• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉద్యోగ వేటకు పదును ఇలా!

ఒకే విద్యార్హతలున్న కొంతమంది ఒకేసారి ప్రయత్నాలు మొదలు పెట్టినా... వారిలో కొందరే వెంటనే కొలువును సాధించగలుగుతారు. మరికొంతమంది చాలాకాలం తమ ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. దీనికి కారణం కొన్ని కీలక అంశాలను అనుసరించక పోవటమే. మరి త్వరగా ఉద్యోగాన్ని సాధించాలంటే ఏయే పద్ధతులను పాటించాలో తెలుసుకుందాం!  

ఏదో ఒక సంస్థలో ఉద్యోగం సంపాదించడం లాంటి అస్పష్టమైన లక్ష్యాల వల్ల ఫలితం ఉండదు. మీ అభిరుచికీ, ఆసక్తికీ తగిన ప్రముఖ సంస్థలో ఉద్యోగం సాధించడం మీద దృష్టి పెట్టాలి. దీని కోసం ప్రసిద్ధ సంస్థల పేర్లతో ఒక జాబితా తయారుచేసుకోవాలి. ఆయా సంస్థల్లో ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడగానే దరఖాస్తు చేస్తుండాలి. స్నేహితులెవరైనా దాంట్లో ఇప్పటికే పనిచేస్తుంటే వారి ద్వారానూ వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే ఆయా సంస్థలు నిర్వహించే వివిధ కార్యక్రమాలకు హాజరవుతుండాలి. అయితే ఏవి ప్రముఖ సంస్థలనే విషయంలో సందేహాలున్నా.. సరైన అవగాహన లేకపోయినా దినపత్రికలు, మ్యాగజీన్లు చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు, మార్కెట్లో కొన్ని ప్రత్యేకమైన యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగార్థులు తమ వివరాలను అందులో నమోదు చేసుకుంటే..వారి అర్హతలకు తగ్గ  ఉద్యోగ ఖాళీలుంటే సంబంధిత సంస్థలకు అభ్యర్థుల వివరాలు చేరేలా సంబంధిత యాప్‌ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు.

వెబ్‌సైట్లు

ఏ రంగంలో ప్రవేశించాలనుకుంటున్నారో... దానికి సంబంధించి ప్రత్యేకంగా ఉండే వెబ్‌సైట్లను తరచూ చూస్తుండాలి. ఖాళీలు ఉన్నాయని తెలియగానే వెంటనే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.

అదనపు అర్హతలు 

సాధించిన విద్యార్హతలతోనే సంతృప్తిపడి అంతటితో ఆగిపోకూడదు. అదనపు విద్యార్హతలూ, నైపుణ్యాలను వీలైనంతగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి.

ఇంటర్న్‌షిప్‌లు

ఉద్యోగ అన్వేషణలో ఉండగానే.. ఇంటర్న్‌షిప్‌లు చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనివల్ల అదనపు నైపుణ్యాలను సంపాదించే అవకాశం ఉంటుంది.

సమాచారం తెలుసుకునేదెలా?

ఉద్యోగ నియామకాల సమాచారాన్ని వివిధ రకాల మార్గాల ద్వారా సేకరించవచ్చు. వార్తా పత్రికల నుంచీ, అంతర్జాలం నుంచీ ఉద్యోగ వివరాలను తెలుసుకోవచ్చు. లింక్డ్‌ఇన్‌ లాంటి సైట్లలో వివరాలను నమోదు చేయడం ద్వారా ఉద్యోగ సమాచారాన్ని సేకరించవచ్చదన్నది తెలిసిందే. స్నేహితుల ద్వారాను ఉద్యోగ వివరాలను అందుకోవచ్చు. అలాగే మీకు ఆసక్తి ఉన్న సంస్థలకు ప్రస్తుతం ఖాళీలు లేకపోయినా దరఖాస్తు పంపొచ్చు. ఇలాచేయడం వల్ల భవిష్యత్తులో ఖాళీలు ఏర్పడినప్పుడు మిమ్మల్ని నియామక ప్రక్రియకు పిలిచే అవకాశం ఉంటుంది. 

నెట్‌వర్కింగ్‌: కొన్ని సంస్థలు ఉద్యోగాల భర్తీకి ఎలాంటి ప్రకటనలనూ విడుదల చేయవు. అలాంటప్పుడు స్నేహితుల, పరిచయస్తుల నెట్‌ వర్కింగ్‌ ద్వారా ఉద్యోగ సమాచారాన్ని సేకరించీ దరఖాస్తు చేయొచ్చు. గతంలో ఆయా సంస్థల్లో పనిచేసిన మేనేజర్లు, ఉద్యోగుల రిఫరెన్స్‌తో వచ్చిన వ్యక్తులనూ కొన్ని సంస్థలు విధుల్లోకి తీసుకుంటాయి. కాబట్టి ఇలాంటి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు ప్రవేశించాలనుకుంటున్న రంగంలో ఎక్కడెక్కడ ఏయే ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడానికి నెట్‌వర్కింగ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.  

రిఫరల్స్‌: కొన్ని సంస్థలు తగిన అర్హతలున్న అభ్యర్థులను సూచించిన తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలనూ అందిస్తాయి. ఈ విన్‌-విన్‌ పద్ధతి వల్ల అభ్యర్థికీ, అతడి పేరు సూచించిన వ్యక్తి ఇద్దరికీ ఉపయోగముంటుంది. అయితే ఈ పద్ధతి చాలా అరుదుగా కొన్ని సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. 

జాబ్‌బోర్డ్స్, కెరియర్‌ వెబ్‌సైట్స్‌: జాబ్‌బోర్డ్స్‌లో వివిధ ఉద్యోగ ఖాళీల సమాచారం అందుబాటులో ఉంటుంది. చాలా సంస్థలు జాబ్‌బోర్డ్స్, జాబ్‌ బ్యాంకులను అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతున్నాయి. మాన్‌స్టర్‌.కామ్, గూగుల్‌ ఫర్‌ జాబ్స్, కెరియర్‌ బిల్డర్‌ లాంటి కెరియర్‌ సంబంధిత  వెబ్‌సైట్లూ ఉన్నాయి. ఫ్రీలాన్స్, కాంట్రాక్ట్‌ వర్క్‌ కోసం పీపుల్‌ పర్‌ అవర్, అప్‌వర్క్, సింప్లీ హైయర్డ్, క్రౌడెడ్‌లను ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా రంగాలవారీగానూ వివిధ వెబ్‌సైట్లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఉదాహరణకు సాంకేతిక నిపుణుల కోసం డైస్, ఆర్టిస్టులకు ఆర్ట్స్‌థ్రెడ్‌. 

జాబ్‌ ఫేర్స్‌: కొన్ని సంస్థలు జాబ్‌ ఫేర్స్‌ నిర్వహణ ద్వారా ఉద్యోగ నియామకాలను చేపడుతుంటాయి. ఇలాంటి వాటికి కొన్ని దరఖాస్తులతో హాజరు కావాలి. అలాంటప్పుడు ఎక్కువ సంస్థలకు ఒకేసారి దరఖాస్తు చేసే వీలుంటుంది. కొన్ని సంస్థలు అక్కడికక్కడే మినీ ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేస్తాయి. అలాంటి జాబ్‌ ఫేర్స్‌కు  హాజరవడం ద్వారా వెంటనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంది. 

కంపెనీ వెబ్‌సైట్లు: ప్రత్యేకంగా కొన్ని సంస్థలకు మాత్రమే దరఖాస్తు చేయాలనే ఆలోచన మీకు ఉండొచ్చు. అలాంటప్పుడు నేరుగా సంస్థ వెబ్‌సైట్‌లోని కెరియర్‌ విభాగానికి వెళ్లి దరఖాస్తు పూర్తిచేయాలి. 

ఇంటర్న్‌షిప్‌లు: వీటిని కూడా ఉద్యోగసాధనకు సోపానాలుగా వినియోగించుకోవచ్చు. కొన్ని కంపెనీలు అప్పుడే చదువు పూర్తిచేసిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తాయి. భవిష్యత్తులో ఉద్యోగావకాశాల కల్పనలో ఇంటర్న్‌షిప్‌ చేసిన వారికి ప్రాధాన్యమిస్తాయి. కొన్ని రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు టెంపరరీ, కాంట్రాక్ట్‌ ఉద్యోగావకాశాలను కల్పిస్తాయి. వీటి సహాయంతో కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఉద్యోగాలను సంపాదించవచ్చు. భవిష్యత్తులో ఈ ఉద్యోగాలు పర్మినెంట్‌ అయ్యే అవకాశం ఉంటుంది కూడా. 

దరఖాస్తు కీలకం

నైపుణ్యాలకు మెరుగు: ఒకపక్క ఆసక్తి ఉన్న సంస్థలకు దరఖాస్తు చేస్తూనే మరోపక్క మీ నైపుణ్యాలనూ మెరుగుపరుచుకోవాలి. దీని కోసం ఆన్‌లైన్‌ కోర్సులను ఎంచుకోవచ్చు. లేదా వర్క్‌షాప్‌లకు హాజరుకావడం ద్వారా తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవచ్చు. దరఖాస్తు చేస్తున్న సమయంలోనే మరిన్ని నైపుణ్యాలను సంపాదించినట్లయితే రెజ్యూమెలో అదనంగా వాటిని చేర్చాలని గుర్తుంచుకోవాలి. అలాగే తాత్కాలికంగా పనిచేస్తూ కొంత అనుభవం సంపాదించినా దాన్ని రెజ్యూమెలో జోడించడం మర్చిపోకూడదు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడం ఒక ఎత్తయితే. ఆయా ఉద్యోగాలకు దరఖాస్తులు పంపడం మరో ఎత్తు. దరఖాస్తును నింపిన తర్వాత రాసిన వివరాలను మరోసారి జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే కొంతమంది ఏ పోస్టుకైనా ఒకే దరఖాస్తును పంపేస్తుంటారు. అలా కాకుండా పోస్టును బట్టి రాయాల్సిన వివరాలూ మారుతుంటాయనే విషయాన్ని గుర్తించాలి. విద్యార్హతలు, అనుభవం, ... సంబంధిత వివరాలను సక్రమంగా పూరించారో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి దరఖాస్తును సమర్పించిన తర్వాత వివరాలను మార్చడానికి ఎలాంటి అవకాశమూ ఉండదు.  చాలా సంస్థలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో మాత్రమే నియామక ప్రకటనలు పెడుతున్నాయి. అందుకే అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న కంపెనీల వెబ్‌సైట్లను తరచూ చూస్తుండాలి.  ఇలా చేయడం వల్ల  వాటిలో ఉద్యోగ ప్రకటన వెలువడగానే దరఖాస్తు చేయొచ్చు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి ఇలా అవకాశం ఏర్పడుతుంది.  

ప్రణాళిక ఉండాల్సిందే: ఒక కంపెనీకి దరఖాస్తు చేసిన తర్వాత కొంతమంది ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌ కోసం నెలల తరబడి ఎదురుచూస్తుంటారు. ఇలా చేయడం వల్ల విలువైన సమయమెంతో వృథా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. వారానికో ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ వారంలో పంపాల్సిన దరఖాస్తులు, కలవాల్సిన వ్యక్తులు, హాజరు కావాల్సిన కార్యక్రమాలతో పక్కా ప్రణాళికను రూపొందించుకోవాలి. దీని ప్రకారం పనులను పూర్తిచేయాలి. అంతేగానీ ఒకేదాని మీద దృష్టిని కేంద్రీకరించకూడదు. ఏ వారం లక్ష్యాలను ఆ వారంలోనే పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. ఎంత చేసినా కొన్ని పనులు మిగిలిపోతే వాటిని మరుసటి వారానికి వాయిదా వేసుకుని తప్పనిసరిగా పూర్తిచేయాలి. 

సాధన తప్పనిసరి: రాత పరీక్షల తర్వాత జరిపే ఇంటర్వ్యూలో వివిధ రకాల ప్రశ్నలు అడుగుతుంటారు. సాధారణంగా మీ విద్యార్హతలు, అనుభవాలకు సంబంధించిన ప్రశ్నలను సంధిస్తుంటారు. వీటితో పాటుగా మీ ఆసక్తి, అభిరుచులను తెలుసుకునే విధంగానూ ప్రశ్నలు వేస్తుంటారు. ఇంటర్వ్యూకు హాజరుకావడానికి ముందు రోజు... జవాబులు ఇచ్చే క్రమంలో మీ హావభావాలను అద్దం ముందు నిలబడి పరీక్షించుకోవచ్చు. ఇలా సాధన చేస్తే ఒత్తిడి తగ్గి, ఎలాంటి మార్పులు చేసుకోవాలో అర్థమవుతుంది. క్రీడాకారులు మైదానంలో ఆటను ప్రదర్శించడానికి ముందు.. ఎన్నోసార్లు సాధన చేస్తారు. ఆ తర్వాతే అసలైన పోటీకి తలపడతారు. సరిగ్గా మీరూ ఇలాగే సాధన చేయాలి. దీంతో తడబడకుండా.. స్థిరంగా జవాబులు చెప్పగలుగుతారు.
 

Posted Date : 27-08-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌