• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మీ గురించి..ఇలా చెప్పండి!  

‘టెల్‌ మీ అబౌట్‌ యువర్‌సెల్ఫ్‌’ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఈ ప్రశ్న వేయగానే ఒత్తిడికి గురైన మానస వెంటనే ఎంబీయే చదివానని చెప్పింది. నిజానికి తను ఈమధ్యే ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. ఏదో తెలియని కంగారులో అలా టక్కున తప్పు సమాధానం చెప్పేసింది.

సుదీప్‌ అయితే ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నకు ‘క్రికెటర్‌ ధోనీ అంటే నాకు చాలా ఇష్టం’ అని అంతటితో ఆగకుండా అతడిని కూల్‌ కెప్టెన్‌ అని ఎందుకంటారో సంతోషంగా వివరించి చెప్పాడు. 

నిజానికి వీళ్లిద్దరు చెప్పిన సమాధానాలూ సరికాదు. మీ గురించి చెప్పమంటే తడబడి ఏదో ఒకటి చెప్పటమో, మీరు అభిమానించే వ్యక్తుల గురించి చెప్పడమో చేయకూడదు. 

ఈ ప్రశ్న వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని గ్రహించి సమాధానం చెప్పాలి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు మీ విద్యార్హతలు, అనుభవం, ఈ ఉద్యోగానికి మీరు సరిగ్గా సరిపోతారో లేదో పరీక్షించాలనుకుంటారు. నిజానికి ఒకే ఉద్యోగం కోసం ఎంతోమంది పోటీపడుతూ ఉంటే మిమ్మల్నే ఎందుకు ఎంచుకోవాలనే సందేహం ఎవరికైనా వస్తుంది కదా. అందుకే సరైన సమాచారాన్ని మీ నుంచే రాబట్టాలనుకుంటారు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ ప్రశ్న కూడా. దీనికి మీరిచ్చే సమాధానం మిమ్మల్ని విజేతగా నిలబెట్టాలి. అలా నిలబెట్టాలంటే కొన్ని విషయాలను మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవేమిటంటే...

మీరెవరో చెప్పాలి: మీరు విద్యార్థి అయితే విద్యార్హతల గురించి చెప్పాలి. ఏం చదివారు, దాంట్లో మీ స్పెషలైజేషన్‌ ఏమిటి... మొదలైనవి చెబితే సరిపోతుంది.

గతంలో మీకేదైనా పని అనుభవం ఉంటే దాని గురించి చెప్పాలి. ఏయే బాధ్యతలను నిర్వర్తించారనే విషయాన్ని కాస్త వివరంగా, ఆసక్తికరంగా చెప్పాలి.   

సాధించిన విజయాలు: వేరే సంసలో పనిచేసిన అనుభవం మీకుంటే సేల్స్, మార్కెటింగ్‌ లేదా మరో విభాగంలో మీరు సాధించిన విజయాల గురించి చెప్పవచ్చు. అదికూడా నేను మాత్రమే అలా చేయగలిగాను... మరెవరూ ఇప్పటి వరకు అలాంటి ఘనతను సాధించలేకపోయారు అన్నట్టుగా కాకుండా నమ్రతగా చెప్పాలి.  

విద్యార్థుల‌కు పని అనుభవం ఉండదు కాబట్టి డిగ్రీతోపాటు అదనంగా ఏయే నైపుణ్యాలు నేర్చుకున్నారో చెప్పాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంటే దాన్ని గురించి చెప్పాలి. ఉద్యోగ బాధ్యతలను సమరంగా నిర్వర్తించడానికి అది ఏ విధంగా ఉపయోగపడగలదో వివరించవచ్చు. 

మిమ్మల్నే ఎందుకు ఎంచుకోవాలి: ఎంతోమంది ఇంటర్వ్యూకు హాజరై ఉంటారు. వారిలోనుంచి మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలో స్పష్టంగా చెప్పగలగాలి. మీ అర్హతలు, ఇతర నైపుణ్యాలు ప్రస్తుత ఉద్యోగానికి సరిగ్గా ఎలా సరిపోతాయో వివరించగలగాలి. 

మీరు ఇప్పటికే వేరే సంసలో పనిచేస్తున్నట్లయితే ఆ బాస్‌తో పడలేక ఈ ఉద్యోగానికి వస్తున్నట్టుగా మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే మీకున్న సమస్య వల్ల ఈ ఉద్యోగాన్నే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే వేరేదాన్ని ఎంచుకోవచ్చు. కానీ ప్రస్తుత ఉద్యోగానికి మీరు ఎంతవరకు అర్హులు అన్న దాన్ని మాత్రమే మీరు నిరూపిస్తే సరిపోతుంది. మీకున్న సమస్యల గురించి ఏకరువు పెట్టి ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి విసుగు తెప్పించకూడదు. మీ దృష్టి ఎంతసేపు ప్రస్తుత ఉద్యోగానికి మీరెంత వరకు సరిపోతారు, మీరేవిధంగా న్యాయం చేయగలరు అన్నదాని మీదే ఉండాలి. 

Posted Date : 02-06-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌