• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కొత్త ఏడాదిలో కొట్టాలి కొలువు!

నిపుణుల స‌ల‌హాలు, సూచ‌న‌లు

‘కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాల’నే లక్ష్యం పెట్టుకున్నవారు ఆ లక్ష్యం సాధించే మార్గంలో ముందుకు సాగాలి! సర్కారీ కొలువు ఆశించేవారి సంఖ్య మనదేశంలో చాలా ఎక్కువ. అయితే ఈ   అవకాశాలు పరిమితమైనవి. నూతన సంవత్సరంలో యూపీఎస్‌సీ, రాష్ట్ర సర్వీస్‌ కమిషన్లు, ఇతర ప్రభుత్వ నియామక సంస్థలు ప్రకటించే నోటిఫికేషన్లలో తమ అదృష్టం పరీక్షించుకోవాలని యువత సహజంగానే ప్రయత్నిస్తుంది. ఆ దిశలో తీర్మానాలూ చేసుకుంటారు. ఈ లక్ష్యసాధనకు దృఢంగా నిలబడాలంటే.. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ తరహా ఆలోచనా విధానం పెంచుకోవాలి? 

యూపీఎస్‌సీ, గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో రాత నైపుణ్యం చాలా ముఖ్యం. బ్యాంకింగ్‌ పరీక్షల్లో వేగంగా చేయగలిగే నైపుణ్యం ప్రధానం. యూనిఫామ్‌ ఉద్యోగాల్లో శారీరక  నైపుణ్యాలు కీలకం. రాష్ట్రస్థాయి గ్రూప్‌-2 లాంటి పరీక్షల్లో వివిధ అంశాలను  విశ్లేషించే నైపుణ్యాలు అవసరం. పోటీ పరీక్షల్లో రాణించాలంటే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూనే అవసôమైన   నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. 

శక్తియుక్తులపై అవగాహన 

అభ్యర్థులు తమ శక్తియుక్తులు, సామర్ధ్యాలపై  క్షుణ్ణంగా అవగాహనతో ఉండాలి. వాటికనుగుణంగానే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఇతరులను అనుకరించి వారిలాగా తాము ఉండాలనుకునే క్రమంలో సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోలేనట్లయితే ఆశించిన ఫలితాలు రావు. భావాలనూ, సమాచారాన్నీ సరిగా వ్యక్తీకరించలేని అభ్యర్థి యూపీఎస్‌సీ, గ్రూప్‌-1 మెయిన్స్‌ లాంటి పరీక్షల్లో రాణించడం కష్టం. ఫ్యాక్ట్స్‌ను గుర్తుంచుకోలేనివారు గ్రూప్‌-2, గ్రూప్‌ బి ఉద్యోగాలకు పోటీపడినా పెద్ద ప్రయోజనం ఉండదు. క్లరికల్‌ న్యూమరికల్‌ ఎబిలిటీస్‌ లాంటి సామర్ధ్యాలు లోపించినపుడు బ్యాంకింగ్, రైల్వే మొదలైన పరీక్షల్లో రాణించడం కష్టమే. శారీరక సామర్ధ్యం లేకపోతే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వంటి యూనిఫామ్‌ ఉద్యోగాల్లో విజయం సాధించటం అసాధ్యం. బోధన సామర్ధ్యం లేనివారు ఉపాధ్యాయ -అధ్యాపక నియామక పరీక్షల్లో రాణించలేరు. కేంద్రప్రభుత్వ, బ్యాంకింగ్‌ రంగ ఉద్యోగాల్లో విజయం సాధించాలంటే ఆంగ్లభాషపై పట్టు ఉండాల్సిందే.

సరైన మెంటర్‌ 

లక్ష్యాన్ని నిర్దేశించుకునేందుకైనా, కార్యాచరణ అమలు చేసేందుకయినా సరైన మెంటర్‌ ఎంపిక అనేది సగం శ్రమను తగ్గిస్తుంది. ఎదురయ్యే సవాళ్లను ఎలా పరిష్కరించుకోవాలో మెంటర్‌ ద్వారా సులభమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించినవారిని గానీ, సీనియర్‌ అభ్యర్థులను గానీ, సమీపంలో ఉండే అధ్యాపకులను గానీ ఎంపిక చేసుకుని వారి మార్గదర్శకత్వంలో ముందుకు సాగితే విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయి. మెంటర్‌ నిబద్ధత, అనుభవం, సానుకూల ధోరణి అభ్యర్థి నెగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

నైపుణ్యాలతో అదనపు మార్కులు

పరీక్షల్లో విజయం సాధించేందుకు కంటెంట్‌ (విషయ పరిజ్ఞానం) ముఖ్యం. అయితే పోటీ పరీక్షల్లో గెలుపునకు కావలసిన అదనపు మార్కులను సంబంధిత నైపుణ్యాల వల్లే పొందుతారు. ఉదాహరణకు యూపీఎస్‌సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో రాత నైపుణ్యం చాలా ముఖ్యం. బ్యాంకింగ్‌ పరీక్షల్లో వేగంగా చేయగలిగే నైపుణ్యం ప్రధానం. కొన్ని పరీక్షల్లో వేగంగా చదవగలిగే నైపుణ్యం అవసరం. యూనిఫామ్‌ ఉద్యోగాల్లో శారీరక నైపుణ్యాలు కీలకం. రాష్ట్రస్థాయి గ్రూప్‌-2 లాంటి పరీక్షల్లో వివిధ రకాలైన అంశాలను విశ్లేషించిగలిగిన నైపుణ్యాలు అవసరం. పోటీ పరీక్షల్లో రాణించాలంటే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూనే వివిధ రకాలైన అవసర నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకునే అభ్యర్థులు లక్ష్యాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలు ఉన్నాయా లేదా అని నిర్ధారించుకుని రంగంలోకి దిగాలి. 

సుదీర్ఘ పోరుకు సంసిద్ధత

యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ లాంటి సంస్థలు షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ రంగంలో ఉద్యోగాల ఖాళీలను బట్టి మాత్రమే నోటిఫికేషన్లు వస్తాయి. నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు మాత్రం పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తారు.అయితే రాష్ట్రస్థాయిలో నిర్వహించే అనేక పరీక్షలు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లవు. రాష్ట్ర సర్వీస్‌ కమిషన్ల ద్వారా వచ్చే గ్రూప్‌-1, గ్రూప్‌-2 మొదలైన వాటితో పాటు ఉపాధ్యాయ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మొదలైన ఉద్యోగాల పరీక్షలు ఏమాత్రం కచ్చితత్వం లేనివి. కొన్నికొన్ని సందర్భాల్లో వాటికోసం నాలుగు నుంచి ఆరు సంవత్సరాలపాటు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అది కూడా కచ్చితత్వం ఉండదు. కోర్టు కేసులు, ఇతరత్రా ఉపద్రవాలను బట్టి సుదీర్ఘ కాలం ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులు తమ తక్షణ అవసరాలేమిటో స్పష్టంగా నిర్వహించుకుని వాటికి అనుగుణంగా ఈ ఉద్యోగాలను పొందగలమా లేదా అని విశ్లేషించుకోవాలి. సుదీర్ఘ కాలం పోటీ పరీక్షల కోసం వెచ్చించలేనివారు ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడమే సముచితం. 

నిరంతర ప్రేరణ 

పోటీ పరీక్షల్లో కాలం గడిచే కొద్దీ అనేక సవాళ్ల వల్ల ప్రేరణ కోల్పోయి రంగం నుంచి విరమించే వారి శాతం చాలా ఎక్కువ. పోటీ పరీక్షల్లో రాణించాలంటే విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు ఎంత ముఖ్యమో ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతుండటం కూడా అంతే ముఖ్యం. విజయాలను సాధించిన వ్యక్తులు అనుసరించిన మార్గాలను పరిశీలించటం, విజయం సాధించాక వచ్చే ఫలితాలను ఊహించుకోవటం, శారీరక మానసిక అవరోధాలు అధిగమించేందుకు కౌన్సెలింగ్‌ ప్రక్రియకి వెళ్ళటం, మంచి స్నేహితులుండే బృందంలో సభ్యులు కావటం, యోగా, ప్రాణాయామం లాంటివి అనుసరించడం, ప్రతికూల ధోరణితో ఉండేవారికి దూరంగా ఉండటం, మెంటర్‌ అనుభవాల్ని తమ అనుభవంగా భావించడం లాంటి మెలకువల ద్వారా ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతూ ఉంటే ఆశించిన ఫలితాలు మరింత దగ్గరగా వస్తూంటాయి.

పరీక్షల్లో పోటీ పరీక్షలు వేరయా

అకడమిక్‌ పరీక్షల్లో కష్టపడిన వారందరూ స్కోర్లు సాధించి విజేతలవుతారు. పోటీ పరీక్షల్లో విజేతలు తక్కువ; పరాజితులే ఎక్కువ. పోటీ పరీక్షల్లో చదివే విధానం అకడమిక్‌ పరీక్షల్లో చదివే విధానం కంటే చాలా భిన్నమైంది. ఏ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నాను, దాన్ని నిర్వహించే సంస్థ, ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థ లక్ష్యాలు ఏమిటి? అభ్యర్థుల నుంచి వారు ఆశిస్తున్నది ఏమిటి? మొదలైనవి దృష్టిలో పెట్టుకుని సన్నద్ధతను అన్వయించుకోవాలి. అప్పుడు మాత్రమే పరీక్షకు అవసరమైన రీతిలో తయారవుతారు. పోటీ పరీక్షల్లో సిలబస్‌ అనేది నామమాత్రం. ఏయే సందర్భాల్లో సిలబస్‌కి బయట వెళ్లి మరీ ప్రశ్నలడుగుతారనేది అంచనా వేయగలిగినప్పుడు విజయాన్ని సాధించటానికి మారం సుగమమవుతుంది. ఏ విషయాన్ని పరిహరించాలి, దేన్ని అదనంగా చదవాలి అనే అవగాహన పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యం. సిలబసులోని ఏ విషయాల్లో కనిష్ఠ, మధ్యమ, గరిష్ఠ స్థాయుల్లో ప్రిపరేషన్‌ ఉండాలో నిర్ణయించుకోవడమూ విజయానికి దారి తీసే అంశమే.

మీకుందా ప్లాన్‌ - బి?

‘అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతే ఏమిటి’? అనే ప్రశ్న వల్ల అభ్యర్థులు చాలా సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల విజయావకాశాలను తగ్గించుకుంటారు. ‘పోటీ పరీక్షల్లో సహజంగా అందరి లక్ష్యం ఒకటే ఉండాలి, అదే జీవన్మరణ సమస్య’ అని చెబుతూ ఉంటారు. కానీ అది అంత సరైన ఆలోచన కాదు. ఎప్పుడైతే జీవన్మరణ సమస్య అనుకుంటామో రెట్టించి చదువుతామేమో కానీ అంతకు పదిరెట్లు ఒత్తిడికి గురవడం వల్ల నష్టమే అధికం. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని భావించి అప్పుడేం చెయ్యాలో ప్లాన్‌- బి ఉంటే అభ్యర్థులు చాలా ఉపశమనం పొందుతారు. ఫలితంగా విజయావకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అయితే...‘ప్లాన్‌-బి ఉంది కదా’ అని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే మాత్రం అసలుకే మోసం వస్తుంది సుమా!


 

Posted Date : 04-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌