• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈ-గురువులు.. బోధనలో వినూత్న పద్ధతులు


ఈనాడు, హైదరాబాద్‌: బోధన అంటే వారికి తరగతిలో చెప్పే పాఠాలే కాదు.. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ.. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. తాజాగా కేంద్ర విద్యాశాఖ అందించిన ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ) అవార్డులను అందుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. ఆ ఉపాధ్యాయుల కృషి, బోధనలో అనుసరిస్తున్నవిధానాలపై ‘ఈనాడు’ కథనం.

ప్రత్యేక టూల్స్‌ రూపకల్పన
ఆరుట్ల జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న వీరనాల గోపాల్‌ది బోధనలో వినూత్నశైలి. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆధునిక సాంకేతితను ఉపయోగించుకుని పాఠ్యాంశాలు చెబుతున్నారు. దాదాపు రెండు దశాబ్ధాలుగా కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని వాడుకుని డిజిటల్‌ బోధన చేస్తున్నారు. ఇప్పటివరకు 2 వేలకు పైగా పాఠాలు డిజిటల్‌ రూపంలోకి తీసుకువచ్చారు. ఘట్‌కేసర్‌కు చెందిన గోపాల్‌ 1998 డీఎస్సీలో ఎస్‌ఏ(బయోలజీ)గా ఎంపికయ్యారు. బంట్వారంలో ఉపాధ్యాయుడిగా చేరి.. తర్వాత ఉద్దెమర్రికి వచ్చారు. అక్కడి నుంచి పదోన్నతిపై గుండ్లపోచంపల్లి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా బదిలీ అయ్యారు. 2015లో షాబాద్‌లోని బాలుర పాఠశాలలో ఇన్‌ఛార్జి ఎంఈవోగా పనిచేశారు.2018లో ఆరుట్ల జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు వచ్చారు.  బయోలజీ సబ్జెక్టు అయినప్పటికీ.. సొంతంగా కంప్యూటర్‌లో మెలకువలు నేర్చుకుని టూల్స్‌ తయారీలో నైపుణ్యం సాధించారు. ఆన్‌లైన్‌ టెస్టులు, క్విజ్‌లు నిర్వహణకు ప్రత్యేకంగా వెబ్‌టూల్స్‌ తయారు చేశారు. పాఠశాలల్లో గ్రంథాలయాలున్నా పుస్తకాల రికార్డుల నిర్వహణలో ఇబ్బందుల కారణంగా పిల్లలకు ఇచ్చేందుకు ఉపాధ్యాయులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు పుస్తకాల రికార్డుల నిర్వహణకు ప్రత్యేకంగా వెబ్‌టూల్‌ రూపొందించారు. మొబైల్‌లోనే నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాలు తల్లిదండ్రులకు చేర్చేందుకు మరో టూల్‌ రూపొందించారు. 

‘లెక్కల’ చిక్కులు సులువు చేసేలా...
పిల్లల్లో గణితంపై మక్కువ పెంచుతూ.. సాంకేతికతను వినియోగించుకుంటూ బోధించడం ఎం.ఎస్‌.కుమార్‌స్వామి ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎలకుర్తి గ్రామానికి చెందిన ఈయన గచ్చిబౌలిలోని కేంద్రీయ విద్యాలయ(కేవీ)లో గణితశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2012 - 13లో గణితశాస్త్రంలో ఆరు నుంచి పదో తరగతి వరకు స్టడీమెటీరియల్‌ రూపొందించి రీజనల్‌స్థాయిలో అన్ని పాఠశాలలకు పంపించారు. తొమ్మిది, పదో తరగతులకు భౌతికశాస్త్రంలోనూ స్టడీ మెటీరియల్‌ రూపొందించారు. 2014లో గచ్చిబౌలిలో కేవీకి వచ్చాక గణితాన్ని మరింతగా విద్యార్థులకు చేరువ చేసేందుకు 2015 ఏప్రిల్‌1న www.kumarsir34.wordpress.com పేరిట వెబ్‌ బ్లాగ్‌ను ఏర్పాటు చేసి ఉచితంగా స్టడీమెటీరియల్‌ అందిస్తున్నారు. ఆయన వెబ్‌సైట్‌ సాయంతో 150 దేశాలకు 2.25 మందికి వీక్షకులు వచ్చారు. 

30లక్షల మంది వీక్షణం
యూట్యూబ్‌లో కుమార్‌ ఆన్‌లైన్‌ చానల్‌ ప్రారంభించి 600 వీడియో పాఠాలు తయారు చేసి అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 30లక్షల మంది పాఠాలు వీక్షించారు. రేడియాలోనూ ఎనిమిది, 9 తరగతులకు పీఎం ఈ-విద్య ప్రాజెక్టు పాఠాలు బోధించారు. కుమార్‌స్వామి కృషికి గుర్తింపుగా 2012లో ఎన్‌సీఈఆర్‌టీ టీచర్‌ ఎక్స్‌పెరిమెంటేషన్‌ అండ్‌ ఇన్నొవేటివ్‌ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం తరఫున మొదటి అంతర్జాతీయ ఉపాధ్యాయుల పరస్పర మార్పిడి కార్యక్రమం కింద గతంలో జపాన్‌ పర్యటనకు వెళ్లారు. మూడేళ్లుగా తరగతి గది బోధనను బ్రిక్స్‌మ్యాథ్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారంతో విద్యార్థులకు బోధించారు. ఇలా దాదాపు పది ప్లాట్‌ఫారాలలో వీడియో పాఠాలు, స్టడీమెటీరియల్‌ విద్యార్థులకు చేరవేస్తున్నారు. ‘బాలా-బిల్డింగ్‌ యాజ్‌ లెర్నింగ్‌ ఎయిడ్‌’ పేరిట పాఠశాలలో ప్రాజెక్టు చేపట్టి అభ్యసన వనరులను అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో కేంద్రీయ విద్యాలయాల్లోని 1248 మంది ఉపాధ్యాయులలో ఐసీటీ అవార్డుకు కుమార్‌స్వామి ఒక్కరే ఎంపికవ్వడం విశేషం.

లాక్‌డౌన్‌లో  బోధించేలా..
2020 మార్చిలో లాక్‌డౌన్‌ ప్రారంభమయ్యాక తమ పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ప్రత్యేకంగా జూన్‌ 7న ఆరుట్ల బడి అనే వెబ్‌ అప్లికేషన్‌ తీసుకువచ్చారు. దీన్ని తెలుసుకుని మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖాధికారులు గోపాల్‌ను సంప్రదించి.. మేడ్చల్‌బడి వెబ్‌సైట్‌కు రూపకల్పన చేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లాకు ఆర్‌ఆర్‌బడి తీసుకువచ్చారు. వీటిల్లో పాఠాలు రికార్డు చేయడం మొదలుకుని.. అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా 380 మంది ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటివరకు వెబ్‌సైట్లకు 13లక్షల మంది వీక్షకులు వచ్చారు. ఈ విషయంలో గోపాల్‌ శ్రమను గుర్తించి కేంద్ర విద్యాశాఖ ఐసీటీ అవార్డు అందించింది. అంతకుముందు 2005లో మైక్రోసాఫ్ట్‌ తరఫున జాతీయ ఇన్నోవేటివ్‌ అవార్డు వరించింది.  
 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌