• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టెన్త్ మార్కులతో పోస్టల్ ఉద్యోగం

ఎలాంటి రాత పరీక్ష లేదు

గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన

ఆంధ్రప్రదేశ్లో 2296, తెలంగాణలో 1150 ఖాళీలు

రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు ఇది శుభవార్తే. భారత తపాలా విభాగం భారీగా ఖాళీల భర్తీకి సిద్ధమైంది. మీ ప్రాంతంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించింది మీరే అయితే.. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఖాయం. ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థ కలిగిన మన దేశంలో 23 సర్కిళ్లలో 1,55,333 పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో కేవలం పోస్టల్ సర్వీసులే కాకుండా బ్యాంకులకు దీటుగా ఆర్థిక లావాదేవీలూ జరుగుతున్నాయి. ఇది భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖ అధీనంలో పని చేస్తుంది. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాల్లో 3446 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. కేవ‌లం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. పదిలో మీకు అత్యధిక మార్కులు వచ్చి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.. కేంద్రప్రభుత్వం కొలువు కొట్టేయండి. 

అర్హత

భారత తపాలా విభాగం బ్రాంచ్ పోస్టుమాస్ట‌ర్‌ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్ట‌ర్‌ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో 2296, తెలంగాణలో 1150 ఉన్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మ్యాథమేటిక్స్, లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ సబ్జెక్టుల‌తో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థి కనీసం పదో తరగతి వరకు లోకల్ లాంగ్వేజ్‌లో చదివి ఉండాలి. కనీసం 60 రోజుల శిక్షణా వ్యవధితో ఏదైనా కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికెట్ పొందాలి. కంప్యూటర్ కోర్సును ఒక సబ్జెక్టుగా పదో తరగతిలో చదివితే సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదు. సంబంధిత గ్రామ పరిధిలో నివాసం ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇచ్చారు. సాధారణంగా పోస్టాఫీస్ కార్యాలయం గ్రామ పంచాయతీ లేదా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్‌కు చెందిన ఏదైనా బిల్డింగ్‌లో ఏర్పాటు చేయాలి. అందుబాటులో బిల్డింగ్ లేకపోతే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుకు ఎంపికయ్యే అభ్యర్థులు తమ ఇంట్లోనే కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా గ్రామ‌స్థులంద‌రికీ అనువైన ప్రాంతంలో సౌక‌ర్యాల‌తో ఉండాలి. 100 గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉండకూడదు. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా పోస్టాఫీస్‌లో కంప్యూటర్/ ల‌్యాప్‌టాప్‌ తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి సిగ్నల్స్ సమస్య లేకుండా చూసుకోవాలి. మూడు పోస్టులకూ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా సైకిల్ తొక్కడం రావాలి. లేదా ద్విచక్రవాహన డ్రైవింగ్ వ‌చ్చిన‌ట్ల‌యితే అందుకు సంబంధించి సర్టిఫికెట్‌ను సమర్పించాలి. 

అభ్యర్థులు ఆన్‌లైన్లో సమర్పించాల్సిన సర్టిఫికెట్లు: 

అభ్యర్థులందరూ కచ్చితంగా ఎస్ఎస్సీ (పదో తరగతి) సర్టిఫికెట్ లేదా మార్కుల మెమో సమర్పించాలి. వాటిలో మార్కులు, పాయింట్స్, గ్రేడ్స్ లేకపోతే ఎస్ఎస్సీ మార్కులషీట్ లేదా అడిషనల్ మార్కులమెమో జత చేయాలి. ఈ మెమోలో పుట్టిన తేదీ లేకపోతే సంబంధిత ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్, కమ్యూనిటీ ధ్రువ‌ప‌త్రాలు, ఫొటో, సంతకం, దివ్యాంగులు సందరం, ట్రాన్స్‌జెండ‌ర్లు సంబంధిత‌ సర్టిఫికెట్లు జత చేయాలి. 

ఎంపిక విధానం: 

నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ తయారవుతుంది. ఉన్నత విద్యార్హతలకు అదనపు వెయిటేజ్ ఏమీ ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. 

జీతభత్యాలు:

టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్(టీఆర్సీఏ) పద్ధతి కింద ఆయా పోస్టులకు ఎంపికైన వారికి చెల్లింపులు ఉంటాయి. బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం)కు కనీసం 4 గంటలకు టీఆర్సీఏ రూ.12000, 5 గంటలకు టీఆర్సీఏ రూ.14500 ఇస్తారు. ఏబీపీఎం/ డాక్ సేవక్లకు కనీసం 4 గంటలకు టీఆర్సీఏ రూ. 10000, 5 గంటలకు టీఆర్సీఏ రూ.12000 అందుతాయి.

దరఖాస్తు చేసుకోండిలా..

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జనవరి 27, 2021న ప్రారంభమై మార్చి 01, 2021న ముగుస్తుంది. దరఖాస్తు రుసుముగా ఓసీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ పురుష/ ట్రాన్స్-మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మహిళా/ ట్రాన్స్‌మెన్‌, పీడబ్ల్యూడీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు.

వెబ్‌సైట్‌: https://appost.in

Posted Date : 28-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌