• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Medical Seats: అరకొర సీట్లు.. ఫీజుల బరువు

వైద్య విద్యకోసం తప్పని విదేశీ యానం
కరోనా దెబ్బకు చైనాలో, యుద్ధం తాకిడికి ఉక్రెయిన్‌లో భారతీయ వైద్య విద్యార్థుల అగచాట్లు అందరి మనసులను కలచివేశాయి. భారత్‌లో వైద్య విద్యావసతులకు ఏం కొరత, డాక్టరీ చదువుల కోసం దేశం విడిచి వెళ్ళాలా అనే ప్రశ్నలు సహజంగానే అందరి మదిలో మెదిలాయి. ఉక్రెయిన్‌ విద్యాశాఖ గణాంకాల ప్రకారం అక్కడ 18,095 మంది భారతీయ వైద్య విద్యార్థులు చేరారు. చైనా, రష్యాలతోపాటు కిర్ఘిజ్‌స్థాన్‌, కజఖ్‌స్థాన్‌, ఆర్మీనియా, ఫిలిప్పీన్స్‌ వంటి చిన్న దేశాలకూ మన విద్యార్థులు వైద్య విద్యకోసం తరలివెళ్తున్నారు. భారతీయ వైద్య కళాశాలల్లో సీటు సంపాదించడం చాలా కష్టంతో కూడుకోవడం, ఫీజుల మోతను భరించలేకపోవడం మన విద్యార్థుల విదేశీ బాటకు కారణాలవుతున్నాయి.
తీరని గిరాకీ
గత డిసెంబరులో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ లోక్‌సభకు తెలిపిన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 88,120 ఎంబీబీఎస్‌ సీట్లు, 27,498 బీడీఎస్‌ (దంతవైద్య) సీట్లు ఉన్నాయి. 2021లో ఆ సీట్ల కోసం నీట్‌-యుజీ పరీక్ష రాయడానికి 15.44 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. వారిలో 8.70లక్షలమంది ఉత్తీర్ణులైనా, కేవలం 10-12శాతం మందికి మాత్రమే స్వదేశంలో వైద్య విద్య సీట్లు లభిస్తాయి. దేశంలో కొత్త వైద్య కళాశాలలు వస్తూనే ఉన్నా గిరాకీ మాత్రం తీరడం లేదు. 2013-14లో ఇండియాలో మొత్తం 387 వైద్య కళాశాలలు ఉన్నాయి. 2021-22 నాటికి అవి 596కి పెరిగాయి. 284 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 43,310 ఎంబీబీఎస్‌ సీట్లు ఉంటే, 269 ప్రైవేటు కళాశాలల్లో 41,065 సీట్లు ఉన్నాయని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వెబ్‌సైట్‌ తెలుపుతోంది.
భారతీయ విద్యార్థులు వైద్య విద్యకోసం చిన్నచిన్న దేశాలకు వెళ్తున్నారని, వారి అవసరాలను స్వదేశంలోనే తీర్చడానికి ప్రైవేటు రంగం పెద్దయెత్తున ముందుకురావాలని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రైవేటు వైద్య కళాశాలలు వ్యాపారానికి ప్రాధాన్యమిస్తూ భారీగా ఫీజులు దండుకుంటున్నాయి. అందువల్ల చివరకు బంగ్లాదేశ్‌ సైతం మన విద్యార్థులను భారీగా ఆకర్షిస్తోంది. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకుని కాబోలు- ప్రైవేటు, డీమ్డ్‌ వైద్య కళాశాలల్లో సగం సీట్లకు ప్రభుత్వ వైద్య కళాశాలల ఫీజులను వసూలు చేయాలని తాజాగా ప్రధాని మోదీ ట్విటర్‌లో సూచించారు. ఈ నిర్ణయం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వస్తుందని ఎన్‌ఎంసీ ప్రకటించింది. తమిళనాడు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఇప్పటికే 65శాతం సీట్లను ప్రభుత్వ కోటాగా పరిగణించి, తక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అంతకన్నా తక్కువ శాతం సీట్లను ప్రభుత్వ కోటాకు మళ్ళిస్తున్నారు. అవన్నీ ప్రధానంగా స్థానికులకే లభిస్తాయి. కొత్త ఉత్తర్వుల ప్రకారం అన్ని రాష్ట్రాలూ ప్రైవేటు వైద్య కళాశాలల్లో సగం సీట్లకు ప్రభుత్వ ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. దానివల్ల ప్రైవేటు యాజమాన్యాలు తమ చేతిలో మిగిలిన 50శాతం సీట్లకు ఫీజులను మరింతగా పెంచేసే అవకాశం ఉంది. ప్రభుత్వ కొత్త నియమం మైనారిటీ వర్గాలు నడిపే వైద్య కళాశాలలకు వర్తించకపోవచ్చు. రాజ్యాంగం ప్రకారం మైనారిటీ యాజమాన్యాలకు కళాశాల నిర్వహణలో స్వయం నిర్ణయాధికారం ఉంటుంది. ప్రస్తుతం మైనారిటీ వైద్య కళాశాలలు సైతం పెద్ద సంఖ్యలోనే దేశంలో కొనసాగుతున్నాయి. ఎవరెన్ని కళాశాలలు నడిపినా జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు ఒరిగేది అంతంత మాత్రమే కాబట్టి విదేశాల వైపు వారు దృష్టి సారించక తప్పడం లేదు.
కేంద్రం వెసులుబాట్లు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించిన ప్రకారం ప్రతి వెయ్యి మంది రోగులకు ఒక డాక్టరు చొప్పున ఉండాలి. దీన్ని ఆచరణలోకి తేవాలన్నా, భారతీయ ఆశావహులకు వైద్య విద్యను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలన్నా మరి కొన్నేళ్లపాటు దేశంలో ఎంబీబీఎస్‌ సీట్లను ఏటా ముప్ఫై వేల చొప్పున పెంచుకుంటూ పోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అది చాలా ఖరీదైన వ్యవహారం. ప్రైవేటు వైద్య కళాశాలల ఏర్పాటుకు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమవుతాయి. అనుబంధ ఆస్పత్రులు, సుశిక్షిత బోధనా సిబ్బంది కావాలి. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని వైద్య కళాశాలలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద ఏర్పాటు చేయాలని, భారీ గొలుసుకట్టు ఆస్పత్రి గ్రూపులు వైద్య కళాశాలలను నెలకొల్పేలా ప్రోత్సహించాలని సూచనలు వస్తున్నాయి. ప్రస్తుతం విదేశీ వైద్య పట్టభద్రుల విషయంలో కేంద్రం కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకొంటోంది. కొవిడ్‌, ఉక్రెయిన్‌ సంక్షోభాలవల్ల విదేశాల్లో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయలేకపోయిన భారతీయ వైద్య విద్యార్థులు స్వదేశంలో స్క్రీనింగ్‌ పరీక్షలో నెగ్గితే ఇక్కడే ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చని ఎన్‌ఎంసీ ప్రకటించింది. విదేశాల్లో చదువు పూర్తిచేసుకొని భారత్‌కు తిరిగివచ్చే వైద్య విద్యార్థులు ఇక్కడ విదేశీ వైద్య పట్టభద్రుల పరీక్ష (ఎఫ్‌ఎంజీఈ)లో ఉత్తీర్ణులైతే కానీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టడానికి లైసెన్సు లభించదు. మున్ముందు ఎఫ్‌ఎంజీఈ పరీక్ష బదులు నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్స్ట్‌)ను ప్రవేశపెట్టే యోచన ఉంది. విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన వారితో పాటు స్వదేశీ వైద్య విద్యార్థులు సైతం ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్‌ బహుశా నీట్‌-పీజీ పరీక్ష స్థానాన్ని భర్తీచేయవచ్చు. మొత్తం మీద భారతీయ వైద్య విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించాల్సిన సమయం వచ్చేసింది.
భరించలేని భారం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి ప్రత్యేక విధానం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైద్య కళాశాల సీట్లలో తలా 15శాతాన్ని అఖిల భారత కోటా కింద కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తాయి. ఈ ఆలిండియా కోటాలో కొంతమేర సీట్లను ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ విద్యార్థులకు రిజర్వు చేస్తారు. రాష్ట్రాలు తమ చేతిలో మిగిలిన ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి సొంత ఫార్ములాలను వర్తింపజేస్తాయి. అవి స్థానికులకే ప్రాధాన్యమిస్తాయి. ఏతావతా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు అందుబాటులో ఉండే సీట్లు చాలా స్వల్పం. ఇక ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల మోత అంతా ఇంతా కాదు. ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్‌ విద్యకు కనీసం రూ.10-15 లక్షలు ఖర్చవుతుంటే, ప్రైవేటు కళాశాలల్లో రూ.75 లక్షలనుంచి కోటి రూపాయల వరకు ముట్టజెప్పాల్సిందే. అదే ఉక్రెయిన్‌ వంటి దేశాల్లో మొత్తం కోర్సు రూ.15-20 లక్షల్లోనే పూర్తయిపోతుంది. అందుకే భారత విద్యార్థులకు విదేశాలు ఆకర్షణీయంగా మారుతున్నాయి.

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

Posted Date : 14-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.