటీ రంగం నుంచే కావడం గమనార్హం. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లను ఎక్కువగా నియమించుకున్న నగరాల్లో దిల్లీ (18 శాతం), హైదరాబాద్‌ (13 శాతం), పుణె (12 శాతం) ఉన్నాయి. ఐటీ తర్వాత ఇంటర్నెట్, ఇ-    కామర్స్‌ (2.6 శాతం), నియామకాలు (2 శాతం), బ్యాంకింగ్‌ (1.5 శాతం) డెవలపర్లకు చోటు ఇస్తున్నాయి.

డిజిటల్‌ మార్కెటింగ్‌ ఉద్యోగాలకు బెంగళూరు (28 శాతం)లో గిరాకీ లభిస్తోంది. తర్వాతి స్థానాల్లో దిల్లీ (26 శాతం), ముంబయి (14 శాతం), హైదరాబాద్‌ (9 శాతం) నిలిచాయి. 

ఐటీ ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్న నగరాల్లో బెంగళూరు, పుణె (50 శాతం) నిలిచాయి. ఇక్కడ వార్షిక వేతనం రూ.25 లక్షలకు పైగా ఉంది. 

నవంబరులో వచ్చిన మొత్తం ఐటీ ఉద్యోగాల్లో 50 శాతం బెంగళూరు, పుణె, హైదరాబాద్, దిల్లీ నగరాల్లోనే ఉన్నాయి.  

Posted Date : 27-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌