• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్ పాఠాలు అర్థ‌వంతంగా..!

ఆస‌క్తిగా నేర్చుకోవ‌డానికి మెల‌కువ‌లు

నిత్యం మోగే బడి గంట ఆగింది. ఉదయాన్నే ఎక్కే కళాశాల బస్సు నిలిచిపోయింది. పోటీ పరీక్షల కోచింగ్‌ కూడా డిటో!  టీచరు ముందు కూర్చుని పాఠాలు నేర్చుకొనే అవకాశమూ పోయింది. కానీ కాలం ఆగిపోలేదు. అవసరాలూ, ఆశలూ అలాగే ఉన్నాయి. భవిష్యత్తు కలలు కల్లలు కాకూడదు కదా! మరి ప్రత్యామ్నాయమేంటి? అవే ఆన్‌లైన్‌ క్లాసులు. మాష్టారు అక్కడ, విద్యార్థి ఇక్కడ. ‘ఏకాగ్రత కుదరటం లేదు, కళ్లు లాగుతున్నాయి, ఇంట్లో డిస్టర్బెన్స్‌..’ అంటే ఏమీ చేయలేం. గమ్యం చేరాలంటే ఆన్‌లైన్‌ క్లాసులు తప్పవు కదా? వాటిని ఎంత మెరుగ్గా ఆస్వాదించవచ్చో, ఏం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చో తెలుసుకుందాం! 

ఆన్‌లైన్‌ శిక్షణ, బోధన ఎప్పటి నుంచో ఉన్నా కరోనా పరిణామాలు వీటి అవసరాన్నీ, ప్రాముఖ్యాన్నీ పెంచేశాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు రెండు రకాలుగా ఉన్నాయి. 

1. ఆన్‌లైన్‌ లైవ్‌ తరగతులు: అధ్యాపకుడు తన ఇంటి నుంచి లేదా విద్యా సంస్థ నుంచి పాఠాలు బోధించడం. అదే సమయంలో విద్యార్థి తన ఇంటి నుంచి ప్రత్యక్షంగా పాఠాలు వినడం. ఇక్కడ సాధారణంగా అధ్యాపకుడు  Wacom లేదా  Tab లాంటి సాధనాలు వాడతారు.  

2. ఆన్‌లైన్‌ రికార్డెడ్‌ తరగతులు: దీనిలో ఉపాధ్యాయులు ముందుగా ఒక మంచి స్టూడియోలో పాఠాలను రికార్డు చేస్తారు. వీటిలో అత్యుత్తమ టెక్నాలజీ వాడే అవకాశం ఉంటుంది. గ్లాస్‌బోర్డు, డిజిటల్‌ స్మార్ట్‌ బోర్డు లాంటివి వాడతారు. రికార్డు చేసిన పాఠాలను మెరుగ్గా ఎడిట్‌ చేసి యాప్‌లో గానీ యూట్యూబ్‌లో గానీ అప్‌లోడ్‌ చేస్తారు. 

ఏయే తేడాలు? 

అంశం: 1. తరగతుల సమయం     

ఆన్‌లైన్‌ లైవ్‌ తరగతులు: ఇది ఉపాధ్యాయుడు లేదా విద్యాసంస్థ మీద ఆధారపడుతుంది.      

ఆన్‌లైన్‌ ప్రీ రికార్డెడ్‌ తరగతులు: పాఠ్యాంశాలను ముందుగా రికార్డు చేయడం వల్ల విద్యార్థి తనకనుకూలమైన సమయంలో పాఠ్యాంశాలు వినవచ్చు.  

అంశం: 2. ప్రజెంటేషన్‌ క్వాలిటీ     

ఆన్‌లైన్‌ లైవ్‌ తరగతులు: ఇక్కడ ఉపాధ్యాయుడు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా ఉండటం వల్ల కొన్ని పరిమితులు ఉంటాయి. యానిమేషన్‌ లాంటివి వాడటం కొంత ఇబ్బంది.

ఆన్‌లైన్‌ ప్రీ రికార్డెడ్‌ తరగతులు: ప్రజెంటేషన్‌ అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. 2డి లేదా 3డి యానిమేషన్స్‌ వాడవచ్చు. ఒకటికి రెండు సార్లు సరిచేసుకోవడం, ఎడిటింగ్‌ చేయడం వల్ల చక్కగా అనిపిస్తాయి.

అంశం: 3. సందేహ నివృత్తి      

ఆన్‌లైన్‌ లైవ్‌ తరగతులు: లైవ్‌ చాట్‌బాక్స్‌ ద్వారా విద్యార్థి సందేహాలకు సమాధానాలు ఎప్పటికప్పుడు దొరుకుతాయి. 

ఆన్‌లైన్‌ ప్రీ రికార్డెడ్‌ తరగతులు: సందేహాలను ప్రత్యేక ‘డౌట్‌ క్లారిఫైయింగ్‌ సెషన్‌’ ద్వారా గానీ ఈ-మెయిల్‌ ద్వారా గానీ నివృత్తి చేసుకోవచ్చు. 

అంశం: 4. పాఠ్యాంశాల కదలిక      

ఆన్‌లైన్‌ లైవ్‌ తరగతులు: చాలావరకు టీచర్‌ని బట్టి ఉంటుంది. కొంతమంది విద్యార్థులకు చాలా నెమ్మదిగానూ, కొంతమందికి వేగంగానూ అనిపించవచ్చు.

ఆన్‌లైన్‌ ప్రీ రికార్డెడ్‌ తరగతులు: సాధారణంగా ఈ తరగతులు యాప్‌ ద్వారా ఉంటాయి. విద్యార్థి తను అర్థం చేసుకునే వేగాన్ని బట్టి ఈ తరగతుల వేగం కూడా మార్చుకోవచ్చు. 

అంశం: 5. పాఠ్యాంశాల క్రమం     

ఆన్‌లైన్‌ లైవ్‌ తరగతులు: ఉపాధ్యాయులు ఒక క్రమ పద్ధతిలో చెబుతారు. విద్యార్థి స్థితిగతులను బట్టి కాదు. ఏదైనా విద్యార్థికి ఓ పాఠ్యాంశంపై పట్టు ఉండి, గ్రహించాల్సింది కొత్తగా ఏమీ లేకపోతే తనకు సమయం వృథా అవుతుంది. 

ఆన్‌లైన్‌ ప్రీ రికార్డెడ్‌ తరగతులు: ఇక్కడ అన్ని పాఠ్యాంశాలూ ముందుగా అందుబాటులో ఉండటం వల్ల, తనకు అనుగుణమైన వరసలో వినవచ్చు, నేర్చుకోవచ్చు. సమయం చాలా కలిసి వస్తుంది.

అంశం: 6. సమయపు వృథా     

ఆన్‌లైన్‌ లైవ్‌ తరగతులు: సందేహ నివృత్తి పేరుతో కొంతమంది విద్యార్థులు క్లాసు మధ్యలో అనవసర ప్రశ్నలు వేస్తుంటారు. వాటికి సమాధానం చెప్పే ప్రయత్నంలో ఉపాధ్యాయుడి సమయం, శక్తి వృథా అవుతాయి. దీనివల్ల చురుకైన విద్యార్థికి నష్టం కలుగుతుంది.

ఆన్‌లైన్‌ ప్రీ రికార్డెడ్‌ తరగతులు: సందేహ నివృత్తికి ప్రత్యేక తరగతులు లైవ్‌లో జరుగుతాయి. దీనివల్ల రెగ్యులర్‌ పాఠ్యాంశాల అభ్యాసానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. విద్యార్థి తన అవగాహన కోసం ఈ తరగతులకు హాజరు అవ్వొచ్చు.

అంశం: 7. ఇంటర్నెట్‌ ప్రభావం   

ఆన్‌లైన్‌ లైవ్‌ తరగతులు: లైవ్‌ క్లాసులు జరిగేటప్పుడు ఇంటర్నెట్‌ సరిగా లేకపోతే (ఉపాధ్యాయుడి దగ్గర/ విద్యార్థి ఇంటి దగ్గర) పాఠాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. 

ఆన్‌లైన్‌ ప్రీ రికార్డెడ్‌ తరగతులు: ముందుగా రికార్డు అవడం వల్లా, ఎడిటింగ్‌ వల్లా ఉపాధ్యాయుడి వైపు నుంచి ఇబ్బంది ఉండదు. మన ఇంటిలో ఇంటర్నెట్‌ సరైనప్పుడు వీడియోలు చూడొచ్చు. డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ ఉండటం వల్ల ఇంటర్నెట్‌ లేకపోయినా పాఠ్యాంశాలు వినవచ్చు. 

అంశం: 8. ఫీజు (రుసుము)      

ఆన్‌లైన్‌ లైవ్‌ తరగతులు: సాధారణంగా ఎక్కువ.      

ఆన్‌లైన్‌ ప్రీ రికార్డెడ్‌ తరగతులు: సాధారణంగా తక్కువ. 

అంశం: 9. ఎవరికి ఉపయోగం?   

ఆన్‌లైన్‌ లైవ్‌ తరగతులు: ఫుల్‌టైమ్‌ విద్యార్థులకు మాత్రమే.     

ఆన్‌లైన్‌ ప్రీ రికార్డెడ్‌ తరగతులు: ఫుల్‌టైమ్‌ విద్యార్థులతో పాటు ఉద్యోగులకూ, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులకూ, చిరుద్యోగులకూ అందరికీ ఉపయోగం.

సద్వినియోగానికి  ఏమేం కావాలి? 

ల్యాప్‌టాప్‌/ ట్యాబ్‌/ స్మార్ట్‌ఫోన్‌: స్పెసిఫికేషన్స్‌ టీచర్‌ ముందుగా తెలియచేస్తారు. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ మొదలైనవాటికీ¨, గ్రాఫిక్స్‌ ఎక్కువగా వాడితే చాలా హయ్యర్‌ ఎండ్‌ కావలసి ఉంటుంది. మామూలు తరగతులకు సాధారణ పరికరాలు సరిపోతాయి.  

కావలసిన డేటా: ఇది టీచరు వాడే టెక్నాలజీని బట్ట్టీ, తరగతుల సమయాన్ని బట్టీ ఉంటుంది. స్మార్ట్‌ బోర్డ్‌ వాడితే ఎక్కువ డేటా అవసరమవుతుంది.  

ఏకాగ్రతకు భంగం కలగకుండా: వాడే ఎలక్ట్రానిక్‌ పరికరానికి వాట్సాప్, మెయిల్స్, ఇతర మెసేజ్‌లు రాకుండా నిరోధించాలి. లేకపోతే అవి ఏకాగ్రతను దెబ్బ తీస్తాయి. పాఠాలు వినేటప్పుడు స్నేహితులు, బంధువులు పక్కకు రాకుండా చూసుకోవాలి. మన దగ్గరలో టీవీ లేకుండా చూసుకోవాలి. హెడ్‌ఫోన్స్‌ వాడటం కొంతవరకు మంచిది.  

నేర్చుకునే ప్రత్యేక ప్రదేశం: ఇంట్లో సరైన గాలీ, వెలుతురూ వచ్చే, ఇతరత్రా వాటి వల్ల ఏకాగ్రతకు భంగం కలగని స్థలం ఎంచుకోవాలి. ఒక మంచి టేబుల్, కుర్చీ, రైటింగ్‌ ప్యాడ్, కాల్‌క్యులేటర్, నోట్‌బుక్స్, పెన్సిల్స్, పెన్స్, హైలైటర్, తెల్ల కాగితాయి ఉంచుకోవాలి. 

సరైన ప్రణాళిక  

గమ్యం ఏమిటో ముందుగా నిర్దేశించుకోవాలి. అది ఏ పరీక్షకైతే దానికి సంబంధించిన సిలబస్, పాఠ్య పుస్తకాలు (స్టడీ మెటీరియల్‌), గత ప్రశ్నపత్రాలు దగ్గర ఉంచుకోవాలి.  

ఉన్న సిలబస్‌ ప్రకారం ఒక క్రమరీతిలో సబ్జెక్టు వినాలి. తరగతి గదిలో ఎలా ఉంటామో అలాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి.  

ప్రతి తరగతినీ ఆసక్తితో తప్పకుండా వినాలి.  

ఏదైనా పాఠ్యాంశం ఆన్‌లైన్‌లో అర్థం కానప్పుడు ప్రామాణిక పాఠ్యపుస్తకం నుంచి చదివి అర్థం చేసుకోవాలి.

ఏరోజుకారోజు విన్న వాటిని తర్వాత కొంతసేపు మననం చేసుకోవాలి.  

ముందుగా రికార్డు అయిన తరగతులైతే అన్ని పాఠ్యాంశాలూ దాదాపు ఒకేసారి అందుబాటులో ఉంటాయి. అలాంటప్పుడు మనకంటూ స్టడీ క్యాలెండర్‌ని ఏర్పాటుచేసుకోవాలి. దాని ప్రకారం సంసిద్ధం కావాలి. సులభతరమైన, మనకు కొంత పట్టు ఉన్న పాఠ్యాంశాలను త్వరగా వినాలి, చదవాలి. కఠినతరమైన పాఠ్యాంశాలను నెమ్మదిగా వినాలి. ప్రాక్టీసు చేయాలి. రోజూ నిర్దేశించుకున్న సమయం ప్రకారం..అనుకూలంగా ఉండే సమయంలో చదవాలి.  

క్లాస్‌రూమ్‌ కోచింగ్‌ దాదాపు 6 నెలలు అనుకుందాం. అదేవిధంగా ఆన్‌లైన్‌ తరగతులకు సమయం కేటాయించాలి. రోజూ సమయపాలన ఒకేవిధంగా ఉండేలా చూసుకోవాలి. ఒక్కో సబ్జెక్టుకు ఎన్ని గంటలు, ఎన్ని రోజులు అనేది దాదాపు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. క్లాస్‌రూమ్‌ కోచింగ్‌లో సాధారణంగా ప్రతి గంటన్నరకొక సారి విరామం తీసుకుంటాం. అదేవిధంగా ఆన్‌లైన్‌లో కూడా ఉండేటట్టు చూసుకోవాలి. 

సందేహ నివృత్తి ఎలా?  

ఉపాధ్యాయుడు మనతోపాటు లేనందువల్ల సందేహ నివృత్తికి ఈ విధానాలు పాటించాలి.  

లైవ్‌చాట్‌ బాక్స్‌ ద్వారా మన సందేహాలకు సమాధానం తెలుసుకోవచ్చు.  

ఈ-మెయిల్, వాట్సాప్‌ ద్వారా కూడా చాలామంది ఉపాధ్యాయులు సహాయం చేస్తారు.

ఒకే విధమైన ఆలోచన, జీవితాశయాలున్న ముగ్గురు నలుగురు విద్యార్థులు ఓ గ్రూప్‌గా ఏర్పడి ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు.

సినిమా చూసినట్టు చూస్తే ఫలితం సున్నా 

నోట్సు తయారీ: 

లైవ్‌ క్లాస్‌లలో ముఖ్యమైన విషయాలు మాత్రమే నోట్‌ చేసుకోవాలి. తర్వాత లైవ్‌క్లాస్‌ రికార్డ్‌ నుంచి పూర్తి నోట్సు తయారుచేసుకోవచ్చు.  

ఆన్‌లైన్‌ రికార్డెడ్‌ (ప్రీ రికార్డెడ్‌) తరగతులు 10 నుంచి 15 నిమిషాల నిడివితో ఉంటాయి. ప్రతి మాడ్యూల్‌ తర్వాత వీడియోని ఆపి, ఒకసారి మననం చేసుకోవాలి. ముఖ్య విషయాలను రాసుకోవాలి. ఏదైనా న్యూమరికల్‌ ప్రశ్న ఉంటే స్క్రీన్‌ను ఆపి ఆ ప్రశ్న సమాధానం సొంతంగా రాబట్టే ప్రయత్నం చేయాలి. చేయలేనప్పుడు మాత్రమే ప్రశ్న- సమాధానం చూడాలి. అంతేగానీ సినిమా చూసినట్టు ఆన్‌లైన్‌ క్లాసులు చూస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు.  

పునశ్చరణ: 

ప్రతిరోజూ పునశ్చరణకు కొంత సమయం కేటాయించాలి.  

ప్రతి చాప్టర్, సబ్జెక్ట్‌ ప్రిపేర్‌ పూర్తి అయ్యాక తప్పకుండా పునశ్చరణ చేయాలి. ముందుగా తయారు చేసుకున్న నోట్స్‌తో ఈ పునశ్చరణను సద్వినియోగం చేసుకోవాలి.  

మోడల్‌ పరీక్షలు (మాదిరి పరీక్షలు):  

సాధారణంగా ప్రతి సంస్థా వారాంతపు పరీక్ష లేదా సబ్జెక్టు  పరంగా మోడల్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. వాటిని తప్పకుండా రాయాలి. దీనివల్ల మనకెంత వరకు సబ్జెక్టు అర్థమైందో తెలుస్తుంది.  

గత ప్రశ్నపత్రాలను కూడా తప్పకుండా సాధన చేయాలి.  

మోడల్‌ పరీక్షలు రాసేటప్పుడూ, గత ప్రశ్నపత్రాలు సాధన చేసేటప్పుడూ గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. 

ప్రేరణ: 

ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం చెందకుండా గమ్యం వైపు దృష్టి సారించాలి. తను అనుకున్నది సాధించడానికి జ్వలించే తపన ఉండాలి. ప్రేరణ కల్గించే విజయగాథలను అప్పుడప్పుడూ వినాలి. 

ఆరోగ్యమే మహాభాగ్యం: 

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రోజూ తప్పకుండా వ్యాయామం, యోగా, నడక లాంటివి ఒక గంటసేపయినా చేయాలి. 


 

Posted Date : 27-04-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌