• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ఎంబీఏ

మేనేజ్‌మెంట్‌ విద్యపై ఆసక్తి ఉన్నవారు ఎంచుకోగల ప్రముఖ సంస్థల్లో ఐఐఎఫ్‌టీ ఒకటి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి గమ్యం. దీనిలో ప్రవేశానికి ఇటీవలే ప్రకటన విడుదలైంది. ప్రవేశపరీక్ష, బృంద చర్చ, మౌఖిక పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

మేనేజ్‌మెంట్‌ విద్య అనగానే క్యాట్‌ గుర్తుకొస్తుంది. ఆ తరువాత అంతటి ప్రాముఖ్యమున్నదానిగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) పరీక్షకు పేరు. మేనేజ్‌మెంట్‌కు సంబంధించి రెండూ ప్రతిష్ఠాత్మక పరీక్షలే. కానీ ఐఐఎఫ్‌టీ పరీక్షలో వేగం కీలకమైతే, క్యాట్‌లో క్రిటికల్‌ థింకింగ్‌కు ప్రాముఖ్యముంటుంది. ఇదే ఈ రెండింటిలో ప్రధాన తేడా. ఐఐఎఫ్‌టీలో ప్రవేశానికి ఏటా 55,000కు పైగా అభ్యర్థులు పోటీ పడతారని అంచనా. ఈ సంస్థ ప్రత్యేకంగా ‘ఐఐఎఫ్‌టీ ఎగ్జామ్‌’ను నిర్వహించి ప్రవేశాలను కల్పిస్తుంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దీనిని నిర్వహిస్తుంది. అర్హత సాధించినవారు ఎంబీఏ (ఐబీ- ఇంటర్నేషనల్‌ బిజినెస్‌)లో ప్రవేశం పొందుతారు. సాధించిన ర్యాంకు ద్వారా మూడు క్యాంపస్‌లు- ఐఐఎఫ్‌టీ- దిల్లీ, కోల్‌కతా, కాకినాడల్లో అడ్మిషన్‌ అవకాశం కల్పిస్తారు. నీడ్‌ బేస్‌డ్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.6.50 లక్షలలోపు ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీవారికీ ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌ అవకాశాలను అందిస్తున్నారు. కోర్‌ అంశాలతోపాటు ఎలక్టివ్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఆరు ట్రైమిస్టర్లుగా విభజించి ఉంటుంది. కోర్‌ అంశాల్లో 30 సబ్జెక్టులున్నాయి. ఎనిమిది ఎలక్టివ్స్‌ అందుబాటులో ఉన్నాయి. కోర్సులో భాగంగా పోర్ట్‌ విజిట్, సమ్మర్‌ ప్రాజెక్ట్, రిసెర్చ్‌ ప్రాజెక్ట్, కాంప్రహెన్సివ్‌ వైవా (అయిదో ట్రైమిస్టర్‌లో), ఎస్‌ఏపీ (సోషల్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌) ఉంటాయి.

ఎంపిక ఇలా..

మూడు దశలు- రిటన్‌ ఎబిలిటీ టెస్ట్‌ (డబ్ల్యూఏటీ), బృంద చర్చ (జీడీ), వ్యక్తిగత ఇంటర్వ్యూ (పీఐ)ల్లో సాధించిన స్కోరు ఆధారంగా ఎంపిక ఉంటుంది. గత తరగతుల్లో అకడమిక్‌ పరంగా సాధించిన మార్కులు, కోర్సుల్లో వైవిధ్యం, లింగ వైవిధ్యం, పని అనుభవానికీ మార్కులు ఇస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు- అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా కటాఫ్‌ నిర్ణయిస్తారు. దీనిలో అర్హత సాధించినవారు ఒక ఎస్సేను సమర్పించాల్సి ఉంటుంది. దీనిలో విషయం పట్ల అభ్యర్థికి ఉన్న స్పష్టత, సమర్పించిన విధానాలను పరిశీలిస్తారు. దీనిలోనూ అర్హత సాధించినవారికి బృంద చర్చ నిర్వహిస్తారు. దీనిలో అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, బృందంతో కలిసి పనిచేయడం, కమ్యూనికేషన్, ఇచ్చిన అంశంపై ఏవిధంగా స్పందించారో పరిశీలిస్తారు. దీనిలో అర్హత సాధించినవారికి వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తంగా సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు.
ఎన్‌ఆర్‌ఐలకు జీమ్యాట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

అర్హతలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం మూడేళ్ల వ్యవధిగల డిగ్రీ/ తత్సమాన విద్యను పూర్తిచేసినవారు అర్హులు. 
గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో 50 శాతం మార్కులు సాధించి ఉండటం తప్పనిసరి. ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందినవారు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి.
గ్రాడ్యుయేషన్‌ తుది సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ 2021 అక్టోబరు 7 నాటికి ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఎలాంటి వయః పరిమితీ లేదు.

పరీక్ష విధానం

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. ఇంగ్లిష్‌ మాధ్యమంలో ప్రశ్నలుంటాయి. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు. క్వాంటిటేటివ్‌ అనాలిసిస్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, వెర్బల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. విభాగం, అడిగే ప్రశ్నలను బట్టి మార్కుల్లో మార్పులుంటాయి. గత ప్రశ్నపత్రాలను గమనిస్తే ఈ విషయంగా అవగాహనకు రావొచ్చు. వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

దరఖాస్తు చేయాలంటే..

సంస్థ వెబ్‌సైట్‌ (https://iift.nta.nic.in) లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ వారికి రూ.1000. వెనుకబడిన వర్గాలవారు సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది.
సమర్పించాల్సిన పత్రాలు: పది, ఇంటర్, డిగ్రీ ధ్రువపత్రాలు; వెనుకబడిన తరగతుల వారు సంబంధిత ధ్రువపత్రాలు; ఫొటో, సంతకం స్కాన్‌ కాపీలు; అనుభవం ఉన్నవారు సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు గడువు: డిసెంబరు 20, 2020
ప్రవేశపరీక్ష తేదీ: జనవరి 24, 2021
వెబ్‌సైట్‌: www.iift.edu

Posted Date : 19-11-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌