• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టెన్త్‌తో నౌకాదళంలో ఉద్యోగం

1159 ట్రేడ్స్‌మ్యాన్‌మేట్ ఖాళీల భర్తీకి ప్రకటన

అర్హత; పదో తరగతి, ఐటీఐ 

రక్షణ రంగంలో తక్కువస్థాయి విద్యార్హతల నుంచి ఉన్నత స్థాయి వరకు ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. పదో తరగతితో ఉద్యోగాల్లోకి ప్రవేశించి, తర్వాత దూరవిద్య తదితర మార్గాల ద్వారా డిగ్రీలు సంపాదించి ఉన్నత స్థానాలకూ చేరుకోవచ్చు. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. నేవిలోని ఈస్టర్న్, వెస్టర్న్, సదరన్ కమాండ్‌ల‌లోని 1159 ట్రేడ్స్‌మ్యాన్ మేట్ గ్రూపు-సి (నాన్ గెజిటెడ్ ఇండస్ట్రియల్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.

అర్హతలు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయసు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఇతర అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఎలా?

అర్హులైన అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుముగా రూ.205 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది. దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లికేషన్ ఫారంలో పరీక్ష కేంద్రాల్లో ఏవైనా మూడింటిని అభ్యర్థులు ఎంచుకోవాలి. 

ఎంపిక విధానం

అభ్యర్థుల దరఖాస్తులను బట్టి ఇండియన్ నేవీ షార్ట్‌లిస్టింగ్ చేస్తుంది. అనంతరం వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహిస్తుంది. అందులో ప్రతిభ చాటిన అభ్యర్థులకు ప్రొవిజినల్ అపాయింట్‌మెంట్ ‌లెటర్ పంపుతారు. అనంతరం వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. 

రాత పరీక్ష

షార్ట్‌లిస్టింగ్ ‌చేసిన అభ్యర్థులకు ఇండియన్ నేవీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తుంది. పరీక్ష తేదీని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫోన్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్/ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్/కాంప్రహెన్షన్, జనరల్ అవెర్‌నెస్ నుంచి 25 ప్ర‌శ్న‌ల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్ర‌శ్న‌కు ఒక మార్కు. 

జీతభత్యాలు ఇలా..

ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత స్పెషలైజేషన్ల‌ను అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు. 

ప్రిపరేషన్ ప్రణాళిక

జనరల్ఇంటలిజెన్స్అండ్ రీజనింగ్

ఈ విభాగంలో వెర్బల్, నాన్‌వెర్బల్, క్రిటికల్, అనలిటిక‌ల్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సృజనాత్మకత, వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండేలా ఆలోచిస్తే సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు. నంబర్లు, లెటర్లు, పదాలు, చిత్రాలమీద ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు. సిరీస్, అనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్, చిత్రాన్ని పూర్తిచేయడం, మిర్రర్ఇమేజ్, వాటర్ఇమేజ్, నంబర్, సింబల్, ఆపరేషన్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. 

న్యూమరికల్ ఆప్టిట్యూడ్

ఈ విభాగంలో అరిథ్‌మెటిక్‌, మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు అరిథ్‌మెటిక్ నుంచే వస్తాయి. ఈ విభాగంలోని ప్రశ్నలకు తక్కువ సమయంలో ఎక్కువ సమాధానాలు గుర్తించాలంటే సూక్ష్మీకరణపై పట్టు ఉండాలి. సంప్రదాయ పద్ధతులతో కాకుండా చివరి అంకెను గుర్తించడం, గుణకాలు, ఆప్షన్నుంచి సమాధానం గుర్తించడం వంటి సులభమైన పద్ధతుల ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.  అరిథ్ మెటిక్ అంశాల్లో ‘శాతాలు’ కీలకమైన చాప్టర్. శాతాలకు అనుసంధానంగా నిష్పత్తి- అనుపాతం, లాభనష్టాలు, బారువడ్డీ, చక్రవడ్డీ ప్రశ్నలుంటాయి. ఈ అంశాలన్నీ ఒకే తర్కం ఆధారంగా ఉంటాయి. వీటి నుంచి కచ్చితంగా ప్రశ్నలుంటాయి.

జనరల్ఇంగ్లిష్

ఇంగ్లిష్ గ్రామ‌ర్ నియ‌మాలు తెలిస్తే 40 నుంచి 50 శాతం ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎర్రర్‌లొకేషన్, సెంటెన్స్అరెంజ్‌మెంట్, సెంటెన్స్ క‌రెక్ష‌న్ల ప్ర‌శ్నలు ఈ నియమాలపై ఆధారపడి ఉంటాయి. ఒకాబులరీ, యాంటనిమ్స్, సిననిమ్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. కాంప్రహెన్షన్, క్లోజ్‌టెస్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులకు ముఖ్యంగా కావాల్సిన లక్షణం- తక్కువ సమయంలో ఇచ్చిన సమాచారాన్ని చదివి, అందులో ముఖ్యమైన లేదా అవసరమైన సమాచారాన్ని గుర్తుంచుకోవడం. కాంప్రహెన్షన్ ప్యాసేజ్‌లో ముందుగా ప్రశ్నలను చదివి, గుర్తుంచుకుని తరువాత ప్యాసేజీలో ఇచ్చిన సమాచారాన్ని చదివితే అవసరమైన సమాచారమేదో గుర్తించడం సులభమవుతుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా ఆంగ్ల దినపత్రిక చదవాలి. ఇందులో ఎడిటోరియల్ కాలమ్స్, బిజినెన్, స్పోర్ట్స్ పేజీలు చదివితే ఒకాబులరీ, గ్రామర్, కరెంట్ అఫైర్స్‌తోపాటు ఇంగ్లిష్ భాష‌మీదా పట్టు వస్తుంది. ఇంగ్లిష్ విభాగాన్ని అతి కీలకమైనదిగా గుర్తించాలి. అభ్యర్థులు ఉద్యోగులుగా మారాలంటే ఈ విభాగంలోని మార్కులే కీలకం. ఎక్కువ మందికి దీనిలో తక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి, ఎక్కువ మార్కులు పొందినవారు ఫైనల్ మెరిట్ జాబితాలో ముందుంటారు.

జనరల్ అవెర్‌నెస్‌

భారతదేశం, పొరుగు దేశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. చరిత్ర, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, బడ్జెట్, భారతదేశం పాల్గొన్న సమ్మిట్స్, వాటి ముఖ్యాంశాలు, ఆయాదేశాలు, వాటి రాజధానులు, కరెన్సీ, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, యునెస్కో గుర్తించిన ప్రదేశాలపై పట్టు పెంచుకోవాలి. పొడవైన/లోతైన/ ఎత్తైన నదులు, పర్వతాలు, వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్ సంబంధిత అంశాల్లో ప్రస్తుతం జరిగిన ఆటల్లో విజేతలు, పుస్తక రచయితలు, కరోనా వైరస్, బాక్టీరియా, కెమికల్ ఫార్ములాలు, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, భారత్ ప్ర‌యోగించిన అంతరిక్ష ప్రయోగాలు, శాటిలైట్స్ సంబంధిత సమాచారాన్ని సేకరించాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా దినపత్రికలు చదవడం ద్వారా పరీక్షకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు.

విధులు, బాధ్యతలు

షిప్ నిర్వహణ; అన్ని విభాగాల పరిశుభ్రత; ఆఫీసు కార్యకలాపాలకు సంబంధించిన ఫైల్స్ నిర్వహణ; ఫాక్స్ లు, లెటర్లు పంపడం అందుకోవడం, ఇంకా ఇతర నాన్ - క్లరికల్ విధుల నిర్వహణ కోసం నేవీలో ట్రేడ్స్ మ్యాన్ మేట్ అనే గ్రూప్- సి ఉద్యోగులు ఉంటారు. వార్డ్ డ్యూటీ తదితర బాధ్యతలు చేపట్టడానికి ఈ ఉద్యోగులను తీసుకుంటారు. 

దరఖాస్తుకు చివరి తేదీ;  మార్చి 7, 2021న ముగుస్తుంది.

వెబ్‌సైట్‌; https://www.joinindiannavy.gov.in/

Posted Date : 25-02-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌