• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Fees: ఫీజుల నియంత్ర‌ణ‌కు శాస‌నం!

జీవోతో లాభం లేదని చట్టం వైపు మొగ్గు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ జీవోలతో సాధ్యం కాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల తరహాలోనే చట్టాన్ని తెచ్చేందుకు నిర్ణయించింది. వచ్చే శాసనసభ సమావేశాల్లోనే చట్టాన్ని ప్రవేశపెట్టనుంది. జీవోలపై ఆయా యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయించి అమలు కాకుండా అడ్డుకుంటున్నాయన్న ఆలోచనతో ఇప్పుడు ప్రత్యేకంగా చట్టం రూపకల్పనకు సర్కారు పూనుకుంది. అయితే అది కూడా రుసుములపై సుప్రీం కోర్టు తీర్పులకు లోబడి మాత్రమే ఉండాలని, లేకుంటే చట్టాన్ని కూడా సవాల్‌ చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్నో రాష్ట్రాలు..
పాఠశాలలు ఏటా ఇష్టారాజ్యంగా ఫీజుల్ని పెంచుతుండటంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే చట్టాలు రూపొందించి నియంత్రిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర 15 రాష్ట్రాలు చట్టాలను రూపొందించగా... హరియాణా సైతం గత నెలలో చట్టాన్ని తెచ్చింది. ఈ రాష్ట్రంలో వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ)పై 5 శాతం ఫీజు ఏటా పెంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పెంచితే భారీగా అపరాధ రుసుం, అప్పటికీ మార్పు రాకుంటే గుర్తింపు రద్దు తదితర చర్యలు ఉన్నాయి. అంటే చట్టం వచ్చినా ఫీజు పెరగడం తప్పదు... కాకపోతే ఇష్టారాజ్యంగా పెంచుకుంటే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. ఫీజు ఎంతనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా యాజమాన్యాలదేనని, అదే సమయంలో వాటిని నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు గతంలోనే పలు కేసుల్లో స్పష్టంచేసింది. అంటే ఫీజుకు తగ్గట్లు వసతులు, విద్యా బోధన ఉందా? లేదా? అని తనిఖీ చేసి ఎక్కువ రుసుం ఉంటే తగ్గించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘కొన్ని రాష్ట్రాల్లో చట్టాలు చేసినా పలు విద్యా సంస్థల యాజమాన్యాలు కోర్టులకు వెళ్లాయి. అందుకే గతంలో సుప్రీం తీర్పులు, కేసులను పరిగణనలోకి తీసుకొని చట్టాన్ని రూపొందించాలి’ అని ఆచార్య తిరుపతిరావు సూచించారు. ‘ఫీజుల నియంత్రణకు జీవో కాకుండా చట్టాన్ని తీసుకురావాలని హైకోర్టు కూడా సూచించింది’ అని పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.
సుప్రీంకోర్టు చెప్పినా అయిదున్నరేళ్లకు నియంత్రణ దిశగా..
ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన జీవో 91పై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు దాన్ని కొట్టేసింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ క్రమంలో రుసుములను నియంత్రించే అధికారం కలెక్టర్లు ఛైర్మన్లుగా ఉండే కమిటీలకు లేదని, ఆ కమిటీలు సిఫారసు చేస్తే ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుందని 2016 సెప్టెంబరులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జీవో 91లో ఆ చిన్న సవరణ చేసుకొని ఫీజులను నియంత్రించవచ్చని సూచించింది. ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య తిరుపతిరావు కమిటీని నియమించింది. ఆ కమిటీ 2017 డిసెంబరులో నివేదిక సమర్పించింది. ఏటా 10 శాతం వరకు ఫీజులు పెంచుకోవచ్చని, అంతకంటే ఎక్కువ పెంచుకోవాలంటే కమిటీకి ఆదాయం, వ్యయాలు సమర్పించి అనుమతి తీసుకోవాలని సూచించింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చి నాలుగేళ్లు గడిచింది. మరో వైపు హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎస్‌పీఏ) దాఖలు చేసిన కేసు హైకోర్టులో తరచూ విచారణకు వస్తోంది. తాజాగా గత నెలలో రాగా ఆరు వారాల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఏమి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఫలితంగా ప్రభుత్వం చట్టం రూపకల్పనకు సమాయత్తమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొన్ని పాఠశాలలు 15-25 శాతం కూడా పెంచుతూ తల్లిదండ్రులకు షాక్‌ ఇస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో దాదాపు 35 లక్షల మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు.

Posted Date : 19-01-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌