• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నిలవాలి.. గెలవాలి! 

పోటీ పరీక్షలకు నాలుగంచెల గెలుపు బాట   

 

 

ప్రభుత్వోద్యోగ సాధనకు చేసే ప్రయత్నాలకు అననుకూల పరిస్థితులుంటాయి. అపజయాలూ ఎదురవుతాయి. అధిగమించడమే పోటీ తత్వం. సరైన దారిలో ముందుకు సాగి విజయం సాధించడమే అంతిమ లక్ష్యం! 

 

లక్షల మందితో పోటీ. వందలు, వేలు మాత్రమే ఉద్యోగాలు. ఆర్థిక, శారీరక, సామర్ధ్య, సామాజిక అవరోధాలు సహజం. పోటీ పరీక్షల ద్వారా విజయం సాధించాలనుకునేవారిలో అత్యధికులకు అనేక ప్రయత్నాల్లో అపజయమే ఉంటుంది. కొద్దిమంది మాత్రమే తొలి లేదా మలి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఇలాంటి నేపథ్యంలో అత్యధిక పోటీదారుల్లో నిరాశ నిస్పృహలతో పాటు ప్రతికూల (నెగిటివ్‌) ధోరణులు ఏర్పడుతూ ఉంటాయి. 

 

రాష్ట్రసాయి ఉద్యోగ నియామకాలు క్రమబద్ధంగా జరగవు. అనేక అవకతవకలు, తప్పిదాల వల్ల సంవత్సరాల తరబడి రేయింబవళ్లు కష్టపడినా అనుకున్న ఫలితాలు సాధించలేని వాతావరణం ఉంటుంది. అందువల్ల పోటీదారుల్లో మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్‌ లాంటి మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. ఈ మానసిక రుగ్మతలూ, ఒత్తిడులూ ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది నేర స్వభావాన్ని పెంచుకుంటారు. ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. 

 

ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి రెండు ప్రయత్నాల తర్వాత కొంతమంది పోటీ పరీక్షల ప్రయత్నాల నుంచి తప్పుకొని వేరే ఉపాధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. పోటీ పరీక్షల్లో అపజయాన్ని మూటగట్టుకుని జీవితాంతం బాధపడుతూ ఉంటారు. 

 

మరికొంతమంది ఇటీవలి కాలంలో ఈ పోటీ పరీక్షల రంగంలోకి ప్రవేశించి అనిశ్చిత వాతావరణాన్ని గమనించి తీవ్రమైన మనోవేదనకు గురవుతారు. తమ పూర్తి శక్తియుక్తుల్ని ఉపయోగించరు. మరో ఉపాధి బాటలోనూ ప్రవేశించరు. అనేక రుగ్మతలకు గురవుతూ కుటుంబంలో, సమాజంలో లోపభూయిష్ఠమైన సర్దుబాటుతనం ఏర్పరచుకుంటారు. 

 

ఇలాంటి దుస్థితి ఏర్పడకుండా విజయాన్ని సాధించుకునేందుకు పోటీ పరీక్షల అభ్యర్థులకు మానసికపరంగా ఏ విధమైన ఏర్పాట్లు అవసరమో చూద్దామా?. 

 

1. దీర్ఘకాలిక పోరాటానికి సంసిద్ధత 

సివిల్స్, గ్రూప్స్‌ లాంటి పరీక్షల్లో అంతిమ విజేతలైనవారిలో ఎక్కువమంది కనీసం మూడు సంవత్సరాలకు పైగా శ్రమపడినవారే. ‘మొదటి విడత విజయం సాధించాం’ అని చెప్పుకునేవారి వెనుక కూడా రెండు మూడు సంవత్సరాల సన్నద్ధత ఉంటుంది. రాష్ట్ర సాయి పరీక్షల్లో ఒక క్రమబద్ధత ఉండదు. మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మూడు నాలుగు సంవత్సరాలు ప్రిపరేషన్‌ మీదే ఉండటం అనేది నిజంగా కష్టమైన విషయమే అయినప్పటికీ అంతిమ ఫలితం సాధించాలంటే ఆ దీర్ఘకాలాన్ని కూడా చక్కగా వినియోగించగలిగిన ప్రణాళిక ఉంటేనే అనుకున్న లక్ష్యం సాధించగలుగుతారు. 

సుదీర్ఘ కాలం వేచివుండాలనే విషయం గ్రహించినప్పుడే నిర్ణయంలో హేతుబద్ధత ఉంటుంది. ఫలితంగా మానసికపరమైన ఒత్తిళ్లు ఉండవు. ఈ చిన్న లాజిక్‌ను సరిగా అర్థం చేసుకుంటే కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుంది. 

 

2. ఆర్థిక నిర్వహణ అతి కీలకం 

తాత్కాలిక ఆవేశంతో ఆర్థిక వనరులను సరిగా అంచనా వేసుకోకుండా కొంతమంది అభ్యర్థులు పోటీ పరీక్షల్లో దిగుతారు. ఆ తర్వాత ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక మధ్యలోనే వదిలేస్తారు. ఫలితంగా లక్ష్య సాధనలో విఫలమవుతారు. పోటీ పరీక్షలకు దిగే ముందే, అభ్యర్థులు తమపై ఉండే ఆర్థిక భారాన్ని అంచనా వేసుకోవాలి. కుటుంబ ఆర్థిక భారాన్ని భరించాల్సివస్తే పార్ట్‌ టైం జాబ్‌ నిర్వహిస్తూ ఏ విధంగా చదువుకోవాలి అనే ప్రణాళిక ఉండాలి. కుటుంబ భారం లేదనుకుంటే.... పోటీ పరీక్షలకు ఎంతకాలం సమయాన్ని వెచ్చించాలి, ఆ సమయంలో ఆర్థికపరమైన ఖర్చులను ఏవిధంగా ఎదుర్కోవాలీ అనే వ్యూహం పటిష్ఠంగా ఉండాలి. సంవత్సరాల తరబడి అపజయాలు ఎదురైనా, పోటీ పరీక్షల నోటిఫికేషన్‌ రాకుండా సంవత్సరాలు గడుస్తున్నా ఆర్థిక భారాన్ని ఎలా విభజించుకోవాలనే ప్రణాళిక అభ్యర్థులపై ఉండే అనవసర భారాన్ని తగ్గిస్తుంది. తద్వారా విజయం వైపు పయనించడం సులభమవుతుంది. 

కుటుంబ, వ్యక్తిగత ఆర్థిక భారాలు తప్పవు అనుకున్నప్పుడు పోటీ పరీక్షల కోసం సమయం వెచ్చిస్తూ విలువైన కాలాన్ని కోల్పోవటం అవివేకం అవుతుంది. ఆర్థిక సమస్యా పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యామ్నాయ ప్రణాళికతో పోటీ పరీక్షల కోసం సిద్ధపడాల్సి ఉంటుంది. ఇలాంటి ఆర్థిక ప్రణాళిక లేనప్పుడు పరీక్షల ప్రిపరేషన్లో అసహనం, అశక్తతతో పాటు అపజయం కూడా చూడాల్సి ఉంటుంది. 

 

3. సామర్థ్యాలు సరితూగాయా?

‘విజయం సాధించలేకపోయాం’ అని ఆవేదన, ఆక్రోశం పోటీ పరీక్షల్లో పాల్గొన్న చాలామందిలో కనిపిస్తాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనేముందు ఆ పరీక్షలకు కావలసిన లక్షణాలు ఏమిటి? అని విశ్లేషించుకునే అభ్యర్థులు చాలా తక్కువమందే ఉంటారు. గొర్రె మనస్తత్వంతో సామర్థ్యాలు ఉన్నా లేకపోయినా పోటీ పడి విజయం సాధించాలని ఏదో ప్రయత్నం చేస్తారు కానీ... అంతిమ ఫలితం అపజయమే. 

అలాంటి అభ్యర్థులు పరీక్ష వ్యవస్థలోని లోపాలను తిట్టుకుంటూ, అసలైన దారిలో పయనించడం మర్చిపోతారు. పెడదోవ పడతారు. మొత్తం పరీక్షా వ్యవస్థ వృథా అని నిందిస్తుంటారు. ఇలాంటి నైరాశ్య ధోరణి మరిన్ని అపజయాలకు దారితీస్తుంది. అంతేకానీ అవసరమైన విజయాన్ని అందించదు. అందుకే.. పోటీ పరీక్షకు కావలసిన అర్హతలు, లక్షణాలు, సామర్థ్యాలు, నిపుణతలు ముందుగా అంచనా వేసుకుని పోటీ పరీక్షలకు దిగాలి. ఒకవేళ ఇప్పటివరకు అంచనా వేసుకోకుండా కొన్ని ప్రయత్నాలు చేసి అపజయం లో ఉంటే... ఇప్పుడైనా ఒక్కసారి పునః పరిశీలన చేసుకుని పోటీ పరీక్షల్లో కొనసాగాలా వద్దా అనే ఆలోచనను పెంచుకోవాలి. తద్వారా విలువైన సమయమూ, డబ్బూ మిగులుతాయి. 

 

4. ప్లాన్‌-బి ఏర్పరుచుకుంటే భరోసా 

సాధారణంగా పోటీ పరీక్షల్లో ఒక సూత్రాన్ని చెబుతారు. అదేమిటంటే ‘వేరే ఆలోచనలు వద్దు. వేరే మార్గాలు వద్దు. ఏక దీక్షతో ఒకే లక్ష్యంతో పోటీ పడాల’ని. ఈ నిర్వహణ సూత్రం మనదేశానికి సంబంధించినంత వరకూ సత్యం కాదు. ఎందుకంటే వందల్లో ఉద్యోగాలు, లక్షల్లో పోటీదారులు. వారిలో వేల మంది అయినా ఏక దృష్టితో ఏకైక లక్ష్యంతో పోటీపడతారు. వారిలో వందల మందికి ఉద్యోగాలు వస్తాయి. 95 శాతానికి పైగా నిరుద్యోగులు గానే మిగిలిపోతారు. 

ఇలాంటి సందర్భంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు (ప్లాన్‌- బి) లేనట్లయితే భవిష్యత్‌ జీవితంలో ఉపాధిని పొందలేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ నగ్న సత్యాన్ని గమనించి అభ్యర్థులు పోటీ పరీక్షల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే సమయంలోనే ప్రత్యామ్నాయ మార్గం తప్పనిసరిగా ఏర్పరుచుకోవాలి. ప్రత్యామ్నాయ మార్గం అనేది కేవలం భవిష్యత్తులో ఉపయోగపడే సాధనమే కాదు; ప్రిపరేషన్లో ఒత్తిడి తగ్గించే సాధనమని కూడా గుర్తించాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించలేక పోయినా ‘వేరే ప్రత్యామ్నాయం ఉంది’ అనే భరోసా అభ్యర్థులో అనేక రకాలైన ఒత్తిళ్లకు తగ్గిస్తుంది. నిరాశనూ తొలగిస్తుంది. దాంతో ఉత్తేజపూరితమైన పోటీని ఇవ్వగలుగుతారు. నోటిఫికేషన్లు లేనటువంటి ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రత్యామ్నాయం పొందేందుకు కూడా సమయాన్ని వినియోగించుకోవచ్చు.

 


 

Posted Date : 07-09-2021 .

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌