• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మీకు ఉందా ప్లాన్‌ బీ & సీ?

పరిధి పెంచుకుంటే.. ఉద్యోగ అవకాశాలెన్నో!

సాంప్రదాయిక ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషించే రాష్ట్ర సర్వీస్‌ కమిషన్ల నుంచీ, జిల్లా సెలక్షన్‌ కమిటీల నుంచీ నియామక నోటిఫికేషన్లు రానంత మాత్రాన డీలా పడిపోకూడదు. ఇలాంటి నిస్సహాయ పరిస్థితి నుంచి యువత బయట పడాలి. ప్లాన్‌ ఏ  కాకపోతే ప్లాన్‌ బీ...సీ! ఆశించిన లక్ష్య పరిధి నుంచి కొంచెం బయటకు రావాలే గానీ.. అద్భుతమైన అవకాశాలెన్నో నిపిస్తాయి. మళ్లీ కొత్త పోటీ పరీక్షలకు తయారవడం కొంచెం కష్టమైనా ఆచరణ సాధ్యమే! 

తక్కువ ఉద్యోగాలతో విడుదలైన జాబ్‌ క్యాలెండర్‌ మూలంగా ఆంధ్రప్రదేశ్‌లో, నియామకాలు జరగని పరిస్థితుల వల్ల తెలంగాణలో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. దీనంతటికీ కారణం- సాధారణ విద్యార్హతలతో రాసే గ్రూప్‌ 1, 2, 3, 4 మొదలైన కొలువులని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రత్యేక అర్హతలతో రాసే డీఎస్‌సీ, సబ్‌ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ లాంటి నోటిఫికేషన్లు ఆశించిన స్థాయిలో రాకపోవడం కూడా రెండు తెలుగు రాష్ట్రాల యువతలో నిరాశా నిస్పృహలకు కారణమయ్యాయి. ఆ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఏ దారిన వెళ్లాలో తెలియని అయోమయ స్థితి కూడా ఏర్పడింది. చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే వెలుగుని చూడలేము. కొండలను పిండి కొట్టగలిగే సత్తా ఉన్న యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఉంటుందా?  

యువతలో కనిపించే పెద్ద లోపం- ఒకటి రెండు అవకాశాలను మాత్రమే ఎంపిక చేసుకుని అవి కష్టమైన దారులయినా వాటి గుండానే పయనించాలని ప్రయత్నించటం! నిజానికి కొంత సులభమైన మార్గంలో మరెన్నో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉన్నా రొటీన్‌ మనస్తత్వానికి భిన్నంగా నడవలేని పరిస్థితిలో ఉంటారు. 

అన్ని అవకాశాలూ చూడాలి

డిగ్రీ స్థాయిలో, ఇంటర్‌ స్థాయిలో పరీక్షలు రాసుకుని ఏదో ఒక ఉద్యోగం సాధించాలని దృఢ నిర్ణయం తీసుకొని ఇతర అవకాశాలను చూడటంలో విఫలమవుతున్నారు.

కొంతమంది తాము బ్యాంకులో క్లర్క్‌ అయినా, మేనేజర్‌ అయినా, అధికారి అయినా చాలనుకుంటారు. ఇక బ్యాంకు పరీక్షలు రాస్తూ విజయం కోసం ప్రయత్నం చేస్తారు. వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఆ బ్యాంకు పరీక్షలుంటే విజయం సాధిస్తారు. లేకపోతే పరాజితులుగా మిగిలిపోతారు. మరే ఇతర పరీక్షల వైపూ దృష్టి సారించరు.

కొందరు రైల్వే ఉద్యోగాల మీద దృష్టి పెడతారు. వాటికి సంబంధించిన పరీక్షలకు మాత్రమే ప్రిపేర్‌ అవుతారు. అవి వచ్చేంతవరకు ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. రాకపోతే నిరాశకు గురవుతారు. మరో దిక్కుకు చూడరు!

చాలా సులభంగా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించవచ్చనే అభిప్రాయం సమాజంలో ఉంది. అది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే డీఈడీ, బీఈడీ పరీక్షలు పాస్‌ అయిన వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. దానివల్ల ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో డీఎస్‌సీ పరీక్ష నోటిఫికేషన్‌ వెలువడేంతవరకు నిస్సహాయంగా ఎదురుచూస్తూనే ఉంటారు. మహా అయితే ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తారు. కొద్దిగా చొరవ తీసుకుని, ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి తమ విద్యార్హతలతో పొందగలిగిన అనేక ఉద్యోగాలున్నాయని ఆలోచించటానికి కూడా ఇష్టపడరు. అందువల్లనే నాలుగేళ్లకైనా, ఆరేళ్లకైనా డీఎస్‌సీ పరీక్ష వస్తే చాలనుకుంటారు. రాకపోతే ఆందోళనకు గురవుతారు. జీవితం మొత్తం కోల్పోతున్నట్లుగా నిస్పృహలో మునిగిపోతారు. 

మరికొంతమంది శారీరక దార్ఢ్యం దృష్టిలో పెట్టుకునో, యూనిఫామ్‌ ఉద్యోగాల మీద ఆకర్షణతోనో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా, కానిస్టేబుల్‌గా తమను తాము ఊహించుకుంటారు. ప్రేమలో పడిన యువకుల మాదిరిగా వేరే ధ్యాస లేకుండా ఆ పోస్టుల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వయసు అయిపోవడం లేదా విజయం సాధించ లేని సందర్భాల్లో సర్వం కోల్పోయిన స్థితిని ఏర్పరచుకుంటారు.

ప్రభుత్వ పాలనలో ఉండే అధికారాన్ని పొందేందుకు గ్రూప్‌ 1, 2 లాంటి ఉద్యోగాల్ని ఎలాగైనా పొందాలనే లక్ష్యంతో ఉవ్విళ్లూరుతూ ఉండే యువత మరికొంతమంది. ఒక ఉద్యోగం ఉన్నా చాలు, అది తమదేననే ఆశతో చదువుతారు కానీ ఆ ఆశలు కొంతమందికే నెరవేరుతాయి. మిగతావారిలో నిరాశా నిస్పృహలూ, నిరుత్సాహమూ ఏర్పడతాయి.

స్వయం ఉపాధి.. సాటిలేనిది!

సర్వశక్తులనూ ఉద్యోగ సాధనకే వినియోగించనక్కర్లేదు. ఆలోచన మార్గం మార్చుకుంటే- పారిశ్రామిక వ్యవస్థాపకునిగానూ (ఆంత్రప్రెన్యూర్‌) ఎదగొచ్చు. స్వయం ఉపాధి పథకాలు, వ్యాపారాలు చేసుకునేందుకు అనువైన వాతావరణం ఉందని అభ్యర్థులు గమనించాలి. ప్రభుత్వ ఉద్యోగాలే పరమావధి అనుకోకూడదు. ప్రభుత్వం వివిధ నైపుణ్యాలను పెంపొందించి రుణ సహాయం కూడా చేస్తూ వ్యాపార తత్వాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్త్తోంది. ఇలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలి.

కారణాలు ఏమిటి?

అసలు యువత నిరాశామయ పరిస్థితి వెనకున్న కారణాలను పరిశీలిస్తే- 

వివిధ రకాల నైపుణ్యాలను అందించాల్సిన కళాశాల వ్యవస్థ బలంగా లేకపోవడం.

కళాశాల స్థాయిలో విద్యార్థుల్లో పరిజ్ఞానంతో పాటు వివిధ నైపుణ్యాలను అలవర్చుకునే ప్రత్యేక శ్రద్ధ లోపించటం.

కళాశాలలో విద్యార్థుల్ని సరైన దిశలో నడిపే కరిక్యులం లోపించటం.

ఉద్యోగం పొందే క్రమంలో కేవలం ఒకటి రెండు రకాలైన ఉద్యోగాలనే పొందాలని తమ పరిధిని కుదించుకోవడం.

అభ్యర్థులు తమ నైపుణ్యాలు, సామర్ధ్యాలను సరైన విధంగా అంచనా వేసుకోలేకపోవటం.

అనుకరణ ధోరణిలో ఒకరిని చూసి మరొకరు గుంపు మనస్తత్వంతో ఒకే రకమైన పరీక్షలు రాస్తూ పోటీపడటం.

ప్రభుత్వ వ్యవస్థలో పని ఒత్తిడి ఉండదనీ, స్థిరమైన జీవితమనీ, జీతభత్యాలు అధికమనీ భావిస్తూ ఇంజినీరింగ్‌ కోర్సులు చేసిన అభ్యర్థులు కూడా సాధారణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం.

రాజకీయ పార్టీలు లక్షలాదిగా ఉండే నిరుద్యోగులను ఆకర్షించే క్రమంలో లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల్లో ఆశలు కల్పించడం.

యూపీఎస్‌సీ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ల ద్వారా..

అందరికీ తెలిసిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలతో పాటు CDS, NDA , INDIAN FOREST SERVICE, EPFO లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్స్, SO/ STENO పరీక్షలు కూడా యూపీఎస్‌సీ నిర్వహిస్తోంది. వీటికి పోటీ తక్కువే! 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ సంస్థల ద్వారా ప్రతి సంవత్సరం వివిధ రకాలైన ఉద్యోగాలకు వేలాది నియామకాలు జరుగుతున్నాయి. సాధారణ గ్రాడ్యుయేట్లు కూడా రాయగలిగిన పరీక్షలు చాలా ఉన్నాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ నిర్వహించే సీజీఎల్‌ పరీక్షకు గ్రాడ్యుయేషన్, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షకు ఇంటర్మీడియట్, ఎంటీఎస్‌ పరీక్షకు టెన్త్‌ కనీస విద్యార్హతగా ఉంది.

ఆర్‌ఆర్‌బీ నిర్వహించే నాన్‌-టెక్నికల్‌ పరీక్షలకు గ్రాడ్యుయేషన్, గ్రూప్‌- డి పరీక్షలకు టెన్త్‌  కనీస విద్యార్హత.

బ్యాంక్, ఇన్సూరెన్స్‌ ఉద్యోగాలకు పోటీపడటానికి గ్రాడ్యుయేషన్‌ అర్హత. 

ఇవి పాటిస్తే చాలు..

ఇప్పటి పరిస్థితుల్లో ఉద్యోగార్థులు అలవర్చుకోవల్సిన లక్షణాలు:

1. గిరి గీసుకుని ‘ఈ ఉద్యోగమే కావాల’నుకోకూడదు: ఒకటికి మించిన లక్ష్యాలను నిర్దేశించుకుని ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. సారూప్యత ఉన్న ఉద్యోగాలను ఎంచుకుని కృషి చేస్తే లక్ష్య సాధన సులభమవుతుంది. ఉదా: బ్యాంకు పరీక్షలు రాసే ఉద్యోగులు స్టాఫ్‌ సెలక్షన్, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్, యూపీఎస్‌సీకి చెందిన కొన్ని నోటిఫికేషన్లను ఎదుర్కోవచ్చు 

2. సామర్ధ్యాలను తక్కువగా ఊహించుకోవద్దు: ‘నేను ఈ ఉద్యోగానికి మాత్రమే పనికి వస్తాను’ అనే పరిమిత పరిధి నుంచీ, ఆ భావజాలం నుంచీ బయటపడాలి. ఎన్నో ఉన్నత ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలకు సరిపోయే సామర్ధ్యాలు వీరికి ఉండి ఉండవచ్చు. ముందుగా వాటిని పరిశీలించుకుని వీలైనంత విస్తృతంగా పోటీ పరిధిని ఏర్పరుచుకోవాలి.

3. ప్లాన్‌ బీ, సీ కూడా ఉండాలి: అనుకున్న లక్ష్యాన్ని సాధించలేని పరిస్థితులు ఎదురవ్వొచ్చు. వాటిని చూసి బెంబేలెత్తిపోకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకుంటే నిస్పృహ వాతావరణం ఏర్పడకుండా జాగ్రత్తపడొచ్చు. 

4. అనుకరణ వద్దు: ‘మనకు తెలిసిన కొంతమంది కొన్ని రకాలైన ఉద్యోగాలు సాధించారు కాబట్టి మనమూ వాటిని సులభంగా పొందగలం’ అనుకోవటం సరైనది కాదు. ఎందుకంటే అన్నదమ్ముల్లో కూడా ఒకే మోస్తరు కాకుండా విభిన్న సామర్ధ్యాలూ, నైపుణ్యాలూ ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ఇతరులను అనుకరిస్తే వారి సామర్ధ్యాలు మీకుండకపోతే జరిగేది నష్టమే! 

5. వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేసుకోవాలి: రాజకీయ పార్టీలు రకరకాల ఆకర్షణలను కల్పించినా అవి సాధ్యం అవుతున్నాయా లేదా అని విశ్లేషించుకోవాలి. ‘గత పది సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? మనకెంత అవకాశం ఉంటుంది?’ అని అంచనా వేసుకోవడం వల్ల నిష్ప్రయోజనమైన కృషి చేయకుండా ఉండొచ్చు.

6. ప్రైవేటు రంగంపై అపోహలు వదిలెయ్యాలి: ‘ప్రైవేటు ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉండదు’ అనే భావన నుంచి బయటకు రావాలి. ప్రైవేటు రంగంలో కూడా సమర్ధులైన వ్యక్తులకు అత్యంత విలువ ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆర్థిక సంస్కరణల అనంతరం ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేటు అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు రంగంలో రాణిస్తే ప్రభుత్వ రంగంలో కంటే ఆర్జనతో పాటు సంతృప్తినీ పొందవచ్చు.

7. విద్యార్హతలు పెంచుకునే ప్రణాళికలు: ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వాతావరణం ఏర్పడినప్పుడు నిరాశా నిస్పృహలకు గురి కాకుండా వివిధ నైపుణ్యాలు, సామర్ధ్యాలను పెంపొందించుకోవాలి. అలాగే విద్యార్హతలు పెంచుకునే ప్రణాళికలను అమలు చేయాలి. అందువల్ల కూడా మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. చాలామంది డిగ్రీ తర్వాత బ్యాంక్, రైల్వే, రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలపై దృష్టి పెడుతూ ఇతర ప్రత్యామ్నాయ విద్యార్హతలనూ, నైపుణ్యాలనూ దృష్టిలో పెట్టుకోకుండా గుడ్డిగా సాగుతూ ఉంటారు. ఇది కూడా అభ్యర్థుల తత్వంలో రావలసిన మార్పే.


 

Posted Date : 28-06-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌