• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అవుతారా.. అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి?

ఎన్‌ఐఏసీఎల్‌లో 300 పోస్టులు

 

 

డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ఇప్పటికే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు సిద్ధంగా ఉన్నాయి! కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 300 ఏవో పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. రెండు దశల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. విధుల్లో చేరినవారికి రూ.60 వేల వేతనం అందుతుంది! 

 

బీమారంగంలో ప్రాధాన్యం ఉన్న వాటిలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు ముందుంటాయి. సంబంధిత బ్రాంచీల వ్యవహారాలను ఈ విధుల్లో ఉన్నవారు పర్యవేక్షిస్తారు. అనుభవం, శాఖాపరమైన పరీక్షలతో భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఏవోలకు దక్కుతుంది. ఐబీపీఎస్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించే ఫేజ్‌-1 (ఆబ్జెక్టివ్‌) ఫేజ్‌-2 (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌) పరీక్షల్లో, మౌఖిక పరీక్షల్లో మెరిసినవారితో నియామకాలు చేపడతారు. విధుల్లో చేరినవారు కనీసం నాలుగేళ్లు కొనసాగడం తప్పనిసరి. మధ్యలో వైదొలిగితే ఏడాది వేతనం చెల్లించాల్సి ఉంటుంది. 

 

ప్రొబేషన్‌ వ్యవధి 6 నెలలు. ఈ సమయంలో వీరు ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే నాన్‌ లైఫ్‌ లైసెన్సియేట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. దీన్ని పూర్తిచేయలేనివారికి మరికొంత వ్యవధి ఇస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తేనే పూర్తికాల విధుల్లోకి తీసుకుంటారు. రూ.32,795 మూలవేతనానికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు కలుపుకుని రూ.60 వేలు జీతం మొదటి నెల నుంచే లభిస్తుంది.  

 

ప్రాథమిక పరీక్ష ఇలా 

వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్‌ ఎబిలిటీ 35, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 35, ఆంగ్ల భాష (వ్యాకరణం, పద సంపద, గ్రహణ)ల నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. పరీక్ష వ్యవధి గంట. ప్రతి విభాగాన్నీ 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. విభాగాలవారీ కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి. ఇలా అర్హులైనవారి జాబితా నుంచి ఆయా కేటగిరీల్లో ఉన్న ఖాళీలకు 15 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను తర్వాతి దశ పరీక్షకు ఎంపిక చేస్తారు. 

 

ప్రధాన పరీక్ష 

200 మార్కులకు ఆబ్జెక్టివ్, 30 మార్కులకు డిస్క్రిప్టివ్‌ విధానంలో ప్రధాన పరీక్ష ఉంటుంది. ఈ రెండూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ పరీక్ష పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్‌ మొదలవుతుంది.  

 

ఆబ్జెక్టివ్‌ పరీక్షలో రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, జనరల్‌ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఒక్కో విభాగానికీ 50 మార్కులు కేటాయించారు. వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌ 30 నిమిషాల్లో, మిగిలిన విభాగాలు ఒక్కోటీ 40 నిమిషాల్లో పూర్తి చేయాలి. విభాగాలవారీ అర్హత మార్కులు సాధించాలి. ఆబ్జెక్టివ్‌లో అర్హులైతేనే డిస్క్రిప్టివ్‌ పేపర్‌ మూల్యాంకనం చేస్తారు. డిస్క్రిప్టివ్‌ పరీక్షలో లెటర్‌ రైటింగ్‌ 10 మార్కులకు, ఎస్సే 20 మార్కులకు ఉంటాయి. దీనికి 30 నిమిషాలు కేటాయించారు. డిస్క్రిప్టివ్‌లో 15 మార్కులు వస్తేనే అర్హులైనట్లు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 13.5 మార్కులు పొందాలి. డిస్క్రిప్టివ్‌ పరీక్షలో వచ్చిన మార్కులు తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. డిస్క్రిప్టివ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను వారు ప్రధాన పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూకు వెయిటేజీ 75:25. ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులతో నియామకాలు చేపడతారు. 

 

ప్రాథమిక, ప్రధాన పరీక్షల్లో రుణాత్మక మార్కులున్నాయి. తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో పావు శాతం చొప్పున తగ్గిస్తారు. 

 

ఇవి ముఖ్యం...

కనీసం 10 మాక్‌ పరీక్షలు రాయాలి. నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయగలుగుతున్నారా, ఎన్ని మార్కులు సాధిస్తున్నారు గమనించాలి. 

60 మార్కులకు తగ్గకుండా వచ్చినట్లు చూసుకుంటే ప్రధాన పరీక్షకు ఎంపికవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

అభ్యర్థి తాను వెనుకబడిన అంశాలపై పట్టు పెంచుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వాలి.  

పోటీ పరీక్షల్లో విజయానికి పరిజ్ఞానంతో పాటు ఏ ప్రశ్నలు ముందు సాధించాలి, వేటిని తర్వాత ప్రయత్నించాలో నిర్ణయించుకోగల నైపుణ్యానికీ ప్రాధాన్యం ఉంటుంది. వేటిని వదులుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు మాక్‌ పరీక్షలు మార్గదర్శిలా ఉపయోగపడతాయి.  

తక్కువ సమయంలో ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్ల నుంచి సమాధానం రాబట్టవచ్చు. ఆ అవకాశం అరిథ్‌మెటిక్‌ విభాగంలోని ప్రశ్నలకు ఎక్కువగా ఉంటుంది.

సమాధానం రాబట్టడం కష్టంగా అనిపించిన ప్రశ్నలనూ, జవాబు గుర్తించడానికి ఎక్కువ వ్యవధి అవసరమైనవాటినీ వదిలేయడమే మంచిది. మిగతా ప్రశ్నలకు జవాబులు గుర్తించడం పూర్తయిన తర్వాత సమయం ఉంటే వీటి గురించి ఆలోచించవచ్చు. 

జనరల్‌ అవేర్‌నెస్, ఎస్సే, లెటర్‌ రైటింగ్‌ అంశాలపై ప్రాథమిక పరీక్ష అనంతరం దృష్టి సారిస్తే సరిపోతుంది. 

ఒకే అంశంపై ఎక్కువ పుస్తకాలను అధ్యయనం చేస్తే సమయం వృథా అవుతుంది. ఏదో ఒకటే ఎంచుకుని వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు సాధన చేయాలి.

 

సన్నద్ధత

 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగంలో న్యూమరికల్‌ ఎబిలిటీ, అరిథ్‌మెటికల్‌ ఎబిలిటీ, డేటా ఎనాలిసిస్‌ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగంలో ప్రశ్నల కోసం గణితంలో ముఖ్యమైన భాగహారం, గుణకారం, కూడికలు, తీసివేతలను క్షుణ్నంగా సాధన చేయాలి. దీనితోపాటు ఎక్కువగా వర్గాలు, ఘనాలు, ఘాతాంకాలు, భిన్నాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. 

అరిథ్‌మెటిక్‌ విభాగంలో ముఖ్యంగా కాలం-పని, కాలం-దూరం, లాభనష్టాలు, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, వైశాల్యం, ఘనపరిమాణం మొదలైనవాటిపై శ్రద్ధ చూపాలి. 

పట్టికలు, బార్‌ చార్టులు, గ్రాఫ్‌ల నుంచి ప్రశ్నలొస్తాయి. వాటిలో ఉన్న వివరణల ఆధారంగా సమాధానం రాబట్టాలి. డేటాను విశ్లేషించే సామర్థ్యం పెంపొందించుకుంటే జవాబులు గుర్తించడం తేలికవుతుంది.

చిన్న చిన్న గణాంకాలను నోటితోనే (మనసులోనే) లెక్కించగలిగేలా ఉండాలి. కనీసం 30 వరకు వర్గాలు (స్క్వేర్స్, క్యూబ్స్‌) నోటితో చెప్పగలిగేలా ఉండాలి.

 

జనరల్‌ ఇంగ్లిష్‌

ఇంగ్లిషు సబ్జెక్టులో గ్రామర్, వొకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌లకు ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా ప్రామాణిక గ్రామర్‌ పుస్తకాన్ని పూర్తిస్థాయిలో అభ్యాసం చేయాలి. పద పరిజ్ఞానం పెంచుకోవడం అవసరం. ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, సెంటెన్స్‌ కరెక్షన్, సిననిమ్స్, యాంటనిమ్స్, టెన్సెస్, పారాగ్రాఫ్‌...అంశాలపై శ్రద్ధ పెట్టాలి.  

 

రీజనింగ్‌

అభ్యర్థికి సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఎంతమేరకు ఉందనే విషయాన్ని రీజనింగ్‌లో గమనిస్తారు. ప్రాబ్లమ్‌ సాల్వింగ్, సిచ్యువేషన్‌ అనాలిసిస్, లాజికల్‌ సొల్యూషన్‌ ఆధారం చేసుకొని ప్రశ్నలుంటాయి.

ఉన్నతస్థాయి ఆలోచనా విధానం, ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా పరిగణనలోనికి తీసుకోవడం, వాస్తవికతకు దగ్గరగా, అనుగుణంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడం ఈ విభాగంలో సమర్థంగా సమాధానాలు గుర్తించడానికి దోహదం చేస్తాయి.

 

జనరల్‌ అవేర్‌నెస్‌

అభ్యర్థి పరిశీలన, అవగాహనను పరిశీలించేవిధంగా ప్రశ్నలుంటాయి. తాజా అంశాలకు ప్రాధాన్యం ఉంది. ఉదాహరణకు.. ఇటీవల ఒలింపిక్‌ క్రీడలు ముగిశాయి. అందువల్ల ఒక ప్రశ్న అయినా ఆశించవచ్చు. అలాగే కొత్త ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కొత్త నియామకాలు, జాతీయ స్థాయిలో ముఖ్యమైన అంశాల నుంచి ప్రశ్నలు రావచ్చు. రోజువారీ ముఖ్యాంశాలను నోట్సు రాసుకుంటే గుర్తుంటాయి. స్టాక్‌ జీకే నుంచీ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వివిధ అంశాలకు సంబంధించి ఎత్తైనవి, లోతైనవి, పొడవైనవి, పొట్టివి, పెద్దవి...అలాగే దేశాలు... వాటి రాజధానులు, కరెన్సీ, పార్లమెంట్‌ పేరు, ప్రధాని లేదా అధ్యక్షులు.. ఈ రకమైన ప్రశ్నలు కూడా ఉంటాయి. ఉద్యోగం ఇన్సూరెన్స్‌ కంపెనీలో కాబట్టి బీమా విభాగం ప్రశ్నలూ ఆశించవచ్చు. అందువల్ల ఆ రంగంలో తాజా పరిణామాలపైనా దృష్టి సారించడం అవసరం. 

 

ఖాళీలు: మొత్తం 300. విభాగాల వారీ అన్‌ రిజర్వ్‌డ్‌ 121, ఓబీసీ 81, ఈడబ్ల్యుఎస్‌ 30, ఎస్సీ 46, ఎస్టీ 22  

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 21

ఫేజ్‌-1 పరీక్షలు: అక్టోబరులో 

ఫేజ్‌-2: నవంబరులో  

అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం సరిపోతాయి. 

వయసు: ఏప్రిల్‌ 1, 2021 నాటికి 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది) 

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100. మిగిలిన అందరికీ: రూ.750  

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.  

వెబ్‌సైట్‌: https://www.newindia.co.in/
 

Posted Date : 20-09-2021 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌