• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూహం

ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ఉద్యోగ నియామక సంస్థలు ఆన్‌లైన్‌ వేదికగానే ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. వీటి మెలకువలు ఇవిగో!

ఇప్పటి పరిస్థితుల్లో ఉద్యోగార్థులు తమ డిజిటల్‌ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరమెంతో ఉంది. జూమ్‌ మీటింగుల్లో పాల్గొన్న అనుభవం మీకు లేకపోయినట్లయితే.. ఈ విషయంలో స్నేహితుల, బంధువుల సాయం తీసుకోవచ్చు. వారితో జూమ్‌లో మాట్లాడుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి అసౌకర్యం లేకుండా వీడియోలో మాట్లాడటం అలవాటు అవుతుంది. 

ఇది మాత్రమే సరిపోదు: ఉద్యోగాన్వేషణకు ఎంతోమంది లింక్‌డ్‌ఇన్‌ను సాధనంగా ఎంచుకుంటారు. ఇంతవరకూ బానే ఉంటుందిగానీ ఇది ఒక్కటి మాత్రమే సరిపోదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాలనూ ఎన్నో సంస్థలు అభ్యర్థుల ఎంపికకు వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. అలాగే ఆన్‌లైన్‌ నెట్‌ వర్కింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొనడానికీ సందేహించనవసరం లేదు. కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌ వేదికగా రెజ్యూమె సమీక్షలు, ఇంటర్వ్యూ కోచింగ్‌లను అందజేస్తున్నాయి. ఈ సేవలను వినియోగించుకుని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.

ఎంప్లాయిమెంట్‌ ఏజెన్సీలు: కొంతమంది ఎంప్లాయిమెంట్‌ ఏజెన్సీల ద్వారా ఉద్యోగం పొందడమంటే ఖర్చుతో కూడుకున్న పని అనుకుంటారు. నిజానికి కొన్ని నియామక సంస్థలు అలాంటి ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను నియమించుకుంటాయి. కాబట్టి ఈ పద్ధతిలో కూడా ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించవచ్చు. 

పరిధులను విస్తరించుకోవాలి: చాలా సంస్థలు మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులను కూడా గుర్తిస్తున్నాయి. వారికి ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో పోటీ పెరుగుతుంది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు తమ ప్రతిభా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. అవసరమైతే తగిన శిక్షణనూ తీసుకోవాలి. 

నిజాయతీ ముఖ్యమే: మీరెందుకు నిరుద్యోగులుగా ఉన్నారనే విషయాన్ని ఇంటర్వ్యూ సమయంలో నిజాయతీగా చెప్పేయాలి. ఈ విషయంలో ఎలాంటి దాపరికాలూ ఉండకూడదు. కొన్ని సంస్థలు గతంలో మీరు పనిచేసిన వారి వివరాలూ, అక్కడి వారి రిఫరెన్స్‌ నంబర్లూ అడుగుతాయి. ఇలాంటప్పుడు మీరేమైనా తప్పుడు సమాచారం ఇస్తే అనవసరంగా ఇబ్బందిపడతారు. 

తాత్కాలిక ఉద్యోగమూ చేయొచ్చు: మీ ఆసక్తీ, అర్హతలకు తగిన ఉద్యోగం వచ్చేంతవరకు తాత్కాలికంగా ఏదైనా పనిచేయొచ్చు. ఇలా చేయడం వల్ల సమయం వృథా కాకుండా ఉండటంతోపాటు పని అనుభవాన్నీ సంపాదిస్తారు. కొత్త ఉద్యోగంలో చేరడానికి ఈ అనుభవం పునాదిలా ఉపయోగపడుతుంది. పూర్తి సమయాన్ని ఉద్యోగాన్వేషణలోనే వృథా చేసే కంటే.. తాత్కాలికంగా పనిచేస్తూనే ప్రయత్నాలను కొనసాగించవచ్చు. దీంతో సమయం విలువ తెలిసిన మీ మీద ఎదుటివారికి సదభిప్రాయమూ కలుగుతుంది. 
 

Posted Date : 26-05-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌